మీ కర్మ పైన పట్టు సాధించండి
కర్మ అనే పదం చాలా కాలం నుండి పరిపరి విధాలుగా దుర్వినియోగం చేయబడింది. కర్మ యొక్క అసలైన అర్థాన్ని సద్గురు తెలియజేస్తారు. కర్మ యొక్క మూలలు ఎంత లోతైన ప్రభావం కలిగి ఉంటాయో వివరించి, సంక్లిష్ట నిర్మాణం గల కర్మను నిర్వహించడానికి ఒక మార్గాన్ని సూచిస్తారు.
జీవశాస్త్రంలోని ఎపిజేనిటిక్స్ అనే శాఖ మానవుల యొక్క ప్రవర్తనాతీరు, జీవితానుభవాలు వారి డిఎన్ఏ మీద ఎలా ప్రభావం చూపుతాయో అధ్యనం చేస్తూ తద్వారా ఒక తరం నుంచి ఇంకొక తరానికి ఎలా సంక్రమిస్తాయో శాస్త్రజ్ఞుల ద్వారా ప్రస్తుతం అన్వేషించబడుతోంది. అయినప్పటికి యోగ పరంగా చూస్తే గతం యొక్క ప్రభావం మన పూర్వీకులని దాటి గ్రహం మీద మొట్టమొదటి ప్రాణి వరకు వెళ్తుంది. ఈ వ్యాసంలో సద్గురు వివిధ సందర్భాలలో తప్పుగా వాడబడ్డ కర్మ అనే పదం యొక్క అర్ధాన్ని వివరించారు. కర్మ యొక్క ప్రభావాలు ఎంత లోతుగా పాతుకుపోయి ఉన్నాయో చెప్తూ, ఈ క్లిష్టమైన విషయం మీద పట్టు ఎలా పొందాలో మార్గం కూడా చూపిస్తున్నారు.
సద్గురు: కర్మ అనగా చర్య లేక మనలో మిగిలిపోయిన ఆ చర్య తాలూకు ముద్ర. మీ తండ్రిగారు చేసిన చర్యలు మీరు ఉన్న పరిస్థితులలోనే కాకుండా మీ శరీరంలోని ప్రతి కణంలోను పనిచేస్తూ మిమ్మల్ని దెబ్బ కొడుతూ ఉంటాయి. మీ తల్లితండ్రుల ప్రభావం నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు మరి! మీరు 18 -20 ఏళ్ళ ప్రాయంలో ఉన్నప్పుడు మీ నాన్న మీద గాని, అమ్మ మీద గాని తిరుగుబాటు చేసి ఉంటారు. కాని 40 -45 సంవత్సరాలు వచ్చేసరికి మీరు వారి లాగ మాట్లాడటం, ప్రవర్తించటం, వారిని అనుకరించడం గమనించి ఉంటారు. కాని అది ఒక నిరాశజనకమైన జీవన విధానం, ఎందుకంటే ఈ తరం వారు వారి ముందు తరం వారిలాగా ప్రవర్తిస్తూ, పనిచేస్తూ, జీవిస్తూ వారు పొందిన జీవితనుభావాన్నే పొందుతూ ఉంటే ఇది ఒక వృధా తరం. ముందు తరం వారు ఊహించలేని, పొందలేని జీవితానుభవాన్ని ఈ తరం వారు అనుభవించాలి. అంటే మీరేదో వీధుల్లో వింతగా ఏదో చేయాలని నా ఉద్దేశ్యం కాదు. నా ఉద్దేశంలో మీరు పొందే ఈ జీవితానుభవం పూర్తిగా మార్పు చెందబడాలి. ఈ అనుభవాన్ని పై స్థాయిలోకి తీసుకెళ్లగలగాలి.
మొట్ట మొదటి ఆర్తనాదం
కర్మ అనేది మీ ఒక్కరిది కాదు. లేదా మీ తండ్రి, తాతలది మాత్రమే కాదు. మొట్టమొదటి జీవి అయిన బాక్టీరియా లేక వైరస్ లాంటి ఏకకణ జీవి యొక్క కర్మ కూడా మీ లోపల ఈ రోజుకి కూడా పనిచేస్తూ ఉంటాయి. మీ శరీరంలో ఉన్న బాక్టీరియా కూడా మీ తాతముత్తాతల తల్లితండ్రులు కలిగి ఉన్న బాక్టీరియా మీద ఆధారపడి ఒక ప్రత్యేకమైన ప్రవర్తనా రీతులను చేరవేస్తున్నాయి. కాబట్టి మీ గురించి మీకు ఉన్న గొప్ప అభిప్రాయాలు, వ్యక్తిగా మీకు ఉన్న గొప్ప ఆలోచనలు అన్నీ అబద్ధం. అందుకే మేము చెప్తూ ఉంటాము ఇది అంతా మాయ అని. ఎందుకంటే మీలో ఆడుకుంటున్న విషయాలన్నీ ఎలాంటివి అంటే దాదాపు మీరు చేసే ప్రతీది మీ గతంలోని సమాచారం ద్వారా నియంత్రించబడుతోంది.
మీరు ఏం చేయనవసరంలేదు. మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాము. మీరు ఊరికినే కూర్చొని 12 గంటలు పాటు రోజు ధ్యానం చేయండి అని మీకు నేను చెప్తే, మొదట్లో ఇది చాలా గొప్ప అదృష్టంగా అనిపించవచ్చు. కాని ఒక నెల తర్వాత మీకు పిచ్చెక్కుతుంది. మీరు ఆ ఉన్మాదాన్ని దాటితే, అన్నిటినీ దాటగలరు. కాని చాలామంది తమలో కలిగే ఈ పిచ్చితనం వల్ల మధ్యలోనే దీనిని వదిలేస్తారు. ఇది వాళ్ళు అనుకొన్నంత సులభం కాదు కాబట్టి వాళ్ళు విపరీతంగా ప్రవర్తిస్తూ పారిపోవటానికి ప్రయత్నిస్తుంటారు. ఇది మీ తండ్రి తాతముత్తాతల అంతేకాకుండా ఆ బాక్టీరియాల ఆక్రందనలే. లక్షల కొలది జీవాలు అన్నీ తమని వ్యక్తపరుచుకోవటానికి అరుస్తూ ఉంటాయి. వాళ్ళు చెప్పేదే వినాలని వారి కోరిక. మిమ్మల్ని వాళ్ళు ఊరికినే వదిలి పెట్టరు. మీరు వాళ్ళని నిర్లక్ష్యం చేయలేరు ఎందుకంటే మీ శరీరంలో ప్రతి కణంలో అవి సలుపుతూనే ఉంటాయి.
అంటే నేను అంత నిస్సహాయంగా చిక్కుకుపోయనా ? అని మీరు అనుకోవచ్చు. చిక్కుకుపోయారు గాని అంత నిస్సహాయంగా కాదు. పశుపత నుంచి -- అంటే ఒక ఏక కణ జీవి నుంచి అత్యున్నతమైన ప్రాణి వరకు ఉండే జంతు స్వభావం యొక్క మిశ్రమ వ్యక్తీకరణ --- పశుపతి గా మారే అవకాశం ఉంది. పశు అంటే ప్రాణం (జీవం) పతి అంటే ప్రభువు. జీవనానికి ప్రభువు. ప్రతి ఒక్కరు ఇది అంతా వెనక వదిలేసి ముందుకు దాటిపోవాలి.
విషయాలపై పట్టు సాధించు
కర్మ అనేది మీ శత్రువు కాదని మీరు అర్థం చేసుకోవాలి. ఏది ఏమిటో అవగాహన లేకపోవడం మీ శత్రువు. కర్మ అనేది జీవతంలో ఒక జ్ఞాపకం. ఒక ఏకకణ జీవినుంచి ప్రతి ఒక్క ప్రాణి వరకు ఈ పూర్వ స్మృతి వల్లే శరీరాన్ని ఏ విధంగా నిర్మించాలో అలా నిర్మించగలుగుతున్నారు. ఈ భౌతిక శరీరంలో ప్రస్తుతం మీ ఉనికికి మూలం మీ కర్మే. ఈ కర్మనంతా తీసివేసినట్లయితే ఈ క్షణంలో మీరు ఈ శరీరాన్ని వదిలివేస్తారు. ఇది ఎలా అంటే మీ బిరడా తీసివేసినట్లే. కర్మ ఒక జిగురు లాంటిది. ఈ కర్మే మిమ్మల్ని ఈ శరీరానికి అతికించి ఉంచుతుంది.
మీరు ఈ శరీరాన్ని లేక మనస్సుని కాని మార్చవలసిన అవసరం లేదు. మీరు చేయవలసినది ఏమిటంటే దీని పిడి ఎక్కడ ఉన్నదో కనిపెట్టాలి. ప్రస్తుతం మీరు కారులో కూర్చొని సీట్ బెల్ట్ వేసుకున్నారు. సీట్ బెల్ట్ మంచిదే. ఇది మీ జీవితాన్ని రక్షించవచ్చు. కాని మీరు విడిపించుకోవాలని అనుకొన్నప్పుడు విడిపించుకోలేని విధంగా సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది మీకు ఒక బంధనం అవుతుంది. మీరు కారు లోపలికి వెళ్లి తలుపు మూసుకుంటారు. ఇది మంచిదే. అయితే మీరు కారు లోపల్నించి కావాలని అనుకున్నప్పుడు తలుపు తెరవలేకపోవడం చాలా భయంకరమైన స్థితి. మీకు తప్పకుండా దాని హ్యాండిల్ ఎక్కడ ఉన్నదో తెలిసి ఉండాలి. అప్పుడు మీకు పర్వతం అంత కర్మ ఉన్నా సరే, ఏ సమస్యా ఉండదు.
ఈ సమస్య కర్మ వల్ల వచ్చింది కాదు. మీరు ఇందులో చిక్కుకుపోవడంవల్ల వచ్చింది. మీరు ఈ వలలో బంధించబడటం వల్ల వచ్చింది. మీకు మీ శరీరానికి మధ్య కొంచం ఎడం ఏర్పడితే, అలాగే మీకు మీ మనస్సుకు మధ్య కూడా ఎడం ఏర్పడితే చాలు, ఎలాంటి కర్మ అయినా సరే మీ మీద ప్రభావాన్ని చూపలేదు. ఈ శరీరంగా ఉంటూ జీవిస్తూ ఒక వ్యక్తిగా మీ పాత్రని మీరు నిర్వహించుకోగలరు, అప్పుడు ఈ కర్మ మీకు బంధనం కాదు. ఒక సోపానం అవుతుంది.
Editor’s Note: Get the latest updates from the Isha Blog. Twitter, facebook, rss or browser extensions, take your pick.