సద్గురు: ఒక వ్యవస్థాపకుడికి ధనం ఎంతో ముఖ్యం అన్న విషయం నాకు తెలుసు. కానీ కేవలం మీరు కోరుకున్నంత మాత్రాన డబ్బు దొరకదు. మీరు దేనినైనా సరిగ్గా చెయ్యగలిగినప్పుడే అది వస్తుంది. మీరు కేవలం ధనం గురించి మాత్రమే ఆలోచిస్తున్నట్లయితే - నా అవగాహన ప్రకారం - మీరు కేవలం ఫలితాల మీదే ఆసక్తి చూపిస్తున్నారు కానీ, చేయవలసిన ప్రక్రియ మీద కాదు. కానీ ఎవరైతే కేవలం ఫలితాల మీదే ఆసక్తి చూపిస్తున్నారో, ఎవరైతే చెయ్యవలసిన ప్రక్రియల మీద ఆసక్తి చూపించడం లేదో, వారు కేవలం ఫలితాల గురించి కలలను మాత్రమే కంటారు. వాటిని సాకారం చేసుకోలేరు. మీరు ఎల్లప్పుడూ ఎంత డబ్బు సంపాదించాలి అని ఆలోచించడం కంటే, మీకు ఏమి సృజించాలని ఉన్నదో, దాని వైపు మీరు దృష్టి పెట్టాలి. మీరు సృజించినది నిజంగా ఎంతో విలువైనది అయితే, అప్పుడు ధనం దానంతట అదే వస్తుంది.

మీ జీవితం ముగిసిపోతున్నప్పుడు, మీరు ఏవైతే పోగుజేసుకున్నారో అవన్నీ మీతో పాటు తీసుకువెళ్ళలేరు. మీరు ఏదైతే సృజించారో, అది మాత్రమే లెక్కలోకి వస్తుంది. మీరు కనుక ఈరోజుల్లో బాగా విజయం సాధించిన వ్యవస్థాపకుల్ని చూసినట్లయితే, ఉదాహరణకు నారాణమూర్తి గారు.. ఇటువంటివారు, ధనం గురించి పెద్దగా పట్టించుకోలేదు. వారు ఏదో సృజించాలి, ఏదో సృష్టించాలి - అన్నదాని మీదే తపనపడ్డారు. వారు సృజించినది విలువైనది కాబట్టి, సహజంగానే ధనం వస్తుంది. అన్నిటికీ మించి,  మీరు కనుక ప్రతివారి జీవితంలోనూ ఎంతో విలువ కలిగి ఉన్న దానిని సృజిస్తున్నట్లయితే, మీకు దానిని సృజించడంలోనే ఒక ఆనందం ఉంటుంది. ఒక వ్యాపారవేత్త, ఒక వ్యవస్థాపకుడు, ఆయన ఆలోచించినది ఏదో జరగాలి - అని ఆకాంక్షిస్తారు. మీరు ఏదైనా సృజించాలనుకుంటే, ధనం అందులో భాగమే. ఈనాటి ప్రపంచంలో, ధనం లేకుండా ఎటువంటి పనీ చెయ్యలేం.

ప్రతివారూ ఎంతో నిమగ్నతతో పని చేస్తే తప్ప ఏదైనా గొప్ప విషయం జరగడమన్నది సాధ్యం కాదు.
ఏదైనా మనం సాకారం చేసుకునేందుకు ధనం ఒక పదార్థంగా మారింది. ఎంతోమంది పదార్థాలను నియంత్రిస్తున్నట్లు, మీరు ధనాన్ని నియంత్రిస్తున్నారు. మీరు ఎంత ధనాన్ని సంపాదించగలరన్నది కాలమాన పరిస్థితిని బట్టి ఉంటుంది. ఇన్ఫోసిస్ వంటి గొప్ప విజయగాధలు మన చరిత్రలో కొంత కాలానికే పరిమితమైనవి. ఒక ప్రత్యేకమైన సమయంలో, ఒక ప్రత్యేకమైన టెక్నాలజీలు - ఇవన్నీ జరగడానికి సానుకూల పడ్డాయి. మీరు, వాటికై చూడకూడదు. మీరు ఏమి సృజించాలనుకుంటున్నారో, దానిని తెలుసుకోండి. ఏదైతే ప్రజల జీవితాలకి విలువను అందిస్తుందో, దాని గురించి తెలుసుకోండి. మీరు ప్రజల జీవితాలకి విలువైనదానిని అందించగలిగితే, మీరు ధనాన్ని గురించి ఆలోచించనవసరం లేదు. అది ఎలా అయినా వస్తుంది.

కొంతకాలం క్రితం, నారాయణమూర్తిగారు మాతో ఒక కాన్ఫరెన్సులో, కొన్ని విషయాలను పంచుకొన్నారు.  ఆయన, ఒక చిన్న సంస్థను మొదలు పెట్టారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతిని పొందారు. ఆయన భాగస్వాములను ఎంచుకునేటప్పుడు (ఇది ఎంతో ముఖ్యమైన పని ఏ వ్యాపారంలోనైనాగానీ..) మిగతా ఆరుగురు భాగస్వాములు అనుభవంలో ఆయనకంటే ఎంతో చిన్నవారు. కానీ ఆయన వారిని భాగస్వాములుగా తీసుకున్నప్పుడు, అందరికీ అందులో సమాన భాగాన్ని ఇచ్చారు. ప్రజలు ఈయనని పిచ్చివారనుకున్నారు. అందులో ఎంతోమంది భాగాస్వాములకి కేవలం ఒక్క సంవత్సరం అనుభవం మాత్రమే ఉంది. వారికి, ఆయన సంస్థలో ఆయనతో సమానమైన హోదాను, ఇచ్చారు. ఇలా ఎందుకు చేశారని ఆయనను అడిగినప్పుడు, “నేను దీనిని ధనం కోసం చెయ్యడం లేదు, అందుకని ఇది ఒక పెద్ద విషయం కాదు.

వారు నూటికి నూరు శాతం ఇందులో నిమగ్నమవ్వడం నాకు ముఖ్యం. వారు,  “దీనిని ఎలా అయినా సరే  విజయపథంలోనికి తీసుకుని వెళ్ళాలి” అని తప్ప మరేవిషయాన్ని ఆలోచించకూడదు”  -  అన్నారు. ఇలా ఆయన ఆలోచించడం, ఆయనకీ ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టింది. ఎందుకంటే  ఒక ఐదు కోట్లకు అధిపతి అవ్వడం కంటే కూడా యాభైవేలకోట్లలో ఒక పదిహేను శాతం భాగస్వామ్యం రావడం గొప్ప విషయమే కదా..! అన్నిటినీ మించి మనతో పనిచేస్తున్నవారు, వారి జీవితాలను ఆ పనిలో నిమగ్నం చెయ్యడం అన్నది ఎంతో ముఖ్యం. ప్రతివారూ ఎంతో నిమగ్నతతో పని చేస్తే తప్ప ఏదైనా గొప్ప విషయం జరగడమన్నది సాధ్యం కాదు. మీరు ఎంతో జాగ్రత్తగా, నేను రోజుకు ఎనిమిది గంటలు పని చేస్తాను, అని అంటే..ఇలాంటి ఒక సంస్థ ఏర్పడదు. ఒక  సంస్థాపకుడు, దానితో జీవించగలగాలి. ఇది, కేవలం మనుగడ కోసం కాదు. మీరు ఏ పనినైతే చేస్తున్నారో దానినే మీ జీవితంగా మలచుకోవడం. ఒక సంస్థాపకుడు తనకుగా తాను ఎంతో ఉత్తేజ భరితంగా ఉంటాడు. బయట విషయాలేవీ అతనిని ప్రోత్సహించాల్సిన పని లేదు. అతను లేక ఆమె నూటికి నూరు శాతం వారి పరిధులలో ఎంతవరకూ పని చెయ్యగలరో అంతవరకూ పని చేస్తారు. ఇదిలా జరగాలంటే, మీకంటే ఎంతో పెద్దదానిని మీరు సృజించగలగాలి.  ఇందులో ధనం అన్నది కేవలం ఒక ఫలితం మాత్రమే!

ప్రేమాశీస్సులతో,
సద్గురు