భౌతికంగా కనిపించే లక్షణాలన్నిటికీ రెండు వ్యతిరేక ధ్రువాలు (polarities) ఉంటూ ఉంటాయి. 'పాజిటివ్-నెగెటివ్', 'పురుష ధర్మాలు- స్త్రీ ధర్మాలు', 'శివ- శక్తి', 'ఆడా- మగా', వగైరాలు. ఈ రెండు ధ్రువాల మధ్యా మనం ఒక విభజన సృష్టించుకొని కూర్చోగానే, ఇక ఆ ధ్రువం గొప్ప, ఈ ధ్రువం గొప్ప అని పోలికలూ, తగవులూ, తీర్పులూ తలెత్తి తీరతాయి. ఇలాంటి తీర్పులూ, తీర్మానాల వల్లే ఎన్నో స్థాయిలలో ఎంతో అయోమయం, ఎన్నో విధాల వికృత స్పందనలూ, ఎన్నో రకాల దోపిడీలూ పరపీడనలూ పుట్టుకొచ్చాయి.

'స్త్రీత్వం- పురుషత్వం' అంటే మరేదో కాదు, ఒక వ్యక్తిలో స్త్రీ సహజమైన ధర్మాలో, పురుష సహజమైన లక్షణాలో ఒక దాని కంటే మరొకటి కొంత హెచ్చుగా, ప్రస్ఫుటంగా కనిపించటం మాత్రమే. మీరిప్పుడు ఇక్కడ ఒక స్త్రీ రూపంలో కూర్చొన్నారంటే అర్థం మీలో మీ తండ్రి గారినుంచి సంక్రమించే పురుష సహజమైన లక్షణాలు అసలు లేనే లేవని కాదు. అలాగే పురుషులలో కూడా తల్లి నుంచి వచ్చే స్త్రీ సహజమైన లక్షణాలు కొన్నన్నా ఉండి తీరతాయి. మీరు ఈ సత్యాన్ని అర్థం చేసుకోని, మీలోనే అంతర్గతంగా ఉన్న పురుష -స్త్రీ ధర్మాలను రెండింటినీ ఒక సమన్వయంతో కలిసి పెంపు పొందేలా చూసుకోవాలి. అప్పుడే మీరు మానవ జాతికి చెందిన వ్యక్తిగా ఒక సమతౌల్యంతో ఉండగలుగుతారు. మీరు మీలో ఉన్న పురుష సహజమైన లక్షణాలను మాత్రమే పెంపు చేసుకొంటే, మీలో సౌకుమార్యం, నాజూకుతనం అంటే ఏ మాత్రం ఎరగని ఒక దురుసైన, మోటైన 'మగ'తనం మాత్రమే ప్రకటితమౌతుంది. మీరు స్త్రీసహజ స్వభావాన్ని మాత్రమే వికసించనిచ్చి, పెంపుచేసుకొంటే, మీలో భావోద్వేగాల తీవ్రతా, అలంకార ప్రీతి లాంటి లక్షణాలు కొంత అతిగా ప్రకటితం కావచ్చు.

మనిషిజాతిలో స్త్రీలు పూవుల లాంటి వాళ్ళు. వేళ్ళు లేకుండా మొక్క ఉండదు, నిజమే, కానీ పూవు లేకపోతే కూడా జీవితానికి పూర్ణత్వం ఉండదు. మనం స్థాపించుకొనే సమాజంలో, జీవితంలోని 'స్త్రీసహజ' ధర్మాలు – సంగీతం, కళలూ, సౌందర్యారాధనా వగైరాలు – అర్థ శాస్త్రం, విజ్ఞాన శాస్రం, సాంకేతిక పరిజ్ఞానం మొదలైన వాటితో సమానమైన ప్రాముఖ్యత కలిగి ఉండాలి.

ఈ రోజులలో, ఇప్పటి తరాలలో, స్త్రీలు పురుషులలా ఉండేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది. పురుషుడిలా ఉండటమే జీవితంలో విజయం సాధించినందుకు నిదర్శనం అయినట్టు. మన జీవితాలు మరింత అందంగా సాగిపోవాలంటే, సంఘంలో 'స్త్రీత్వ' ధర్మాలకు సముచితమైన స్థానం లభించాలి.

మన సమాజానికి, ‘ఉపయోగకరమైన’ విషయాలు ఎంత అవసరమో, సౌందర్య సంబంధమైన విషయాలు కూడా అంతే అవసరం అని మనం అర్థం చేసుకోవాలి. 'మనకు ఫలానా విషయాలే ఉపయోగకరం, ఫలానా వాటివల్ల ఉపయోగం శూన్యం’ అన్న పరిధిలో మాత్రమే మన ఆలోచనలు సాగేట్టయితే, మనం పూల మొక్కలన్నిటినీ పెకలించి అవతల పారేసి, కాయగూరల మొక్కలే పెంచుకోవాలి. జీవితంలో అందమూ, సౌందర్య పిపాసా అనేవి లేకపోతే, అసలు ఆ జీవితానికే ఉపయోగం శూన్యం అవుతుంది!

ప్రాచీన కాలం నుంచి, భారత దేశంలో ‘స్త్రీత్వ’లక్షణాలకు, ‘పురుషత్వ’ ధర్మాలతో సమానంగా - బహుశా అంతకంటే ఎక్కువగా కూడా - ప్రాధాన్యత ఉంటూ వచ్చింది. దేశం అనేకమైన దండయాత్రలకు గురవటం వల్ల , శతాబ్దాలు దొర్లిన కొద్దీ మన దేశపు సాంఘిక పరిస్థితులు మారుతూ వచ్చాయి. మీ మీద దండయాత్రకు వచ్చిన వాడి దృష్టి ముందు మీ భార్య మీదా, మీ కుమార్తె మీదా పడుతుంది. అందుచేత భద్రత కారణాల వల్ల వాళ్ళని మనం గృహాలకే పరిమితం చేయ వలసి వచ్చింది. ముందు రక్షణ కోసం మాత్రమే ఆరంభమైన ఈ ఏర్పాటు, కొంతకాలం తరవాత సాంఘికమైన కట్టుబాటుగా మారింది. ఇప్పుడు భారత దేశం పూర్తిగా స్వతంత్ర దేశం కనక ఈ కట్టుబాట్లను పునః పరిశీలించాల్సిన సమయం వచ్చింది.

అంటే అర్థం మనం పాశ్చాత్య దేశాలను పూర్తిగా అనుకరించాలనీ, ఇక్కడి స్త్రీలందరూ వీలయినంత వరకూ పురుషుల లాగా మారి పోవాలనీ కాదు. అలాగని వాళ్ళు బుట్ట బొమ్మలుగానో, ‘బార్బీ డాల్స్’ లాగానో మారిపోవాలని కూడా కాదు.

దురదృష్ట వశాత్తూ , ‘స్త్రీత్వ’ లక్షణాలు అంటే పై పై మెరుగుల మీద ఆసక్తీ, ఊహా లోక విహారాలు చేస్తూ ఉండటమూ లాంటివే అన్న భావన ఒకటి లోకంలో ఏర్పడి ఉంది. వాటిలో ఒక గాఢతకు గానీ, తీవ్రతకు గానీ, నైసర్గికమైన అంతస్సౌందర్యానికి గానీ ప్రాధాన్యత ఇవ్వగల శక్తి లేదన్నట్టు.

సంఘంలో ‘స్త్రీత్వ’ ధర్మాలూ, ‘పురుషత్వ’ ధర్మాలూ సరిసమానంగా ఉండటం చాలా ముఖ్యం. పుష్పించే శక్తి లేని మొక్క గానీ, వేరు గానీ, ఎప్పుడూ నైరాశ్యం లోనూ, నిరుత్సాహ స్థితి లోనూ ఉండాల్సిందే. ‘స్త్రీత్వ’ లక్షణాలకు చోటే లేని స్థితి, కుంగుబాటుకూ నిస్పృహకూ మాత్రమే దారి తీస్తుంది. కేవలం ‘పురుషత్వ’ లక్షణాల మయమైన మనసు నిస్సంతోషంగా, భారంగా, నిరుత్సాహంగా ఉండిపోతుంది. ఇప్పుడు ప్రపంచంలో – ముఖ్యంగా పాశ్చాత్య దేశాలలో – ఎక్కువగా కనిపిస్తునది ఇదే. ఇప్పుడిప్పుడు భారత దేశంలో కూడా ఇదే పరిస్థితి వస్తున్నది. ఎక్కడ చూసినా దిగులూ, కుంగుబాటూ!

మీలో ఉన్న ‘స్త్రీత్వ’ స్వభావం చురుకుగా పని చేస్తూ ఉంటే, అది, చాలా చిన్న చిన్న విషయాల నుంచి కూడా మీ జీవితంలో ఎంతో సౌందర్యాన్ని నింపే మార్గాలను వెతికి పట్టుకొంటుంది. అందుకు విరుద్ధంగా, మీరు మీలో ఉన్న ‘స్త్రీత్వ’ స్వభావాన్ని పూర్తిగా నిర్మూలించేశారనుకోండి. బయటికి చూడటానికి అంతా పూర్తిగా సవ్యం గానే కనిపిస్తుంది, కానీ అది మీకు ఎందుకూ ఉపయోగపడదు.

ఎప్పుడూ అతి సమర్థంగా ఉండాలీ, ఇతరులందరికంటే ఎంతో మెరుగ్గా ఉండాలి అని తాపత్రయపడే సంస్కృతి, పోయిన కొద్దీ సంఘాన్ని ‘పురుషత్వ’ ధర్మం వైపు మరింతగా పురికొల్పుతుంది. సంఘం పురుషత్వోన్ముఖమైతే, ఆర్థిక సమృద్ధికి లోటుండదు. నిజమే, కానీ అప్పుడు, ఆర్థిక పుష్టి మానవ సంక్షేమానికి సాధనంగా ఉండటానికి బదులు, మనుషులే ఆర్థిక సమృద్ధిని సాధించి పెట్టే పనిముట్లుగా మిగిలిపోతారు. ఈ రోజు జరుగుతున్నదిదే. ఆర్థిక ప్రగతి శకటానికి మనిషి అనే వాడు ఒక ఇంధనంగా మాత్రమే మారిపోయాడు.

మనం మన విద్యా విధానాలను కూడా మన పిల్లలు ఆ ఆర్థిక ప్రగతి సాధన యంత్రాలలో చిన్న చిన్న చక్రపుటంచులుగా ఇమిడిపోయెందుకు తోడ్పడేటట్టు మాత్రమే మలచుకొన్నాం. ఓ రకంగా చూస్తే, ఈ రోజున మనుషులు పుట్టిన క్షణం నుంచి గిట్టేదాకా చేసే చాకిరీ అంతా ఆర్థికంగా మునుపటికంటే ఒక్క పిసరు మెరుగ్గా బతికెందుకే. మన సమాజాలు మరీ అత్యంత పురుషత్వోంముఖంగా (super masculine) అయిపోతున్నాయి.

మనం ఈ ప్రయాణపు దిశను మార్చుకోవలసిన సమయం వచ్చేసింది. అన్ని చోట్లా అర్థ వ్యవస్థ ప్రజల జీవితాలలో అతి ప్రధానమైన అంశంగా అయి కూర్చొన్నది. ప్రపంచ వ్యాప్తంగా స్త్రీలందరూ ఈ ఆర్థిక ప్రగతి ప్రక్రియలలో పాలు పంచుకొని, ఆర్థిక వ్యవస్థలో కొంత మృదుత్వం తేవలసిన అవసరం ఉంది.

ఇవాళ మన ప్రజా జీవితానికీ, ఈ భూగోళానికీ, ఆర్థిక కార్యక్రమావళులే యుద్ధాలకంటే ఎక్కువ హాని కరంగా పరిణమిస్తున్నాయి. ఈ ‘పురుషత్వో’న్ముఖమైన ధోరణులను మెత్తబరచాల్సిన సమయం వచ్చింది. వాణిజ్య రంగాన్ని నడిపే నాయకుల శ్రేణులలోనూ, వ్యాపార సంస్థలకు దిశా నిర్దేశం చేసే డైరెక్టర్ల బృందాలలోనూ, మహిళల అవసరం ఎంతైనా ఉంది. కానీ వాళ్ళు పురుషుల కంటే ఎక్కువ ‘పురుషత్వ’ లక్షణాలు ప్రదర్శించే మహిళలు కాకూడదు. తమలో ఇంకా ‘స్త్రీత్వ’ ధర్మాలు సజీవంగా ఉంచుకొన్న మహిళలు కావాలి. అలాగే అవసరమైనప్పుడు తమలో ఉన్న ‘స్త్రీ త్వ’ లక్షణాలు ప్రదర్శించేందుకు సిగ్గుపడని పురుషుల అవసరం కూడా ఉంది.

సమాజంలో ఈ రకమైన సమతౌల్యాన్ని తీసుకురావాలి. ఈ సమతౌల్యంలోనే నిజమైన సాధికారత (empowerment) ఉంటుంది. ‘పురుషత్వ’ ఉన్ముఖత, ‘స్త్రీత్వ’ ఉన్ముఖత కంటే గొప్పదని భావించినంత కాలం (అలాగే ‘స్త్రీత్వ’ ఉన్ముఖత ‘పురుషత్వ ఉన్ముఖత కంటే గొప్పదని భావిస్తూ పోతే కూడా!) అందుకు మనం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కనక మనలో అంతర్గతంగా మనమీ సమతౌల్యాన్ని అలవరచుకోగలిగితేనే మన జీవితాలు క్షేమంగా సాగుతాయి.

అది జరగాలంటే, మన అస్తిత్వం (identity) కేవలం మన భౌతిక శరీరాలలో భేదాలకు మాత్రమే పరిమితం కాకుండా, ఆ భేదాలకు అతీతమైందిగా ఉండాలి. దైనందిన జీవితంలో ప్రతి విషయంలోనూ, ఫలానా వ్యక్తి పురుషుడా, స్త్రీయా అని చూడటం ఎందుకు? అలా ప్రత్యుత్పత్తి అవయవాల నిర్మాణమే ఆధారంగా గుర్తింపు ఏర్పరుచుకోవటం ఆదిమ మానవుల పోకడ అవుతుంది.

ఆధ్యాత్మిక ప్రక్రియ అంటే, అనుభూతి పూర్వకం(experiential) గా మీ భౌతిక శరీర నిర్మాణం పరిమితులకు అతీతమైన స్థాయికి చేరటం. మీ జీవితానుభవం మీ భౌతిక శరీర నిర్మాణ భేదాలకు అతీతమై ఉన్నప్పుడూ, ఆ శరీర నిర్మాణం రీత్యా మీరు పురుషుడైతేనేం, స్త్రీ అయితేనేం? జీవితంలో ఒక వ్యక్తి , స్త్రీగానో పురుషుడిగానో తన పాత్ర భిన్నంగా పోషించవలసి వచ్చేది కొన్ని సందర్భాలలో మాత్రమే. ప్రతి సందర్భంలోనూ, అనుక్షణమూ ఈ స్త్రీ పురుష భేదాన్ని లాక్కు రావాల్సిన అవసరమే లేదు. ఇదివరకు కాలంలో లింగ వివక్ష రూపేణా దోపిడీ, పరపీడనా జరిగాయి కాబట్టి, ఇప్పటికీ మనం ఆ లింగ భేదం మీద ఆధారితమైన అస్తిత్వానికి అవసరాన్ని మించిన ప్రాధాన్యత ఇస్తున్నాం. దీనివల్ల స్త్రీజాతి సంక్షేమంలో మార్పు రాదు. మీరు చేయవలసిన మీ సామాన్య విధులేవో మీరు నిర్వర్తించుకొనేటప్పుడు మీరు స్త్రీలా, పురుషులా అన్న ప్రశ్నకు తావే ఉండకూడదు. అలాంటి సమాజాన్ని మనం నిర్మించుకోవాలి. ఫలానా వ్యక్తి పురుషుడూ, ఫలానా వ్యక్తి స్త్రీ అన్న భేదం మీరు గుర్తించినంత సేపూ, మీరు పురుషులు గొప్ప అనో, స్త్రీలు గొప్ప అనో నిర్ణయానికి రాకుండా ఉండలేరు. కొందరు ఒక నిర్ణయానికి వస్తారు. మరికొందరు మరో నిర్ణయానికి వస్తారు. దీనివల్ల వివక్షలూ పక్షపాతాలూ తప్పవు.

ఈ ప్రపంచంలో ఉన్న ప్రాణి కోటిలో అన్ని ప్రాణులూ సమానమే అన్న ఉదాత్త భావంతో మనం ఎలాగూ జీవించలేకుండా ఉన్నాం. కనీసం మానవ జాతి అంతా ఒక్కటే అన్న సమ భావమైనా అలవరచుకోవాలి గదా! ఫలానా వారు గొప్ప, ఫలానా వారు తక్కువా అని విభజించి చూడటం ఒక మౌలిక స్థాయి వివేకం మాత్రమే కలవారి లక్షణం. మనుషుల కుండే అకారణ పక్షపాతాలూ వివక్షలూ , వాళ్ళు అనేక విధాలుగా బయటి ప్రపంచం నుంచి నేర్చుకొన్నవే. వాస్తవానికయితే, ఫలానా వారు గొప్ప, ఫలానా వారు బీదా అన్న భేద భావనకు అవసరమే లేదు.

ఆది యోగి శివుడు పార్వతిని తన శరీరంలో భాగంగా చేసుకొని, 'సగం స్త్రీ- సగం పురుషుడు' గా ఉండే అర్థ నారీశ్వర రూపం ధరించిన కథ మీకు తెలుసు కదా? ఆయనలో సగం భాగం స్త్రీ కనకనే ఆయన పురుషులలో సర్వ శ్రేష్ఠుడైన పరమ పురుషుడిగా భావించ బడుతున్నాడు. అది మీ జీవితానికి సంబంధించిన ఒక తాత్త్విక సత్యాన్ని మీకు గుర్తు చేయటానికే.

మీది పురుష శరీరం అయినంత మాత్రాన మీరు మీలో 'స్త్రీత్వ' ధర్మాలు ఏవైనా ఉంటే, వాటన్నిటినీ చంపి వేయాలని అర్థం కాదు. అలాగే స్త్రీలు వాళ్ళలో 'పురుషత్వ' ధర్మాలనూ చంపుకోనక్కర్లేదు. మీలో అందరిలోనూ అంతర్గతంగా ఉన్నపురుష, స్త్రీధర్మాల రెంటి మధ్య ఒక సమతౌల్యాన్ని ఏర్పరచుకో గలిగితేనే, మీరు బౌద్ధికం (intellectual)గానూ, అనుభూతిపూర్వకం(experiential)గానూ జీవితపు లోతులన్నిటినీ గ్రహించగలుగుతారు.

ఈ భిన్న ధ్రువాల సూత్రం (principle of polarities) యోగ శాస్త్రంలో బోధించే ప్రాథమిక స్థా యి యోగం- హఠయోగం- లో కూడా కనిపిస్తుంది. హ అంటే సూర్యుడు. ఠ అంటే చంద్రుడు. మీ జీవితంలో ఉన్న సౌర సంబంధమైన, చంద్ర సంబంధమైన అంశాలు రెంటి మధ్యా ఒక సమ తౌల్యం సాధించేందుకు వీలుగా మీ శరీరావయవాల రేఖా గణితాన్ని మలచుకొని, రెంటి ద్వారా ప్రయోజనం ఎలా పొందాలో చెప్పేదే హఠ యోగం. 'పురుషత్వ', 'స్త్రీత్వ' ధర్మాలలో హెచ్చు తగ్గులు మరీ ఎక్కువయితే కలిగే పరిణామాలు వికృతంగా ఉంటాయి.

నిజమైన స్త్రీ సాధికారత సాధించాలంటే, ఆ సాధికారతను మానవ జాతి అంతా, సమతౌల్యం వల్ల సాధించాలి. సమాజంలో ఘర్షణలు నెలకొని ఉంటే, పురుషుడు పై చేయి సాధించటం సహజం. సమతూకమూ స్థిరత్వమూ గల సమాజంలో మాత్రమే స్త్రీలు తమ శక్తియుక్తులను పూర్తిగా ప్రకటించగలుగుతారు. ప్రపంచంలో ఈ నాడున్న అనేక సమాజాలలో, అతి కొద్ది సమాజాలలోనే ఈనాడు స్త్రీలు ఇలా తమ శక్తి యుక్తులను పూర్తిగా ప్రదర్శించగలుగుతున్నారు. ఇప్పుడు మనకున్న సాంకేతిక పరిజ్ఞానం ధర్మమా అని, స్త్రీపురుషులు సరిసమానంగా పాలు పంచుకొనేందుకు అనువైన భౌతిక ప్రపంచం ఏర్పడి ఉంది. ఇలాగే స్త్రీ పురుషులు సమానంగా పాలు పంచుకోగల ఆధ్యాత్మిక, మనో వైజ్ఞానిక ప్రపంచాలను గూడా ఏర్పరచుకొనేందుకు అనువైన సమయం వచ్చింది. స్త్రీత్వ, పురుషత్వ ధర్మాలు రెండూ సమానంగా పని చేస్తేనే, మనుషులు అంతర్గతమైన వికాసాన్ని అనుభవించ గలుగుతారు. జీవితానుభవాలలో శిఖరాగ్రాలు ఎలా ఉంటాయో గ్రహించగలుగుతారు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు