భూత శుద్ధి- ఒక ప్రాథమిక యోగ ప్రక్రియ
భూత శుద్ధి లేదా పంచభూతాల శుద్ధీకరణ ప్రాముఖ్యత
పంచభూతాలను శుద్దీకరణ చేయడం ఎందుకు?
పంచభూతాలు ఇంకా కర్మ
భూత శుద్ధి- కార్మిక ముద్ర నుంచి విముక్తి పొందడం
ఈశా భూత శుద్ధి ప్రాక్టీసు చేయడం వల్ల ప్రయోజనాలు
భూత శుద్ధి సాధనలో సంపూర్ణ ప్రయోజనం పొందడానికి అనుసరించాల్సిన సరైన పద్ధతి
భూత శుద్ధి - మార్మిక అంతర్దృష్టి

భూత శుద్ధి- ఒక ప్రాథమిక యోగ సాధన

సద్గురు: మీరు, "నా శరీరం " అని పిలిచేది, నిజానికి కేవలం భూమి, నీరు, నిప్పు, గాలి ఇంకా ఆకాశం అనే ఐదు మూలకాల కలయిక మాత్రమె. మీకు మీలోపల ఈ ఐదింటిని సరిగ్గా నిర్వహించుకోవడం ఎలాగో తెలిస్తే, జీవితంలో అంతకుమించి చేయాల్సింది ఇంక ఏమీ లేదు. ఈ పంచభూతాలను ఎలా నిర్వహించుకోవాలో మీకు తెలిస్తే - ఆరోగ్యం, శ్రేయస్సు, అవగాహన, జ్ఞానం, ఎరుక ఇంకా ఆత్మజ్ఞానం పరంగా - అన్నింటినీ చక్కబెట్టుకున్నట్టే. యోగ సంప్రదాయంలో అతి ప్రాథమిక ప్రక్రియ అయిన భూత శుద్ధి నుండే, మిగిలిన అన్ని క్రియలూ వచ్చాయి. "భూత" అంటే పంచభూతాలు లేదా ఐదు మూలకాలు, “శుద్ధి” అంటే వాటిని శుభ్రం చేయడం. మీ వ్యవస్థలోని ఈ ఐదు మూల పదార్థాలను శుభ్రపరిచే విధానాన్ని నేర్చుకుంటే చాలు. ఆధ్యాత్మిక ప్రక్రియల పరంగా చూస్తే, మీరు చేస్తున్న యమ, నియమ, ప్రాణాయామ, ఆసనాలు, ధారణ, ధ్యానం, సమాధి లేక శూన్య అయినా - ప్రాధమికంగా వాటన్నింటి మూల సూత్రాలు భూత శుద్ధి నుంచి వచ్చినవే. తక్కిన యోగ ప్రక్రియలన్నీ కూడా, యోగాలోని పంచభూత వ్యవస్థ నుండి వచ్చినవే. 

పంచభూతాలను శుభ్రపరుచుకుంటే, చాలా అద్భుతమైన జీవితాన్ని గడపవచ్చు. కానీ మీరు దాన్ని దాటి వెళ్లాలంటే, అందమైన జీవితాన్ని గడపాలి అనే ఆలోచన పక్కనపెట్టి, జీవానికి అతీతంగా వెళ్ళండి, ఎందుకంటే జీవాన్ని అధిగమించడం కంటే అందమైన జీవితాన్ని గడపడం మరింత క్లిష్టమైన పని. అధిగమించడం అంటే, దాటి అవతలికి వెళ్లడం. అవతలి వైపున ఉన్నదానికి భౌతిక తత్వపు సంక్లిష్టతల గోల ఉండదు. కానీ మీరు భౌతికతలో ఉంటూనే, దానికి అతీతంగా ఉండాలీ అనుకుంటే, అందుకు భౌతిక తత్వం మీద కొంత ప్రావీణ్యత సంపాదించాల్సి ఉంటుంది. ఒకవేళ మీ వద్ద భౌతుకతకు సంబంధించిన ప్రావీణ్యత లేకపోతే మీరు భౌతికతకి బానిసలైపోతారు.

ఈ ఐదు మూలకాలను ఒక స్థాయి వరకు శుద్ది చేస్తే, మీరు భూత సిద్ధి పొందుతారు, అంటే మీరు వాటి విషయంలో ప్రావీణ్యం సంపాదించారు అన్నమాట. ఒకసారి మీకు పంచభూతాల మీద ప్రావీణ్యత వస్తే, అప్పుడు మీకు కేవలం శరీరం ఇంకా మనసు మీదే కాక, ఈ సృష్టి మీదే ప్రావీణ్యత ఉంటుంది.

భూత శుద్ధి లేదా పంచభూతాల శుద్ధీకరణ ప్రాముఖ్యత

ఈ మూలకాలే మీ సృష్టికి ఆధారభూతాలు. మీరు వీటి విషయంలో ఏ కొంచెం ప్రావీణ్యత సాధించగలిగినా, ఇతరులు అద్భుతమని భావించే రీతిలో మీరు జీవించ గలుగుతారు. నిజానికి అందులో మ్యాజిక్ ఏమీ లేదు. ప్రస్తుతం, ఉదాహారణకి మీరు మంచి నీళ్లు తాగారు అనుకుందాం. ఆ నీరు మీలాగా ఉండదు, దానికి కనీసం మీ పోలికలు కూడా ఉండవు. కానీ, దాన్ని మీరు తాగినప్పుడు, అది మీరుగా అయిపోతుంది. ఇదే ఒక మ్యాజిక్. మీ వ్యాధి నయమైంది. అది మ్యాజిక్ కాదు. నీరు మీరుగా మారిపోవడం అనేది గొప్ప మ్యాజిక్. ఇటువంటి అద్భుతాన్ని చేయగలిగిన మీరు, ఏదో రోగాన్ని నయం చేసుకోవడమో, పాడైపోయిన దాన్ని బాగు చేసుకోవడమో, ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకునే సామర్ధ్యాన్ని తప్పకుండా కలిగి ఉంటారు, ఎందుకంటే మీరు మీ శరీరం మొత్తాన్ని, మీ లోపల్నుంచి, నాలుగు మూలకాలతో తయారు చేసుకుంటున్నారు. దురదృష్టవశాత్తు, ఇది మీకు తెలియకుండా జరిగిపోతోంది. ఈ నాలుగు మూలకాలు శరీరంగా ఎలా తయారవుతున్నాయి అన్నదాన్ని మన ఎరుకలోకి తీసుకురావచ్చు.

పంచభూతాలను శుద్దీకరణ చేయడం ఎందుకు?

ప్రశ్న: పంచభూతాలను శుభ్రపరుచుకోవలసిన అవసరం ఏమిటి?

సద్గురు: మీరు ఒక మురికి కాలువ నుంచి నీళ్లు తీసుకొస్తే, ఆ నీళ్లు స్వచ్చంగా లేవని అనుకుంటారు, కానీ అది నిజం కాదు. నిజానికి మీరు తాగే బాటిల్ నీళ్లలో కంటే, ఆ మురికి కాలువ నీళ్లలో ఎక్కువ జీవజాలం ఉంటుంది. కాకపోతే ఆ నీళ్లు మీ శరీరానికి సరిపడవు అంతే. మనుషుల అవగాహనలో ఇంకా భాషలో, మనకి సరిపడే నీటిని మాత్రమే మనం మంచి నీరు అంటాం. కానీ మిగతా ఎన్నో జీవాలకు, మురికి నీరే మంచి నీరు. మంచి నీటి పేరిట, మీరు ఆ జీవాలన్నిటినీ చంపేశారు. ఆ మిగిలిన జీవాలన్నీ మీ బాటిల్ నీళ్ళని జీవంలేని నీళ్ళు అనుకుంటాయేగానీ, మంచి నీరు అనుకోవు.

మన ఉద్దేశాలతో, భావోద్వేగాలతో ఇంకా ఆలోచనా ప్రక్రియలతో మనం తాగే నీరు, పీల్చే గాలి, ఇంకా తినే ఆహార పదార్దాల స్వభావాన్ని మార్చవచ్చు.

ప్రాధమికంగా శుద్ధీకరణ అనేది మనుషులకి సంబంధించిన నేపధ్యంలోనే గానీ, మూలకాలకు సంబంధించిన నేపధ్యంలో కాదు. అదేవిధంగా, మందుల కర్మాగారాల్లో, వివిధ ఔషధాల్లో వాడే రసాయనాలకు, పరిశ్రమల్లో ఉపయోగించే రకం, ఇంకా మందుల తయారీలో ఉపయోగించే రకం అని రెండు రకాలు ఉంటాయి. ఎందుకంటే మనిషి లోపలికి తీసుకోదగినది వేరు, ఎన్నో ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించేది వేరు. అంటే దానర్థం పరిశ్రమల్లో ఉపయోగించేది అపరిశుభ్రమైనదని కాదు. విషయం ఏంటంటే, అది మీకు ఉత్తమంగా పనికొచ్చే స్థితిలో లేదు. మనం పంచభూతాల గురించి మాట్లాడేటప్పుడు, మనకు ఏది మరింత ఉపయుక్తమైనది అన్న కోణంలో మాట్లాడుతున్నాం. ఈ కోణంలో, పంచభూతాలను శుద్ధి చేయడం అవసరం.

పంచభూతాలు ఇంకా కర్మ

ఈ శరీరం, ప్రపంచం ఇంకా విశ్వమంతా - ఈ పంచభూతాల క్రీడే. ఈ మూలకాలు ఇతర లక్షణాలను, రకరకాల సంభావ్యతలను సంతరించుకోకపోతే, కేవలం ఐదింటితో ఇన్ని వేల కోట్ల జీవరాశులను సృష్టించడం సాధ్యం కాదు. అవి సహజంగానే గ్రహణ శక్తి గలవి. ఈ రోజు మనకు తెలుసు, వాటిని మనం ప్రభావితం చేయగలమని. మన ఉద్దేశాలతో, భావోద్వేగాలతో ఇంకా ఆలోచనా ప్రక్రియలతో మనం తాగే నీరు, పీల్చే గాలి, ఇంకా తినే ఆహార పదార్థాల స్వభావాన్ని మార్చవచ్చు. మీలో ఉండే, మీ శరీర నిర్మాణ పదార్థాలైన, ఈ పంచభూతాలు, “కర్మ పదార్థం” చేత ప్రభావితం అయి ఉంటాయి. ఈ “కర్మ పదార్థం” అనేది మనం పోగు చేసుకున్న ఒక సమాచారపు పొర. అది లేకపోతే, ఈ పంచభూతాలు మీలో ఇలా ప్రత్యేకమైన రీతిలో ప్రవర్తించవు. ఒక్కొక్కరికీ ప్రత్యేకమైన సమాచారం లేకపోతే, మనుషులందరూ ఒకేలా ఉండి ఉండేవారు. మీరు దేన్నయితే ప్రత్యేకమైన వ్యక్తి అనుకుంటున్నారో, అది నిజానికి కొంత సమాచారం మాత్రమే. అది మిమ్మల్ని అంటిపెట్టుకుని ఉండేది ప్రాధమికంగా ఈ మూలకాల ద్వారానే, ఎందుకంటే మీ శరీరంలో ఈ ఐదు మూలకాలకు మించి మరేమీ లేదు.

అందుకనే యోగ, ప్రతి దాన్నీ శరీరం అని సంబోధిస్తుంది- భౌతిక శరీరం, మానసిక శరీరం ఇంకా శక్తి శరీరం - కానీ మనసు ఉండదు. ఎందుకంటే, మీరు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చిన మానసిక కార్యకలాపాలు ముఖ్యమైనవీ కావు, పర్యవసానాలు తెచ్చేవీ కావు.

మూలకాలను శుద్ధి చేయడం అంటే, వాటి నుండి ఈ పోగుచేసుకున్న సమాచారాన్ని లేదా కర్మ పదార్థాన్ని కడిగేయడమే. ఇది గనక చేయకపోతే, మీరు ఒక బలమైన వ్యక్తిగా ఉంటారు, కానీ మీకు మీరు ఏర్పరుచుకున్న ఈ సరిహద్దులను అధిగమించడం ఎలాగో మీకు ఎప్పటికీ తెలియదు. మీకై మీరు ఏర్పరుచుకున్న హద్దులను మీరు దాటలేకపోతే, అది బుద్ధి హీనంగా బతకడమే అవుతుంది. ఎందుకో తెలియకుండానే మీకు మీరు హద్దులను ఏర్పర్చుకుని, కొంత కాలం తర్వాత వాటిని దాటలేక,"నేను ఇలానే ఉంటాను" అని చెప్పడం మొదలు పెడతారు. నిజానికి మీరు ఉండేది అలా కాదు. మిమ్మల్ని మీరు అలా తయారు చేసుకున్నారు.

స్వేచ్ఛ ఇంకా ముక్తి మీ జీవిత లక్ష్యాలు అయి, పరిమితులను దాటి ముందుకు సాగాలని మీరు అనుకున్నప్పుడు మాత్రమే, శుద్ధీకరణ అవసరం అవుతుంది. మీరు కేవలం ఒక సిమెంటు దిమ్మెలా ఉండాలనుకుంటే, శుద్దీకరణ అవసరం లేదు. కర్మ పదార్థం గట్టి పడిపోతే అది మిమ్మల్ని బిరుసుగా చేసేస్తుంది, బిరుసుదనం మీకు విపరీతమైన బాధలను తీసుకువస్తుంది. మీకు వేరే ఉపద్రవం రావాల్సిన అవసరం లేదు. మీకు మీరే ఒక ఉపద్రవంగా అవుతారు. ఎందుకంటే కర్మ ముద్ర ఎంత గాఢంగా ఉంటుందంటే, మీరు ఎప్పుడూ ఒక నిర్బంధ రీతిలో, నిర్ణీతమైన పద్ధతిలోనే ప్రవర్తిస్తుంటారు. ఒకే పరిస్థితి వెయ్యిసార్లు వచ్చి ఉంటుంది, అయినా కూడా మళ్ళీ అదే జరిగితే, మీరు మళ్లీ దాదాపు మునుపటిలాగే స్పందిస్తారు. మీ ప్రతిస్పందన మరో రకంగా ఉండాలంటే, అందుకు మీలో కొంత ఎరుక కావాలి, ఇంకా మిమ్మల్ని కొంత కుదపాల్సిన అవసరం కూడా ఉంటుంది. దీన్ని ప్రాథమిక స్థాయిలో చేయడం కోసమే భూత శుద్ధి.

భూత శుద్ధి- కార్మిక ముద్ర నుంచి విముక్తి పొందడం

పొద్దున్నే మీ మనసుని శుభ్రం చేస్తే, మధ్యాహ్నం కల్లా మళ్లీ కొత్త విషయాలన్ని చేరిపోతాయి. అది ఉత్త దండగ. అందుకనే యోగ సాంప్రదాయంలో మీ మానసిక వ్యవస్థకు ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వబడలేదు. మీ ఆలోచనలకు, ఉద్వేగాలకు ఎటువంటి విలువ ఇవ్వలేదు ఎందుకంటే, ఈ రోజు దాన్ని మారిస్తే, కొన్ని గంటల్లోనే మీరు దాన్ని మళ్ళీ మరోరకంగా మార్చేస్తారు.

మనము కేవలం శరీరం మీదనే ధ్యాస పెడతాము. అందుకనే యోగ, ప్రతి దాన్నీ శరీరం అని సంబోధిస్తుంది- భౌతిక శరీరం, మానసిక శరీరం ఇంకా శక్తి శరీరం - కానీ మనసు ఉండదు. ఎందుకంటే, మీరు ఎంతగానో ప్రాముఖ్యత ఇచ్చిన మానసిక కార్యకలాపాలు ముఖ్యమైనవీ కావు, పర్యవసానాలు తెచ్చేవీ కావు. మీ లోపల ముద్రించబడిన సమాచారాన్ని బట్టి, మీ కర్మ ఇంకా సంస్కారాలను బట్టి, మీ ఆలోచనలు, అనుభూతులు ఉంటాయి. ప్రతిదీ ఆ విధంగానే జరుగుతుంది. మీరు చెట్టు ఖాండాన్నినరికితే, అది ప్రతీకారంతో తిరిగి చిగురిస్తుంది. అదే మీరు చెట్టు వేర్లను పెకలిస్తే, ఇక మళ్లీ తిరిగి రాదు. మన ఆసక్తి వేర్ల మీదనే; కార్మిక ముద్రల తల్లివేరు పంచభూతాలలో ఉంటుంది.

ఈశా భూత శుద్ధి ప్రక్రియ చేయడం వల్ల ప్రయోజనాలు

bhuta-shuddhi-practice

భూత శుద్ధి అంటే మిమ్మల్ని మీరు పోగొట్టుకోవడం. అది మంచిదా, చెడ్డదా, అందమైనదా, అసహ్యంగా ఉందా అన్నదానితో సంబంధం లేదు - మీరు కూడబెట్టుకున్నదంతా మీరు పోగొట్టాలి అనుకుంటున్నారు - ఎందుకంటే అప్పుడు ఆ సృష్టికర్త సృష్టి, మీలో నిలబడి వెలుగుతుంది. అందుకు కొంత నిర్దిష్టమైన కృషి అవసరం. మేము నేర్పించే భూత శుద్ధి చాలా ప్రాథమిక స్థాయికి చెందినది. మీరు మరింత తీవ్రమైన భూతశుద్ధి సాధన చేయాలనుకుంటే, అదేదో ఒక పక్కన చేసేది కాదు, దానికి జీవితాన్ని అంకితం చేయాలి. కానీ మీరు ఎంత చిన్నస్థాయి భూత శుద్ధి సాధన చేసినా కూడా, మీలో జరిగే మార్పు శాశ్వతంగా ఉండటాన్ని మీరు చూస్తారు. వెనక్కి పడిపోయే ధోరణి ఉండదు. అది చాలా ముఖ్యం కూడా. లేకపోతే ప్రతిఒక్కరూ మూడు రోజుల పాటు మారిపోయి, మళ్లీ తిరిగి అదే అలవాటైన పద్ధతిలోకి పడి పోతారు. కానీ ఒకవేళ మీరు చేసే పనులకు భూత శుద్ధి సాధనను జోడిస్తే, అలా జరగదు.

అది మంచిదా, చెడ్డదా, అందమైనదా, అసహ్యంగా ఉందా అన్నదానితో సంబంధం లేదు - మీరు కూడబెట్టుకున్నదంతా మీరు పోగొట్టాలి అనుకుంటున్నారు - ఎందుకంటే అప్పుడు ఆ సృష్టికర్త సృష్టి, మీలో నిలబడి వెలుగుతుంది.

మీరు భూత శుద్ధి సాధన చేస్తూ ఉంటే, అది ఎంత చిన్న సాధన అయినా సరే, సమయం గడిచే కొద్దీ, కాదనలేని ప్రభావాన్ని అది చూపడాన్ని మీరే గమనిస్తారు. ఉదాహరణకి మీరు ఆరు నెలల పాటు యోగాసనాలు సాధన చేసి, ఆ తర్వాత ఒక ఏడాది పాటు వదిలేస్తే, మీ శరీరం యథాస్థితికి వచ్చేస్తుంది. అలాగే ఒకవేళ మీరు, “శక్తి చలన క్రియ” వంటి శక్తివంతమైన ప్రక్రియను సాధన చేస్తే, దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది, కానీ మీరు కొంత సమయం పాటు దాన్ని ఆపేస్తే, వ్యవస్థ పూర్వస్థితిలోకి వచ్చేస్తుంది. మీరు కొంతకాలం పాటు, “శూన్య” ధ్యానం చేసి, తర్వాత కొంతకాలం పాటు మానేస్తే, అది నెమ్మదిగా వెనక్కి జారి పోతుంది. కానీ భూతశుద్ధి నైజం అది కాదు. భూత శుద్ధి చేస్తున్నప్పుడు ఏమీ జరుగుతున్నట్టుగా అనిపించదు, ఎందుకంటే అది చాలా ప్రాథమిక మైనది ఇంకా నెమ్మదిగా పని చేసేది. కానీ మీరు ఈ దేహంలో ఉన్నంతవరకు, అది మీతో ఉంటుంది, వెళ్ళిపోదు. ఎందుకంటే అది చాలా ప్రాధమికమైన స్థాయిలో ఉంటుంది. అదే భూత శుద్ధి ప్రత్యేకత. మీరు ఏ వృత్తిలోనూ లేనట్లయితే, మీకు కుటుంబం కూడా లేకపోయినట్లయితే, మనము భూత శుద్ధిలో మరింత తీవ్రమైన సాధనను మొదలుపెట్టవచ్చు, ఎందుకంటే అది చాలా సమయం తీసుకుంటుంది.

భూత శుద్ధి సాధనలో సంపూర్ణ ప్రయోజనం పొందడానికి అనుసరించాల్సిన సరైన పద్ధతి

తరచుగా, మనుషులు ఆ ఎరుక లేకుండానే, తమకి తెలియకుండానే, అనుకోకుండానే భూతశుద్ధిని చేస్తూ ఉంటారు. ఉదాహరణకి, నాయకులు కొంతమంది కేవలం తాము అక్కడ ఉండడం చేత, తమ చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చేస్తూ ఉంటారు. చాల మంది ఉన్నారు - ఆధ్యాత్మిక వ్యక్తులే కాదు - వారు, గదిలోకి అడుగు పెట్టిన క్షణంలోనే అక్కడి వాతావరణాన్ని వారు మార్చేస్తారు. ఇది తెలియకుండానే వారు చేస్తున్న కొంత భూతశుద్ధి ప్రక్రియే. దీన్నే మీరు ఎరుకతో చేయగలిగితే, అది ఇంకా ఎక్కువ ఫలవంతంగా ఉంటుంది. శక్తికి సంబంధించిన కొన్ని అంశాలలో మార్పు చేయడం ద్వారా కూడా చుట్టూ ఉన్న వాతావరణంలో మార్పులు తేవచ్చు. కానీ అలా చేయడం వల్ల ఇతరులపై కలిగే ప్రభావం, ఒక నిర్దిష్టమైన శక్తి ఇంకా ఉద్దేశం అక్కడ ఉండడం వల్ల పంచభూతాలు తమని తాము క్రమబద్ధం చేసుకోవడం అనేది - ఇతరులపై చూపించే ప్రభావమంత గాఢంగా ఉండదు.

భూత శుద్ధి ఒక వ్యాయామంలా జరగకూడదు, సంపూర్ణమైన అంకితభావంతో ఒక ప్రేమ వ్యవహారం లాగా జరగాలి. భక్తి ఇంకా ప్రేమ భావనతో చెయ్యాలి.

భూతశుద్ధిని సాధన చేయడంలోని ఉద్దేశం - మీలో పంచభూతాలు పనిచేసే తీరును పూన:సవరించడం. మీలో అవి ఏ ఉద్దేశంతో పనిచేస్తాయి అన్నదాన్ని మార్చడం. ఈ ఐదు మూలకాలు భూమిలోనో, లేదా ఒక చెట్టులోనో పనిచేసే విధంగానే మీలో కూడా పని చేస్తే ఉపయోగం ఉండదు. మానవ వ్యవస్థలో అవి ఒక నిర్ధిష్టమైన పద్ధతిలో పని చేస్తాయి. అది ఆ రకంగా పనిచేసి ఉత్తమమైన సంభావ్యతలుగా మార్పు చెందాలని మనం కోరుకుంటాం.

నిజానికి ప్రతి మనిషిలోనూ పంచభూతాలు ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పనిచేస్తాయి. తూర్పు దేశాల్లో సాంప్రదాయక వైద్య విధానాలు, ఈ వ్యక్తి-సంబంధిత వ్యత్యాసాలను ఎప్పుడో గుర్తించాయి. చికిత్స ఎప్పుడూ కూడా, రోగికి వచ్చిన వ్యాధిని బట్టి కాక, ఆ వ్యక్తి శరీర వ్యవస్థ నిర్మాణాన్ని అనుసరించి ఉండేది. అందరికీ వర్తించే చికిత్స అంటూ ఉండేది కాదు. వైద్యుడు ఆ రోగిని పరిశీలించి, అతనికి ఏది అవసరమో గుర్తిస్తే తప్ప, చికిత్స అది పనిచేయాల్సినంత ఉత్తమంగా పనిచేయదు. ఆ వ్యక్తి శరీరాన్ని బట్టి, అతనిలోని వ్యవస్థ పనితీరును బట్టి, దాని లోపలి అమరికను బట్టి చికిత్సా విధానం ఉండేది, అంతేకానీ రోగ లక్షణాలను బట్టి కాదు. మరో మాటలో చెప్పాలంటే, తూర్పుకి చెందిన వైద్య వ్యవస్థలలో ఎప్పుడూ రోగ లక్షణాలను బట్టి చికిత్స చేసే వారు కాదు, కానీ పాశ్చాత్య అల్లోపతి వైద్యం 100% రోగ లక్షణాలను బట్టి చికిత్స చేస్తుంది. ఒకవేళ ఐదుగురు వ్యక్తులకు ఒకే రకమైన వ్యాధి లక్షణాలు ఉంటే, ఆ ఐదుగురికి ఒకే రకమైన ఔషధం ఇస్తారు. కానీ సిద్ధ ఇంకా ఆయుర్వేద విధానాల్లో, ఐదుగురు వ్యక్తులకి ఒకే రకమైన వ్యాధి లక్షణాలు ఉన్నా, వాళ్లకి వేరు వేరు ఔషధాలు ఇస్తారు, ఎందుకంటే ఔషధం ఇస్తున్నది ఆ ప్రత్యేకమైన శరీర వ్యవస్థకు, వ్యాధికి కాదు.

ఈ ఐదు మూలకాలు కలిసి ఒకచోట చేరి, ఇంతటి క్లిష్టమైన, అద్భుతమైన దాన్ని తయారుచేయడం అనేది ఒక గొప్ప ప్రేమ వ్యవహారం. భూత శుద్ధి ఒక వ్యాయామంలా జరగకూడదు, సంపూర్ణమైన అంకితభావంతో ఒక ప్రేమ వ్యవహారంలా జరగాలి. భక్తి ఇంకా ప్రేమ భావనతో చెయ్యాలి. ఈ ప్రక్రియలో మీ మనసు, భావోద్వేగాలు, శక్తి ఇంకా భౌతిక శరీరం – అన్నీ నిమగ్నం కావాలి. ఇటువంటి నిమగ్నత లేకపోతే, మీకేవో కొన్ని భౌతికమైన లాభాలు కలగవచ్చు, కానీ ఈ ప్రక్రియలో ఉన్న లోతు పాతులను మీరు తెలుసుకోలేరు. ఒకవేళ మిమ్మల్ని మీరు పూర్తిగా సమర్పణ చేసుకుంటే, ఈ సులువైన సాధన మీ జీవ మూలాలనే మార్చగలదు.

భూత శుద్ధి - మార్మిక అంతర్దృష్టి

శరీరం పంచభూతాల కలయిక; అలాగే ప్రపంచం; విశ్వమంతా కూడా. సృష్టిలో ప్రతి పదార్థము పంచభూతాల సమ్మేళనమే. ఇందులో ఉన్న మార్మిక కోణాలను శోధించాలని అనుకుంటే తప్ప, మీరు 'ఆకాశ' తత్వం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన నాలుగు మూలకాలలో, శరీరంలో 72% జలం, 12 శాతం భూమి, ఆరు శాతం వాయువు, నాలుగు శాతం అగ్ని, ఇక మిగిలినది ఆకాశం. బాగా జీవించడానికి 4 మూలకాలు చాలు; ఐదవది (ఆకాశం) కేవలం హాయిగా బతికితే చాలు అనుకునేవారి కోసం కాదు.

శరీరం పంచభూతాల కలయిక; అలాగే ప్రపంచం; విశ్వమంతా కూడా. సృష్టిలో ప్రతి పదార్థము పంచభూతాల సమ్మేళనమే.

మీ శరీరంలో నీరు 72%. అది ఈ భూమితో కలిసి ఉంది; భూమిలో దాదాపు 72% నీరే. ఆ విధంగానే జీవ పరిణామం జరిగింది. ఈ భూగోళపు స్వభావం మీ శరీరంలో ఎన్నో విధాలుగా వ్యక్తమవుతుంది. మీరు భోజనం చేసేటప్పుడు ఎప్పుడూ కూడా, అందులో 70 శాతానికి మించి నీరు ఉన్న పదార్థాలను తీసుకోవాలి. పాశ్చాత్య దేశాల వారు ఈ ఒక్క విషయాన్ని విస్మరించి, ఫలితంగా చాలా పెద్ద మూల్యం చెల్లించుకున్నారు. ఒక కూరగాయలో 70 శాతం నీరు ఉంటుంది. ఒక పండులో 90% నీరు ఉంటుంది. మీ లోపల శుద్ధి జరగాలంటే మీరు పండ్లు తినాలి. మీ శరీరాన్ని అదే విధంగా నిలుపుకోవాలంటే, కాయగూరలు సరిపోతాయి. దాదాపుగా అన్ని తూర్పు దేశాల సాంప్రదాయపు వంటకాల్లో 70 శాతం నీరు ఉంటుంది, ఎందుకంటే వారికి ఇది తెలుసు కాబట్టి. ఊరికే నీరు తాగితే, అది ఆ విధంగా పనిచేయదు. మీరు తినే భోజనంలో 70 శాతానికి మించి నీరు ఉండాలి.

ఈ నాలుగు మూలకాలకీ జ్ఞాపక శక్తి ఉంటుంది. వీటిలో ముఖ్యంగా నీరు, భూమికి చాలా బలమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. ఇవాళ ఆధునిక విజ్ఞాన శాస్త్రం రకరకాల పరిశోధనలు చేసి నీటికి చాలా గొప్ప జ్ఞాపక శక్తి ఉందని రుజువు చేస్తున్నారు. నీటి గురించి చాలా పరిశోధనలు జరిగాయి. దానిలో ఉన్న జ్ఞాపకాలను బట్టి నీరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంది. అందుకనే ప్రజలు ఆలయాలకు, ప్రతిష్టిత ప్రదేశాలకు వెళ్లినప్పుడు, అక్కడ దొరికే కొన్ని చుక్కల తీర్థం కోసం తపించిపోతారు. ఆ తీర్థం దైవ శక్తి స్మృతిని కలిగి ఉంటుంది. మంచి స్మృతులు గల నీళ్ళని లోపలికి తీసుకోవాలని అనుకుంటారు.

కేవలం మీరు మీలో ఉన్న నీటిని తియ్యగా చేసుకున్నంత మాత్రాన, మీరు 72 శాతం చక్కగా ఉంటారు, మరో 12 శాతం భూమిని కూడా మధురంగా చేసుకుంటే, మీలో 84% అద్భుతంగా ఉన్నట్టే. మీరు గాలిని శుద్ధంగా ఉంచుకుంటే, మీలో 90% అద్భుతంగా ఉన్నట్టే. ఒకవేళ మీరు అగ్నిని గనుక శుద్ధి చేసుకోవాలనుకుంటే అది చాలా పెద్ద పని.

అగ్నికి ఐదు పార్శ్వాలు ఉన్నాయి. పునరుత్పత్తి అగ్ని, జీర్ణం చేసే అగ్ని, మానసిక అగ్ని, హృదయాగ్ని ఇంకా అంతర్గత అగ్ని. సామాన్య జనులకు ఈ ఐదింటి మీదా సాధన చేయడం కష్టం. దానికి చాలా క్రమశిక్షణ కావాలి, కానీ మూడింటి మీద పని చేయవచ్చు. పునరుత్పత్తి అగ్ని, జీర్ణ అగ్ని ఇంకా మానసిక అగ్ని - వీటి విషయంలో సులభంగా, చాలా తక్కువ శ్రమతో పట్టు సాధించవచ్చు. మిగిలిన రెండిటికీ తీవ్రంగా సాధన చేయవలసి ఉంటుంది. మీరు కేవలం ఈ మూడింటిని గనుక శుద్ది చేసుకుంటే, ఇక అప్పుడు మీరు మామూలు మనిషిగా ఉండరు. మీరు కేవలం ఒక ఆరోగ్యంతో, ఆనందంగా ఉన్న మనిషి మాత్రమే కాదు; మీరు అంతకుమించి చాలా చాలా ఎక్కువ, ఎందుకంటే ఒకసారి మీలో ఉన్న అగ్ని మూలకం మీద మీరు నైపుణ్యాన్ని సాధించారంటే, ఇక మీరు ఆకాశ మూలకాన్ని తాకబోతున్నారనమాట. ఇక మీరు కేవలం ఒక్క అడుగు దూరంలో ఉన్నారు. హఠాత్తుగా మీరు ఒక సామాన్య వ్యక్తి స్థాయి నుంచి ఎదిగి పోతారు, ప్రపంచంలో చాలామందికి తెలియనిదేదో మీలో ప్రజ్వలిస్తూ ఉంటుంది. అందరికీ అది తెలియాలన్నదే మా లక్ష్యం. మీరు మీ మర్మ స్థానంలోని అగ్నినీ, పొట్టలోని అగ్నినీ, ఇంకా మీ మనసులోని అగ్నినీ మీ అదుపులోకి తీసుకోగలిగితే, ఈ జీవితంలో మీరు ఎన్నో అద్భుతమైన పనులు చేయవచ్చు. నిర్బంధతలకు బానిసగా ఉండకుండా, మీ ఇష్టప్రకారం అనుక్షణం ఎరుకతో జీవించవచ్చు. ఇది మీకు మీరు ఏవో కొన్నింటిని నిరాకరించుకోవడం గురించి కాదు. ఇది ప్రతీదాన్నీ నిర్భంధత వల్ల చేయడం కాకుండా, ప్రతీదాన్నీ ఎంపిక చేసుకుని చేయడం గురించి.

Editor's Note:  

ఈశా భూత శుద్ధి సాధన

ఈశా హఠ యోగ టీచర్ దగ్గర్నుంచి ఈ సాధన నేర్చుకోండి. మీ దగ్గరలో ఉన్న హఠ యోగా టీచర్ ని కనుక్కోవడానికి ఇక్కడ నొక్కండి.

భూత శుద్ధి కిట్

భూత శుద్ధి సాధన నేర్చుకొని ఉండాలి. చేతితో తయారుచేసిన అందమైన రాగి డబ్బా ఇంకా సేంద్రియ చేనేత సంచిలో ఇది లభ్యమవుతుంది. ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి.

భూత శుద్ధి రీఫిల్స్ - భూమి ఇంకా కర్పూరం 

కర్పూరం, దీన్ని ఆయుర్వేదంలో చంద్ర భస్మ అని కూడా అంటారు. భూత శుద్ధి ప్రక్రియలో దీన్ని అగ్ని మూలకానికి వాడతారు. సాంప్రదాయ వైద్య విధానాల ప్రకారం కర్పూరం, తన సహజ క్రిమిసంహారక లక్షణం వల్ల గాలిని శుద్ధి చేస్తుంది, అలాగే ఊపిరితిత్తుల్లో నిమ్ముని సరిచేస్తుంది. ఈ కర్పూరం సహజమైన మూల పదార్థాలతో తయారు చేయబడినది, మూడు నెలలపాటు సాధనకు సరిపోతుంది. వెలిగించినప్పుడు, ఈ బిళ్ళలు ఎటువంటి అవశేషాలూ మిగలకుండా పూర్తిగా మండుతాయి.ఆన్లైన్లో కొనుగోలు చేయడానికి ఇక్కడ నొక్కండి