కలలు, దృశ్యాలు ఇంకా దూర దృష్టి
సద్గురు ఇంకా ముజఫ్ఫర్ అలీ మధ్య జరిగిన సంభాషణలో దూర దృష్టి, కళలు, మార్మికత అనే విషయాల గురించి తెలియజేసారు. కల అనేది మనసు యొక్క మరో పార్శ్వం అని, మనసుని దాటి వెళ్ళగలిగితేనే మార్మికతని తెలుసుకోగలమని సద్గురు చెబుతున్నారు.
సద్గురు: ఎవరికైనా దూర దృష్టి(vision) ఉందని మీరంటే, వారికి ‘ఒక పెద్ద లక్ష్యం’ లేదా “ఒక పెద్ద కల” అని అనుకుంటారు. దూర దృషి(vision) అంటే కల కాదు. దూర దృషి అంటే, మీరు చూడగలిగే ఒక గమ్యం. ఇతరులు చూడలేనిది మీరు చూస్తున్నప్పుడు మనం అతన్ని” ఓహ్ ఇతనొక గొప్ప దార్శనికుడు “ అంటాం. అతనికి మీకన్నా పెద్ద కల ఉన్నంత మాత్రాన అతనొక దార్శనికుడు అవ్వడు – అతనొక పెద్ద సమస్య అవుతాడు.
ముజఫ్ఫర్ అలీ: అతను ఒక మాయగాడు అవుతాడు.
సద్గురు: నాకొక పెద్ద కల ఉందనుకోండి. ఆ కల ఇతరుల కలలకు ఏమాత్రం అనుగుణంగా లేదనుకోండి, నేను వాళ్ళందరినీ నా కల వైపు నడిపించాల్సి వస్తుంది. అలాంటి కలకు ప్రయోజనం ఏముంది?
ముజఫ్ఫర్ అలీ: మీ కల ఏంటి సద్గురు?
సద్గురు: నేను కలగనను...జీవిస్తాను. సంపూర్ణంగా జీవిస్తాను.
ముజఫ్ఫర్ అలీ: కానీ కలలు కనటం మంచిదే కదా!. అందరూ కలలు కనండి, జీవించండి, నేర్చుకోండి, ఎదగండి అంటున్నారు, కానీ ఆ కలలే మనల్ని నిర్మలంగా ఉంచుతాయి కదా!.కాదంటారా?
సద్గురు: చాలా మందికి అతి చెత్త కలలు వస్తాయి. అందరికీ స్వచ్ఛమైన కలలు వస్తాయనుకుంటున్నారా? నన్నడిగితే నాకు గత ఇరవై ఐదు సంవత్సరాలలో, ఒక్క కల కూడా రాలేదు. నేను పడుకుంటే, చనిపోయినట్టే పడుకుంటా, లేస్తే పూర్తిగా మెలకువతో ఉంటా. నేను రాత్రి కలలు కంటూ సమయం వృధా చేసుకోను, గత పాతిక సంవత్సరాలుగా నేను రాత్రి రెండు నించీ రెండున్నర గంటలు మాత్రమే నిద్రపోతున్నాను. ఈ మధ్యే, కాస్త బద్ధకం ఎక్కువై నాలుగు నించీ నాలుగున్నర గంటలు నిద్రపోతున్నాను.
మనసుకి ఆవల
కల అనేది ఎరుక లేకుండా చేసే ఒక ఊహ. కొంతమంది వ్యక్తులు వారి మనసులోని సాధారణంగా స్పృశించలేని పార్శ్వాలలో వెళ్లేందుకు కలలను ఉపయోగిస్తారు. అందుకే వారికి కలలు ఒక ఉపయోగకరమైన సాధనంగా ఉంటాయి. ముఖ్యంగా, ఆస్ట్రేలియాలో ఉన్న అబోర్గిన్ సంస్కృతి, ఉత్తర అమెరికాలో ఉన్న కొన్ని తెగలు, కలలను చాలా ఎక్కువగా వాడుకున్నారు. కానీ వారు ఎంత చేసినా దక్కించుకున్నది తంత్ర విద్యలు మాత్రమే. నిజమైన మార్మికత తెలియలేదు వారికి. భారతదేశంలో, ఊహను ఆధారంగా చేసుకుని తంత్ర విద్యలు ఉపాసించి ఎన్నిటినో తయారు చేశారు. చాలామంది తంత్రాన్ని ఉపయోగించి ఎందరికో హాని కలుగజేస్తున్నారు కానీ ఆ విద్య ఎందరికో మంచి చెయ్యగల సామర్ధ్యం ఉన్నది. కల మీ మనసులోని ఇంకొక పార్శ్వం మాత్రమే. దాన్ని దాటినపుడే, నేడు మార్మికతగా పిలువబడే పార్శ్వం పట్టుబడుతుంది. “మార్మికత” అంటే మీ శరీరంచే గానీ మనసుచే గానీ తాకలేనిది అని అర్ధం. మీ మనసుకి ఆ సామర్ధ్యం లేదు. శరీరానికి కూడా లేదు. ఆ పార్శ్వాన్ని మీరు తాకాలంటే, మీలోని ఇంకొక పార్శ్వం నిద్రలేవాలి. మనం దాన్నిఅలా నిర్వచించుకుందాం. లేకపోతే ప్రతి కలనీ ప్రతి కల్పననీ మనం మార్మికత అనుకునే ప్రమాదం ఉంది.
లోపలున్న అబద్ధపు ప్రపంచం
కల ఒక సాధనం లాంటిది, కానీ అది జారుడుబల్ల లాంటిది. దీనికంటే మెరుగైన సాధనాలున్నాయి కానీ వాటిని ఉపయోగించుకోవటానికి మనిషికి అంతర్గతంగా చాలా నిర్వహణ కావాలి. ఉదాహరణకి, నా తీరు ఇది. నేను కళ్ళు మూసుకుంటే, ప్రపంచమంతా మాయమైపోతుంది నాకు. “అదెలా సాధ్యం?” అని అందరూ నన్ను అడుగుతారు. నిజానికి మీ కనురెప్పల పనే అది కదా!! అందుకే కదా అవి మీకు ఇవ్వబడ్డాయి!! మీరు వాటిని మూయగానే అంతా మాయం అయిపోవాలి. మీ ఇంట్లో ఒక కిటికీ ఉంది. మీరు దాన్ని మూస్తే ఎంత గొప్ప సూర్యుడైనా మరుగై పోవాలి. ఒక కిటికీ ఆ పని చెయ్యగలిగినప్పుడు, మీ రెప్పలెందుకు చెయ్యలేవు?. ఎందుకు చెయ్యటం లేదంటే మీలోపల మీరే ఒక అబద్ధపు ప్రపంచాన్ని సృష్టించుకున్నారు. మీరు కళ్ళు మూసినప్పుడు బైటి ప్రపంచం అంతా వెళ్ళిపోతుంది. కానీ మీ లోపల ఉన్న మీ సొంత ప్రపంచం నడుస్తూ ఉంటుంది. మీకు ఆ లోపలి ప్రపంచం లేకపోతే, మీరు కేవలం ఈ బాహ్య ప్రపంచంలోనే బ్రతికితే, మీరు కళ్ళు మూసుకోగానే “ఉఫ్ఫ్.....” అని బైటి ప్రపంచం వెళ్ళిపోతుంది. నేను ఒక ఐదారు రోజులు ఒక చోట కూర్చుంటే, నాకొక్క ఆలోచన కూడా రాదు. కల సంగతైతే పూర్తిగా మర్చిపోండి. ఒక్క ఆలోచన కూడా రాదు. ఎందుకంటే నా బుర్ర మొత్తం ఖాళీ. అందుకే అది తేలికగా ఉంటుంది. చాలా చాలా తేలికగా..!