మనమెందుకీ ప్రపంచంలోకి వచ్చాం?
అసలు ఈ జీవితానికి అర్ధం ఉందా? మనం ఎందుకు ఇక్కడికి వచ్చాము? జీవితం దుర్భరంగా ఉంటే దాన్ని అధిగామించేదేలా? ఈ ప్రశ్నలకు సామాధానం చదివి తెలుసుకోండి.
ప్రశ్న: మనమెందుకీ ప్రపంచంలోకి వచ్చాం? ఈ జీవితానికో అర్థం అంటూ ఉందా?
సద్గురు: మీరేగనక జీవితాన్ని హాయిగా సంతోషంగా గడుపుతుంటే ఈప్రశ్న వేసేవారా...? జీవితానుభవాలు మీకు ఉత్సాహాన్నివ్వడం లేదు కాబట్టి ఈప్రశ్న మీరడుగుతున్నారు. అసలు మనుషులు ఆలోచనలు అపోహలు అభిప్రాయాలు ఉద్వేగాల గుడారాలుగా మారిపోయారు. దానర్థమేమిటో ఆలోచించారా..? మీ మానసిక ఘర్షణలు మిమ్మల్ని మీకు కాకుండా చేస్తున్నాయి. దానికి కారణం చెప్పమంటారా.. మీరు జీవితం గురించి ఆలోచిస్తున్నారే కానీ జీవించటం మర్చిపోయారు. పుడమి తల్లి మిమ్మల్ని ఆహ్వానించింది జీవితాన్ని హాయిగా గడిపేందుకు,అంతేకానీ ఆలోచనలే మీ జీవితం మాత్రం కాదు. అర్ధంపర్థం లేని ఆలోచనలను పక్కన పెట్టండి. అంతకన్నా మీరుచేయవలసింది ఏమిటంటే, మీరు గడిపే జీవితాన్ని విశ్లేషించండి, మీకే అర్ధమవుతుంది.. జీవించటానికి కారణాలు వెతకక్కర్లేదని,జీవితం తనంతటతానే ప్రకాశించే వెలుగు తరంగమని. అందుకే జీవితాన్ని వికసించనివ్వండి. ఆ వికసనాన్ని అనుభూతి చెందండి. జీవించటానికి అవసరమైన కారణమేమిటో తెలుసుకుంటారు.
ప్రశ్న: జీవితమెందుకు కొంతమందికి ప్రతిబంధకంగా మారుతుంది...దాన్న అధిగమించే మార్గాలున్నాయా?
సద్గురు: ప్రజలు జీవితంలో ప్రతిదశని ఓ సంక్షోభంగానే మార్చుకుంటున్నారు కదా, యవ్వనమో సంక్షోభం, కెరీర్ తీర్చిదిద్దుకోవటమో సంక్షోభం, నడివయస్సు జీవితమో సంక్షోభం, ఇక వృద్ధాప్యమూ సంక్షోభమే. అసలు మీరంతా సంక్షోభంలో లేనిదెప్పుడు...అది చెప్పండి..? కాస్త కష్టాలొచ్చిపడ్డాయంటే మనుషుల ప్రవర్తన చిత్ర విచిత్రంగా ఉంటుంది.ఒక కష్టంలో మీరున్నారంటే ఆ కష్టాన్ని ఎదుర్కోటంలో మీరు దృఢంగా ఉండాలి.కానీ చాలా కొద్ది మంది మాత్రమే అలా ఉంటున్నారు. సామాన్యంగా, అలాంటి సమయాల్లో చాలామంది నీరుగారిపోతారు.
మీకోసం మీరు కాస్త సమయాన్ని కేటాయించేందుకు సుముఖంగా ఉంటే, ఈ పార్శ్వాన్ని తేలికగా అధిగమించ వచ్చు. మీరు చెసే పని ముఖ్యమైనదని మీరనుకుంటే, ముందు మిమల్ని మీరు తీర్చి దిద్దుకోవాలి.ఇందుకు అనేక మార్గాలు ఉన్నాయి. మిమ్మల్ని నడిపే జీవశక్తిని మెరుగ్గా పనిచేసేందుకు అనేక మార్గాలున్నాయి. ఇందుకు సంబంధించిన సంపూర్ణ శాస్త్ర సాంకేతిక ఉన్నాయి.