సద్గురు: ప్రాధమికంగా, మీరు ‘నేను’ అనుకునేది, ఈ మానవ వ్యవస్థగా పిలువబడుతున్నదల్లా, ఒక విధమైన ‘సాఫ్ట్ వేరు’. ఈనాడు, సాఫ్ట్వేర్ అంటే ఒకరకమైన జ్ఞాపకం(memory)అని మనకు తెలుసు. అది మనవ శరీరమైనా లేక బ్రహ్మాండమైనా అన్నీ పంచభూతాల (భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము) తోనే సృజించబడ్డాయి. పంచభూతాలకి తమదైన జ్ఞాపక శక్తి ఉన్నది. అందుకే అవి వాటి తీరులో ప్రవర్తిస్తాయి.

మట్టిగా ఉన్నదే ఆహారం అయింది. ఆహారంగా ఉన్నదే తర్వాత ఒక మానవ శరీరంగా అయింది. అదే మళ్ళీ మట్టిలో కలిసిపోతుంది. మరి అది ఎలా జరుగుతోంది...? మన్నుగా ఉన్నది ఒక పుష్పంగా, ఫలంగా, లేదా మరొకటిగా ఎలా అవుతుంది? దానికి కారణం బీజంలో నిక్షిప్తమై ఉన్న స్మృతులే. ఎవరైనా తమ తండ్రినో, తల్లినో పోలి ఎలా ఉంటున్నారు? దానికి కారణం ఆ ఒక్క కణంలో నిక్షిప్తమై ఉన్న స్మృతి వల్లనే. అన్నిటికీ పదార్థం ఒకటే - అవే పంచభూతాలు. కేవలం స్మృతుల మూలంగానే మట్టి ఆహారంగానూ, ఆహారం మానవ శరీరంగానూ అవుతోంది.

కేవలం ఒక ఆలోచనతో లేక మనోభావంతో లేక మీ ప్రాణ శక్తి మీద ఉన్న కొంత నియంత్రణతో మీరు ఈ స్మృతి పై ఎంతో ప్రభావం చూపించవచ్చు, ఏ స్థాయిలో చూపించగలరంటే అది పూర్తిగా మారిపోయేంతగా.

తీర్థం వెనక ఉన్న శాస్త్రీయత

ఒక ఆలోచన లేక ఒక మనోభావంతో మీరు నీటి రసాయనిక మార్పు చేయకుండానే, పరమాణువుల అమరికలో మార్పు చేయవచ్చని ఈనాడు ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ఏ రకమైన రసాయనిక మార్పులు లేకుండా అదే H2O, దానిలో ఉన్న స్మృతులను బట్టి, మీ శరీరంలో విషంలా పనిచేయవచ్చు లేదా జీవామృతం కావచ్చు.

బయట ఎక్కడా, ఎవరి చేతి నుండో, ఆహారము నీళ్లు తీసుకోకూడదని మన అమ్మమ్మలు మనకు చెప్పారు. మనం ఎప్పుడూ, ఆ రెంటినీ మన మీద ప్రేమ, ఆపేక్ష ఉన్న వారి దగ్గర నుంచే స్వీకరించాలి. అందుకనే భారతదేశంలో, సంప్రదాయ పరమైన ఇళ్లలో, ఎప్పుడూ ఒక ఇత్తడి బిందె ఉంటుంది. దాన్ని రోజూ కడిగి పెట్టి, దానికి పూజ చేసి, బొట్టు పెట్టి, అప్పుడే దానిలో తాగడానికి నీరు నింపేవారు. ఇక దేవాలయాల్లో అయితే, ఒక ఉద్దరిణె నీళ్ల కోసం కోటీశ్వరుడు కూడా తాపత్రయపడతాడు. ఎందుకంటే అటువంటి నీరు మీరు ఎక్కడా కొనగలిగింది కాదు. ఆ నీటిలో దైవ స్మృతి ఉంటుంది, తీర్థం అంటే అదే. ఇది తాగితే అది తమలోని దైవత్వాన్ని గుర్తు చేస్తుంది, అందుకే ప్రజలు దానిని తీసుకోవాలి అని అనుకుంటారు.

మీరు ఇదంతా మూఢ నమ్మకం అనుకున్నారు, కానీ ఇప్పుడు శాస్త్రజ్ఞులు అది నిజమే అని అంటున్నారు. నీటిని బలవంతంగా పంపింగ్ చేయటం వల్ల, ఆ నీరు పైపుల, ద్వారా ప్లాస్టిక్ లేక ఇతర గొట్టాల ద్వారా అనేక మలుపులు తిరుగుతూ రావడం వల్ల, ఆ నీటి మీద దుష్ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అంటే నీటికి ఒక స్మృతి ఉన్నది, మీ భౌతిక శరీరంలో 72 శాతం నీరే, అంటే మీరు ఒక పొడుగాటి నీళ్ల సీసా అన్నమాట. మీరు ఆ మంచి నీళ్ళ బిందె లో ఉన్న నీటిని ఆహ్లాదంగా ఉండేలా ప్రభావితం చేయగలిగితే, మరి మీ దేహంలో ఉన్న నీటిని ఆనందభరితం చేయలేరా? ఇదే యోగ శాస్త్రము. భూత అంటే మూలకాలు, మరి భూత శుద్ధి అంటే ఆ మూలకాలను శుద్ధి చేయటం. భూత శుద్ధి అనేది యోగాలోని అతి ప్రాథమిక అంశము. మీరు చేసే యోగా లోని ప్రతి అంశము కూడా ఈ భూత శుద్ధి నుండి తీసుకోబడ్డవే.

భారత దేశంలోని నీటి ఎద్దడి పరిస్థితి

మన జీవనానికి నీరు ముఖ్యమైన అంశం. కానీ దేశం ఇప్పుడు ఎదుర్కొంటున్న నీటి ఎద్దడి చాలా తీవ్రమైనది. దేశంలో తలసరి నీటి లభ్యత 1947 తో పోల్చుకుంటే 18 శాతం మాత్రమే ఉన్నది. ఈనాడు దేశంలో కొన్ని పట్టణాలలో ప్రజలు మూడు రోజులకు ఒక సారి స్నానం చేస్తున్నారు. ఈ దేశ సంస్కృతి ఎలాంటిదంటే, ఏది ఏమైనా సరే, మీరు భోజనం చేయకపోయినా సరే, మీరు ఖచ్చితంగా స్నానం చేయాలి. కానీ ఈనాడు ప్రజలు స్నానం చేయడం లేదు. ఇది పురోగతి కాదు, ఇది శ్రేయస్కరం కాదు. పరిస్థితి ఇక ఎలా కానుందంటే, ఇంకొన్నాళ్ళకి మనం రెండు రోజులకు ఒకసారి నీరు తాగవలసి వస్తుందేమో. ఒక దేశంగా మనకు అంత సంసిద్ధత లేదు, లేదా ప్రజలందరికి తాగేందుకు నీటిని అందించేందుకు కోట్లాది లీటర్ల నీటిని, ఒక చోట నుంచి ఇంకోచోటకి తరలించేందుకు కావలసిన మౌలిక వసతులు కూడా లేవు. ఇలా అయితే, కోట్లాది ప్రజలు కేవలం నీటి సమస్యతో చనిపోతారు.

నేను కొన్ని ఏళ్ల క్రితం హిమాలయాల్లో ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు గంగా నదిపై కట్టిన తెహ్రీ డామ్ దగ్గరికి వెళ్లాను. అక్కడ నీటి మట్టం చాలా తక్కువగా ఉందని, నీరు కేవలం 21 రోజులకు సరిపోతుందని చెప్పారు. అంటే రాబోయే 21 రోజుల్లో వర్షం పడకపోతే, ఇక ఆ ప్రాజెక్టు దిగువ భాగానికి నీరు లభించదు. అలా జరిగితే ఆ పరిస్థితి మన పై ఎంతో మానసిక ప్రభావం చూపించగలదు. గంగా ప్రవాహం ఆగిపోతుందా? మనకు గంగానది కేవలం ఒక నది కాదు, గంగను పరిరక్షించేందుకు కొన్ని ఆధ్యాత్మిక సంఘాలు ఉన్నాయి, వారు నదిని పరిరక్షించడంలో చాలా కృషి చేస్తున్నారు. ఈ విషయం పట్ల వారు ఎంతో వ్యాకుల పడుతున్నారు. భారతీయులకు గంగ అంటే ఎంతో పెద్ద అంశం. పట్టణాల్లో ఉన్నవారు అలా అనుకోపోవచ్చు, కాని సామాన్య ప్రజలకు అది కేవలం ఒక నది మాత్రమే కాదు అంత కన్నా చాలా పెద్దది. అది మనకు జీవానికి ప్రతీక వంటిది.

వర్షాలు రెండు, మూడు వారాలు ఆలస్యమైతే, అది ఏ సంవత్సరమైనా జరగవచ్చు, ఇక గంగా ప్రవాహం ఉండదు, మన పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. అందుకే మనం ఎరుకతో జనాభాను అదుపు చేసుకోవాలి, లేకపోతే ప్రకృతే ఎంతో కౄరంగా ఆ పని చేస్తుంది. మనకున్న మార్గం అదొక్కటే. జనాభా పెంచకూడదని నేను అనడం లేదు. కాకపోతే దానిని ఎరుకతో కంట్రోల్ చేయాలి. లేదంటే ప్రకృతే క్రురంగా ఆ పని చేస్తుంది. మనం మానవులమైతే మనం దానిని ఎరుకతో చేయాలి, అటువంటి పరిస్థితులు మనకు జరగకుండా చూసుకోవాలి.

ప్రేమాశీస్సులతో,

సద్గురు