మహాభారతం 17 వ భాగం: పుట్టుకనుంచీ వక్రీకరించిన విధి
మహాభారతంలోని ఈ విభాగంలో, అసాధారణమైన జననం నుంచీ, కీర్తి కోసం కర్ణుడు చేసే పోరాటం, ఆ ఆరాటంవల్ల అతను ఎంతో సామర్థ్యం పొందినా, ఆయన మీద పగ బట్టిన రెండు శాపాల గురించి చూద్దాం.
సద్గురు: కుంతి చిన్నప్పుడు దూర్వాస మహామునిని తన సేవతో మెప్పించింది. ఆమె సేవను మెచ్చుకుంటూ, ఆయన ఆమెకు ఒక మంత్రాన్ని ఇచ్చాడు. ఆ మంత్రం ద్వారా ఆమె కావాల్సిన దేవుడిని ఆహ్వానించవచ్చు. ఒకరోజు ఆ మంత్ర మహిమను ఆమె పరీక్షించి చూడాలనుకుంది. ఆమె బయటికి వెళ్లి, అద్భుతంగా సూర్యోదయం అవడం చూసింది. ఆమె వెంటనే ‘‘నాకు సూర్య దేవుడు కావాలి’’ అన్నది. సూర్య దేవుడు వచ్చి, ఆమెను గర్భవతిని చేశాడు, ఆమెకు ఒక పిల్లవాడు పుట్టాడు.
14 ఏళ్లప్పుడు పెళ్లి కాకుండానే తల్లి అయిన ఆమెకు, సాంఘిక పరిస్థితిని ఎలా ఎదుర్కొనాలో అర్థం కాలేదు. ఆ పిల్లవాడి గతి ఏమవుతుందో ఆలోచించకుండా, ఆమె ఆ పిల్లవాడిని ఒక పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది. దానివల్ల ఆమె చాలా బాధపడింది. కానీ ఆమె ధైర్యం ఉన్న, ఆత్మస్థైర్యం ఉన్న మనిషి. ఒకసారి ఏమి చేయాలో నిర్ణయించుకుంటే, ఆమె ఏమైనా చేసేస్తుంది.
అతిరధుడు, ధృతరాష్ట్రుని రథసారథి. అతిరధుడు ఆ నది ఒడ్డుకి రావడం జరిగింది. అతను ఈ అందమైన చెక్కపెట్టెను చూశాడు. దాన్ని తీసుకుని తెరచి చూశాడు. అందులో ఒక చిన్న పసివాడిని చూసి, ఎంతో సంతోషించాడు. పిల్లలు లేని తనకు, ఇది దేవుని బహుమానంగా తలచాడు. ఆయన ఆ పెట్టెతోపాటు పసివాడిని భార్య రాధ దగ్గరకు తీసుకువచ్చాడు. ఇద్దరూ ఎంతో సంతోషించారు. ఆ పెట్టె అందం చూసి, వారు ఇది మామూలు ఇంటి నుంచి వచ్చింది కాదు, ఏ రాజో, రాణీనో ‘ఈ పిల్లవాడిని వదిలేసి ఉంటారు’ అని తలచారు. కానీ అది ఎవరో వారికీ తెలియదు. ఈ పిల్లవాడు దొరికినందుకు వారు ఎంతో ఆనందించారు. పిల్లలు లేని వారి జీవితంలో ఆ పిల్లవాడు నిండుదనాన్ని తీసుకొచ్చాడు.
ఆ పిల్లవాడు కర్ణుడు అనే పేరుతో పెరిగాడు. విధి పుత్రుడు, అది కూడా ఎంతో బలీయమైన విధి. పసితనంలోనే అతనికి బంగారపు చెవి కుండలాలు, అతని ఛాతీ మీద ఒక రకమైన కవచము ఉన్నాయి. అతను చాలా అద్భుతంగా ఉన్నాడు. రాధ ఆ పిల్లవాడిని ఎంతో ప్రేమతో పెంచింది. అతిరధుడు రథాన్ని తోలేవాడు కాబట్టి, పిల్లవాడికి కూడా అదే నేర్పాలనుకున్నాడు. కాని కర్ణుడు విలువిద్య నేర్చుకోవాలన్న తపనతో ఉన్నాడు. ఆ కాలంలో అటువంటి యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి, ఆయుధాలు వాడటానికి, క్షత్రియులే అర్హులు. ఇది రాజుల అధికారం కొనసాగించడానికి చాలా సులువైన విధానం. ఆయుధాలు ఎలా వాడాలో అందరూ నేర్చుకుంటే, వాటిమీద నియంత్రణ చేయడం చాలాకష్టం. అందువల్ల కర్ణుడు క్షత్రియుడు కాదు కాబట్టి, ఏ గురువూ అతనిని అంగీకరించలేదు.
ద్రోణుడు అతనిని అంగీకరించలేదు
ఆ కాలంలో పరశురాముడు అందరికంటే ఎక్కువ యుద్ధ నైపుణ్యం ఉన్నవాడు. అతను ద్రోణుడికి గురువు కూడా, తన అస్త్రాలను ద్రోణుడికి ఇచ్చివేసే ముందు, పరశురాముడు ఒక షరతు పెట్టాడు. అదేమిటంటే, ఈ శక్తివంతమైన అస్త్రాలను, ద్రోణుడు క్షత్రియులకు నేర్పకూడదు. ద్రోణుడు ఈ హామీ ఇచ్చి సరాసరి హస్తినాపురానికి వెళ్లి, క్షత్రియులకు ఈ అస్త్రవిద్య నేర్పటానికి, రాజు గారి దగ్గర ఉద్యోగం సంపాదించడానికి వెళ్ళాడు. ద్రోణుడు ఇటువంటి అత్యాశగల మనిషి. నీతి నియమాలు తెలిసినా, అవి లేని మనిషి. అతనికి ధర్మాలు శాస్త్రాలు, నీతి నియమాలు, గ్రంథాలు, అన్నీ తెలుసు కానీ అవసరమైతే వేటినీ పట్టించుకోడు. గొప్ప గురువే, కానీ అత్యాశ ఉన్న మనిషి.
ధ్రోణుడు హస్తినాపురానికి రాకముందు, పాండవులు, కౌరవులు యుద్ధ విద్యలు కృపాచార్యుని వద్ద నేర్చుకుంటున్నారు. ఒకరోజు వారు బంతి ఆట ఆడుకుంటున్నారు. ఆ కాలంలో బంతులు రబ్బర్ తోనో, చర్మంతోను, ప్లాస్టిక్ తోనో, చేసినవి కాదు. సామాన్యంగా కొన్ని కలుపు మొక్కల విత్తనాలతో, గట్టిగా గుండ్రంగా తయారుచేసినవి. ఆడుకుంటున్నప్పుడు, అనుకోకుండా ఆ బంతి, బావిలో పడింది. వారు ఆ బంతి బావిలో తేలడం చూసారు, కానీ బయటికి తీయడం ఎలాగో ఎవరికీ చేతకాలేదు. ఎందుకంటే, బావి లోతుగానూ, మెట్లు లేకుండానూ ఉంది.
ద్రోణుడు అటునుంచి వెళుతూ, ఆ పరిస్థితిని చూశాడు. మీరు క్షత్రియులు కాదా అన్నాడు? వారు మేము క్షత్రియులమే అన్నారు. మరి మీకు ధనుర్విద్య రాదా? అని అడిగాడు. అప్పుడు అర్జునుడు, ‘నాకు ధనుర్విద్య వచ్చు, నాకు ఈ ప్రపంచంలో అందరి కంటే గొప్ప విలుకాడు కావాలని ఉంది’ అన్నాడు. అప్పుడు ద్రోణుడు అతనితో ‘నీకు విలువిద్య వస్తే, మరి ఆ బంతిని బయటకు ఎందుకు తియ్యవు అని అడిగాడు’ అప్పుడు వారు ‘విలు విద్యతో బంతిని పైకి ఎలా తీస్తారు?’ అని ఆశ్చర్యంగా అడిగారు. అప్పుడు అతను నేను చూపిస్తాను అంటూ, ఆయన ఒక రెల్లు గడ్డిపోచ తీసుకొని, ఆ గురిచూసి బంతిమీదకు వదిలాడు. అది బంతికి గుచ్చుకుంది. ఆ విధంగా అతను ఒక దాని వెనకాల మరొక గడ్డిపోచ వదిలాడు. ఆ విధంగా అవి ఒక ‘కడ్డీ’ లాగా తయారయ్యాయి. ఆయన ఆ బంతిని అలా సునాయాసంగా బయటకు తీశాడు. ఆయన నైపుణ్యానికి వారు ఆశ్చర్యచకితులయ్యారు. అది వారికి ఒక మ్యాజిక్ లాగా అనిపించింది. అప్పుడు వారు తమకు కూడా ఆ విద్య నేర్పమని అడిగారు. మీరు నన్ను గురువుగా అంగీకరిస్తే కానీ, నేను నేర్పను అన్నాడు ద్రోణుడు. అప్పుడు ఆ పిల్లలు అతనిని భీష్ముడి దగ్గరకు తీసుకు వెళ్లారు. భీష్ముడు వెంటనే ద్రోణుడుని గుర్తించాడు. అతనిని గుర్తించి, అతని సామర్థ్యాన్ని మెచ్చుకున్నాడు. ఆయన అతనికి రాజగురువుగా ఉద్యోగం ఇచ్చాడు, అంటే కాబోయే రాజులకు ఆయన విద్య నేర్పుతాడు.
ద్రోణాచార్యుడి కింద శిక్షణ ప్రారంభమైంది, దానితో కౌరవులకు, పాండవులకు మధ్య పోటీ ప్రారంభమయింది. కొన్ని సంవత్సరాల శిక్షణ తర్వాత వారందరూ గొప్ప యుద్ధ వీరులుగా తయారయ్యారు. ఈటె విసరడంలో యుధిష్టరుడు అందరికన్నా గొప్ప. గదతో భీముడు, దుర్యోధనుడు సరి సమానం. వారిద్దరూ అలసిపోకుండా ఎంతసేపైనా ఒకరిని ఒకరు ఓడించడానికి యుద్ధం చేయగలరు. విలువిద్య వచ్చేప్పటికి అర్జునుడు అందరికంటే ముందున్నాడు. ఇక కత్తి సాములో, గుర్రపు స్వారీలు నకుల సహదేవులు ముందున్నారు.
సూత పుత్రుని మోసం
గొప్ప విలుకాడు కావాలన్నా కోరికతో కర్ణుడు ద్రోణుడి దగ్గరికి వెళ్లాడు. కానీ ఆయన కర్ణుడిని నువ్వు సూత పుత్రుడివి అంటూ తిరస్కరించాడు. దాని అర్థం ఏమిటంటే ఒక రథం తోలేవాడు పుత్రుడివి, అంటే నువ్వు తక్కువ కులానికి చెందినవాడవని. ఇలా తిరస్కరించడం, కించపరరచడం, కర్ణునికి చాలా బాధ కలిగించింది. ఇలా అడుగడుగునా తిరస్కారాలు, అవమానాలతో, ఈ ముక్కుసూటి మనిషి ఒక్కసారిగా చాలా మోసగాడు అయిపోయాడు. ఎవరైనా, ఎప్పుడైనా అతనిని సూతుడు, అంటే అతని నీచ గుణం మరింత ఎక్కువ అయ్యేది. అది అతని మామూలు గుణం కాదు. ద్రోణుడు నిరాకరించడం మూలంగా, కర్ణుడు పరశురాముని దగ్గరికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు ఆ కాలంలో అతడే యుద్ధవిద్యల్లో అతి గొప్ప గురువు.
ఆ కాలంలో యుద్ధ విద్యలు అంటే ముష్టి యుద్ధాలే కాదు, అన్ని రకాల అస్త్రాల శిక్షణ కూడా. ముఖ్యంగా విలువిద్యకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. పరశురాముడు కేవలం బ్రాహ్మణ విద్యార్థులను అంగీకరిస్తారని కర్ణుడుకి తెలుసు. నేర్చుకోవాలన్న తాపత్రయంతో అతను ఒక దంద్యం(యజ్ఞోపవీతం) వేసుకొని బ్రాహ్మణుడిగా పరశురాముని దగ్గరికి వెళ్లాడు. పరశురాముడు అతనిని శిష్యునిగా అంగీకరించి తనకు తనకు తెలిసినదంతా నేర్పాడు. కర్ణుడు చాలా త్వరగా నేర్చుకున్నాడు. మరి ఏ ఇతర శిష్యునికి ఇంత సహజమైన నేర్పు, శ్రద్ధ లేవు. పరశురాముడు అతనితో ఎంతో సంతోషించాడు.
పరశురాముడు అప్పటికే చాలా ముదుసలి. ఒకరోజు అరణ్యంలో శిక్షణ ఇస్తున్నప్పుడు పరశురాముడు చాలా అలిసిపోయి పడిపోయాడు. అప్పుడు అతను కర్ణునితో నేను కాసేపు పడుకోవాలి అన్నాడు. కర్ణుడు పరశురాముని తల తన ఒళ్లో పెట్టుకొని కూర్చున్నాడు. పరశురాముడు నిద్ర పోయాడు. ఒక రక్తం తాగే పురుగు కర్ణుడి తొడలోకి దూరి కుట్టడం ప్రారంభించింది. రక్తస్రావంతో, నొప్పితో ఉన్నా, గురువు గారికి నిద్రాభంగం అవుతుందని కదలకుండా కూర్చున్నాడు. మెల్లగా ఆ నెత్తురు పరశురాముని చెవి దగ్గరకు చేరింది. ఆ స్పర్శ ఆయనను నిద్ర లేపింది. ఆయన కళ్ళు తెరిచి కర్ణుడు రక్తంతో ఉండడం చూశాడు. ఇది ఎవరి రక్తం అని అడిగాడు. నాదే అన్నాడు కర్ణుడు.
అప్పుడు పరశురాముడు ఈ రక్తం తాగే పురుగు కర్ణుడి తొడలోకి వెళ్ళటం, కండ తొలిచి వేయటం చూసి, అయినా అతను కదలకుండా అలాగే కూర్చోవటం గమనించాడు. అప్పుడు పరశురాముడు అతనితో, నీవు బ్రాహ్మణుడవు అయి ఉండవు. నువ్వు అంత నొప్పి ఉన్నా కదలకుండా ఉన్నావంటే, నువ్వు క్షత్రియుడవు అయి ఉంటావు అన్నాడు. అప్పుడు కర్ణుడు అవును నేను బ్రాహ్మణున్ని కాదు, నాపై కోపం చూపకండి, అని ప్రార్ధించాడు. అప్పుడు పరశురాముడు కోపంతో ఊగిపోయాడు. నువ్వు ఒక దొంగ దంద్యం వేసుకొని, ఇక్కడకు వచ్చి నన్ను మోసం చేస్తావా, నేను నిన్ను శపిస్తాను అన్నాడు. దయచేసి శపించకండి. నేను బ్రాహ్మణుడను కాదు, క్షత్రియుడినీ కాదు. నేను సూత పుత్రుడిని అందువల్ల అది సగం అబద్దమే, అని ప్రాధేయ పడ్డాడు.
కీర్తి కాంక్ష
పరశురాముడు అతని మాట వినలేదు. ఆ పరిస్థితి చూసిన వెంటనే, అతను క్షత్రియుడు అని అనుకున్నాడు. అప్పుడు అయన ‘‘నువ్వు నన్ను మోసం చేశావు, నేను నేర్పిన విద్య నీకు ఉంటుంది కానీ, నిజంగా అవసరమైనప్పుడు దాని మంత్రం నీవు మర్చిపోతావు, అదే నీకు అంత అవుతుంది’’ అన్నాడు. కర్ణుడు ఆయన కాళ్ళ మీద పడి వేడుకొన్నాడు. నాకు అలా చేయవద్దు, నేను క్షత్రియుడిని కాదు. నాకు మిమ్మల్ని మోసం చేద్దామని ఉద్దేశం లేదు. నేర్చుకోవాలని నేను ఎంతో తపనతో ఉండేవాడిని, కానీ, ఎవరూ నాకు నేర్పడానికి ఇష్టపడలేదు. మీరు ఒక్కరే నేర్పుతున్నారు అన్నాడు.
పరశురాముడు కోపం తగ్గి ఇలా అన్నాడు, నువ్వు చెప్పింది ఇంకా అబద్ధమే. నీ పరిస్థితి ముందే నాతో వివరించి ఉండవలసింది. కానీ నువ్వు నాతో అబద్ధం ఆడావు. నేను నా శాపం వెనక్కు తీసుకోలేను. కానీ విలువిద్యలో, రాజ్యాధికారంలో నీకున్న తపన తెలుసుకున్నాను. నీ తపన ఎప్పుడూ కీర్తి గురించే, అందువల్ల నీకు కీర్తి వస్తుంది అన్నాడు. ప్రజలు ఎప్పుడూ నిన్ను గొప్ప విలువిద్య తెలిసిన వానిగా గుర్తు పెట్టుకుంటారు. కానీ నీకు అధికారం గాని, నువ్వు అతి గొప్ప విలుకాడివిగానీ కాలేవు. కానీ నీ కీర్తి చిరస్థాయిగా ఉంటుంది. నీకు కావాల్సింది అదే కదా అన్నాడు.
తన మీద ఉన్న ఈ శాపంతో కర్ణుడు అటు ఇటు పిచ్చివాడిలా తిరిగాడు. శిక్షణ పొందినందుకు సంతోషించాడు. కానీ దానిని ఎక్కడ చూపించాలి? క్షత్రియులు ఒక్కరే యుద్ధంలో కానీ, విలువిద్యా ప్రదర్శనలో గాని పాల్గొనగలరు. ఆయన కళ్ళు మూసుకునే దేనినైనా కొట్టగలడు. కానీ తన నైపుణ్యాన్ని చూపించ లేకపోతున్నాడు. ఆయన కోరుకుంది కీర్తి. కానీ, అది ఆయనకు దొరకడం లేదు. ఆ బాధతో ఆయన ఆగ్నేయ దిశగా పయనించి సముద్రం ఒడ్డున కూర్చున్నాడు. అది ప్రస్తుతం ఒరిస్సాలోని కోణార్క్ దగ్గర ప్రాంతం. అక్కడ సూర్యుని కరుణ బాగా ప్రసరిస్తుంది.
రెండు శాపాలు
ఆయన ధ్యానంలో కూర్చుని, ఎన్నో సాధనలు చేశాడు. ఎన్నో రోజుల పాటు సాధన చేశాడు. అక్కడ తినడానికి ఏమీ లేదు, అయినా అలాగే కూర్చుని ఆయన తపస్సు చేశాడు. ఆకలి వేసింది ఆయన కొన్ని పీతలు పట్టుకుని తిన్నాడు. వాటివల్ల ఆయన ఆకలి పెరిగింది. కొన్ని వారాల సాధన తర్వాత అన్నిటికన్నా ఆయన ఆకలి ముఖ్యం అయ్యింది. ఆ స్థితిలో ఆయన పొదల్లో ఏదో జంతువు కదలాడటం చూశాడు. ఆయన అది ఒక జింక అనుకుని, తన విల్లు, బాణాలతో దాన్ని కొట్టాడు. దానితో తన ఆకలి తీరుతుంది అనుకున్నాడు. కానీ, ఆ పొద వెనక వెళ్లి చూసినప్పుడు, అది జింక కాదు, ఆవు అని గుర్తించాడు.
ఆవును చంపడం అనేది ఒక ఆర్యుడు చేయగలిగిన అతి ఘోరమైన తప్పు. బాధతో ఆవు ఒకసారి దీనంగా అతని వంక చూసి ప్రాణం వదిలింది. ఆవును చంపానన్న భయంతో అతనికి ఏం చేయాలో తోచలేదు. అప్పుడే ఒక బ్రాహ్మణుడు అటుగా వచ్చాడు. ఆ చనిపోయిన ఆవును చూసి ఆయన ఏడవడం మొదలెట్టాడు. ఆయన ‘‘నువ్వు నా అవును చంపేసావు. నువ్వు ఒక క్షత్రియుని లాగ కనబడుతున్నావు. అందుకే నేను నిన్ను శపిస్తున్నాను. నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడు, మరీ అవసరమైన స్థితిలో ఉన్నప్పుడు, నీ రథం మట్టి లోకి కూరుకుపోతుంది. ఎంత లోతుగా అంటే దానిని నువ్వు మళ్ళీ బయటికి తీయలేవు. అటువంటి దుస్థితిలో నీవు చంపబడతావు. కర్ణుడు ఆయన కాళ్ళ మీద పడి ‘‘క్షమించండి, నాకు చాలా ఆకలి వేసింది. అది నాకు ఆవు అని తెలియదు. కావాలంటే నీకు నేను 100 ఆవులను ఇస్తాను.’’ అన్నాడు. బ్రాహ్మణుడు ‘‘ఈ ఆవు నాకు కేవలం ఒక జంతువు కాదు. అది నాకు అన్నిటికంటే అతి ప్రియమైనది. నువ్వు నాకు ఇటువంటి ఆవుకు, వేరే ఆవులు ఇస్తానన్నావు, నేను నిన్ను ఇంకా శపిస్తాను’’ అంటాడు.
ఈ శాపంతో కర్ణుడు ఎక్కడికి వెళ్లాలో తెలియకుండా వెళ్ళిపోయాడు. అతను ఒక మట్టి రేణువును కూడా తన బాణంతో కొట్టగలడు. కానీ లాభం ఏమిటి? ఆయన క్షత్రియుడు కాకపోవటం వల్ల యుద్ధానికి కాదు ఎవరూ ఆయనతో పోటీకి కూడారారు. ఇలా తలచుకుంటూ ఆయన ఏ దిక్కూ లేకుండా తిరుగుతున్నాడు.
ఇంకా ఉంది............