నిశ్చలంగా కూర్చోవడం - శరీరాన్ని ఇంకా మనస్సుని కుదుట పరచడం
ఎక్కువ సమయం వరకూ నిశ్చలంగా కూర్చోగలగాలంటే, అందుకు ఏమి అవసరమన్న ప్రశ్నకు సద్గురు సమాధానం ఇస్తున్నారు. అలాగే శరీరాన్నీ, మనసునీ, ఇంకా శక్తులనీ కుదుటపరచడం యొక్క ప్రాముఖ్యతని వివరిస్తున్నారు.
ప్రశ్న:: సద్గురు, కొన్ని గంటల సేపు నేను స్థిరంగా కూర్చోవాలని నా కోరిక కానీ అది చేయలేకపోతున్నాను. ఇది నేను ఏ విధంగా అధిగమించగలను?
సద్గురు:: నిశ్చలంగా కుర్చోవాలంటే, మీ శరీరాన్ని అందుకు తయారు చేయాలి. హఠ యోగ అనేది అందుకోసమే. కానీ మీ శరీరం మంచి స్థితిలో ఉన్నాసరే, మీరు ఇతర అంశాలని కుదుటపరిస్తే తప్ప మీరు నిశ్చలంగా కూర్చోలేరు.
యోగాకి ఎనిమిది అంగాలు ఉంటాయి - యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యాన, ఇంకా సమాధి.. ఇవి అడుగులు కాదు. ఇవి అంగాలు. మీకు ఎనిమిది అంగాలుంటే, ముందు దేన్ని కదపాలి అనేది మీ ఇష్టం. మీ అవసరాన్ని బట్టి మీరు నిర్ణయించుకోవచ్చు. ఏ భాగాన్ని ముందు కదపాలి అన్న నియమం ఏమన్నా ఉందా? మీరు భారతదేశం నుండి వచ్చారు గనుక, ఎప్పుడూ కుడి కాలే ముందు వేయాలని అనుకోకండి. జీవితంలో ముందు కుడి కాలుపెడితే మంచి జరిగే విషయాలు కొన్ని ఉంటాయి, ఎడమకాలు ముందు పెడితే మంచి జరిగే విషయాలు కొన్ని ఉంటాయి. ముందు ఏ కాలు వేయాలి అన్నది పనిని బట్టి ఉంటుంది. అలాగే యోగాలో ఏ భాగాన్ని ముందు కదపాలి అన్నది మీరు ఎక్కడ ఉన్నారు అన్న దాన్ని బట్టి ఉంటుంది.
మానవుల చరిత్రలో చాలా కాలం వరకూ, శరీరం అనేది బలమైన అంశము అలాగే అతి పెద్ద అడ్డంకి కూడా. అందువల్ల, ప్రజల చేత హఠ యోగ చేయించేవారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం, కేవలం 5 -10 % శాతం ప్రజలకే, మానసిక సమస్యలు ఉండేవి. మిగతావారికి కేవలం శారీరక సమస్యలు మాత్రమే ఉండేవి. ఇప్పుడు కూడా, గ్రామాల్లో, చాలా వరకూ ప్రజలకి శారీరక సమస్యలు మాత్రమే ఉంటాయి, మానసిక సమస్యలు కాదు. కానీ సాధారాణంగా, గత కొన్ని తరాలుగా, ప్రజలకు శారీరక సమస్యల కంటే, మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు శరీరం కంటే మెదడుని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఇది మానవాళిలో ఒక పెద్ద మార్పు. గత 100, 200 సంవత్సారాల వరకూ, మనుషులు మెదడు కన్నా శరీరాన్ని ఎక్కువగా వాడుతూ ఉండేవారు.
నేను సమకాలీన మార్మికుడిని కాబట్టి, నేను ప్రస్తుతం ఇక్కడ ఉన్న ప్రజల గురించి ఆలోచిస్తున్నాను. వారి సమస్యలు శారీరకం కంటే మానసిక మైనవి కాబట్టి, మేము సాధారణంగా క్రియలతోనూ ఇంకా ధ్యానం తోనూ మొదలు పెడతాము. అవి ముఖ్యంగా శక్తి స్థాయిలో ఇంకా మానసిక స్థాయిలో పనిచేస్తాయి. ఆ తరవాతే హఠ యోగ వైపుకి వెళ్తాము.
మీరు నిశ్చలంగా కూర్చోవాలి అనుకుంటే, కేవలం శరీరం పై పనిచేస్తే సరిపోదు - మీరు మీ మనస్సు పైన కూడా పనిచేయాలి. ముఖ్యంగా ఈ తరానికి, మొత్తం వ్యవస్థనీ - అంటే మనస్సునీ, భావోద్వేగాలనీ, శరీరాన్ని, ఇంకా శక్తులనీ స్థిరపరచడం చాలా ముఖ్యం. నేటి ప్రజలు మునుపటి ప్రజలకన్నా తెలివైన వారు అని అనుకోవడం సరియైన ఆలోచన కాదు. విషయం ఏమిటంటే, సరిగా వాడక పోవడం వల్ల నేటి ప్రజల మనస్సులు మరింత ఎక్కువగా అదుపులో లేకుండా ఉన్నాయి.
మన విద్యా వ్యవస్థ రూపొందించబడిన విధానం ఎలాంటిదంటే, అది సమతుల్యం లేని మెదడులనే తయారు చేస్తుంది. పిల్లవాడు, పద్యాలు చదువుతూ, వెంటనే గణితాలు చేయడం మొదలుపెడతాడు - రెంటికీ సంబంధం ఉంది. కానీ ఆ సంబంధం నెలకొల్పే వారు ఎవ్వరూ ఉండరు. గణితం నుండి వాళ్ళు సంగీతంకి వెళతారు - రెంటికీ సంబంధం ఉంది. కానీ ఆ సంబంధం నెలకొల్పే వారు ఎవ్వరూ ఉండరు. సంగీతం నుండి వాళ్ళు కెమిస్ట్రీ క్లాసుకి వెళ్తారు - రెంటికీ సంబంధం ఉంది. కానీ ఆ సంబంధం నెలకొల్పే వారు ఎవ్వరూ ఉండరు. ఎందుకంటే సంగీతం డిపార్టుమెంటు వాళ్ళకీ ఇంకా కెమిస్ట్రీ డిపార్టుమెంటు వాళ్ళకీ పడదు. .
అన్నీ ముక్కలు ముక్కలుగా నేర్పించబడతాయి. ఎందుకంటే మొత్తం మీదా ఎవ్వరూ కుడా తెలుసుకోవాలీ అనే జిజ్ఞాసతో చదవడం లేదు. అందరూ పరీక్ష పాసై ఉద్యోగం పొందడానికే చదువుతున్నారు. చదువు నేర్చుకునేందుకు ఇది ఒక ప్రమాదకరమైన విధానం, అలాగే జీవించేందుకు ఇది ఒక దయనీయమిన విధానం. అది ఎంత అవివేకంగా ఉన్నా, ప్రపంచంలోని అధిక శాతం ప్రజలు ఆ విధంగా జీవించడాన్నే ఎంచుకున్నారు.
ఈ మధ్యే, నేను ఒక గొప్ప వాళ్ళ పార్టీకి వెళ్లాను. అక్కడ ఒక మూలన మద్యం ఇవ్వబడుతూ ఉంది. ఆ పార్టీ ఇచ్చే అతను అన్నాడు, “సద్గురు ఇక్కడ ఉన్నారు. మధ్యం త్రాగడం ఆపుదాం.” కానీ కొంతమంది తాగకుండా ఉండలేరు. అక్కడ ఒక మినిస్టర్ ఉన్నాడు, అతను ముందుకొచ్చి, “నాకు తెలుసు, సద్గురు ప్రాపంచిక మనిషే, ఖచ్చితంగా ఆయన ఏమీ అనుకోరు” అన్నాడు. నేను, “ప్రపంచం మొత్తం ఎప్పుడు తాగడం మొదలు పెట్టింది?” అన్నాను. ఈ రోజున ఎలా తయారయిందంటే, ప్రపంచంలోని ఒక మనిషి అవ్వాలంటే, మీరు తాగాల్సిందే. లేదంటే మీరీ ప్రపంచానికి చెందిన వారు కాదు.
మీరు మానవ మెదడులను పూర్తిగా తప్పు దారిలో నడిపిస్తున్నారు. అలాంటప్పుడు, వారు ప్రశాంతంగా, ఆనందంగా ఉంటారని ఎలా అనుకుంటున్నారు? అది పని చేయదు. మీరు సరైన పనులు చేస్తే తప్ప, సరైన విషయాలు జరగవు. మీరు వైద్య పరంగా బాగున్నట్టు ధృవీకరించబడినా, మీరు ఇక్కడ కూర్చున్నప్పుడు, మీకు సుఖంగా లేకపోతే, స్పష్టంగా మీలో ఎదో సరిగా లేదనే అర్థం. అమెరికా మెడికల్ పుస్తకాల ప్రకారం, వారానికి రెండు సార్లు మల విసర్జనకి వెళ్ళడం మామూలు విషయం అని తెలుసుకుని నేను ఆశ్చర్యపోయాను. యోగ సాంప్రదాయం ప్రకారం యోగులు రోజుకి రెండు సార్లు మల విసర్జనకి వెళ్ళాలి. ఎందుకంటే మలం వ్యవస్థలో ఉండిపోకూడదు. ఏదైతే బయటకి వెళ్ళాలో, అది వీలైనంత త్వరగా వెళ్ళాలి. మీరు ఉదయాన లేవగానే, ముందు ఈ పని చేయాలి. వారానికి రెండు సార్లు అంటే, సగటున మీరు దాన్ని మీ శరీరంలో మూడు రోజులు ఉంచుకుంటున్నారు. ఇక ఇప్పుడు మీ మెదడు సక్రమంగా వుండాలని కోరుకుంటున్నారా? అది సక్రమంగా ఉండదు ఎందుకంటే మీ మెదడుకీ ఇంకా మీ పెద్ద ప్రేగుకి ఒక సూటి సంబంధం ఉంది.
పెద్ద ప్రేగు, మీ శక్తి వ్యవస్థకి పునాది అయిన మూలాధార దగ్గర వుంటుంది. మూలాధార దగ్గర ఏం జరిగినా, అది ఎదో ఒక విధంగా, వ్యవస్థ మొత్తంలో జరుగుతుంది. ముఖ్యంగా మీ మెదడులో కూడా జరుగుతుంది. నేటి శాస్త్రవేత్తలు అటువంటి నిర్ధారణలకి ఎందుకు వస్తున్నారంటే, వాళ్ళు మనిషిని ముక్కలు ముక్కలుగా మైక్రోస్కోప్ కింద అధ్యయనం చేస్తున్నారు. కాబట్టి, ప్రతి భాగానికీ, వాళ్ళు ఒక నిర్ధారణకి వస్తారు. మొత్తం బయట నుండి అవగతం అవ్వదు. అది లోపల నుండే అవగతం అవుతుంది.
మీ సాధన చేయండి, మీ ఆహారం మార్చండి, మరింత సహజమైన ఆహారాన్ని తీసుకోండి, ఒక రెండు నెలల్లో మీరు నిశ్చలంగా కూర్చుంటారు.
Editor’s Note: Isha Hatha Yoga programs are an extensive exploration of classical hatha yoga, which revive various dimensions of this ancient science that are largely absent in the world today. These programs offer an unparalleled opportunity to explore Upa-yoga, Angamardana, Surya Kriya, Surya Shakti, Yogasanas and Bhuta Shuddhi, among other potent yogic practices.