సద్గురు: మనం ‘ఏసుక్రీస్తు’ అన్నప్పుడు, 2000 సంవత్సరాల క్రితం జీవించిన ఒక వ్యక్తి గురించి మాట్లాడడం లేదు. ప్రతి మనిషిలోనూ ఉండే సంభావ్యత గురించి మాట్లాడుతున్నాము. తమలోని ఈ సంభావ్యతను వికసింపచేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే, మతం పేరిట ప్రజలు ఒకరి ప్రాణాలు ఒకరు తీయడానికి కూడా సిద్ధపడుతున్నారు. దైవాన్ని చేరుకోవాలి అనే ప్రయత్నంలో మనం మానవత్వాన్ని కోల్పోతున్నాం.

క్రీస్తు బోధనల్లో అతి ముఖ్యమైన ఒక అంశం – నిష్పక్షపాతంగా జీవించడం, నీ వారెవరు, కాని వారెవరు అనే బేధం లేకుండా ఉండడం. అప్పుడు మాత్రమే దేవుని రాజ్యాన్ని ఎవరైనా అనుభూతి చెందగలరు. ఆయన ఒకటి స్పష్టంగా చెప్పారు, ‘దేవుని రాజ్యం ఎక్కడో పైన లేదు, అది నీలోనే ఉంది’ అని. మార్కెటింగ్ చేసిన మొదటి రోజుల్లో మాత్రమే ‘మిమ్మల్ని దేవుని రాజ్యానికి తీసుకెళ్తాను’ అని అన్నారు. ఒక్కసారి ఆయన చుట్టూ జనాలు గుంపులుగా మూగాక, మాట మార్చి ‘దేవుని రాజ్యం మీలోనే ఉంది’ అన్నారు. ఆయన బోధనల్లోని సారాంశం అదే.

దురదృష్టవశాత్తూ, 99శాతం మంది ప్రజలు తమలో ఉన్న అద్భుతమైన విషయాన్ని గుర్తించడం లేదు. ఒకవేళ అది దూరంగా ఉన్నట్లయితే మీరు అక్కడికి ప్రయాణం చేయాలని అనుకోకపోవచ్చు. కానీ అది ఇక్కడే ఉన్నా కూడా మీరు గుర్తించకపోవడం అనేది విషాదం కాదంటారా? దేవుని రాజ్యం మీలోనే ఉంటే, మీరు మీలోనే దాన్ని శోధించాలి, ఇది సులుమైన విషయం.

మరి విశ్వాసం సంగతేంటి?

మీలోని సృష్టికి మూలమైన ఆ పార్శ్వాన్ని శోధించడానికి శాస్త్రీయ పద్ధతులు ఉన్నాయి. మీ శరీరం మీలో నుండే సృష్టించబడింది. ఆ శాస్త్రాన్ని బోధించేందుకు క్రీస్తు వద్ద ఎక్కువ సమయం లేదు. అందువలన ఆయన, దగ్గరి దారి అయిన ‘విశ్వాసం’ గురించి మాట్లాడారు. ‘పిల్లలు మాత్రమే దేవుని రాజ్యంలోకి ప్రవేశించగలరు’ అని ఆయన అన్నప్పుడు, పిల్లల గురించి ఆయన మాట్లాడడం లేదు. పిల్లల మనస్తత్వం ఉన్న వారి గురించీ, ఎవరైతే అన్నింటి గురించి నిర్ధారణలకు రాకుండా, నిష్పక్షపాతంగా ఉంటారో వారి గురించి ఆయన మాట్లాడారు.

christ-the-redeemer

మీరు ఎటువంటి నిర్ధారణలు చేసినా అవి తప్పు అవ్వక మానవు. ఎందుకంటే, జీవితాన్ని మీరు చేసే నిర్ధారణలో ఇమడ్చలేరు. జీవితాన్ని కానీ ఈ సృష్టి మూలాన్ని కానీ, నిర్ధారణలు ఎక్కువ చేసే వారు తెలుసుకోలేరు. వాటిని దించేస్తే, తెలుసుకోవడం ఎంతో సులువౌతుంది.

ఆయన జీవిత చివరి దశలో, క్రీస్తుకి మరణ దండన ఖాయం అని తెలిసిన సమయంలో, ఆయన శిష్యులు ఆయన్ని అడిగిన ఒకే ఒక ప్రశ్న, ‘మీరు శరీరాన్ని వదిలి దేవుని రాజ్యం చేరుకున్నప్పుడు, మీరు దేవునికి కుడి పైపు కూర్చొంటారు. మరి మేము? మాలో ఎవరు మీ కుడి పక్కన కూర్చుంటారు’ అని. ‘దేవుని బిడ్డ’ అని వారు భావించే వారి గురువు భయంకరమైన మరణానికి గురవ్వబోతుంటే, వారడిగే ప్రశ్న అది. కానీ క్రీస్తు స్వభావాన్ని చూడండి – ఆయన జీవితమంతా ఇలానే జీవించారు – ఎవరు ఆయన్ని ఎటు లాగాలని చూసినా కూడా, ఆయన చేపట్టిన కార్యాన్ని చేస్తూనే పోయారు. కాబట్టి ఆయన, ‘ఎవరైతే ఇక్కడ మొదట నిలుచున్నారో వారక్కడ చివర నిలుచుంటారు, ఎవరైతే ఇక్కడ చివరలో నిలుచుంటారో అక్కడ మొదట నిలుచుంటారు’ అన్నారు. అలా అధికార క్రమాన్ని కూలగొట్టడం ద్వారా, దైవాన్ని చేరుకునే మార్గాన్ని తోపులాట ద్వారా చేరుకోలేరని తెలియజేశారు. అంతర్గత ప్రపంచంలో కేవలం నిజాయితీ పని చేస్తుంది.

ఏసు క్రీస్తు స్పూర్తిని నిలుపుదాం!

నమ్మకాలకు అతీతంగా వెళ్లి జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూడాల్సిన సమయం ఇది. ఈ సృష్టి మూలం మీలోనే ఉంది. దాన్ని మీరు పనిచేయనిస్తే, అంతా సమన్వయంలో ఉంటుంది, ఇదే ఆయన భోధనలకు మూలం. క్రీస్తు మాటలు, ప్రపంచంలో త్యాగాన్ని, విశ్వాసాన్ని, ప్రేమను పెంపొందించాయి. కానీ ఆయన జీవితంలో ముఖ్యమైన అంశమూ ఇంకా ఆయన బోధనలకు మూలము, ‘దేవుని రాజ్యం మీలోనే ఉంది’ అనే సూక్తి.

అది మీలోనే ఉంటే, అదొక ఆధ్యాత్మిక ప్రక్రియ అవుతుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే ఒక గుంపు అనో, మతాచరణపద్ధతి అనో లేదా అభిమాన బృందం అనో కాదు. అది వ్యక్తిగతమైన అన్వేషణ. అదే యోగ సారం, ఇంకా తూర్పు దేశాల్లోని ఆధ్యాత్మిక ప్రక్రియ కూడా. దురదృష్టవశాత్తూ, క్రీస్తు మాట్లాడిన అతి ముఖ్యమైన అంశాలను మర్చిపోయారు. ఆయన మాటల సారాన్ని తిరిగి అందించే సమయం ఇది – ప్రత్యేకించి ఒక వర్గానికే కాదు, అందరికీ అందించాలి. ఏసుక్రీస్తు స్ఫూర్తిని నిలుపుదాం.

Download the free ebook “Inner Management”, where Sadhguru offers effective tools to enhance our capabilities, and gives us a way to open up a whole new dimension of life that frees us from external influences.

Download Inner Management

Editor's Note: Go beyond morality and clichés to find out more about the intriguing birth, life and teachings of Jesus. Only on Sadhguru Exclusive! Watch now.

BlogBanner-Jesus-V3