అవధూతలు ఎటువంటివారు??
ఆధాత్మిక జగత్తులో ఎన్నోసార్లు అవధూతల గురించిన ప్రస్తావన వింటూ ఉంటాం. అవధూతల స్థితి అంతర్ముఖంగా ఉంటుందా? వారు సమాజంలో ఉండగలరా?
ప్రస్తుతం మీరు కానటువంటి ఎన్నో విభిన్నకోణాలను మీలో ఏర్పరచడమే యోగా లక్ష్యం. ‘‘మీరు కానిది’’ అన్నప్పుడు నా ఉద్దేశమేమంటే: ప్రస్తుతం మిమ్మల్ని మీరు అనేక విషయాలతో గుర్తించుకుంటున్నారు. మీ దృష్టిలో ‘మీరు’ అంటే మీరు దేనితో గుర్తించుకుంటున్నారో అదే. ఈ పరిమితమైన గుర్తింపులను పక్కకు పెట్టి, వీటిని మించిన ఒక స్థలాన్ని మీలో ఏర్పాటు చేయడమే యోగా. మొదట్లో ఇది మీలో చిన్నగానే ప్రారంభమవుతుంది. మీరు, మీలో పోగుచేసుకున్న చెత్తను వదిలించుకొంటూ, దానికోసం మీరు స్థలం ఖాళీ చేస్తున్న కొద్దీ అది(అపరిమితత్వం) ఆ స్థలాన్నంతా వ్యాపించడం ప్రారంభిస్తుంది.
ఎదో ఒక రోజున, అది మీలో సర్వస్వాన్నీ ఆక్రమిస్తుంది. మీరు అంతకముందు పోగు చేసుకున్న ఐహిక విషయాలు, మీ చుట్టూతా తేలియాడుతూ ఉంటాయి. కావాలనుకుంటే మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు, లేదా మీరు వాటి స్పర్శే లేకుండా ఉండవచ్చు. మీరు ఇలా మారినప్పుడు, నిజంగానే ధ్యాన స్థితిలో, సమాధి స్థితిలో అంటే అన్నిటితో సమన్వయంతో ఉండగలిగిన స్థితిలోకి వెళతారు. అప్పుడు మిమ్మల్ని ఏదీ తాకదు.
అవధూతలు ఎటువంటివారు??
మీరు పోగుచేసుకున్నవి మీ చుట్టూ లేకుండా మీరీ ప్రపంచంలో జీవించలేరు. మీరు ఈ ప్రపంచంలో ఆడవలసిన ఆట అడలేరు. అవి లేకపోతే మీరొక అవధూతలా తయారవుతారు. ఈ రోజుల్లో ప్రతివాళ్లూ తాము అవధూతలమని చెప్పుకుంటున్నారు. ‘‘నేను అవధూతను, మీరు కూడా అవధూతలే’’ అని. అటువంటి వారి గురించి కాదు నేను చెప్పేది. అవధూత అంటే పసిపిల్లవాడి మనస్తత్వం కలిగినవారు - వాళ్లకేమీ తెలియదు. మీరు వాళ్లకు తినిపించాలి. మీరే నిలబెట్టాలి, కూర్చోబెట్టాలి. వాళ్లు ఎంత తన్మయావస్థలో ఉంటారంటే వారికి వారి జీవితంలో మరోదాన్ని నిర్వహించడమే తెలియదు.
అటువంటి వ్యక్తి తన మనస్సును పూర్తిగా వదిలి వేస్తాడు. అతనీ చెత్త అంతటికీ ఎంతో దూరం. మీరతన్ని ఒక పసిపిల్లవాడిలా చూసుకోవాలి; లేకపోతే అతనీ లోకంలో ఉండలేడు. ఇలాంటి స్థితులలో ఉండగలగడం శాశ్వతం కాదు, అవి నిర్దిష్ట వ్యవధుల్లో ముగుస్తాయి. కొంతమంది సంవత్సరాల తరబడి అవధూతలుగా ఉండగలిగిన వాళ్లూ ఉంటారు. అదొక పరమానందకర, మహాద్భుతమైన స్థితి, కాని ఆ స్థితిలో మిమ్మల్ని చూసుకొనే వారెవరైనా ఉండాలి, లేకపోతే ఆ విధంగా మీరు జీవించలేరు.
మనుషుల్ని ఇటువంటి స్థితిలోకి నెట్టడం నాకు చాలా తేలిక, చాలా మామూలు విషయం. అది చాలా ఆనందకరమైన, అద్భుతస్థితి. కాని వాళ్లను ఎవరు చూసుకుంటారు? ఇవ్వాళ ప్రపంచంలో ఉన్న సామాజిక స్థితిలో దీన్ని సానుకూల అభివృద్ధిగా ఎవరూ చూడడం లేదు. అటువంటి వ్యక్తి పిచ్చివాడనీ, అతను ఉండవలసిన చోటు పిచ్చాసుపత్రి అనీ జనం అనుకుంటారు. అతను పరమానంద స్థితిలో ఉన్నప్పటికీ దాన్నెవరూ లెక్కచేయరు.
భారతదేశంలో ఇటువంటి స్థితులను ఆరాధించేవారు - అవధూతలను పూజించేవారు. దక్షిణ భారతదేశంలో ఇటువంటి అద్భుతమైన అవధూతలున్నారు, నాకు అలాంటి వాళ్ళు చాలా మంది తెలుసు. వాళ్లు అద్భుతమైన వ్యక్తులే కాని, చూసుకొనే వాళ్లు లేకుండా వారి మనుగడ సాగదు.
ఇటువంటి స్థితులలో కర్మల నుండి విముక్తులం కావచ్చు
తక్కువ కాలాల పటు, ప్రజలు ఈ స్థితిలోనికి వెళ్లడం మంచిదే. ఇది మీ కర్మ నిర్మాణంలోని అట్టడుగు అంతస్తును శుభ్రం చేయడం వంటిదిది. ఉదాహరణకు, మీ కార్మిక నిర్మాణంలో 110 అంతస్తులున్నాయనుకుంటే, మీరు అట్టడుగు నేలను శుభ్రం చేస్తున్నారన్నమాట. ఒక వ్యక్తి తనను తాను శుద్ధి చేసుకోవడానికి అంత లోతుకు వెళ్లడానికి ఎంతో చైతన్యం ఉండాలి. కాని ఇటువంటి స్థితిలో వ్యక్తి అట్టడుగు భాగాన్ని తేలికగా శుద్ధి చేయగలడు. ఈ స్థితిలో అతనేమీ చేయడు, అతనికేమీ తెలియదు, కాని అతనికి కర్మ ఉండదు, బంధం ఉండదు, అందువల్ల అతనిలో సర్వం శుద్ధి చేసేయబడుతుంది.
యోగులు ఇటువంటి స్థితిలో నిర్దిష్ట కాల వ్యవధులు గడుపుతారు. ముక్తికి ఇది ఎంతో వేగవంతమైన మార్గం. కాని అలాగే, దాదాపుగా ఎప్పుడూ కూడా అవధూతలు తమ శరీరాన్ని అవధూతలుగా విడిచిపెట్టలేరు. అవధూత స్థితిలో శరీరాన్ని విడిచిపెట్టలేని విధంగా మానవ చైతన్యం ఏర్పాటు చెయ్యబడింది. ఆ స్థితిలో మీరు దేహం విడిచిపెట్టలేరు. మీరు దేహాన్ని విడిచిపెట్టే సమయంలో మీరు చైతన్యంలోనికి రావాలి. ఈ స్థితికి వెలుపల ఉండే ఆ కొద్ది క్షణాల్లో మీరు మళ్లీ కర్మ సృష్టిస్తారు. జీవితమంతా అవధూతలుగా, విముక్తంగా జీవించి, చివరి క్షణాల్లో ఆ స్థితి నుండి బయటికి వచ్చి, తమ కర్మ నిర్మాణంలోకి మళ్లీ తిరిగివచ్చిన వారెందరో మనకు తెలుసు. సాధారణమైన కర్మలే, పెద్ద విషయమేమీ కాదు కాని, వాటిల్లో చిక్కుకోకుండా బయట పడడమెలాగో వాళ్లకు తెలియదు.
అంటే మీరు పోగుచేసుకున్న ఐహిక విషయవాసన లేకుండా మీరీ లోకంలో జీవించలేరు. మీలో నిరంతరం వర్తిస్తున్న ద్వంద్వాల మధ్య, మీ అవగాహనలో పొరపాటువల్ల ఈ ‘వాసనలు’ కలుగుతాయి. మీరు ఈ ద్వంద్వాలన్నిటినీ అధిగమించి, మీలో స్పష్టమైన సరళత ఉంటే, ద్వంద్వాలు మీకు వెలుపలే వర్తిస్తాయి. మీరు కావాలనుకుంటే మీరు ఆ ఆట ఆడగలరు, వద్దనుకుంటే లేదు. అప్పుడు ఈ చెత్త మీలో భాగం కాదు. అయితే, మీ వద్ద వాటి నిలువలు ఉంటాయి, కావాలనుకుంటే దాన్ని మీరు ఉపయోగించవచ్చు, కాని ఇక మీరు మాత్రం అది కాదు.