సరైన సమయానికి చేయడం ఎందుకంత ముఖ్యం?
మనం చేసే అన్ని పనులూ అనుకూలమైన ప్రతిఫలాలను ఇవ్వాలని మనందరమూ కోరుకుంటాము. మన పనుల్లో మనం పూర్తి ప్రయత్నం పెట్టిన తరువాత కూడా ఇలాగే ఎల్లప్పుడూ జరగదు. మన పూర్తి సంకల్పం, సంలగ్నత ఇంకా తీవ్రమైన కృషి కాక మన ప్రయత్నాలకు ఫలితం దేనిమీద ఆధారపడి ఉంటుంది అన్న విషయం సద్గురు వివరిస్తున్నారు.
ప్రశ్న: సద్గురూ, నేను కొన్నిసార్లు, నా లక్ష్య సాధన వైపు అచంచలమైన కృషి చేస్తూ ఉంటాను. మరికొన్ని సార్లు నేను జరగలసినవి వాటంతట అవే అపూర్వంగానూ, అందంగానూ వాటంతట అవే వికసించడానికి ఎంతో ఓపికతో ఎదురు చూస్తూ ఉంటాను. మీ ఉద్దేశ్యంలో, ఈ రెండిటిలో ఏది మంచి పధ్ధతి?
సద్గురు: ప్రపంచంలో ఏదైనా చేయడానికి దాని గురించి మనకు పూర్తిగా అవగాహన ఉండాలి. సామర్థ్యము, తెలివి ఇవన్నీ అవసరమే. కానీ ఒక్క ముఖ్యమైన విషయం, మనుషులు ప్రత్యేకంగా యుక్త వయస్సులో ఉన్నవారు విస్మరించేది, సరైన సమయంలో చేయడం. మీరు మీ కార్యకలాపాలను సరైన సమయంలో చేయడం. అలా మీరు సరైన సమయంలో చేయకపోతే మీరు చేసిన కృషి ఎంత గొప్పదైనా, ఆది వృధా అవుతుంది. తమ జీవితంలోని విషయాలను సరైన సమయానికి అనుసంధానం చేసుకోలేనివారు, జాతకాలను చూసి “ఇది అనుకూలమైన సమయం, ఇది ప్రతికూలమైన సమయం, ఇది మంచి సమయం, ఇది చెడు సమయం” అంటూ ఉంటారు.
వీటికి ప్రామాణికమైన పట్టిక లేదు. సమయం అన్నది ఎంతో ముఖ్యం. సమయం యొక్క ప్రాధాన్యాన్ని నేను నా చుట్టుప్రక్కల ఉన్నవారికి ఎప్పుడూ వివరిస్తూ ఉంటాను. కార్య నిర్వహణకి ఉన్న విలువ వారికి తెలుసు, కాని చాలావరకు సమయం యొక్క ప్రాముఖ్యత తెలియదు. సరైన సమయంలో చేసిన చిన్న పనైనా గొప్ప ఫలితాలను ఇస్తుంది. సమయం సరైనది కానప్పుడు, మీరెంతగా కృషి చేసినా, ఏదో కొంతే ఫలితమే వస్తుంది. సరైన సమయం ఎలా తెలుస్తుంది? ఇది క్లిష్టమైన విషయం. ఒక అంశం ఏమిటంటే, మనిషిగా మీరు 24 గంటలు ఒకే విధమైన మానసిక, శారీరిక క్షమతతో ఉండరు. అది ఎప్పుడూ మారుతూ ఉంటుంది. మీరు ఏదైనా పని పూర్తి ఏకాగ్రతతో చేయవలసి వచ్చినప్పుడు, మీరు మీ పూర్తి క్షమతతో ఉండాలి. ఈ విషయంలో మీరు శ్రద్ధ వహించాలి. ప్రపంచానికి సంబంధించిన విషయాలలో సరైన సమయం నిర్ధారించుకోవడానికి ఎంతో అనుభవం ఇంకా వివేకం అవసరం. కాని కనీసం మీ విషయంలో అయినా మీరు సరైన సమయంలో చేయండి. మీరు మీ అత్యున్నత స్థితిలో ఉన్నప్పుడు ముఖ్యమైన పనులు చేసుకుని, మీరు అంతగా బాగులేనప్పుడు చేయకపోవడం మంచిది.
సమయంతో పాటు ఉండడం
ఈ మధ్యే, కొన్ని సంవత్సరాల క్రితం నాతో ప్రయాణం చేసిన ఒకరు, తన అనుభవం మరొకరితో వివరిస్తున్నాడు. అప్పటి సంఘటన అతనని ఎంతో భయపెటటడం వల్ల అతనికి ఇంకా గుర్తు ఉంది. “ఆ రోజు సద్గురు ఎలా డ్రైవ్ చేసారంటే, ఆయనతో ఇలా డ్రైవ్ చెయ్యవద్దని చెప్పాను” అన్నాడతను. నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నప్పుడు, ఆరోజున నేనేమైనా చెయ్యగలను అని నాకు తెలుసు. మరో రోజు నేను అలా లేనప్పుడు, నేను కొంత జాగ్రత్తగా ఉండాలని మిగతా వారిలా కొంత వెనకడుగు వేయాలని నాకు తెలుసు. వెలుపలి ప్రపంచంతోనూ ఇంకా పరిస్థితులతో కూడా కొంత సమయానుకూల పరిస్థితులు ఉండాలి. బయటి పరిస్థితులతో సరైన సమయంలో సరైన పని చేసేందుకు ఎంతో అనుభవము ఇంకా పరిశీలన అవసరం. కాని కనీసం మీతో అది జరగాలి, ముఖ్యమైన పనులు చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడు ఆ పనిని పూర్తి సామర్ధ్యంతో చేయగలరో కనీసం మీకు తెలిసి ఉండాలి.
మీకిది అర్థమయ్యినప్పుడు మిమ్మల్ని మీరు ప్రతి క్షణం పూర్తి సామర్ధ్యంతో ఉంచుకోవడం ముఖ్యమన్న అవగాహన మీకు వస్తుంది. మీరు చేసే ప్రతి చిన్న పనినీ, మీరు పెద్ద పని అనుకుని చేసే వాటిలా, ఏకాగ్రతతో చేస్తే, కొంత కాలానికి ఈ చిన్న పనులన్నిటివల్ల కలిగే మొత్తం ప్రభావం ఎంత ఎక్కువో మీకు తెలుస్తుంది. ఈ చిన్నపనులన్నిటిని మీరు పూర్తి సంకల్పంతో, శ్రద్ధతో, తీవ్రతతో చేయడంవల్ల అవి అన్నీ కలసి ఎంతో మహత్తరంగా అవుతాయి. మీలోనూ ఇంకా మీ చుట్టుప్రక్కలా ఏది తగినదో, ఏది తగినది కాదో అని సరిగ్గా మీరు నిర్ణయించే ముందు మీరు ఒక మౌలికమైన పని చేయవచ్చు. ఇది ప్రాధాన్యమని, అది కాదని నిర్ణయించుకోకండి. అన్నిటిపై ఒకే విధమైన శ్రద్ధను చూపండి, ప్రతి విషయంలోనూ ఒకే విధమైన తీవ్రతను చూపండి. దేవుడు వచ్చినా అంతే, చీమను చూసినా అంతే శ్రద్ధ, తీవ్రత, సంలగ్నతను చూపగలిగితే, ప్రతిదీ దానంతట అదే సర్దుకుంటుంది.
ఇప్పుడు మానవ జాతిలో ఉన్న అతి పెద్ద సమస్య ఏమిటంటే, వారు “ఇది ప్రధాన్యమైనదని, ఇది ప్రాధాన్యం కాదని”, “ఈ మనిషి గొప్పవాడని, యితడు మంచివాడు కాదని”, “ఇది సరైనదని, అది కాదని”, “ఇది దేవుడని, ఇది దెయ్యమని”, అనుకోవడమే. ఈ విధంగా వారు సగం జీవంగా మిగులుతున్నారు, ఎందుకంటే సగం సమయం అది ప్రాధాన్యం కాదని నిర్ణయించుకోవడంతో వారు అక్కడ (వారు చేసే పనియందు) లేకపోవటమే. మీరిప్పుడు శ్వాస తీసుకుంటున్నారు. అది ప్రధానమైనదేనా? మీరు దీనిని పూర్తి శ్రద్ధతోనూ, తీవ్రతతోను తీసుకుంటే అప్పుడు మీరు “యోగి” అని పిలవబడతారు.
ఒక సాధారణమైన విధానం
ఇది ముఖ్యమని, ఇది కాదని ఏదీ లేదు. మీరు మీ స్నేహితుడిని చూస్తున్నారో లేక మీకు అంతగా ఇష్టంలేని వారిని చూస్తునారో అన్నది ముఖ్యంకాదు, మీరు సామాజికంగా ఉపయోగమైన పని చేస్తున్నారా లేదా అన్నది ముఖ్యం కాదు. జీవిగా మీ జీవితంలోని ప్రతి క్షణం మీకు అంతే ముఖ్యం. మీరు చేసే ప్రతి పనీ ముఖ్యమైనదే. ముఖ్యమైనది కానప్పుడు దానిని చేయకండి. మీరు అనవసరం అనుకున్న వాటిపై మీ జీవితాన్ని ఎందుకు వెచ్చిస్తున్నారు? మీరు ఏదైనా మూర్ఖమైన పని చేస్తున్నప్పుడు, అది ముఖ్యమైనది కాదని నేను అనుకున్నా పరవాలేదు, కానీ ముఖ్యమైనది అని మీరు అనుకున్నప్పుడు మాత్రమే, మీరు మీ జీవితం దానికై వెచ్చించాలి. లేకపోతే ఎందుకు? మీరిలా చేస్తే, మీకు ‘సరైన సమయం’ అన్నది అవగాహనకు వస్తుంది. దానికి కొంత సమయం పట్టవచ్చు కానీ, అది వస్తుంది. అలా సరైన సమయంలో చేయడం అన్నది చాలా చాలా ముఖ్యం.
మీరు క్రికెట్ లేక గోల్ఫ్ వంటి ఆటలు చూస్తూంటే వాటిలో బంతిని సరైన సమయంలో కొట్టటం ఎంత ముఖ్యమో అందరూ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అది బలంగా కొట్టడం కాదు. ఒక్కొక్కరు శక్తిని వ్యర్ధం చేస్తూ బంతిని బలంగా కొడతారు, ఇంకొకరు అలా అని (కొద్ది ప్రయత్నంతో) బంతిని అంతే దూరం కొట్టలుగుతారు. దీనినే సమయం చూసి చేయడం అంటారు. మీ జీవితంలో కూడా అది అంతే. సరైన సమయం అన్నది చాలా ముఖ్యం. మీ జీవితంలో సమయం ఇంకా శక్తి అన్నవి మితమైన వనరులు. ఎవ్వరికీ అపరమితమైన శక్తి లేదు. ఎవ్వరి వద్దా అంతులేని సమయంలేదు. అందువల్ల మీరు చేసే పనిని సరైన సమయంలో చేయవలసి ఉంది. మొట్ట మొదట మిమ్మల్ని మీరు గమనించుకోవడం అవసరం. మీరు మీ ఉత్తమ స్థితిలో ఉన్నప్పుడు పని చేయడం మంచిది. మిమ్మల్ని మీరు తగినంతగా గమనిస్తే, అన్ని సమయాలలోనూ మీ ఉత్తమ స్థితిలో ఉండడం అవసరమన్నది తెలుసుకుంటారు.
ప్రేమాశీస్సులతో,