నిర్వాణానికి మార్గము -ఒక ధ్యాని కథ
చాలా మంది ఆధ్యాత్మిక అన్వేషకులు నిర్వాణ మార్గం కోసం లేక ముక్తి మార్గం కోసం అక్కడే వృత్తాలుగా తిరుగుతూ జీవితాన్ని సమాప్తి చేస్తారు. కాని నిర్వాణానికి మార్గం వారి పాదాల చెంతనే ఉందన్న సత్యాన్ని గ్రహించరు
ఆతను చాలా మంది వద్దకు వెళ్లి, "నిర్వాణానికి మార్గము అంటే ఏమిటి"? అని అడిగాడు.
ఈ ప్రశ్న విన్న ప్రతి ఒక్కరూ అతనితో "ప్రతి మార్గమూ బుద్ధుని ప్రదేశానికే తీసుకు వెళతాయి, కానీ ఒక మార్గము మాత్రం సరాసరి నిర్వాణ ద్వారానికి దారితీస్తుంది. ఒకే ఒక ధ్యాన గురువుకి మాత్రమే ఆ మార్గము గురించి తెలుసు. ఆయన దగ్గరకి వెళ్ళు. ఆయన నీకు ఆ మార్గదర్శనం చేస్తారు." అన్నారు. చాలా పేరు పొందిన ధ్యాన గురువు పేరు వారు అతనికి చెప్పి, ఆయన మఠానికి వెళ్ళమని చెప్పారు.
ఆ యువకుడు ఆ మఠాన్ని చేరుకొని, ఆ గురువు పాదాలకు మోకరిల్లాడు.
ఆ తర్వాత ఎంతో వినమ్రతతో "ఓ గురుదేవా! నన్ను నేను మీ పాదాల వద్ద సమర్పించుకున్నాను. దయచేసి దారి చూపండి." అన్నాడు.
ఆ గురువు "అది ఆ ప్రహరీ గోడకు అవతలే ఉంది" అన్నారు.
ఆ శిష్యుడు అమితాశ్చర్యముతో బహుశా గురువు గారికి నా ప్రశ్నసరిగా అర్థం కాలేదేమో అనుకున్నాడు.
"గురుదేవా! నేను ప్రహరీ గోడకు అవతల ఉన్న మార్గం గురించి కాదు అడిగింది, నేను కోరేది అంతిమ మార్గం."
"ఓ అదా! అదే దారి రాజధానికి పోతుంది. నీకు తెలీదా?"
"అది కాదు గురుదేవా! ఎక్కడ ప్రజల్ని అడిగినా అన్ని మార్గాలు బుద్ధుని ప్రదేశానికి తీసుకుపోతాయని, కానీ ఒక్క దారి మాత్రం సరాసరి నిర్వాణ ద్వారానికి తీస్కుపోతుందనీ, మీరు ఆ మార్గం గురించి బాగా తెలిసినవారనీ చెప్పారు ఆ మార్గం ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.”
“ఓ! ఆ మార్గమా ? అది ఇక్కడే వుంది.” అన్నారు. శిష్యుడు నిల్చొని ఉన్న ప్రదేశాన్ని వేలు పెట్టి చూపిస్తూ.
సద్గురు వివరణ:
మీరు నిర్వాణాన్ని చేరాలన్నా, ముంబై చేరాలన్నా, ఎక్కడ్నించి ప్రయాణం మొదలు పెట్టాలి? మీరిప్పుడు ఎక్కడున్నారో అక్కడినించే కదా! ముక్తికి మార్గం మరెక్కడి నించో ప్రారంభమౌతుందని మీరు ఊహించుకుంటే మీరు ఆ ఊహా లోకంలోనే తప్పిపోతారు. ఏ రకమైన ప్రయాణమయినా, మనమెక్కడున్నామో అక్కడి నించే ప్రారంభించగలం.
మనుషులు ఈ భూమి మీద అనేక వేల సంవత్సరాల నించి ఉన్నప్పటికీ ఈ విషయాన్ని అర్ధం చేసుకోలేకపోవటం అనే ఒకే ఒక్క కారణం చేత వారి లోపల నించి వికసించలేకపొతున్నారు. ఆదివాసులు లేక గుహలలో నివసించే వారిలానే ఇప్పటికీ క్రోధంలో మనం మగ్గుతున్నాము. బయట పరిస్థితులు, ఆయుధాలు ఇంకా శక్తివంతంయినప్పటికీ ప్రాధమికంగా చూస్తే అంతా ఒకేలా ఉంది.
క్రోధం వల్ల ఎంత విచారము, భయంకరము, బాధ ఎదుర్కోవాల్సి వస్తుందో ఎదురుగా చుస్తున్నప్పటికీ మనం ఈ చిన్న కోపం అనే భావాన్నించి ఎలా బయటపడాలో అర్ధం చేసుకోలేక పోయాము. ఎందుకు మనకీ పరిస్థితి వచ్చింది? తేలికగా చెప్పాలంటే మనం ఇప్పుడు ఉన్న చోటు నించి కదలలేకపోవడమే దీనికి కారణం. ఇప్పుడు మీరున్న ప్రదేశం నించి అంగుళం కదలకుండా ముక్తి కోసం అడిగితే ఎప్పటికైనా మీరు ఎలా దాన్ని పొందగలరు? మనం ఎక్కడ నిన్చున్నామో చూసుకోకుండా మనం కనుక అవతలి వీధి నించి ప్రారంభీంచాలని చూస్తే ఒక ప్రయాణం అనేది జరుగదు, మీరు మీ ఊహాలోకంలోనే పరిభ్రమిస్తూ ఉంటారు.
మీరు కనుక ఇప్పుడు మనం ఉన్నచోటు నించి తర్వాతి అడుగు వేస్తేనే అటు తర్వాత అడుగు, ఆ తర్వాత అడుగు, అంటూ ప్రయాణం అనేది జరుగుతుంది.
ఆ ధ్యాన గురువు తమ వచనముల ద్వారా దీనినే ఆ యువకుడికి సూచించారు.