మహాశివరాత్రి జాగరణకు మీకోసం ఈ నాలుగు శివుడి కథలు
యోగ సాంప్రదాయంలో, తార్కికమైన రీతిలో అమూల్యమైన జ్ఞానాన్ని అందించే అనేకమైన శివుడికి సంబంధించిన కథలున్నాయి. మీకోసం అటువంటి నాలుగు కథలు.
మొదటి కథ: శివుడు ఇంకా ఎడ్లబండి
సద్గురు:: ఇది ఒక మూడు వందల ఏళ్ల క్రితం జరిగింది. దక్షిణ కర్ణాటకలో ఒక భక్తుడుండేవాడు. అతని తల్లికి వృద్ధాప్యంవల్ల అంత్యకాలం సమీపించడంతో, కాశీకి వెళ్లి విశ్వనాథుడైన పరమశివుని సన్నిధిలో శరీరం విడిచిపెట్టాలి అని భావించింది. ఆమె తన జీవితకాలంలో కోరిన కోరిక అదొక్కటే. తన కొడుకుతో “నన్ను కాశీకి తీసుకువెళ్ళు. నాకు ముసలితనం వచ్చింది. నేను అక్కడకు వెళ్లి శరీరం వదులుతాను” అని చెప్పింది.అతను తన తల్లితో పాటు కాశీకి ప్రయాణమై, వారు దక్షిణ కర్ణాటక అడవుల గుండా నడిచి వెళ్ళడం ప్రారంభించారు. సుదీర్ఘ ప్రయాణం, పైగా వృద్ధురాలు కావడంతో ఆమెకు సుస్తీ చేసింది. అప్పుడతను ఆమెను తన భుజాలపై వేసుకుని నడవసాగాడు. కొద్ది సమయంలోనే అతని శక్తీకూడా క్షీణించసాగింది. ఇప్పుడు ఈ యాత్ర ముందుకుసాగాలంటే శివుడ్ని వేడుకోవడం తప్ప మరో మార్గంలేదని భావించి అతను “శివయ్య, నా ఈ ప్రయత్నం వృధాపోకుండా చూడు తండ్రీ. నా తల్లి కోరుకున్న ఒక్కగానొక్క కోరిక..నన్ను తీర్చనివ్వు. నేను ఆమెను కాశీకి తీసుకుని వెళ్ళాలి. నీకోసమే మేము అక్కడకు వస్తున్నాం. నాకు శక్తినియ్యవా...” అంటూ వేడుకోసాగాడు.
అతను అలా నడుస్తూపోతున్నప్పుడు, ఎడ్లబండి వెనుకగా వచ్చేటప్పుడు మోగే గంటల శబ్దం వినబడింది. పొగమంచులో నుండి ఒక ఒంటెద్దు బండి అతనివైపు రావడం గమనించాడు. ఇదో వింత. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఒంటెద్దు బండి కేవలం తక్కువ దూరం ప్రయాణించడానికే వాడుతారు. అడవులగుండా దూరప్రయాణం చేయాలంటే రెండెడ్లు కావాలి. కానీవారు అప్పటికే బాగా అలసిపోవడంతో ఇవేమీ పట్టించుకోలేదు. బండి దగ్గరకు వచ్చినా, దాన్ని నడిపే అతను ముసుగులాంటి బట్ట కప్పుకుని ఉన్నందున ఇంకా పొగమంచు వల్ల అతని మొహం కనిపించలేదు.
అప్పుడతను “నా తల్లికి ఆరోగ్యం బాగోలేదు. ఈ ఖాళీ బండిలో మేము ప్రయాణం చేయవచ్చా?” అని అడిగాడు. బండి నడిపే అతను సైగ చేస్తున్నట్టు తల ఊపాడు. ఆ ఇద్దరూ బండి ఎక్కి ప్రయాణించసాగారు. కొంత సమయానికి అతను అడవి మార్గంలో కూడా బండి అంతటి సునాయాసంగా కదలడాన్ని గమనించాడు. అప్పుడు అతడు కిందకు చూస్తే, బండి చక్రాలేమీ తిరగకుండా, స్థిరంగా ఉన్నాయి. కానీ బండి మాత్రం పోతూనే ఉంది. అప్పుడతను ఎద్దు వైపు చూసాడు, అది కూర్చొని ఉంది కానీ బండి మాత్రం పోతూనే ఉంది. అప్పుడతను బండి నడిపే అతన్ని పరిశీలిస్తే, కేవలం ముసుగుబట్ట మాత్రమే కనిపిస్తుంది. కానీ ముసుగులో ఎవరూలేరు. తల్లివైపు చూశాడు. అప్పుడు ఆమె “ఇంకా అర్ధం కాలేదా, మనం గమ్యానికి చేరిపోయాం. ఇంకెక్కడికీ వెళ్ళనవసరంలేదు. ఇక్కడే నన్ను వెళ్లనివ్వు.” అని చెప్పి ఆ తల్లి శరీరం విడిచింది. ఎద్దు, బండి, ఆ నడిపేవాడు అందరూ మాయమయ్యారు!
అతను తిరిగి అతని స్వగ్రామానికి చేరుకున్నాడు. అక్కడివారు “అతను చాలా త్వరగా వచ్చాడంటే.. ఖచ్చితంగా తల్లిని కాశీకి తీసుకుపోకుండా మధ్యలోనే ఎక్కడో వదిలేసి ఉంటాడు.” అని భావించారు. అతనిని “నీ తల్లిని ఎక్కడ వదిలేసావ్?” అన్నారు. అతను “లేదు, మేము కాశీకి వెళ్ళే పనిలేకుండానే శివయ్యే మా కోసం వచ్చాడు” అని బదులిచ్చాడు. వాళ్ళు “ఇదంతా ఒట్టి బూటకం!” అన్నారు. అతను “మీరేమైనా అనుకోండి. శివుడు మాకోసం వచ్చాడు. అంతే. నా జీవితం ధన్యమైంది. నాకు నాలో అది తెలుస్తుంది. మీకు తెలియకపోతే.. నేను చేసేది ఏమీ లేదు.” అన్నాడు. వాళ్లప్పుడు “సరే, అయితే నువ్వు శివుడ్ని చూశావనడానికి గుర్తుగా మాకు ఏమైనా చూపించు” అన్నారు. అతను “నాకు తెలియదు ఎందుకంటే నేను అతన్ని చూడలేదు. నేను ముసుగు ఉన్న బట్టనే చూశాను. అందులో ముఖం కనబడలేదు. అక్కడేమీ లేదు. అంతా ఖాళీ” అన్నాడు.
అప్పుడు వాళ్ళందరూ ఉన్నట్టుండి అతను కనుమరుగైపోవడం గమనించారు. కేవలం అతని దుస్తులు మాత్రమే కనిపించాయి. అతను దక్షిణ భారతదేశంలో గొప్ప తపస్వి అయ్యారు. ఆయనెక్కడకు వెళ్ళినా ప్రజలు ఖాళీ ముఖం చూసి ఆయనను గుర్తించేవారు.
రెండవ కథ: మల్ల - శివుడికి ఆధీనమైన ఒక దొంగ కథ
సద్గురు: నేను పుట్టిన ప్రదేశానికి ఎంతో దగ్గరలో నివసించిన ఒక యోగి గురించి మీకు చెబుతాను. ఈయన గురించి, అక్కడ జరిగిన దాని గురించి నేను కుర్రవాడిగా ఉన్నప్పుడు విన్నాను. కానీ అప్పుడు దానిమీద అంత దృష్టి పెట్టలేదు. అది నాకు కొంత ఉత్సాహాన్ని కలిగించింది, కానీ అప్పట్లో అది నాకంతగా ప్రాధాన్యమైన విషయంగా అనిపించలేదు.శివుడు తప్ప మరేమీ తెలియదు మల్లకి. అతను ఎంతో మొరటుగా పెరిగాడు. ఏ పనీ - పాటా నేర్చుకోలేదు. అతనికి కావలసినది ఎవరో ఒకరిని ఆపి, వారి దగ్గర నుంచి తీసుకోవడం అన్న విషయం తప్పు అని కూడా అతనికి అనిపించలేదు. అందుకని అతను అలానే చేస్తూ ఉండేవాడు. ప్రజలు అతనిని దుండగుడు అన్నారు.
ప్రజలు ఎప్పుడూ వెళ్ళే ఒక అడవి మార్గం దగ్గర ఇతను దుండగుడిగా ఉండడం మొదలు పెట్టాడు. అక్కడ ఇతను ఉన్న ప్రదేశం - ఎక్కడైతే ఇతను శిస్తును వసూలు చేస్తూ ఉండేవాడో, దానిని ప్రజలు ‘కల్లనమూలై’ అని పిలవడం మొదలు పెట్టారు. అంటే, ఇది దొంగ ఉండే ఒక మూల అని అర్థం. మొట్టమొదట్లో, ప్రజలు ఇతనిని శపించేవారు. కానీ, సంవత్సరం చివరిలో ఇతను వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసిన ప్రతీ పైసా కూడా ఎంతో ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాన్ని జరిపించడానికి ఉపయోగించేవాడు. ఒక పెద్ద వేడుక చేసేవాడు.
కొన్ని సంవత్సరాల తరువాత, ప్రజలు ఇతను ఒక గొప్ప భక్తుడని అర్థం చేసుకుని, వారే ఇష్టపూర్వకంగా ఇతనికి డబ్బులు ఇవ్వడం మొదలు పెట్టారు. ఎవరైతే ఇవ్వలేదో వారి దగ్గర వసూలు చేసేవాడు.
అన్నదమ్ములైన ఇద్దరు యోగులు ఒకసారి అటుగా రావడం జరిగింది. వారు ఈ వ్యక్తిని ఒక దుండగుడుగా ఇంకా ఒక భక్తుడిగా కూడా చూశారు. వారు “నీ భక్తి అమోఘమైనది. కానీ, నువ్వు ఎంచుకున్న మార్గం ప్రజలని బాధపెడుతోంది” - అని చెప్పారు. దానికి అతడు - “నేను ఇది శివుడి గురించి చేస్తున్నాను. ఇందులో సమస్య ఏముంది..?” అన్నాడు. వారతనిని ఒప్పించి ప్రక్కకి తీసుకుని వెళ్ళి, ఎన్నో విషయాలు బోధించి, అతనిని మరో మార్గంలో పెట్టారు. ఆ తరువాత నుంచీ, ఆ ప్రదేశాన్ని కల్లనమూలై నుంచి మల్లనమూలై అనడం మొదలు పెట్టారు. ఈ రోజుకీ దానిని మల్లనమూలై అనే పిలుస్తారు. ఇక్కడ మహాశివరాత్రి ఉత్సవం ఎంతో గొప్ప వేడుకగా చేసే ఒక కేంద్రం ఏర్పాటయ్యింది.
అతను ఇలా దోచుకోవడం మానేసిన ఒకటిన్నర సంవత్సరంలోనే ఈ యోగులతో కూర్చుని మహాసమాధిని పొందాడు. ఈ యోగులు ఇతనికి మహాసమాధి స్థితిని తీసుకువచ్చిన తరువాత, వారిద్దరూ కూడా కూర్చుని వారి దేహాలను త్యజించారు. ఈ రోజున అక్కడ ఒక అందమైన గుడి ఉంది. కానీ, ప్రజలు ఇంకా దీనిని మల్లనమూలై అనే పిలుస్తారు. ఇది కాబిని నది ఒడ్డున ఉంది.
మూడవ కథ : కుబేరుడు శివుడికి “గొప్ప” భక్తుడెలా అయ్యాడు
సద్గురు:: యక్షుల రాజు కుబేరుడు. యక్షులు మధ్యస్తమైన జీవం. వారు ఇక్కడి ఇక్కడి జీవానికి చెందిన వారు కారు, మరణానంతర జీవం కూడా కాదు - వాళ్ళు మధ్యస్తమైన జీవం. కథలోకి వస్తే, రావణుడు, కుబేరుడ్ని లంక నుంచి వెల్లగొట్టడంతో, అక్కడినుంచి ప్రాణభయంతో ప్రధాన భూభాగానికి వచ్చాడు. అతను పోగొట్టుకున్న ప్రజలు, రాజ్యంపై మోహంతో, శివుడ్ని ప్రార్ధించడం మెదలుపెట్టి శివ భక్తుడయ్యాడు.శివుడు, అతని భక్తి శ్రద్ధలకు మెచ్చి వేరొక రాజ్యాన్ని, ప్రపంచంలోని సంపదనంతటినీ ఇవ్వడంతో కుబేరుడు ప్రపంచంలో కెల్లా గొప్ప ధనవంతుడయ్యాడు. సంపద అంటేనే కుబేరుడు అన్నట్లుండేది. కుబేరుడు గొప్ప భక్తుడయ్యాడు. ఒక భక్తుడు తాను గొప్ప భక్తుడనని ఎప్పుడైతే అనుకుంటాడో, అప్పుడే వాడి పతనం మొదలౌతుంది. తాను శివుడికి అంతులేని కానుకలు, ధనాన్ని సమర్పిస్తున్నాడు కనుక తాను గొప్ప భక్తుడనని భావించడం మొదలుపెట్టాడు. సాధారణంగానే శివుడు అవేమీ తీసుకోలేదు, తనకు సమర్పించిన ఒక్క విభూతి తప్ప. కానీ కుబేరుడు తాను ఎక్కువ సమర్పిస్తున్నందువల్ల తాను గొప్పభక్తుడను అనుకునేవాడు.
ఒకరోజు, కుబేరుడు శివుడి దగ్గరకువచ్చి “నేను నీ కోసం ఏమి చేయగలను?” అన్నాడు. నేను నీకు ఏదోటి చేయాలనుకుంటున్నాను. శివుడు “అవునా? కానీ నాకోసం ఏమీ చేయలేవు, ఏం చేస్తావ్ నాకోసం? ఎందుకంటే నాకు ఏదీ అవసరం లేదు. నేను బాగానేవున్నాను. మా అబ్బాయిని తీసుకెళ్లు “ అని గణపతిని చూపించి “ఈ బాలుడు ఎప్పుడూ ఆకలి అంటుటాడు. అతనికి బాగా తిండి పెట్టు” అని చెప్పాడు.
కుబేరుడు “అది సమస్యే కాదు.” అని గణపతిని భోజనానికి తీసుకువెళ్ళాడు. వాళ్ళు వడ్డించే కొద్దీ గణపతి తింటూనే ఉన్నాడు. వాళ్ళు వడ్డించడం, ఇతను తినడం. కుబేరుడు వందల మంది వంటవాళ్ళను నియమించి నిరంతరాయంగా భోజనం వండించాడు. వాళ్లు ఈ భోజనం మొత్తం వడ్డించగా, అతను విరామం లేకుండా తిన్నాడు.
కుబేరుడు “ఇంక ఆపేయ్!” అని హెచ్చరించాడు. ”నువ్వు ఇలాగే తింటూపోతే నీ బొజ్జ పగిలిపొతుంది.” అని అన్నాడు. దానికి గణపతి “మరేం బాధలేదు. చూడండి నా పొట్ట చుట్టూరా ఈ సర్పం కట్టి వుంది. నా బొజ్జ గురించి మీరేం బాధ పడనవసరం లేదు. నాకు ఆకలేస్తుంది. వడ్డించండి. మీరేగా నా ఆకలి తీరుస్తానని మా నాన్నగారికి వాగ్దానం చేశారు!”
కుబేరుడు తన ధనమంతా ఖర్చుచేసాడు. అతను ఇతర లోకాలకు తన మనుషుల్ని పంపి, ఆహారం కొనుగోలు చేసాడని కూడా చెప్పుకున్నారు. గణపతి మాత్రం మొత్తం తిని, “నాకు ఇంకా ఆకలి తీరలేదు, ఇంకా ఆహారం ఎక్కడ?” అన్నాడు. అప్పుడు కుబేరుడు తన అవివేకానికి చింతించి, శివుడి వద్దకు వెళ్లి “నా సంపదలన్నీ మీకు ఒక ధూళి కణంతో కూడా సమానం కాదు. నేను గొప్ప భక్తుడనని విర్రవీగి తప్పుచేశాను. మీరు ఇచ్చిన దానిలోనే, కేవలం పిసరంత తిరిగి మీకు ఇవ్వజూపాను.” అని ప్రణమిల్లాడు. ఆ క్షణం నుంచి అతని జీవితం గొప్ప మలుపును చూసింది.
నాల్గవ కథ: బృఘువు ఇంకా అర్ధనారిలా శివుడు
సద్గురు: మనం ‘యోగా‘ అన్నప్పుడు ఏదో వ్యాయామం గురించి చెప్పుకోవట్లేదు. సృష్టి మూలానికి సంబంధించిన శాస్త్రం గురించి, ఇంకా ఈ సృష్టిలో భాగాన్ని దాని అత్యుత్తమ అవకాశంగా ఎలా మలచుకోగలమో మాట్లాడుకుంటున్నాం. మనం మన జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని అత్యుత్తమ అవకాశంగా చేసే శాస్త్ర సాంకేతికతను గురించి మాట్లాడుకుంటున్నాం.శివుడు సప్త ఋషులకు యోగ విద్యను ప్రసరించి సృష్టి స్వభావికతను వివరించేటప్పుడు ఒక గొప్ప సంఘటన జరిగింది. సప్త ఋషులలో ఒకరైన బృఘు మహర్షి శివుడికి మహా భక్తుడు. అనుగ్రహ సరస్సుగా పిలువబడే కాంతి సరోవరం ఒడ్డున ఏర్పాటుచేసిన మొట్టమొదటి యోగా కార్యక్రమానికి పార్వతీదేవి కూడా విచ్చేశారు. బృఘు మహర్షి యధావిదిగా పొద్దున్నే శివుడికి ప్రదక్షిణ చేయడానికి వచ్చాడు. పార్వతి కూడా శివునికి దగ్గరగానే కూర్చుంది. కానీ బృఘు వాళ్ళిద్దరి మధ్యగుండా వెళ్లి కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చేశాడు. అతను పార్వతికి కాకుండా కేవలం శివుడికి మాత్రమే ప్రదక్షిణ చెయ్యాలనుకున్నాడు.
శివుడు దీనికి సంతోషించాడు కానీ పార్వతి సంతోషంగా లేదు. ఆమెకు అది నచ్చలేదు. ఆమె శివుని వైపు చూడగా, శివుడు “దగ్గరకు రా.. అతను నీ చుట్టూ కూడా తిరుగుతాడు” అన్నాడు. పార్వతి దగ్గరకు జరిగింది. ఇప్పుడు శివుడికి ప్రదక్షిణ చేయడానికి సరిపోయినంత ఖాళీ లేదని గ్రహించిన బృఘువు.. ఒక చిట్టెలుక రూపంలోకి మారి, శివుడికి మాత్రం ప్రదక్షిణ చేశాడు. పార్వతీదేవిని ప్రదక్షిణ నుంచి విస్మరించాడు.
ఇలా బృఘు మహర్షి శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేయడంతో పార్వతికి కోపం పెరిగిపోతోంది. పార్వతిని శాంత పరచడానికి, శివుడు పార్వతిని తన ఎడమ తొడ మీద కుర్చోబెట్టుకున్నారు. అప్పుడు బృఘువు ఒక చిన్న పిట్టలా మారి పార్వతిని వదిలేసి శివుడి చుట్టూ మాత్రమే ప్రదక్షిణం చేసాడు. పార్వతి కోపం తారా స్థాయికి చేరుకుంది. "ఇదేం పిచ్చి పని" అనుకుంది. దానికి శివుడు పార్వతిని ఇంకా దగ్గరగా లాక్కుని తనలో భాగం చేసేసుకున్నాడు. అలా వారిద్దరూ ఒక్కటిగా కూర్చున్నారు. ఆయన తనలోని సగ భాగాన్ని వదిలిపెట్టి ఆవిడని ఆయనలో లయం చేసుకుని అర్ధనారీశ్వరుడు అయ్యాడు.
ఇది గమనించిన బృఘువు, తూనీగలా మారి ఈసారి కేవలం కుడి కాలుకు మాత్రమే ప్రదక్షిణ చేశాడు. బృఘువు చూపిన అమిత భక్తికి శివుడు సంతుష్టుడయ్యాడు కానీ, అదే సమయంలో బృఘువు తనదైన భక్తిలో మునిగిపోయి, సృష్టి స్వాభావికతను తెలుసుకోకుండా ఉండకూడదని భావించి, ఈసారి ప్రదక్షిణ చేసేందుకు వీలు లేకుండా, యోగాసనమైన సిద్దాసనంలో కూర్చున్నాడు. ఒకవేళ అతను ప్రదక్షిణ చేయాలనుకుంటే, తప్పనిసరిగా స్త్రీ పురుష తత్వమంతటికీ ప్రదక్షిణ జరుగుతుంది.
ఈ కథ చెప్పేదేంటంటే, మనం యోగా అన్నప్పుడు, అంతా కలుపుకునే ఒక పార్శ్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం. అది ఒక వ్యాయామమో, లేక ఆరోగ్యాన్నిచ్చే ఒక ప్రక్రియో కాదు. అది జీవితంలోని ఏ అంశాన్నీ విస్మరించకుండా మనిషికీ అంతిమ శ్రేయస్సును కలిగించడం గురించినది. అది అన్ని పార్శ్వాలను దాటుకుని అంతిమమైన పార్శ్వాన్ని పొందడం గురించి. అది మీ ప్రస్తుత వ్యవస్థను ఉపయోగించే వ్యవస్థను గురించినది - మీ శరీరం, మనస్సు, భావం ఇంకా శక్తులను దివ్యత్వానికి నిచ్చెనలా వాడడం గురించి. అది మిమ్మల్ని మీ అంతిమ స్వభావాన్ని చేరుకునేందుకు సోపానంగా మార్చే ఒక ప్రక్రియ.
Editor’s Note: Celebrate Mahashivratri at the Isha Yoga Center with explosive guided meditations accompanied by dance and music, nightlong satsang with Sadhguru, musical performances by eminent artists. Bask in the Grace of Shiva, The AdiYogi! Visit the Mahashivratri webpage for details on the many ways you can participate.