శివుడు – నిశ్చలత్వం, ఉల్లాసం, మైమరుపు
మీరు ఇంద్రియాలకు అతీతంగా వెళ్ళి పరిపూర్ణ జీవితాన్ని తెలుసుకోవడం కోసం, నిశ్చలత్వం, ఉల్లాసంతో సమ్మేళనమైన మైమరుపులో శివుడు ఎలా ఉంటాడో సద్గురు వివరిస్తున్నారు.
ప్రతి ఒక్కరి ఎంపికా అత్యున్నస్థాయిలోని ఆనందమే. కానీ, మనల్ని మనం దైన్యంగా తయారు చేసుకున్నాము. ఎందుకంటే మన మానసిక వ్యవస్థలో సృష్టిని విభజించాము. ఒక్కసారి మనము సృష్టిని -మంచి, చెడు- -అంగీకారం, తిరస్కారంగా - విభజిస్తే, మనం ఆనందాన్ని పొందే అవకాశాన్ని చేజార్చుకున్నట్టే.
అందుకే శివుడు , మన కాలానికి శక్తిమంతమైన రూపం. యోగిగా ఆయన, నిశ్చలత్వం, ఉల్లాసం, మైమరుపు అనే మూడు ముఖ్యమైన గుణాల స్వస్వరూపము. ఈ మూడు గుణాలే సమస్త సృష్టికి అంతర్లీనంగా ఉన్న మూలసూత్రాలు. ఇవి లేకుండా, మానవ జీవితం ఒక అంతులేని పోరాటమవుతుంది.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఇంకా యోగా సంప్రదాయం రెండూ, ఈ విశ్వం యొక్క మూలస్థానం కచ్చితంగా నిశ్చలతే అని అంగీకరిస్తున్నాయి. మనకు బిగ్ బాంగ్ లు ఇంకా విస్ఫోటించే పాలపుంతల గురించి తెలిసినప్పటికీ, విశ్వంలోని ఎక్కువ భాగం నిశ్చలంగానే ఉంటుంది. యోగా పరిభాషలో దీనిని, ‘శి-వ’ అంటే ‘ఏదీ-కానిది’ అని అంటారు. ఇదే ఈ సృష్టికి మూలం. పరమాణువుకి, విశ్వానికీ కూడా ఇదే మూలాధారం. ఒకవేళ మానవులు భౌతిక, మానసిక హద్దులను దాటి జీవితాన్ని తెలుసుకోవాలనుకుంటే, వారు తప్పనిసరిగా నిశ్చలంగా మారాలి.
ఈ నిశ్చలత్వం నుండే విశ్వం వ్యక్తమవడానికి కావాల్సిన చైతన్యం ఉద్భవిస్తుంది. ఇది ఈ సృష్టి యొక్క సమృద్ధికి కారణమవుతుంది. ఈ ఉల్లాసం, మనం జీవితంలో పాల్పంచుకోవడానికి, సృష్టితో జట్టు కట్టడానికి అనుమతిస్తుంది. ప్రతి క్షణం, మానవ శరీరం మృత్యువు వైపుకి, వారి మనసు తీవ్ర గందరగోళం వైపుకి పయనిస్తున్నాయి. ఒకవేళ ఉల్లాసమే లేకపొతే మానవ జీవితం దుర్భరం.
అయినా, హేతుబద్ధంగాలేని, ప్రతికూల స్వభావం గల సృష్టిలో నిమగ్నమవడానికి మనకి మైమరపు అనే కందెన అవసరం. ఈ మైమరపే శివుడిని, -తపస్విగా, నర్తకునిగా, సన్యాసిగా ఇంకా గృహస్థుగా , ఇలా ఒక మనోహరమైన కలబోతగా చేస్తుంది. ఈ మైమరపే ఆయనను జీవితంతో పూర్తిగా సంలగ్నమైనా దానిచేత ప్రభావితంగాని అనురక్తితోనూ, వైరాగ్యంతోనూ ఉండేలా చేస్తుంది.
సృష్టి మొదలైనప్పటినుండీ మనం ఈ మత్తుని ఎన్నో విధాలుగా కోరుతున్నాము. కొంత మంది ప్రేమ ద్వారా దీనిని పొందారు. ఇతరులు మద్యపానం, లేదా ఇతర రసాయన పదార్ధాలలో దీనిని అన్వేషించారు. ముఖ్యంగా ఈ మైమరపు ప్రపంచంతో మనంచేసే వ్యవహారాలలో ఒక కందెన వంటిది, ఒరిపిడిని తగ్గించడానికి ఒక పరికరం. ఈ మత్తు మనకు, సర్దుకు పోయేగుణం, ఇంకా మృదుత్వాలను ఇచ్చి, జీవితంలో విభేదాల భయం వల్ల మన నిమగ్నత తగ్గకుండా, జీవితాన్ని ఒక క్రీడలా ఆడుకునే శక్తినిస్తుంది.
రసాయనిక మత్తు పదార్ధాలలో ఉన్న ఒకే ఒక సమస్య ఏమిటంటే, అవి మన సామర్థ్యాన్ని హరిస్తాయి. అయినప్పటికీ, ఒకవేళ మత్తుని కనక మనం లోపలి నుండే పొందగలిగితే, అది భౌతికపరంగా ఇంకా మానసికపరంగా, మన జీవితం సాఫీగా ఇంకా సజావుగా సాగేలా చేస్తుంది, మన సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది, ఇంకా మనల్ని ఆనందంగా ఉంచుతుంది. పౌరాణిక కధలు తరచుగా, శివుడు నిత్యం తాగి ఉన్న స్థితిలో ఉన్నటు వర్ణిస్తాయి. కానీ శివుడు ఎప్పుడూ గంజాయిని పుచ్చుకోలేదు. ఆయనే గంజాయి, మత్తుకి మూలము.
మన జీవితంలో ఈ మూడు గుణాలను ఎరుకతో ఎలా పెంపొందించుకోవాలి? సంపూర్ణ మానవునిగా వికసించటానికి మహాశివరాత్రి గొప్ప అనువైన సమయం. మీరు ఈ సరళమైన సాధనను చేసి చూడవచ్చు. పగటి పూట, వివిధ సమయాల్లో, నిశ్చలతను ఇంకా మౌనాన్ని పాటిస్తూ ఏదైనా ఒక ఆసనంలో కూర్చోండి. సూర్యాస్త సమయం తరువాత, మీరు ఉల్లాసంగా అయిపోయి నృత్యం చేయండి. మీరు పగలు నిశ్చలంగా ఉండి, రాత్రి మొత్తం మెలకువతో ఉన్నట్లయితే, సహజంగానే ఒక రకమైన మత్తు మీలో వ్యాపించడాన్ని మీరు గమనిస్తారు.
శివుడే తమలోకి చొచ్చుకుపోయిన వారికి, ఏదో పొందాలనే కోరిక ఉండదు, ఏదో లేదనే బాధ ఉండదు. ఏ విషయము గురించిన పట్టింపూ ఉండదు. దేని గురించీ పట్టింపులేనప్పుడు, ప్రతిదీ ముఖ్యమైనదే. మీరు కొన్ని విషయాలను మాత్రమే పట్టించుకుంటే, మీరు ఆ విషయాలలో చిక్కుకుపోతారు. ప్రతిదీ ముఖ్యమైనప్పుడు, మీరు స్వేచ్చగా ఉంటారు. అలంటి స్థితిలో, తీవ్రమైన మత్తు అనే జీవిత స్వేచ్చలో తడిసిపోతారు. మీరు జీవితపు అత్యున్నత శిఖరాన్ని తాకుతారు. మీరు ఈ తీవ్రమైన, గాఢమైన, సంపూర్ణమైన జీవితాన్ని తాకినప్పుడు, మీరు నిజంగా శివుడిని తాకినట్టే.
సంపాదకుని సూచన: మహాశివరాత్రి రోజును అనుభూతి చెందడానికి, ఈశా యోగా కేంద్రంలో రాత్రి పొడుగునా వేడుకలు జరుగుతాయి. సద్గురుచే గాఢమైన ధ్యానాలు ఇంకా ప్రఖ్యాత కళాకారులచే అద్భుతమైన సంగీత ప్రదర్శనలతో రాత్రంతా సాగే ఉత్సవం ఇది! మరిన్ని వివరాలకు మహాశివరాత్రి పేజిని సందర్శించండి.