సద్గురు : ఎన్నో సంవత్సరాల క్రితం నేను అమెరికా మొట్ట మొదటగా వెళ్ళినప్పుడు, నన్ను TGIF అనే రెస్టారెంట్ కి తీసుకువెళ్ళారు. అదేమిటి అని నేను ప్రశ్నించగా వారు " Thank God It is Friday"( థాంక్ గాడ్ ఇట్ ఈస్ ఫ్రైడే - దేవుడా ధన్యవాదం శుక్రవారం వచ్చింది) అని చెప్పారు. వాళ్ళందరూ వారాంతం కోసం జీవిస్తున్నారు. వారమంతా బాధపడుతూ వారాంతం కోసం జీవించడం అంటే అది ఎంతో నిరర్ధక జీవితం. వారమంతా సంతోషంగా ఉండనవసరం లేదా? వారాంతం వస్తేనే సంతోషమా? దీనికి కారణం, చాలామంది తాము చేసే పనిని ఎందుకు చేస్తున్నారో తెలియకుండా చేయడమే. కేవలం జీవనోపాధి కోసమే వారు ఆ పని చేస్తున్నారు.

సద్గురు తండ్రి : అంకితానికి ప్రతీక

మా నాన్నగారు కార్యదక్షతగల వైద్యుడిగా ఆయన జీవితమంతా గడిపారు. ఆయనకి నాలుగున్నర సంవత్సరాల వయసులో ఆయన తల్లి టీబీ వ్యాధితో చనిపోయారు. అందువలన ఆయన వైద్యం చదవాలని నిర్ణయించుకున్నారు. ఆయన తల్లిని చూడటానికి వెళ్లినప్పటి సంగతులు హృదయానికి హత్తుకుంటాయి. పిల్లవాడికి ఆ జబ్బు అంటుకుంటుందని ఆవిడ పిల్లవాడి మొఖం మీద ఒక తువాలు వేసి దానిపై ముద్దు పెట్టుకునేవారు. ఆ రోజులలో పెద్దగా వైద్యం లేదు. మంచి గాలి ఆవిడ జబ్బుని నయం చేస్తుందని ఆశించి ఆవిడకి ప్రత్యేకంగా చిన్న కొండ మీద ఇల్లు కట్టారు.

ఆవిడ ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాల వయసులోనే మరణించారు. వీరిది ధనవంతులైన వ్యాపార కుటుంబం కనుక దాదాపు పన్నెండు సంవత్సరాల వయసు రాగానే వ్యాపారంలోకి అడుగుపెడతారు. ఆవిడ చనిపోయే ముందు "నువ్వు డాక్టరువి కావాలి" అని కొడుకుతో చెప్పింది. దీనికి కారణం మెరుగైన వైద్యం అందుబాటులో ఉంటే, తన ఆరోగ్యం బాగుపదేదని ఆవిడ భావించింది.

అందువల్ల మా నాన్నగారు వైద్యునిగా అవ్వాలని నిశ్చయించుకున్నారు. పన్నెండు సంవత్సరాల వయసు రాగానే, ఆయన తండ్రి వ్యాపారంలోకి చేరమని వత్తిడి చేయగా ఆయన ఇల్లు వదిలి వీధిలో ఉండి చదువు కొనసాగించారు. విద్యలో రాణించి డాక్టరు అయ్యారు. మొట్ట మొదటగా మైసూరు సానిటేరియంలో చేరి టీబీ వ్యాధి గ్రస్తులకి సేవ చేశారు. మూడు సంవత్సరాలపాటు నెలకి యాభై రూపాయల జీతంతో ఆ సానిటేరియంలో పనిచేశారు. ఆయన పూర్తిగా అంకితమైన - వైద్యుడు. ఆ తరువాత ఆయన గవర్నమెంటు లో పని చేశారు. సఫలత అన్నది ఆయనకి డాక్టరు అవటంతో ముడిపడి ఉంది. మీరు డాక్టరు కాకపొతే మీరు పనికిరాని వారని ఆయన నమ్మకం. కనీసం ఆయన పిల్లల గురించి ఆయనకి ఆ అభిప్రాయం ఉంది. అది చూసిన నేను, ఆయనని ముందు ముందు నిరుత్సాహ పరచడం ఇష్టంలేక, పది సంవత్సరాల వయసులోనే ఆయనకి "నేను డాక్టరుని మాత్రం అవ్వను” అని చెప్పేసాను .

వృత్తి నిర్ణయాలు సామాజిక ప్రతిఫలాల కోసమా?

ఏ వృత్తికైనా సరిపడే శిక్షణ నేను పొందడంలేదని మా నాన్నగారికి ఎప్పుడూ నా గురించిన దిగులు ఉండేది. నేను డాక్టరుని కానని చెప్పిన తరువాత ఆయన ఎంతో నిరాశపడి కనీసం ఇంజినీరింగ్ అన్నా చదవమని చెప్పారు. "నేను డాక్టరుని అవడం ఇష్టంలేదని చెప్పినప్పుడు మీరు, సరే జంతువుల డాక్టరో, ఆయుర్వేదిక్ డాక్టరో కనీసం దెయ్యాల డాక్టరో అవ్వమంటే నేను ఆలోచించేవాడిని". అని సమాధాన మిచ్చాను. "నేను డాక్టరుని కానని ఆన్నప్పుడు మీరు ఇంజనీర్ అవ్వమంటారు. మీరు వ్యక్తపరిచేది సామాజిక సమస్య, నా ఉనికి సమస్య కాదు" అన్నాను. అందుకు ఆయన "మరి ఏమి చేస్తావు, ఏ వృత్తికి సరిపడే శిక్షణ లేదు నీకు" అని అంటే దానికి నేను "దేనిలోనూ శిక్షణ లేనప్పుడు నేను కోరుకున్నది ఏదైనా చేసుకోవచ్చు" అని అన్నాను.

ఇది నేను ఆయనపై అగౌరవం చూపటం కాదు. డాక్టరుగా ఆయన ఎంతో చిత్తశుద్ధి కల మనిషి, ఆయన ఎక్కడికి వెళ్లినా అందరూ ఎంతో ఆరాధించేవారు. ఆయన వృత్తిని నేను ఎంతో గౌరవంతో చూసేవాడిని కానీ నాకు దానిపై అభిమానము లేదు. చుట్టు ప్రక్కల మనుషులకి ఆయన వృత్తి అందించగల సేవ నా కళ్ళతో నేను ఎన్నో సార్లు చూసాను, అందుకే నాకు దానిపై గౌరవం. మా అమ్మ ఎప్పుడూ ఫిర్యాదు చేస్తూ ఉండేవారు. నాన్నగారికి పోస్టింగ్ ఉన్న స్టేషన్లలో పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఎప్పుడైనా హాస్పిటలు నుండి పిలుపు వచ్చేది, అర్ధరాత్రిలో కూడా, ఆయన వెంటనే వెళ్లేవారు. ఎన్నోసార్లు భోజనం చేస్తూ ఉన్నప్పుడు ఫోను వస్తే మధ్యలో లేచి వెళ్లి పోయేవారు.

మా అమ్మ " మూడే నిమిషాలండి..భోజనం చేసి వెళ్ళండి" అని ప్రాధేయపడేవారు. కానీ ఆయన కాదని వెంటనే వెళ్ళిపోయేవారు. ఒక్కొక్కప్పుడు తెల్లవారు జామున రెండు గంటలకు, నాలుగు గంటలకు తిరిగి వచ్చేవారు. ఇదే నాకు ఆయనలో నచ్చిన గొప్ప విషయం, - ఆయన చేసే పనికి ఆయన పూర్తిగా అంకితమయ్యారు.

సంపాదించడమే ప్రధమ లక్ష్యమా?

ఇటువంటి అంకిత భావమే నాకు ఆయన మీదున్న గౌరవానికి కారణం. కానీ, నా గురించి మాట్లాడినప్పుడు సంపాదించడం గురించి మాట్లాడేవారు. "డాక్టరు అయ్యి జీవనోపాధి సంపాదించుకో" అనేవారు. "నాకు అటువంటి పనిలో సంపాదన వద్దు అంటే ఇంజనీర్ అవ్వు సంపాదించుకో అనేవారు అదీ కాదని అంటే సరే కనీసం వ్యాపారం చేయి జీవనోపాధి సంపాదించుకో" అనేవారు. "లేదు" అని చెప్పాను. జీవనోపాధి నాకెప్పుడూ సమస్యగా కనిపించలేదు. యువకుడిగా ఉన్నప్పుడే దేశం నలుమూలలకు మోటారు సైకిల్ మీద తిరిగాను. వారాల కొద్దీ అడవులలో బయట ప్రపంచానికి సంబంధం లేకుండా జీవించాను. "నేనెక్కడైనా జీవించగలను" అని అన్నాను. అప్పుడు నేను వెతుకున్నదేమిటో నాకు తెలియదు. నూటికి నూరు శాతం నాకు తెలిసినది "ఒక టేబుల్ వెనక కూర్చుని నేను నా జీవనోపాధి సంపాదించుకోను" అని మాత్రమే. నేనేమి చేస్తానో నాకు తెలియదు. ఒక్కటి మాత్రం తెలుసు – నేనిక్కడున్నది జీవించడానికి. ప్రతి ప్రాణి ఇక్కడ జీవించడానికే ఉంది. మానవులు మాత్రమే ఇక్కడ ఇంకెందుకో ఉన్నామని అనుకుంటూ ఉంటారు.

ఇంకేదైనా కావాలని ఎదురుచూస్తున్నారా?

మిగతా ప్రాణులన్నిటికీ తెలుసు ఇక్కడికి జీవించడానికి వచ్చామని, బ్రతకటం అంటే తినడం, నిద్రపోవడం, పునరుత్పత్తి చేయడం, చనిపోవడం అని –వాటి జీవితం పూర్తి అవుతుంది. మానవుడిగా పుట్టిన తరువాత మీకు కావలసినంత తినండి, కావలసినంత నిద్రపొండి, కావలసినంత మందిని కనండి అయినా మీకు జీవితం సంపూర్ణంగా అనిపించదు. మీలోని జీవం ఇంకెదో కావాలని కోరుకుంటూ ఉంటుంది. ఆ ఇంకేదో జరగనంతవరకూ మీకు వెలితిగానే ఉంటుంది.

ప్రస్తుతం, వారాంతంలో జీవించడం కోసం ఎదురుచూస్తూ ఉండేవారికి – వారిలో లేని ఉత్తేజం నింపుకోవడానికి కొంత మత్తు పదార్ధాన్ని తీసుకోవలసివస్తుంది. నేను ఉత్తేజంతో నిండి ఉన్నాను కనుక నేను ఎటువంటి వెలుపలి ఉత్ప్రేరకాన్నీ తీసుకోవలసిన అవసరం లేదు. ఉత్తేజం లేనివారికే దానిని బయటనుండి తీసుకోవలసిన అవసరం కనిపిస్తుంది. వారికి విరామం అవసరం – దానిలో తప్పేమీలేదు. కానీ మీరు మీ జీవనోపాధికి, జీవితానికీ మధ్య వ్యత్యాసం తీసుకురాకుండా ఉండటం ఎంతో ముఖ్యం.

జీవితం తప్ప ఇంకేమీలేదు

మీరు చేసేపని మీ జీవితం కానప్పుడు దయచేసి మీరు ఆ పనిని చేయకండి. మీరు చేసేది మీ జీవితం కావాలి. ఇది మీ జీవితం. మీలో ఎంతోమంది మీ మీకుటుంబంతో కంటే మీ పనిలోనే ఎక్కువ సమయం గడుపుతారు. అటువంటప్పుడు ఇది మీ జీవితం ఎందుకు కాదు? పనికూడా జీవితమే. ఇది జీవితంలో ఒక భాగం, అది జీవితంలో ఇంకొక భాగం. మీరు దానిని ఏవిధంగా విభజించుకుంటారో అది మీ వ్యక్తిగత ఎంపిక. కొందరికి కుటుంబంతో ఎక్కువ సమయం కావలసి ఉండవచ్చు కొందరికి తక్కువ. మీరు ప్రతి వారాంతం ఇంట్లో ఉంటే మీ కుంటుంబానికి సంతోషం అయ్యి ఉండవచ్చు, ఇంకొక కుటుంబంలో అది వేరుగా ఉండవచ్చు. మనిషి మనిషికి ఇంకా పరిస్థితిని బట్టి కూడా ఇది మారవచ్చు.

మనము పుట్టినప్పటినుండి మరణించేవరకు మనము జీవిస్తున్నామన్నది, జీవనమే ముఖ్యమని, ప్రతిక్షణం మనము అర్ధం చేసుకోవడం ఎంతో ముఖ్యం. జీవించడం తప్ప మరొకటి కాదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు