కుండలినికి సంబంధించిన కధలు ఎన్నో విని ఉంటారు మీరు. ఇది అర్థం చేసుకోవాలంటే మీ జీవితంలో జరిగే సంఘటనలనే ఉదాహరణగా తీసుకోవడం సమంజసనం. ఉదాహరణకి మీ ఇంటి గోడకి ఒక ప్లగ్ -పాయింట్ ఉంటుంది కానీ విద్యుత్పత్తి అందులోనుండి జరగదు కదా? ఈ విద్యుత్పత్తి ఎక్కడో ఉన్న విద్యత్త్తు కేంద్రంలో జరుగుతుంది. అలాగని మనకి విద్యుత్తు ఈ కేంద్రం నుండి నేరుగా వచ్చేస్తుందా? రాదు కదా? మన ఇంటిగోడకి ఉన్న ప్లగ్ -పాయింట్ ద్వారా ఈ విద్యుత్తుని అందుకుంటాము. మనం ఏదైనా ఉపకరణాన్ని వాడేటప్పుడు ఈ ప్లగ్ -పాయింట్ని వాడుతాము , అయినా ఈ విద్యత్త్తు కేంద్రం గురించి పెద్దగా ఆలోచించము..అసలు దాని మీదకి దృష్టే వెళ్ళదు. అంత పెద్ద విద్యత్త్తు కేంద్రం ఒకటుందని, అందులోనుండి మనకి రోజూ విద్యుత్ సరఫరా జరుగుతోందని తలచుకోము. అయితే ఈ ఉపకరణాన్ని వాడాలంటే మాత్రం ప్లగ్ -పాయింట్ ఉపయోగించాలని తెలుసు. అలా చేస్తే కానీ అది పని చేయదు మరి.
మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట.
అలాగే కుండలిని ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది కానీ అది విద్యత్త్తు కేంద్రం మాత్రం కాదు. అందులోనూ ఇది 3 - పిన్ పాయింట్ కాదు , ఇది 5 - పిన్ పాయింట్. మనశరీరంలో ఏడు చక్రాలు ఉన్నాయని మీరు వినే ఉంటారు. ఈ చక్రాలలో మూలాధార చక్రం ఒక ప్లగ్ -పాయింట్ లాంటిది. అందుకే దానికి ఆ పేరు. మూల-ఆధార అంటే, అన్నింటికీ మూలం అని అర్థం. ఇక మిగిలిన ఆరు చక్రాలలో ఐదు చక్రాలు ప్లగ్ అన్నమాట. అయితే ఏడవది ఏంటి? అది ఒక కాంతి బల్బ్ అన్నమాట. దీన్ని గనక ప్లగ్ -పాయింట్లో పెడితే మీలోని ప్రతీ అంశం దేదీప్యమానంగా వెలుగుతుంది. మీరు సరిగ్గా గనక ప్లగ్ చేసినట్లైతే మీకు 24 గంటలూ విద్యుత్సరఫరా ఉంటుంది, ఆ వెలుతురూ అలాగే ఉంటుంది, బాటరీ అయిపోతుందన్న బెంగలేదు అలాగే వదిలేయవచ్చు . ఇలా నిర్లక్ష్యంగా రోజంతా ఉంచేసినా/ వదిలేసినా కరెంటు అయిపోతుందన్న బాధ లేదు, ఎందుకంటే మీరు నేరుగా ఆ విద్యత్త్తు కేంద్రంతోనే కనెక్ట్ అయ్యి ఉన్నారు కదా?
ప్రస్తుతం మీలో కూడా ఆ శక్తి ప్రవహిస్తోంది , నేను చెప్పే మాటలు మీరు వింటున్నారు, అర్థం చేసుకుంటున్నారు, కానీ మీలోని ఈ జీవశక్తులు కొంత మటుకు మాత్రమే పనిచేస్తున్నాయి. మీరే గనక ఈ శక్తులని సరిగ్గా ప్లగ్ చేసినట్లయితే ఆ శక్తి అంతా మీ సొంతమౌతుంది. ఇక మీ క్రియా శక్తి అపారం, దీనితో మీరు చేయలేని పని ఉండదు, ఎందుకంటే శక్తివంతమైన ఈ కరెంటు ఇప్పుడు మీలో ప్రవహిస్తోంది కదా? మీ ఇంట్లో కూడా చూసే ఉంటారు, ఒక్క ప్లగ్ పాయింట్ తో ఎన్నో ఉపకరణాలు పని చేస్తాయి కానీ, అన్నిటికీ అదే విద్యుత్తు . ఇక్కడ వచ్చిన సమస్య ఏమిటంటే , మీరు ఇంక ప్లగ్ అయ్యి లేరు.
ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే!
సరే, మీ శక్తిని మీరే ఉత్పత్తిచేయాలి అని అనుకున్నారు, రోజుకి ఐదు సార్లు ఆహారం తీసుకుంటారు, అయినా రోజంతా అలసటగానే ఉంటుంది. ఇలా అయితే బ్రతుకు జట్కా బండి ముందుకి వెళ్ళడానికి చాలా కష్టపడుతుంది. శక్తి అంటే.. అది కేవలం బాహ్య ప్రపంచానికి, మన పనులు చేసుకోవడానికి కావలసిన శక్తి కాదు. ఇది జీవితానికీ, జీవనానికీ సంబంధించినది. ఈ సృష్టి అంతా శక్తే కదా? ఈ సృష్టికి మూలమే శక్తి. ఈ విషయం గ్రహిస్తే జీవన మూలం గ్రహించినట్లే. ఈ శక్తి గమ్యాన్ని మనం సరిగ్గా అర్థం చేసుకుంటే , ఈ సృష్టి యంత్రరచన తెలుసుకున్నట్లే! అందుకే చెపుతున్నాను కుండలిని అంటే, ఆ అపారమైన విద్యుత్త్ కేంద్రానికి కనెక్ట్ అయి ఉండడం అని. ఆ కుండలినికి మీరు నేరుగా కనెక్ట్ అయిఉంటే ఆ విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది అన్న అవగహన మీకు ఉండక పోవచ్చు, కానీ అది ఎంత శక్తివంతమైనదో, ఎం చేయగలదో మీకు అనుభూతిలోకి వస్తుంది, కచ్చితంగా అర్థం అవుతుంది. అనంతమైన ఈ విద్యుత్త్ కేంద్రమే కుండలిని.
ఒక ఉపకరణాన్ని మీరు వాడాలనుకున్నప్పుడు దాన్ని ప్లగ్ పాయింటులో పెట్టడానికి ప్రయత్నిస్తారు, కానీ మీ చేతులు వణుకుతూ ఉంటే, గోడంతా గీతలు పెడతారు , విఫలమౌతారు. అలాగే ఈ 5 పాయింట్లున్న పిన్నుని ప్లగ్ చేయడానికి చాలామంది ఎంతో శ్రమ పడతారు, ఎందుకంటే వారి శరీరంలో , భావోద్వేగాలలో, జీవశక్తులలో, మనసులో స్థిరత్వం లేదు కాబట్టి. మనం చేసే ఈ యోగా అంతా కూడా ఆ స్థిరత్వం కోసమే. ఆ కుండలినికి మనం సరిగ్గా ప్లగ్ అయిఉంటే అనంతమైన శక్తిని నేరుగా అందుకున్నట్లే. ఇలా జరగడానికి ఆ విద్యుత్త్ కేంద్రం గురించి మీరు తెలుసుకుని అర్ధంచేసుకునే అవసరంలేదు. ఆ కుండలినికి కనెక్ట్ అయి ఉంటే చాలు. యోగ శాస్త్రం అంతా కూడా ఈ కుండలినితో మీరు ఎలా కనెక్ట్ అవ్వాలో నేర్పుతుంది. ఎడతెగని ఈ శక్తి మీలో నిర్విరామంగా ప్రవహిస్తూ ఉంటే సహజంగానే మీరు జీవితంలో ముందుకి సాగిపోతారు. జీవితగమ్యం వైపే సూటిగా పయనిస్తారు. అనవసరమైన భ్రమల్లో, ఆలోచనలలో, భావోద్వేగాలలో , బాహ్యప్రపంచపు చిక్కుల్లో పడరు.
ప్రేమాశీస్సులతో,
సద్గురు