సాంకేతికత, వాణిజ్యాల వంటి కొన్ని రంగాలలో భారతదేశం వేగంగా ముందడుగులు వేస్తున్నప్పటికీ జలవనరులు తగ్గిపోవడం, మృత్తికాక్షయం రూపంలో ఒక గొప్ప ప్రమాదం పొంచి ఉన్నదంటున్నారు సద్గురు. ఇప్పటికీ చాలామంది ఆకలితో బాధ పడుతున్నారు. మనం మన ప్రాథమిక అంశాలను సవరించుకొని సరైన మార్గంలోకి రాకపోతే మరెంతో మంది తిండి లేక బాధపడవలసి వస్తుంది.

ఇవ్వాళ మనదేశంలో ఎంతో వైజ్ఞానిక ప్రగతి కనిపిస్తూ ఉంది. పరిశ్రమలు, వాణిజ్యం అభివృద్ధి చెందాయి. వాటిని మరింత అభివృద్ధి చేస్తున్నాం. అయితే వీటన్నిటికంటే గొప్ప విజయం మన రైతులు సాధించిన విజయం – గొప్ప సాంకేతికత గాని, మౌలిక నిర్మాణ సదుపాయాలు గాని లేకుండానే మన రైతులు 130 కోట్లమంది ప్రజలకు కడుపు నింప గల్గుతున్నారు.

దురదృష్టవశాత్తు మన కడుపులు నింపుతున్న రైతు పిల్లలు ఆకలితో మాడిపోతున్నారు, రైతు ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. ఈ పరిస్థితికి నేను సిగ్గుతో తలదించుకుంటున్నాను. ఈ పరిస్థితికి ఎన్నో కారణాలున్నాయి. వాటన్నిటిలో ముఖ్యమైంది జలవనరులు తగ్గిపోవడం, మృత్తికాక్షయం. అద్భుతమైన నేల ఉంది మనకు. అందువల్లనే మనం ఇన్ని కోట్లమందికి ఆహారం ఇవ్వగలుగుతున్నాం. సంవత్సరం పొడుగునా మనం ఏది కావాలంటే అది పండించగలుగుతున్నాం. కాని మన నేల ప్రస్తుతం అతివేగంగా క్షయం పొందుతూ ఉంది.

చెట్లు, జంతువులు లేకుండా నేలను మళ్లీ సారవంతం చేయడం అసాధ్యం.

మనం ఏ పంట పండించినా – ఉదాహరణకు పదిటన్నుల చెరకు పండించాలనుకోండి, మనం పది టన్నుల మృత్తికను(Top Soil) కోల్పోతున్నాం. ఏదో రూపంలో మళ్లీ దాన్ని మనం దాని స్థానంలోకి చేర్చాలి. కాని మనం దీన్ని ఏ విధంగానూ పూరించడం లేదు. నేలను తిరిగి పరిపుష్టం చేయాలంటే వనావరణాన్ని పెంచాలి, పశువుల ఎరువు వేయాలి. కాని మన చెట్లన్నీ నశించిపోయాయి. పైగా మన పశువుల్ని వధించి విదేశాలకు మాంసం ఎగుమతి చేస్తున్నాం. చెట్లు, జంతువులు లేకుండా నేలను మళ్లీ సారవంతం చేయడం అసాధ్యం. గత కొన్ని దశాబ్దాలుగా మనం ఈ విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశాం. దాని ఫలితంగా, దేశం 25% ఎడారిగా మారే దిశలో ప్రయాణం సాగిస్తూ ఉంది.

మరో అంశం, మన నదులు అతివేగంగా ప్రవాహాన్ని కోల్పోతున్నాయి. లక్షలాది సంవత్సరాలుగా నిరంతరం ప్రవహిస్తున్న ఈ నదులు ఇప్పుడు పరిమిత కాలిక ప్రవాహాలుగా మారుతున్నాయి. ఇది కేవలం ఒక్క తరంలోనే జరుగుతూ ఉండడం, మరింత విషాదకరం. కావేరి ఇప్పటికే సముద్రంలోకి సంవత్సరంలో దాదాపు మూడు నెలల పాటు ప్రవహించడం లేదు. తగ్గిపోయిన కావేరీజలాల కోసం రెండు రాష్ట్రాలు పోట్లాడుకుంటున్నాయి. కృష్ణానది సంవత్సరంలో దాదాపు నాలుగైదు నెలలు సముద్రంలోకి ప్రవహించడం లేదు. దేశమంతటా ఇలాగే జరుగుతూ ఉంది. మనం తక్కిన అన్ని అనిశ్చితుల్నీ అధిగమించవచ్చు, కాని నీటి వనరులు తగ్గిపోతే, మన జనాభాకు అవసరమైన ఆహారాన్ని పండించలేకపోతే అదొక మహా ప్రళయమే అవుతుంది.

నదులున్నాయి కాబట్టి చెట్లున్నాయని ప్రజలు అనుకొంటారు. అది తప్పు. చెట్లున్నాయి కాబట్టే నదులున్నాయి.

దీనికి ఒక అతి సులువైన పరిష్కారం ఉంది. మన నదులకు ఇరువైపులా కనీసం కిలోమీటరు పరిధిలో చెట్లను పెంచడం. వర్షాలు పడినప్పుడు ఈ అటవీ భూమి, నీటిని పీల్చుకొని క్రమంగా సంవత్సరం పొడవునా నదులలోకి నీటిని పంపుతుంది. నదులున్నాయి కాబట్టి చెట్లున్నాయని ప్రజలు అనుకొంటారు. అది తప్పు. చెట్లున్నాయి కాబట్టే నదులున్నాయి. అందువల్ల ప్రభుత్వ భూమి ఉన్నచోట చెట్లు పెంచాలి. రైతుల సొంత భూములున్నచోట తన బతుకుతెరువు కోసం తిప్పలు పడుతున్న పేదరైతును ఈ భూమండలాన్ని రక్షించమని కోరడం భావ్యం కాదు. అందువల్ల మేమొక ఆర్థిక ప్రణాళికను ప్రతిపాదిస్తున్నాం. ఒక గణనీయమైన పర్యావరణ కార్యక్రమం ఫలితంగా – ఒక వ్యవస్థీకృత పద్ధతిలో పనిచేస్తే, రైతు ఆదాయం ఐదారేళ్లలో రెట్టింపు చేయవచ్చు. నదీ తీరాన ఉన్న రైతులందరూ తాము సాధారణంగా వేసే పంటల నుండి ఉద్యానవన సాగుకు, వృక్షాధారిత పంటలకు మారేందుకు వాళ్లకు ఐదు సంవత్సరాలపాటు సబ్సిడీ అందించాలి. మనం చెట్లు పెంచి వనావరణాన్ని విస్తరించినట్లయితే, పశువుల్ని పెంచి, పశువుల ఎరువు లభ్యతను పెంచినట్లయితే మన నేల, మన నదులు పునరుజ్జీవితమవుతాయి.

దీన్ని సంభావ్యం చేయడం కోసం మేము ప్రభుత్వానికి అందించడానికి ఒక విధాన సిఫారసును తయారుచేస్తున్నాం. నదుల రక్షణ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ ర్యాలీలో భాగం నేను సెప్టెంబరు 3 నుండి అక్టోబర్ 2 వరకు నెలరోజులు కన్యాకుమారి నుండి హిమాలయ పర్వతాల వరకు నేను కార్ స్వయంగా డ్రైవ్ చేస్తూ ప్రయాణిస్తాను. మన నదులు నశించిపోతున్నాయన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేస్తాను. అవగాహన కల్పిస్తాను. నేను 16 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తాను. మార్గంలో ఎన్నో భారీ సభలూ, సమావేశాలు, కార్యక్రమాలూ నిర్వహిస్తాను. పలువురు ముఖ్యమంత్రులూ, గవర్నర్లూ ఈ కార్యక్రమంలో పాల్గొంటామని మాట ఇచ్చారు. ఢిల్లీలో భారత ప్రభుత్వానికి ఒక విధానపరమైన సిఫారసు చేస్తాం.

మీరందరూ మీమీ పద్ధతుల్లో ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మీకు తోచిన రీతిలో, చేతనైన రీతిలో పాల్గొనండి. నేను ‘అందరూ’ అన్నప్పుడు నీళ్లు తాగే వారందరూ నని నా ఉద్దేశం. మన నదులు ప్రవహించేటట్లు చేసి, ఈ నేలను సుసంపన్నంగా ఉంచడమే మనం భవిష్యత్తరాలకందించే అది గొప్ప బహుమతి.

ప్రేమాశీస్సులతో,
సద్గురు

సంపాదకుని వివరణ: సద్గురు ఏ ఏ నగరాలలో ఎప్పుడు ఆగుతారో ఆ కార్యక్రమాన్ని తెలుసుకొనేందుకు, పాల్గొనేందుకు, దేశవ్యాప్త ప్రచార కార్యక్రమంలో భాగస్వాములయ్యేందుకు Rally for Rivers.org దర్శించండి.