ఒంటరిగా అనిపిస్తుంటె ఏం చెయ్యాలి?
కోపం అయినా, సంతోషం అయినా ప్రేమ అయినా, మనం దేన్నైనా సరే స్థిరంగా ఉంచుకోగలిగితే అది ఆత్మ సాక్షాత్కారానికి దారి తీస్తుంది.
ప్రశ్న: నేను నిజంగా ఆనందంగా ఇంకా స్పష్టంగా ఉన్నపుడు, లోపల ఏదో ఉల్లాసనుభూతి చెందుతున్నాను. నేను కరిగిపోతున్నట్లు ఉంటుంది. కానీ నా చుట్టూ ఉన్నవారు నన్ను కిందికి లాగటానికి ప్రయత్నిస్తున్నారు, నేను ఎంత నిగ్రహించుకున్నా సరే. అలా అని నేను వారితో కలవకుండా ఉంటే ఒంటరిగా అనిపిస్తోంది. నేను ఏం చెయ్యాలి?
సద్గురు: ఎంత ఎక్కువగా ఒంటరితనంతో బాధగా ఉంటే అంత ఎక్కువగా ఓ తోడు కావాలనిపిస్తుంది. ఎంత ఎక్కువ ఆనందంగా ఇంకా ఉత్తేజంగా ఉంటే అంత తక్కువ తోడు కావాలి అనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక్కరే ఉన్నపుడు ఒంటరిగా అనిపిస్తోంది అంటే మీరు ఖచ్చితంగా చెడు సహచర్యంలో ఉన్నట్లే కదా.
మీరు ఒక మంచి వ్యక్తితో ఉన్నప్పుడు ఒంటరిగా ఎలా అనిపిస్తుంది? మీరు ఉల్లాసంగా ఉంటారు.
ఉత్తేజంగా ఉండటం అంటే సాధారణంగా “ఏదో మాట్లాడాలి, నాట్యం ఆడాలి, మంచి సంగీతం వినాలి, పదండి అవీ ఇవీ చేద్దాం’’ అనుకుంటారు. కానీ మీరు కేవలం ఒక చోట స్థిరంగా కూర్చుని కూడా పూర్తి ఉత్తేజంగా ఉండొచ్చు.
మీ ఉత్తేజం కనుక ఎప్పటికప్పుడు తయారుచేసుకోవాల్సి వస్తే మీకు ఒక కంపెనీ అవసరం. మీరు సహజంగానే ఉత్తేజంగా ఉంటే, అది జీవిత స్వభావం అయిపోతే, ఇక మీరు చేసే పనులు ఆ ఉత్తేజానికి పరిణామంగా చేసేవే.
మీ జీవనం ఉత్తేజంగా లేకుంటే మీరు చేసే పని ద్వారా జీవితాన్ని ఉత్తేజపరచుకోవాలి అనుకుంటే, అప్పుడు మీరు చేస్తున్న పని మీరు ఉత్తేజంగా ఉండడానికి సాధనంగా ఉపయోగిస్తున్నారు.
ఇది చాలాపెద్ద వ్యత్యాసం. మీరు నృత్యం చేసి ఉత్తేజంగా ఉండచ్చు, లేదా మీరు సహజంగానే ఉత్తేజంగా ఉండడం వల్ల అది పొంగిపోర్లడం వల్ల మీరు నృత్యం చేయవచ్చు. ఈ రెండు వేరు వేరు విషయాలు.
మీరు చాలా సంతోషంగా ఉన్నారు కాబట్టి మనసారా నవ్వుతున్నారా లేదా వేరెవరో, “ప్రతి రోజు నవ్వటం అలవాటు చేస్కొండి, ఏదో ఒక రోజుకి మీరు సంతోషంగా అవుతారు’’ అని చెప్పారు కాబట్టి నవ్వుతున్నారా?
ఈ రెండు చాలా భిన్నమైన విషయాలు. మీ చుట్టూ ఒకసారి గమనించండి, నాకు చెప్పండి - జీవనం ఏ విధంగా పనిచేస్తోంది? పువ్వులు ఉన్నాయి కాబట్టి వ్రేళ్ళు పాకి కొమ్మలు మొలిచి ఆధారం ఇచ్చయా? కాదు, కొమ్మ దాని ఉత్తేజాన్ని తట్టుకోలేకపోయింది కాబట్టి పువ్వులు పూసాయి. జీవితం కూడా ఇలానే ఉండాలి.
మరో విధంగా జీవిస్తే, జీవితం చాలా కష్టంగా ఉంటుంది. ఎల్లప్పుడూ ప్రపంచంలో సంతోషంగా లేకున్నా సంతోషంగా ఉన్నట్లు చూపిస్తూ జీవిస్తే, అది ఒక కష్టతర జీవితం అవుతుంది. మీరు ఆనందంగా లేకున్నా ఆనందంగా ఉన్నట్లు నటిస్తే దానికి చాలా ఎక్కువ జీవితాన్ని ఖర్చు చేస్తున్నారు. మీరు ఇది గమనించారా? కొంతమంది ఉంటారు, వారు ఆనందంగా ఉన్నప్పుడు ఆనందంగా ఉంటారు, లేనప్పుడు లేనట్లే ఉంటారు. బహిరంగంగానే తెలుస్తుంది. ప్రపంచానికి తెలుసు వారేమిటో. కొంతమంది ఎల్లప్పుడూ పైకి నటిస్తూ ఉంటారు. అలా ఉండటం వల్ల చాలా శక్తి ఖర్చు అవుతుంది. ఇలా పైకి నటిస్తూ ఉండటం అలవాటుగా ఉంటే శారీరిక వ్యవస్థ అనారోగ్యంగా మారి ట్యూమర్లు ఇంకా గడ్డలు ఏర్పడతాయి, మీ మనసుని అలా ఉంచుకునప్పుడు మీ ప్రమేయం లేకుండా అలా చేసుకుంటారు. నన్ను చాలామంది అడుగుతుంటారు , “సద్గురు, నాకు ఏ విధమైన స్వభావం ఇంకా భావోద్వేగం ఉండాలి ?” అని. ప్రజలు నన్ను ఏమని అడుగుతారంటే, "సద్గురు, నా ధోరణి ఇంకా నా మనోభావాలు ఏవిధంగా ఉండాలి?" అని. నేను వారితో ఏం చెప్తానంటే, "ఏదైనా సరే పర్వాలేదు" అని. మీకు కోపంగా ఉండాలి అనిపిస్తే మీరు 24 గంటల పాటు ఆపకుండా కోపంగా ఉండండి; మీరు జ్ఞానోదయం పొందుతారు. మీకు ప్రేమ ఇష్టమైతే, మీరు 24 గంటలు ప్రేమగా ఉండండి. ఇలా కూడా మీకు ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఏదైనా సరే, మీరు స్థిరంగా నిలపగలిగితే మీకు కొంత జ్ఞానం కలుగుతుంది. దానికి కావాల్సింది ఇదే.
ఈ సృష్టిలో ఉన్న ప్రతీదీ - ఒక కణం అయినా, ఒక అణువు అయినా - మీరు కనుక దాని పట్ల స్థిరంగా ఉంటే అది మీకు ఈ సృష్టికి అతీతంగా వెళ్లేందుకు ఒక ద్వారమే అవుతుంది. ప్రజలతో ఉన్న సమస్య ఏమిటంటే వాళ్ళు మారిపోతుంటారు. మునుపెన్నడూ జరగని విధంగా ప్రపంచంలో ఈ నాడు ఇలా జరుగుతోంది. ప్రజలు వాళ్ళ ఏకాగ్రత చాలా కొద్ది పాటి అని చెప్పుకోవడం ఓ పెద్ద సుగుణం అనుకుంటారు. మీరు ఒక దాని నుండి మరొక దానికి మారుతూ పోతే జరిగేది ఏది ఉండదు. మీరు ఎటు కావాలంటే అటు వెళ్ళండి కానీ స్థిరంగా వెళ్ళండి.