జాతీయ గీతానికి మనం లేచి నుంచోవాలా?
సద్గురు, గౌతం గంభీర్ తో జాతీయ చిహ్నాల పట్ల గౌరవం చూపించడం గురించి చర్చిస్తున్నారు. మనం అసలు జాతీయ గీతం పాడుతున్నప్పుడు లేచి నుంచోవాలా లేదా అని.
గంభీర్: జాతీయ గీతం పాడుతున్నప్పుడు లేచి నుంచోవటం గురించి చర్చ జరుగుతోంది, దాని గురించి నాకు సత్యం తెలుసుకోవాలని ఉంది. నా ఉద్దేశంలో, ఈ దేశం మనకు ఎంతో ఇచ్చింది, అటువంటప్పుడు అది సినిమా హాల్ లో నైనా, స్కూల్ లో నైనా, ఎక్కడైనా సరే, మనం 52 సెకన్లపాటు లేచి నుంచోవడం గురించి అసలు చర్చ ఉండకూడదు. దీనిపై మీ అభిప్రాయం తెలుసుకోవాలి అని ఉంది.
సద్గురు: నమస్కారం గౌతమ్, దురదృష్టవశాత్తు ఈరోజు ఈ విషయం గురించి చర్చించవలసివస్తోంది.మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, దేశమంటే అదేదో దేవుడిచ్చినది కాదు. అది మనమందరం అంగీకరించిన ఒక భావం, ఆలోచన. దేశం రాజ్యాంగ చట్టంలో ఆవిష్కరింపబడింది. ఒక జెండా, జాతీయ గీతం దేశానికి చిహ్నాలుగా ఉంటాయి. మరి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే మనం ఒక దేశంగా చెల్లుబడి కావాలంటే, ఒక దేశంగా జీవించి అభివృద్ధి చెందాలంటే, మనకు మన దేశం పట్ల భక్తిశ్రద్ధలు ఉండటం ముఖ్యం కాదా?
నేనేదో జాతీయ భావన గురించి మాట్లాడేవాడిని కాదు. నేను మానవతా వాదిని. నేను మానవులంతా ఒకటి అనే వాడిని. కానీ ప్రస్తుతం, మనం ఒక దేశం అని సంబోధించగలిగేది, జనాభాలోని ఒక పెద్ద భాగాన్ని. భారతదేశం అంటే 130 కోట్ల జనాభా, దానికదే ఒక ప్రపంచం. మనం ఈ జాతీయ భావనని శక్తిమంతం చేయకపోతే మనం అభివృద్ధి చెందలేము. ప్రపంచ అభివృద్ధికి మనం మన వంతు ఇవ్వలేము. అంతేకాదు మనకు ఏ రకమైన గుర్తింపు ఉండదు.
జాతీయ గీతం అందులో ఒక అంశం. మరి దానికి నుంచోవాలా, అఖ్కరలేదా? మీకు కాళ్లు లేకపోతే క్షమిస్తాము. మీకు అసలు కాళ్లు లేకపోయినా సరే, జాతీయగీతం పట్ల గౌరవం ఉండాలి. జాతీయ జెండా పట్ల కూడా అలానే ఉండాలి. ఎందుకంటే దీని ద్వారానే ఒక దేశం సంఘటితం అయ్యింది. మీరు మీ జాతీయ గీతాన్ని గర్వంగా పాడుకోలేకపోతే ఇక దేశం ఎక్కడ నుంచి వస్తుంది?
మరి దానికై ‘నేను ఒక సినిమా హాల్లో ఎందుకు లేచి నిలబడాలి? నేను అక్కడికి ఏదో వినోదం కోసం వచ్చాను’ అనే వారిని నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు రిపబ్లిక్ డే పెరేడ్ లో ఎప్పుడు పాల్గొన్నారు? మీరు స్వాతంత్ర దినం నాడు జెండా ఆవిష్కరణలో పాల్గొని ఎన్నాళ్ళయింది? మీరు జాతీయ గీతాన్ని పాడి ఎన్నాళ్ళయింది? బహుశా మీ స్కూల్లోనే అయ్యుంటుంది, అప్పటి నుంచి మీరు దేశాన్నుంచి ఎంత లబ్ధి పొందారు? కానీ దాని అభివృద్ధికి, రక్షణకు మీరు ఏమి చేశారు?
దేశ సైన్యం ఇంకా అనేక ఇతర బలగాలు, లక్షల మంది మన దేశ సరిహద్దుల్లో నిలబడి తమ జీవితాలను పణంగా పెట్టి కాపలా కాస్తున్నారు. మనం ప్రతిరోజూ వారి త్యాగాల గురించి, మరణాల గురించి వింటూనే ఉన్నాము. మీరు వారి దగ్గరికి వెళ్లి, దేశమంటే నాకు ఏమంతా మక్కువ లేదు, మీరు కూడా మీ ఇంటికి వెళ్లి మీ జీవితాలను హాయిగా గడపండి అనగలరా? మరి మీకు మీ దేశం మీద కాస్తంత భక్తి కూడా లేనప్పుడు, వారు అనవసరంగా తమ జీవితాలని పణంగా పెట్టి దేశాన్ని రక్షించవలసిన అవసరం ఏముంది?
దేశ ప్రజలకు, యువతకు దేశం పట్ల వాళ్ళ మనసుల్లో గట్టి భక్తి భావనను పెంపొందించాలి. దురదృష్టవశాత్తు, స్వతంత్రం వచ్చాక మనం దానిని పెంపొందించటంలో విఫలమయ్యాము. మనకు స్వతంత్రం రాగానే ఈ పని చేసి ఉండవలసింది. ఎందుకంటే దేశమంటే అది మన హృదయాలలోనూ మన మనస్సులోనే ఉంటుంది. స్వతంత్రం వచ్చాక దేశం పట్ల ఎంతో భక్తి భావం ఉట్టి పడింది, మనం అప్పుడే ఈ పని చేసి ఉండాల్సింది, దురదృష్టవశాత్తు ఆ కృషి సరిగా జరగలేదు. చాలామంది తమ మతంతోనూ, కులం తోను, తమ క్లబ్బుతోనూ, గుర్తించుకున్నారు. అంతేకాక తమ వ్యక్తిత్వంతో కూడా గుర్తుంచుకున్నారు.
అలాకాక మనం దేశం కోసం నిలబడాలి, నూటికి నూరుశాతం. జాతీయ గీతానికి లేచి నిలబడటం అంటే అలా దేశభక్తి చూపించినట్టు అవుతుందా? అంటే అవుతుంది, మీరు ఖచ్చితంగా 52 సెకండ్లు లేచి నిలబడాలి. దాని గురించి చర్చ అవసరమా? నా ఉద్దేశంలో సమస్యేమిటంటే వాళ్ళ చేతుల్లో కూల్డ్రింకులు, పాప్ కార్న్ పొట్లాలు ఉన్నాయి, అవి ఒలికి పోతాయని వాళ్ళ బాధనేమో?
మనం ఈ చర్చను ఆపేద్దాం. మీకు సరిగా కడుపు నిండని 40 కోట్ల మంది భారతీయుల మీద ఏమైనా శ్రద్ధ ఉంటే, జాతీయ భావంతో దేశాన్ని సంగీత సంఘటితంగా ఉంచడం ఎంతో ముఖ్యం. అది లేకుండా దేశం ఉండదు. ఎందుకంటే మనం ఒక దేశంగా ఇలా బతుకుదామని అంగీకారానికి వచ్చాము మీరు ఈ దేశానికి చెందిన వారైతే మనకు కొన్ని విషయాల పట్ల భక్తి శ్రద్ధలు ఉండాలి.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.