మరణం సంభవించిన తరువాత తిరిగి ప్రాణం పోయడం ఎలా?
మరణం జరిగిన తరువాత తిరిగి బ్రతికించే విధానం. మరణం సంభవించిన వారికి తిరిగి ప్రాణం పోయడానికి యోగాలో ఉన్న పద్ధతి గురించి సద్గురు వివరిస్తున్నారు.
మరణం సంభవించిన వారికి తిరిగి ప్రాణం పోయడానికి ఏదైనా పద్ధతి ఉందా అని ఎప్పుడైనా ఆలోచించారా? "సూర్య స్పర్శ" అనే ప్రక్రియను సాధన చేసిన యోగులు, మరణం సంభవించిన వారిని తిరిగి బతికించే వారు అని సద్గురు చెబుతూ, ఈ అతి గోప్యమైన ప్రక్రియ ఎలా అంతరించిపోయిందో వివరిస్తున్నారు.
మీరు ఒక పక్షి చనిపోయి మూడు గంటలు అయ్యాక, ఆయన దగ్గరికి తీసుకెళ్తే, ఒక మామూలు భూతద్దంతో, సూర్యరశ్మితో కూడా కాదు, అద్దం మీద నుంచి వచ్చే కాంతిని ఉపయోగించి- ఆయన ఆ పక్షిని తిరిగి జీవింపజేసేవారు. అది లేచి కిచకిచ అంటుంది, లేచి కూర్చుంటుంది, అటు ఇటు నడుస్తుంది ఆ తరవాత కొంచెంసేపు ఎగురుతుంది, అలా తిరిగి మళ్లీ కింద పడిపోయి చచ్చిపోతుంది. "దాన్ని పూర్తిగా బ్రతికించొచ్చుగా", అని చుట్టూ ఉన్న జనం అడిగితే అతను, "అది మా గురువుగారు చేయగలరు. నేను ఇంకా నేర్చుకుంటూ ఉన్నాను", అని చెప్పేవాడు. ఆయన అప్పటికే డెబ్బయ్యోపడికి దగ్గర్లో ఉన్నాడు.
"సూర్య స్పర్శ" విద్య ఎలా అంతరించిపోయింది?
అతని దౌర్భాగ్యం కొద్దీ, ఇస్లామిక్ దండయాత్రలు అప్పటికే జరిగి ఉన్నాయి. ఒక ముసల్మాన్ రాజు ఏడేళ్ల కొడుకు ఏదో అంతుచిక్కని జ్వరంతో చనిపోయాడు. వాళ్లు ఈ యోగి పక్షిని బతికించడం గురించి విని, అతని దగ్గరికి వచ్చి" మా రాజు గారి కొడుకు మీద ఈ ప్రయోగం చెయ్యి", అన్నారు. కానీ అతను ఎప్పుడూ తన దేవత సమక్షంలో కాకుండా బయట ఎక్కడా చేసేవాడు కాదు. అతనికి ఒక చిన్న ఆరాధ్య దేవత, గుడి ఉన్నాయి. అతను ఎప్పుడూ ఆ గుడిలోనే ప్రయోగాలు చేసేవాడు. కాబట్టి అతను " నేను నా దేవి ముందు కాకుండా వేరే ఎక్కడా చేయను", అని చెప్పాడు. ఆ మూర్తి ఆయన సృష్టించుకున్న శక్తి స్వరూపం. ఆయన దానితో కలిసి పని చేస్తారు కానీ వీళ్ళకు ఆ దేవత విలువ తెలియదు ఎందుకంటే, వాళ్ళ ప్రకారం అది కేవలం విగ్రహారాధన మాత్రమే. వాళ్లు," ఏంటి, దేవత?? మేము దాన్ని కోటకి తీసుకువెళ్ళిపోతాం", అన్నారు. “లేదు లేదు. ఆమెను కదపకూడదు" అని యోగి చెప్పాడు. "ఏం కాదు..కదపచ్చు", అని వాళ్లు ఆ విగ్రహాన్ని పైకి తీశారు. "వద్దు, అలా చేయొద్దు", అని ఆయన బతిమాలాడాడు. వాళ్లు ఆ మూర్తిని పెకలించి, అతడిని కూడా రమ్మని లాగుతూ ఉండగా ఆయన " నేను రాను. నేను అలా చేయను. నేను అస్సలు చేయను" అని చెప్పాడు. వాళ్లు తన దేవతను ఒక బొమ్మ లాగా పట్టుకుని బయటకి తీసుకెళ్తుంటే ఆయనకు చాలా కోపం వచ్చింది." నేను మీ రాజు కొడుకుని బతికించను. నాకు చేతకాదు. ఒకవేళ వచ్చినా, నేను చేయను", అని అన్నాడు. అది విని వాళ్ళు అతని జుట్టు పట్టుకుని రాజు దగ్గరకు ఈడ్చుకుని వెళ్లారు. అప్పుడు కూడా అతను "నేను చెయ్యను" అని చెప్పాడు. వాళ్లు అతడిని అక్కడికక్కడే నరికేశారు. ఇవన్నీ జరుగుతూ ఉండగా మధ్యలో వాళ్లు ఆ దేవతా మూర్తిని కింద పడేశారు అది కాస్తా విరిగిపోయింది.
ఆయన తన శిష్యులు కొంతమందికి ఈ విద్య నేర్పిస్తూ ఉండేవారు. కానీ అంతా వాళ్లతోనే పోయింది. కానీ ఈ విషయం మాత్రం చాలా స్పష్టంగా చాలా నమ్మదగిన, బాధ్యతాయుతమైన వ్యక్తులచే రాయబడింది. ఎన్నోసార్లు ఆయన చనిపోయిన పక్షిని బ్రతికించేవాడు. అప్పటికే 3 గంటల క్రితం చనిపోయిన పక్షిని ఆయన లేపి, కొంచెం సేపు ఎగిరేటట్టు చేసేవాడు- దాదాపు గంట పాటు. "మా గురువుగారు ఈ పక్షిని పూర్తిగా జీవితకాలం పాటు బతికేట్టు చేయగలరు. ఏదైనా సరే, ఆయన మనుషుల్ని కూడా తిరిగి బతికించగలరు", అని చెప్పేవారు.
అలాంటి వాళ్ళు ఎంతమందో ఉండేవాళ్ళు. ఈ పక్షుల్ని బతికించే యోగి కొంచెం అసలు తరహాకి చెందారు. దక్షిణ భారతదేశంలో ఇంకొక యోగి ఉండేవారు. ఈయన అసలైన యోగి, అందుకని జనం ఆయన దగ్గరికి ఆశీర్వాదాల కోసం వస్తుండేవారు. ఆయన చుట్టూ చాలా సంగతులు జరుగుతుండేవి. కర్ణాటక రాష్ట్రంలోని నైరుతి ప్రాంతంలో ఉన్నకొల్లేగల్ దగ్గర ఆయన నివసించేవాడు, ఆయన దగ్గరికి జనం పోగయ్యే వారు. ఒకసారి ఏం జరిగిందంటే, ఒక చిన్న పిల్లవాడు చనిపోయాడు. తల్లిదండ్రులు ఆ పిల్లవాణ్ణి యోగి దగ్గరకు తీసుకొచ్చి గుండెలవిసేలా ఏడ్చారు. ఆయన వాళ్ల పరిస్థితి గమనించి, బహుశా ఆ పిల్లవాడు చనిపోయి ఉండాల్సింది కాదని గ్రహించి ఉంటారు, అది ప్రమాదవశాత్తు జరిగి ఉంటుంది. ఆయన పక్కనే ఒక దీపం ఉంది. దాదాపుగా కొన్ని రకాల ప్రత్యేక సాధనలు చేసే యోగులందరికీ వారి పక్కన ఒక దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఈయన ఆ దీపం చమురులో వేలు ముంచి, ఆ మరణించిన బాలుడి నోట్లో పెట్టారు, ఆ పిల్లవాడు కొద్దిసేపట్లో ప్రాణంతో లేచి కూర్చుని మామూలుగా అయిపోయాడు.
శవం కదులుతుందా?
ఎవరైనా చనిపోయారని వైద్యులు చెప్పిన వెంటనే, అతను పూర్తిగా మరణించినట్టు కాదు. మరణం నెమ్మదిగా సంభవిస్తుంది. మీకీ విషయం ఇప్పటి వరకూ తెలియనట్లైతే- ఒక మనిషి చనిపోయిన తరువాత, దాదాపు 14 రోజుల వరకు, గోళ్లు ఇంకా జుట్టు పెరుగుతూనే ఉంటాయి. మరణం మెల్లగా వస్తుంది. అది ఇంకా పూర్తి అవలేదు.
ఈ శరీరపు మట్టిముద్దలోంచి జీవ ప్రక్రియ నిష్క్రమణం అంచెలంచెలుగా జరుగుతుంది. భౌతికంగా చూస్తే, శరీరం అచేతనం అయినప్పుడు- ఊపిరితిత్తులు, గుండె ఇంకా మెదడుకు సంబంధించిన ప్రక్రియలన్నీ ఆగి పోయినప్పుడు - వాళ్లు మిమ్మల్ని మరణించారని ప్రకటిస్తారు. కానీ అంతర్లీనంగా జీవ ప్రక్రియ కొనసాగుతూనే ఉంటుంది, దాన్ని మీరు తిరిగి ప్రేరేపించి, వ్యవస్థను చైతన్యవంతం చేయవచ్చు. దీన్ని ఉపయోగించే తాంత్రికులు శవాలను నడిపించారు, దానిలో ఏ వింత లేదు. కొన్నిసార్లు, వాళ్లు ఇలా దహన క్రియ జరుగుతుండగా కూడా చేయగలరు. ఇలాంటివి ఎన్నో ఉదాహరణలున్నాయి. నేను స్వయంగా చూడలేదు కానీ, నాకు తెలుసు కొంతమంది వ్యక్తులు నిజంగా చూసిన వాళ్ళు - దహనం కోసం నిప్పంటించిన తర్వాత, ఆ కాలుతున్నశరీరం లేచి నడవటం చూసినవాళ్లు ఉన్నారు, వాళ్లకి అబద్ధం చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్లు చెప్పరు కూడా. శరీరం బయట నుంచి కాలడం మొదలైన ఆ క్షణంలో, లోపలున్న జీవప్రక్రియ తిరోగమనం ప్రారంభిస్తుంది. అప్పుడు అత్యంత తీవ్రంగా ఆ ప్రక్రియ ఒక చోట కేంద్రీకరింపబడి ఉంటుంది. దీన్ని ఉపయోగించి వాళ్లు వ్యవస్థని తిరిగి ప్రేరేపణ చేసినప్పుడు ఆ శవం హఠాత్తుగా లేచి నడుస్తుంది. ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు అది బతికి ఉన్నట్టుగానే వ్యవహరిస్తుంది ఆ తర్వాత శక్తి నశించి, పడిపోతుంది.