మంచి, చెడు రెండూ కాదు – నిశ్శబ్దం మాత్రమే
జీవితాన్ని ఇదీ - అదీ అని, మంచి – చెడుఅని విభజిస్తే, ఆ వ్యక్తికి నిశబ్దం అనేది ఎప్పటికీ తెలియదని, సద్గురు అంటున్నారు. జీవితాన్ని ఇదీ - అదీ అని, మంచి – చెడ్డ అని విభజిస్తే, ఆ వ్యక్తికి నిశ్శబ్దం అనేది ఎప్పటికీ తెలియదని సద్గురు అంటున్నారు. “యోగా” అంటే ఈ ద్వైతాన్ని నాశనం చేయడమే, అందుకనే ఆదియోగి అయిన శివుడ్ని వినాశకారుడు అంటాం.
సద్గురు: ప్రజలకి మంచితనం నేర్పించిన గురువులు ఉన్నారు, మరి కొందరు విద్వేషాన్ని నేర్పినవారు కూడా ఉన్నారు. కానీ మంచి, చెడు అనే ఈ రెండు భావాలనీ విచ్చిన్నం చేయడానికి, తాము చేయగలిగిందల్లా చేసిన గురువులు ఇంకొందరు ఉన్నారు. ఎందుకంటే, ఈ రెండు భావాలనీ విచ్చిన్నం చేసినప్పుడే జీవితం జరగవలసిన విధంగా జరుగుతుంది; అంతే గానీ, ఏవో కొన్ని నీతి సూత్రాలు వల్లో, అహంకార పూరితమైన ఆలోచనలో లేదా భావోద్వేగాల వల్లో కాదు. అలా చేసినప్పుడు మాత్రమే, అంతర్ముఖంగా నిశ్శబ్దంగా ఉండం అంటే ఏమిటో ఎవరైనా అనుభూతి చెందగలరు. మంచివాళ్ళు నిశ్శబ్దంగా ఉండలేరు, విద్వేషపరులూ నిశ్శబ్దంగా ఉండలేరు. వారి దృష్టిని మంచి, చెడుల పట్ల కాక , కేవలం జీవిత ప్రక్రియగా పట్ల పెట్టిన వారు మాత్రమే నిశ్శబ్దంగా ఉండగలరు.
అదీ – ఇదీ
నిశ్శబ్దమంటే, మీలో మీకు మీ సొంత వ్యహారం కొనసాగుతూ ఉండక పోవడమే. నిశ్శబ్దమంటే, పక్షుల కిలకిలలు, లేదా సూర్యుడు ఉదయించేప్పుడు జరిగే భగ భగలుఉరుములు నాకు వినబడకపోవడం కాదు. సరళంగా చెప్పాలంటే, నిశ్శబ్దమంటే ‘నేను చప్పుడు చేయడం ఆపేశాను’ అని అర్థం. మీరు ఇదీ - అదీ అంటూ విభజన చేసినందువల్లనే ప్రాధమికంగా చప్పుళ్ళన్నీ మొదలయ్యాయి. ఇదీ – అదీ అనే భావన ఉన్న చోట, నిశబ్ధం ఉండే అవకాశం లేదు.ఎక్కడైతే కేవలం “ఇది” ఇంకా “ఇది” అనే భావన ఉంటుందో, అక్కడ మాత్రమే నిశబ్దం సాధ్యమవుతుంది.
ప్రతిచోటా ఇదే ప్రశ్న అడుగుతూ ఉంటారు – “నేను ఎంత ఆద్యాత్మిక సాధన చేస్తే సరిపోతుంది?” అని. మీరు ఎంత చేసినా సరే, మీరు సమస్యతోనే ఉంటారు. మీరు కేవలం ఇది మాత్రమే చెయ్యాలి, ఇది మాత్రమే. మిగతావన్నీ కుడా ఇందులో భాగమే అవ్వాలి, అప్పుడు సమస్య ఉండదు. మీరు ఇదీ, అదీ చేస్తే, మీరు గందరగోళంలో పడతారు – అది అలా పనిచెయ్యదు. ప్రజలకు మంచితనాన్ని నేర్పించాలని ప్రయత్నించిన వారు, ఆ పద్ధతిని అనుసరించటానికి కారణం సామాన్యంగా ఏమిటంటే, ఆ సమయం లో సమాజం పూర్తిగా గతి తప్పి ఉండటం వల్ల. సామాజిక వ్యవస్థలో కొంచెo క్రమం తీసుకురావడం కోసం, ఇంకా ప్రజలను వారు చిక్కుకున్న భావాల నుండి బయటపడేయటానికి, వారు ప్రజలు చేస్తున్న దానికి విరుద్ధంగా బోధించారు. “దెబ్బకు దెబ్బ” అనే సిద్దాంతాన్ని నేర్చుకున్న వారికి , ఒక వ్యక్తి వచ్చి “మిమ్మల్ని ఎవరైనా ఒక చెంపపై కొడితే, వారికి మీ రెండో చెంప చూపించండి” అని చెప్పాడు అంటే, ఇది కేవలం, అప్పట్లో ప్రజలు చిక్కుకు పోయి ఉన్న, ఆ భావాలను నాశనం చేయడానికే. అతన్ని ఇంకొంత కాలం బతకనిచ్చి ఉంటే, అవసరమైతే మరొకరి చెంపపై కొట్టడమెలాగో కూడా వారికి చెప్పి ఉండేవాడు. లేదంటే, ఆయన అప్పటికి అవసరమైన భాగాన్ని మాత్రమె నేర్పి ఉంటాడు; మిగిలింది ప్రజలెలాగూ నేర్చుకుంటారులే అనే ఉద్దేశంతో.
మంచి, చెడు అనే ఆలోచనలు
మంచితనం అనే భావనలోనుంచి వచ్చే ప్రతి తలంపు, వివిధ స్థాయిల్లో పక్షపాతాన్ని కలగజేస్తుంది. ఎప్పుడైతే మీరు ఒకదాన్ని మంచిదిగానూ, మరొకదాన్ని చెడ్డదిగానూ చూడడం మొదలుపెడతారో, మీ గ్రాహ్యత పూర్తిగా వక్రీకరించ బడుతుంది. మీరు దానినుంచి బయటపడే అవకాశమే లేదు. మీరు ఎంత గట్టిగా కృషి చేసినా, అది అలాగే కనబడుతుంది. దీనిని విచ్చిన్నం చేయడానికే, యోగా సృష్టించబడింది. అందుకే, మొదటి యోగా గురువైన శివుణ్ణి, వినాశకారుడు అంటాం. తొలుత ఎంతో అద్భుతంగా అనిపించి తరువాత మిమ్మల్ని చిక్కుకుపోయేలా చేసే వీటన్నింటినీ విచ్చిన్నం చేయడమే యోగా ఉద్దేశ్యం.
శివుడు ‘యోగా’ని అందించినప్పుడు, దానిని ఆయన ఎన్నో విధాలుగా అందించారు. ఒక స్థాయిలో ఆయిన “అది చాలా చేరువలో ఉంది” అన్నారు. ఆయన పార్వతి దేవిని “నువ్వు నా ఒడిలో కూర్చో, అంతే.. అదే యోగా” అని అన్నారు. ఇదేదో ఒక యువతిని తన ఒడిలో కూర్చోబెట్టు కోవడానికి ఒక యువకుడి చేసిన యుక్తిలా కనిపిస్తుంది. కానీ కాదు, ఆయన చేసింది కేవలం ఆమెను తన ఒడిలో కూర్చోబెట్టుకోవడం మాత్రమే కాదు, తనలోని అర్థ భాగాన్ని వదులుకుని, ఆమెను తనలో కలుపుకున్నాడు. ఆమె రకరకాల ప్రశ్నలు అడుగుతున్నప్పుడు, “నువ్వేమీ విచారించకు, నువ్వు ఇక్కడ కూర్చో అంతే. నా ఒడిలో కూర్చో, అంతా అదే జరుగుతుంది” అన్నారు. కానీ, ఇంకొంత మందికి ఆయన విస్తృతమైన సాధనా పద్దతులు బోధించారు. సత్యం గురుంచి మాట్లాడుతూ, సత్యం అనేది కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నట్టు, ఇంకా చాలా కఠినమైన అడుగులు తీసుకోవాలన్నట్టుగా బోధించారు. ఒక వ్యక్తే రెండు విధాలుగా మాట్లాడారు.
సత్యాన్ని వివరించవలసిన అవసరం లేదు
ఎంతో అందమైన విషయం ఇది – ఆయన సత్యం గురించి వివరించడం లేదు, ఆయన తన ముందు కూర్చొని ఉన్నవారిని బట్టి వ్యహరిస్తున్నాడు, ఎందుకంటే సత్యాన్ని వివరించలేము, ఆ అవసరము కూడా లేదు. ప్రపంచం చేసిన తప్పు ఇదే. వారు పరమోత్తమమైన (The Ultimate) దానిని వివరించే ప్రయత్నం చేస్తూ వచ్చారు, వారు ప్రజలనుబట్టి వ్యహరించలేదు. వారు ఎప్పుడూ వివరించే ప్రయత్నం చేస్తూ వచ్చింది, పరమోత్తమమైనదిగా వారు భావించే దేవుడిని (GOD). ఎప్పుడైతే మీరు పరమోత్తమమైన (The Ultimate) దానిని వివరించే ప్రయత్నం మొదలు పెడతారో, ఎన్నో రకాల ఊహా జనిత వక్రీకరణలో మీరు పడతారు.
యోగ పద్దతిలో పరమోత్తమమైన దానిని వివరించడం అంటూ ఉండదు. యోగా కేవలం ప్రజలకు అవసరమైనదే వివరిస్తుంది. పరమోత్తమమైన దాని గురించి ఏమీ చేయవలసిన అవసరం లేదు – అదే పరమోత్తమమైన ది. ప్రస్తుతం ఎవరైతే వివిధ ప్రతిబంధక స్థాయిల్లో ఉన్నారో, వారికి అవసరమైన విధంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. మీరొక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు, అతడు ‘మిమ్మల్ని’ పరిశీలించాలి. అతను కళ్ళు మూసుకుని ప్రార్ధించాలని మీరు ఆశించరు. మీరు అందుకోసం అతని దగ్గరికి వెళ్ళలేదు. అతను మీ శరీరాన్ని పరిశీలించి, సమస్య ఏమిటో కనుక్కోవాలని మీరు అనుకుంటారు. అదే విధంగా, ప్రజలే ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. పరమోత్తమమైనది ఏదయితే ఉందో, అది ఏమాత్రం సమస్యలతో లేదు. సమస్యలతో కష్టపడుతుంది ఈ వ్యక్తులు. ప్రతీ చిన్న విషయానికి తర్జన భర్జన పడుతుంది ఈ వ్యక్తి. కాబట్టి, ఈ వ్యక్తితో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. ప్రతి వ్యక్తితోనూ అతను ఇప్పుడు ఉన్న స్థితి ప్రకారం వ్యహరించడం, అంతిమమైన దాని గురించి సంభోదించక పోవడం అనేదే యోగ విజ్ఞానం సారం.
ప్రేమాశీస్సులతో,