అబ్బురపరిచే 11 బుద్ధుడి కథలు
సద్గురు అప్పుడప్పుడు చెప్పిన 11 బుద్ధుడి గురించిన కథలను ఇక్కడ మీకు అందిస్తున్నాము. ఇవి ఆధ్యాత్మిక పథంలో కొన్ని విషయాలను వివరిస్తూ, గౌతముడి జీవితం నుండీ, ఆయన మార్గం నుండీ మీకు స్ఫూర్తిని కలుగజేస్తాయి.
గౌతముడి పేరు విననివాళ్ళు బహుశా ప్రపంచంలో ఎవరూ ఉండరు. ఎందరో బుద్ధులు ఉన్నారు, కానీ ఆయన పేరు మాత్రం కలకాలం నిలిచి పోయింది. ఆయన కలిగించిన ఆధ్యాత్మిక చైతన్యం అంత గొప్పది, బహుశా ఆయనే ఈ మొత్తం భూమి మీద ఎంతో విజయవంతమైన ఆధ్యాత్మిక బోధకుడు. ఆయన జీవిత కాలంలోనే ఆయన దగ్గర 40 వేల మంది సన్యాసులు ఉండేవారు. ఈ సన్యాసుల సేన ఆధ్యాత్మిక చైతన్యాన్ని సృష్టించడానికి బయటికి వెళ్లారు. ఆయన కొత్తగా ఏది చేయలేదు; కానీ, సమాజానికి పనిచేసే విధంగా ఆయన ఆధ్యాత్మికతను అందించారు. అప్పటివరకు ఆధ్యాత్మిక ప్రక్రియ కేవలం సంస్కృత భాషలో మాత్రమే అందించబడింది. సంస్కృత భాష సమాజంలో చాలా కొద్ది మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. మిగిలిన వారికి అది నేర్చుకోవడం సాధ్యమయ్యేది కాదు. ఎందుకంటే, ఈ భాషను దివ్యత్వానికి కీలకంగా చూసేవారు. మొట్టమొదటిసారిగా గౌతముడు పాలి భాషలో మాట్లాడారు, అది ఆనాడు వాడుకలో ఉన్న భాష. ఆయన అన్ని రకాల ప్రజలకూ ఆధ్యాత్మికత ద్వారాలు తెరిచారు.
#1. గౌతముడి బాల్యం
గౌతముడు ఒక చిన్న రాజ్యానికి యువరాజు. ఆయన పుట్టినప్పుడు ఒక యోగి జోస్యం చెప్పాడు. అది ఏమిటంటే, అతను అయితే ఒక గొప్ప సార్వభౌముడు అయినా అవుతాడు లేదా ఒక గొప్ప తాపసి అయినా అవుతాడు అని. ఆయన ఈ జోస్యం చెప్పినప్పుడు గౌతమి తండ్రి ఎంతో ఉత్సాహ పడ్డాడు. ఆయనకు గౌతముడు గొప్ప తాపసి కావడం ఇష్టం లేదు. ఈయన గొప్ప సామ్రాట్ కావాలని అనుకున్నాడు. ఒకవేళ బాధనూ, దుఃఖాన్నీ చూసినట్లయితే ఆయన ఒక తాపసిగా మారవచ్చు అనుకుని, గౌతముడిని ఎప్పుడూ విలాసాలలో ముంచాడు - మంచి ఆహారం, బట్టలు ఇంకా విలాసాలు. అతనికి 19 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తండ్రి ఆయనకు ఎంతో అందమైన యువతితో వివాహం చేశాడు. వారిని ఒక రాజ భవనంలో, మిగతా సమాజం నుండి దూరంగా ఉంచాడు. అక్కడ కేవలం వినోదాలు, విలాసాలు మాత్రమే తప్ప ఎటువంటి బాధలనూ చూసే అవకాశం లేదు. ఒకరోజు గౌతముడు నగరంలో సంచరించాలి అనుకొని, తనని సంచారానికి తీసుకువెళ్ళమని రథసారధిని ఆదేశించాడు.
ఆయన అలా వెళుతున్నప్పుడు ఒక వృద్ధుడిని చూశాడు. అప్పటివరకు తన జీవితంలో వృద్ధులను ఆయన చూడలేదు. ఆయన తండ్రి వీటన్నిటి నుండి ఆయనను సురక్షితంగా ఉంచాడు. "ఇతనికి ఏమైంది?" అని సారథిని అడిగాడు. అందుకు ఆ రథసారథి "ఆయన ఓ వృద్ధుడు, అంతే!" అన్నాడు. "ఇది ఎలా జరుగుతుంది" అని అడిగాడు. అందుకు అతను "అందరూ ఏదో ఒక రోజు వృద్ధులు అవుతారు" అన్నాడు. తనని తాను చూసుకున్నాడు, తను ఎంతో యవ్వనంలో ఉన్నాడు. "ఏమిటి నేను కూడానా?" అని అడిగాడు. దానికి సమాధానంగా “అవును. అందరికీ ముసలితనం వస్తుంది. ఎక్కువ కాలం జీవిస్తే ముసలివాళ్ళు అవుతారు.." అన్నాడు. "నేను కూడా ఆ విధంగా అవుతాను" అని, ఆయన ఒక వాస్తవం తెలుసుకున్నాడు.
ఆ తర్వాత వీధిలో ఒక మనిషి పడుకొని ఉండడం చూశాడు, అతను ఏదో జబ్బుతో బాధపడుతున్నాడు, లేవ లేక పోతున్నాడు ఎంతో బాధలో ఉన్నాడు. గౌతముడు "ఆగు, ఈ మనిషి ఎవరు? ఇతను ఏమి చేస్తున్నాడు?" అని అడిగాడు. రథసారథి, "ఓఁ, దురదృష్టవశాత్తు అయన అనారోగ్యంతో ఉన్నాడు" అన్నాడు. "దాని అర్థం ఏమిటి?" అని గౌతముడు అడుగాడు. "శరీరం ఉంది కదా! అప్పుడప్పుడు దానికి అనారోగ్యం వస్తుంది. అది ఎవరికైనా జరగవచ్చు" అన్నాడు. "నేను యువరాజును, నాకు కూడా అలా జరిగే అవకాశం ఉందా?"అన్నాడు. "ఎవరికైనా అలా జరగవచ్చు." దానితో గౌతముడు "ఓఁ, నేను కూడా ఈ విధంగా కావచ్చు" అని తెలుసుకున్నాడు. దీనితో ఆయన చాలా వ్యాకుల పడ్డాడు. వాళ్లు ఇంకొంచెం ముందుకు వెళ్లిన తర్వాత అక్కడ దహనసంస్కారాలు జరగడం చూశారు. కొందరు ఒక మృతదేహాన్ని మోసుకొని వెళ్తున్నారు. "అతనికి ఏమైంది?" "ఓఁ, అతను చనిపోయాడు అంతే!" "అంటే ఏమిటి?" "ఇది ఖచ్చితంగా అందరికీ జరిగే తీరుతుంది."
అందుకు గౌతముడు"నేను ఏం చేస్తున్నాను? ఇలా తినడం, విలాసాలలో మునిగి తేలడం అంతా అర్థ విహీనం. నాతో నేనేం చేసుకుంటున్నాను?’’ అంటూ అతనిలో విపరీతమైన అలజడి చెలరేగింది. ఉన్నట్టుండి యువరాజుగా ఉండడం, అంతఃపురం విలాసాలు ఇవన్నీ అతని నుండి విడిపోయాయి.
"వీటన్నింటి వల్ల ప్రయోజనం ఏమిటి? ఈ దేహం ముసలిది అయిపోవచ్చు, అనారోగ్యం పాలు కావచ్చు, ఖచ్చితంగా మరణం సంభవిస్తుంది. మరి, నా జీవితాన్ని నేను ఈ విధంగా ఎందుకు సాగిస్తున్నాను?" అని ఆలోచించసాగాడు. కానీ అప్పటికే, ఆయనకు ఒక పసిబిడ్డ ఉన్నాడు. ఎంతో ప్రేమించే భార్యను, ప్రియమైన బిడ్డను అతను వదలలేక పోయాడు. తనలో తాను ఆయన ఎంతో ఘర్షణకు లోనయ్యాడు.
అప్పటికి దాదాపుగా ఏడాది పైన మూడు నెలలు గడిచాయి. ఆ పిల్లవాడికి ఒకటిన్నర సంవత్సరం వయసు ఉన్నప్పుడు, ఆయన ఇక ఆగలేకపోయాడు. ఒక అర్ధరాత్రి వేళ ఎవరికీ చెప్పకుండా ఆయన అంతఃపురం నుండి ఒక దొంగలా బయటపడి, దానిని శాశ్వతంగా వదిలిపెట్టాడు. "నేను ఈ జీవిత సత్యాన్ని తెలుసుకోవాలి" అంటూ, అని ఆయన సత్యాన్వేషణలో బయలుదేరాడు.
బుద్ధుని జ్ఞానోదయ మార్గం
ఆ కాలంలో భారతదేశంలో ఎన్నో భిన్నమైన ఆధ్యాత్మిక మార్గాలు ఉండేవి. ఒకానొక సమయంలో 1,800 విధానాలు ఉండేవి, 18 వందల భిన్నమైన యోగ విధానాలు. ఈనాటి వైద్యశాస్త్రం ఏ విధంగా ఉందో ఇది ఆ విధంగా ఉండేది. ఉదాహరణకు, పాతిక సంవత్సరాల క్రితం, మీకు మెడికల్ చెకప్ కావాలంటే, మీరు కేవలం మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరకు వెళ్లేవారు. ఈనాడు, మీ దేహంలోని ప్రతి భాగానికి ఒక డాక్టర్ ఉన్నాడు.
యోగ విధానానికి కూడా ఇలాంటిదే జరిగింది. ఎన్నో భిన్నమైన విధానాలలో, చిన్న అంశాలలో ప్రజలు నిష్ణాతను సాధించడం మొదలు పెట్టారు. స్పెషలైజేషన్ అనేది ఒక స్థాయి దాటినప్పుడు ఇక అది హాస్యాస్పదంగా ఉంటుంది. ఇలాంటి సమయంలోనే, పతంజలి వచ్చి అన్నిటినీ యోగసూత్రాలుగా సంకలనం చేశాడు.
గౌతముడు పతంజలి మహర్షి తరువాత వచ్చిన వాడే కానీ, అప్పటికి ఇంకా ఎన్నో విధానాలు ఉన్నాయి. ఆయన ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు వెళుతూ ఎనిమిది రకాల సమాధి స్థితులను అభ్యసించాడు. ఆయనకు ఇవన్నీ ఎంతో అందమైన అనుభూతులుగా ఉన్నాయి. కానీ, అవి ఆయనకు ముక్తిని కలిగించలేదు. ఇలాంటి పరిస్థితిలో ఆయన ఒక ‘సమానా’గా నడవడం మొదలు పెట్టాడు. ఇది ఎలాంటి సాధన అంటే వీళ్ళు ఎవరిని భోజనం కోసం కూడా అడగకుండా నడుస్తూ ఉంటారు. వాళ్లు ఆహారాన్ని వెతుక్కుంటూ వెళ్ళరు, ఎందుకంటే వాళ్ళు మనుగడ యొక్క ప్రాథమిక అంశాన్ని గెలవాలనుకుంటారు.
‘సమానా’లు కేవలం నడుస్తూ ఉంటారు, ఎవరినీ ఆహారం కోసం కూడా అడగరు. కానీ ఆ రోజుల్లో సంస్కృతి సున్నితంగా ఉండేది. ఎవరైనా ఆధ్యాత్మిక వ్యక్తి నడుస్తూ ఉండడాన్ని చూస్తే ప్రజలు ఇంట్లో వంట చేసి, వారి వెంట పరిగెట్టి, వారికి ఆహారాన్ని అందించేవారు. ఎందుకంటే, వీళ్లు ఆహారాన్ని అడగరు అన్న విషయం వారికి తెలుసు. ఈ రోజుల్లో మీరు ఒక ‘సమాన’ అయితే, మీరు చచ్చేంత వరకూ నడుస్తూ ఉండవలసిందే. ఆ రోజుల్లో ప్రజల్లో సున్నితత్వం ఉండేది. సాధనకు స్పందించేవారు అందుకని దేశంలో వేల మంది సమానాలు నడుస్తూ ఉండేవారు. గౌతముడు ఒక సమాన అయ్యాడు. మీరు భోజనం కోసం అడగకపోవచ్చు కానీ ఒక నగరానికి దగ్గరగా నడిచినట్లు అయితే ఆహారం దొరుకుతుంది. కానీ గౌతముడు ఈ వ్రతాన్ని తేలిగ్గా తీసుకోలేదు. అలా నడుస్తూ ఉన్నాడు. ఆయన ఎముకల గూడు అయిపోయాడు. చర్మం కప్పిన అస్తిపంజరంలా తయారయ్యాడు.
అప్పుడు ఆయన నిరంజన అనే ఒక నది సమీపానికి వచ్చాడు. అందులో షుమారు 18 నుండి 20 అంగుళాల నీరు మాత్రమే ఉంది. ఆయన అందులో అడుగుపెట్టాడు. నది మధ్యలో ఉన్నప్పుడు ఆయనకు నదిని దాటే శక్తి లేకపోయింది. ఆయనకు తర్వాతి అడుగు తీసుకోవడానికి కూడా తగిన శక్తి లేదు. కానీ, ఆయన అలా వదిలిపెట్టే మనిషి కాదు. అక్కడ ఒక ఎండిపోయిన చెట్టు కొమ్మ ఉంది, ఆయన దాన్ని అలా పట్టుకుని నుంచున్నాడు. అలా పట్టుకొనే ఉన్నాడు. ఎంతకాలమో మనకు తెలియదు. బహుశా రెండు నిమిషాలు అయి ఉండొచ్చు. మీకు నీరసంగా ఉన్నప్పుడు ఆ రెండు నిమిషాలే మీకు రెండు సంవత్సరాలలా అనిపిస్తాయి. ఆయన అలా పట్టుకొని ఉన్నప్పుడు ఆయనకు ఇది తెలిసింది, "నేను దేని కోసం కృషి చేస్తున్నాను? నేను ఈ దేశాటన దేనికోసం చేస్తున్నాను? ఒక విద్యాశాల నుండి మరొక విద్యాశాలకు, ఇది అది నేర్చుకుంటూ అసలు నేను దేని గురించి వెతుకుతున్నాను?" అని. అప్పుడు ఆయనకు తెలిసొచ్చింది. ‘‘నిజానికి ఉన్నది ఏదీ లేదు. ఈ జీవం కొనసాగుతోంది. నేను చేయవలసిందల్లా అది అనుభూతి చెందడానికి ఏవైతే ఆటంకాలుగా ఉన్నాయో వాటిని తొలగించుకోవడం, మాత్రమే!" అని.
గౌతముడు ఏ విధంగా బుద్ధుడు అయ్యాడు
ఆయనకు సర్వం తనలోనే ఉన్నాయన్న జ్ఞానం కలిగినప్పుడు, వెతికేందుకు ఎక్కడికీ వెళ్లాల్సిన పనిలేదు అని తెలియగానే ఆయనకు తరువాతి అడుగు, ఆ తరువాతి అడుగు తీసుకోవడానికి ఉన్నపళంగా శక్తి వచ్చింది. ఆయన నదిని దాటి ప్రస్తుతం ఎంతో ప్రసిద్ధమైన బోధి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రోజు పౌర్ణమి. ఆయన అక్కడ ఎంతో దృఢనిశ్చయంతో కూర్చున్నాడు "అయితే నేను నా అస్తిత్వం యొక్క మూలాలను ఇప్పుడు తెలుసుకోవాలి, లేదంటే ఇక్కడే కూర్చుని, ఉన్న పళంగానే మరణిస్తాను. అంతే, నాకు అది తెలిసేంతవరకు కళ్ళు తెరవను!" అని.
ఒకసారి ఆయన ఈ దృఢనిశ్చయం చేసిన తరువాత, మీలో ఉన్నది మీకు తెలియడానికి ఒక క్షణం చాలు. జ్ఞానోదయం కోసం మీరు ప్రత్యేకించి ఏదీ చేయవలసిన పని లేదని ఆయన గుర్తించినప్పుడు ఆయనకు పూర్తి ఆత్మజ్ఞానం కలిగింది. నిండు చంద్రుడు మెరిసిపోతున్నాడు. ఆయన ఎన్నో ఏళ్లుగా సరిగ్గా భోజనం చేయలేదు. ఆయన నాలుగు సంవత్సరాలుగా ‘సమాన’ గా ఉన్నాడు. ఆయన వద్దకు అయిదుగురు శిష్యులు చేరారు. వీళ్ళు ఇన్నాళ్ళూ ఏమనుకున్నారంటే, "ఈయన అసలైన వాడు. ఎందుకంటే ఆయన భోజనం చేయడు, కఠినంగా ఉంటాడు" అని. ఇప్పుడు ఆయనని ఏదో పారవశ్య స్థితిలోనూ, ఆయన ముఖంలో ఏదో వెలుగునూ వాళ్ళు చూశారు. కళ్ళు తెరచి వారికి ఆయన ఏదో బోధన అందిస్తారు అనుకున్నారు. ఆయన కళ్ళు తెరిచి వాళ్ల వంక చూస్తూ చిరునవ్వుతో "ఏదైనా వంట చేయండి. మన అందరం తిందాం" అన్నాడు. దానితో వాళ్ళు పూర్తిగా నిరాశ చెందారు. ‘‘ఈయన పతనమై పోయాడు’’ అనుకున్నారు వాళ్లు. నాలుగేళ్లపాటు వాళ్ళ ఆయనతో నడిచారు, ఆయనకు చిత్రహింస తప్ప మరేదీ లేదు. కానీ ఆయనకు ఆత్మజ్ఞానం కలిగినప్పుడు వారు ఆయనను వదిలేశారు. ఎందుకంటే వాళ్ళు ఏదో కఠినమైన విషయాన్ని వినాలి అనుకున్నారు. కానీ ఆయన "వంట చేయండి! మనం తిందాం. మనం మన సమయాన్ని వృధా చేసుకుంటున్నాం" అన్నాడు.
#2 బుద్ధుడు, జ్యోతిష్యుడు
ఒకరోజు గౌతముడు, బుద్ధుడు అయిన తరువాత ఒక చెట్టు కింద కూర్చున్నాడు. చెట్టు కింద కూర్చోవడం ఉత్తమం అని కాదు కాని ఆ రోజుల్లో రియల్ ఎస్టేట్ లేదు కదా. అందుకని అన్నిచోట్లా కట్టడాలు లేవు. చెట్టు కింద కూర్చోడం ఎండలో కూర్చోవడం కంటే ఆహ్లాదకరంగా ఉంటుంది.
ఎంతో ప్రావీణ్యం గల ఒక జ్యోతిష్యుడు అక్కడ నదిలో స్నానానికి వచ్చి, నది ఒడ్డున ఒక కాలి గుర్తు చూశాడు. పాదముద్రలు ఏ విధంగా ఉన్నాయో చూసి, అతను ఏమి చేయగలడో కొందరు జ్యోతిష్యులు కచ్చితంగా చెప్పగలరు.
ఇవి చక్రవర్తి పాదముద్రలు లాగా ఆయన చూశాడు, ఎవరైతే ఈ ప్రపంచాన్ని ఏల గలడో అటువంటి వాడు. ఆ తరువాత, అటువంటి మనిషి ఇలాంటి మారుమూల అడవిలో ఎందుకు ఉంటాడు? అని ఆశ్చర్యపోయాడు. అతను ఆ పాదముద్రలు ఉన్న దిశగానే వెళ్ళాడు ఒక చక్రవర్తిని కలవబోతున్నాననే ఉద్దేశంతో. కానీ ఆయన అక్కడి ఈ సాధువును, గౌతముడిని చెట్టు కింద కూర్చుని ఉండడం చూశాడు. ఇది చూసి ఆయన, "అయితే నా జాతకం అయినా తప్పి ఉండాలి లేదా నన్ను ఎవరో ఆటపట్టిస్తూ ఉండాలి లేదా నేను ఏదో భ్రమలోనో ఉండి ఉండాలి. ఇక్కడ అసలు ఏం జరుగుతోంది?" అనుకున్నాడు. ఆయన గౌతముడి దగ్గరికి వెళ్లి, "నువ్వు ఎవరు?" అని అడిగాడు. గౌతముడు "నేను ఎవరినీ కాదు. కేవలం ఓ అనామకుడిని" అన్నాడు. "కానీ, నీకు ఒక చక్రవర్తి పాదాలు ఉన్నాయి, నువ్వు ఈ ప్రపంచాన్ని జయించాలి" అన్నాడు. గౌతముడు,"అది నేను చేస్తాను, కానీ యుద్ధం ద్వారా కాదు!" అన్నాడు.
ప్రపంచాన్ని జయించేందుకు రెండు మార్గాలు ఉన్నాయి - ఒకటి ఆక్రమించడం ద్వారా లేదా అన్నింటిని కలుపుకోవడం ద్వారా. రెండు విధానాల్లోనూ అది మీది అవుతుంది. మీరు ఆక్రమిస్తూ పోతే అది మీకు బాధ కలిగిస్తుంది. కానీ మీరు అన్నింటిని మమేకం చేసుకుంటే అది మీ జీవితాన్ని ఎంతగానో పెంపొందిస్తుంది. ఆయన "నేను ఈ ప్రపంచానికి చక్రవర్తిని!" అన్నాడు. దానికి జ్యోతిష్యుడు "నువ్వు సాధువువి. ఏదీ నీది కాదు!" అన్నాడు."నాకు ఏదీ సొంతం కాదు. నేను ఎవరినీ కాను. అందుకే అన్నీ నావే!" అన్నాడు.
శూన్యం అవడం(ఏమీ కాకపోవడం) అంటే, మీరు ఎందుకూ ఉపయోగపడరు అని కాదు అర్థం, మీరు శూన్యం అంటే మీరు అన్నింటినీ మీలో కలుపుకున్నారు అని అర్థం. మీరు ఏదో ఒకటి అయితే, మీరు అంత మాత్రంగానే ఉండగలరు. కానీ మీరు ఏదీ కాకపోతే, మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఉండవచ్చు.ఆ జ్యోతిష్యుడు కూర్చుని "నువ్వు ఒక సాధువువి. నీ దగ్గర ఏదీ లేదు. కానీ నువ్వేమో ‘నేను ఎవరిని కాదు, కానీ సర్వం నాదే’ అంటున్నావు. ఇది ఏమిటి?" అని అడిగాడు. గౌతముడు,‘‘నువ్వు రా! నా దగ్గర నీకో మార్గం ఉంది. నువ్వు జీవితంలో ఏం జరుగుతాయో అంచనాలు వేస్తున్నావు. కానీ నావద్ద ఒక ప్రణాళిక ఉంది" అన్నాడు.
‘‘మీరు జీవితం గురించి ఎందుకు అంచనాలు వేస్తారు అంటే, మీకు ఒక ప్రణాళిక వేసే సామర్థ్యం లేదు కాబట్టి. అందుకే మీరు అంచనాల మీద ఆధారపడతారు. కానీ మీకు ఒక ప్రణాళికను తయారు చేసి దానిని నిర్వహించగల సామర్థ్యం ఉంటే, మీరు అంచనాల గురించి చూడరు.’’ అన్నాడు. గౌతముడు “మీరు అంచనాలు వేస్తూ ఉన్నారు, నాకేమో ఒక ప్రణాళిక ఉంది. వచ్చి నా ప్రణాళికలో పాలుపంచుకుంటే, మనం ఏదో చేద్దాం!" అన్నాడు
#3 బుద్ధుడు ఒక మనిషి తండ్రిని స్వర్గానికి పంపినప్పుడు
తల్లిదండ్రులు గాని, తాతలు గానీ మరణించినప్పుడు భారతదేశంలో వారికి చేయవలసిన విస్తృతమైన క్రతువులు ఉంటాయి. ఒక మనిషి చనిపోయినప్పుడు, ఎలాగైనా సరే తన తండ్రి స్వర్గానికి చేరుకోవాలి అని అతని కొడుకు అనుకున్నాడు. ఆ ఊర్లో స్వర్గానికి టికెట్లు బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లు ఎంతోమంది ఉన్నారు. అతను ఒక ట్రావెల్ ఏజెంట్ దగ్గర నుండి మరొక ట్రావెల్ ఏజెంట్ కు వెళ్తూనే ఉన్నాడు. అందరూ టికెట్ ఇవ్వడానికి సిద్ధపడ్డారు కానీ ఖచ్చితంగా స్వర్గానికి పంపిస్తామని ఎవరూ చెప్పలేకపోయారు. కానీ తనేమో వాళ్ళ నాన్న గారికి స్వర్గానికి చేర్చే ఖచ్చితమైన టికెట్ కావాలనుకున్నాడు. ఆరోజున గౌతమ బుద్ధుడు ఆ ఊరిలోనే ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు.
ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి అంటే, భగవంతుడుతో ముఖాముఖి మాట్లాడగలిగినట్లే. ఆయనతో కనుక రికమండేషన్ చేయించుకో గలిగితే మీ నాన్నగారు సూటిగా స్వర్గానికి వెళ్తారు, గేట్ల దగ్గర కూడా ఎవరూ ఆపలేరని చెప్పారు. ఇక ఇతను బుద్ధుడిని వెతుక్కుంటూ వెళ్ళాడు.
గౌతముడు ఊరి బయట ఉన్న ఒక పెద్ద సరస్సు ఎదురుకుండా ఉన్న చెట్టు కింద కూర్చుని ఉన్నాడు. ఇతను వెళ్లి గౌతముడి కాళ్ళమీద పడి ఆయన కాళ్ళను ఒక మోసలిలా పట్టుకుని "మా నాన్నగారు ఎంతో మంచి మనిషి. ఆయన చనిపోయారు. ఆయన కచ్చితంగా స్వర్గానికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఆయన పైకి వెళ్లాలి, కిందకు కాదు" అన్నాడు. గౌతముడు నోరు తెరిచి సమాధానం చెప్పే లోపే, అతను "మీరు కాదనకూడదు!" అన్నాడు. భారతదేశంలో ఒక సాంప్రదాయం ఉంది. అదేమిటంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని ఏదైనా కావాలని ప్రాధేయపడితే, మీరు కాదన కూడదు, ఎందుకంటే అవతల వ్యక్తి నిస్సహాయంగా ఉన్నారు కాబట్టి. మీరు ఇంక ఒప్పుకోక తప్పదు. అప్పుడు గౌతముడు, "సరే!, ఇంక నేనేం చేయగలను... నువ్వు నాకు ఈ విధంగా అంక్ష పెట్టావు కాబట్టి, నేను నీకు వీలుకాదు అని చెప్పలేను. సరే నువ్వు ఒక పని చెయ్యి నువ్వు ఇంటికి వెళ్లి, ఉదయం నాలుగు గంటలకు నదిలో స్నానం చేసి, ఒక మట్టికుండ తీసుకుని అందులో సగం వరకు రాళ్లతో నింపు, మిగతా సగం వెన్నతో నింపు. దానిని ఒక గుడ్డతో కట్టి ఇక్కడికి తీసుకురా! నీ తండ్రికి మనం ఏమి చేయగలమో చూద్దాము!"
అతను వెళ్ళాడు. తండ్రిని స్వర్గానికి పంపించడానికి చిన్న కుండ అయితే సరిపోతుందా, అతను ఆ ఊర్లో ఉన్న అతి పెద్ద కుండను తీసుకువచ్చాడు. దానిని సగం రాళ్లతో నింపి మిగతా సగాన్ని వెన్నతో నింపి గట్టిగా కట్టాడు. ఎంతో బరువుగా ఉన్న ఈ కొండను చాలా కష్టపడి అతను మోసుకొని వెళ్ళి గౌతముడు ఎదురుకుండా నిలుచున్నాడు. గౌతముడు అతన్ని చూసి ఇలా అన్నాడు, "ఆ చెరువు చుట్టూ మూడు సార్లు తిరిగి రా". దీనినే ప్రదక్షిణం అంటారు. దీని వెనుక ఒక శాస్త్రం ఉంది, కానీ ఈ రోజుల్లో ప్రజలు దీన్ని హాస్యాస్పదంగా చేసి, అన్నింటి చుట్టూ మూడుసార్లు తిరుగుతూ ఉంటారు. గౌతముడు అతనితో "వెళ్లి ఆ చెరువు చుట్టూరా మూడు సార్లు తిరిగ"మన్నాడు. అతను ఈ బరువైన కొండను మోసుకుంటూ చెరువు చుట్టూ మూడు సార్లు తిరిగాడు. అతను తిరిగి గౌతముడికి దగ్గరికి వచ్చి నిల్చునే సరికి అతని పని సగం అయిపోయింది. గౌతముడు అతని పరిస్థితిని అతని పట్టుదలని గమనించాడు. గౌతముడు అతనితో "నువ్వు నీ ఛాతి వరకు నీళ్లు వచ్చేలాగా, నీళ్ళలోకి దిగిమని" చెప్పాడు. అతను నీళ్ళలోకి వెళ్ళాడు.
అప్పుడు గౌతముడు "మెల్లిగా కుండను నీటిలోకి వదిలేయ్" అన్నాడు. కుండ నీటిలో మునిగిపోయింది. గౌతముడు ఒక దుడ్డు కర్ర తీసుకొని అతని వైపు విసిరి అతనితో ఇలా అన్నాడు "ఈ కర్రను తీసుకొని ఇప్పుడు ఒక్క వేటుతో లోపల ఉన్న కుండను పగలగొట్టాలి. కుండ నీటి లోపల ఉంది, అతను చాలా అలసిపోయి ఉన్నాడు. ఈ పని చేయడం అతనికి చాలా కష్టమే, కానీ అతని తండ్రి స్వర్గానికి వెళతాడు. అందుకని అతను అక్కడ నుంచొని సిద్ధమయ్యాడు. ఆ మనిషి అతనికి తెలుసిన దేవుళ్ళందరినీ తలుచుకొని శ్వాస బిగబెట్టాడు. అప్పుడు గౌతముడు "నువ్వు దీన్ని ఒక్క దెబ్బతో పగలగొడితే, రాళ్లు పైకి తేలి, వెన్న కిందకి పోతుంది అప్పుడు మీ నాన్నగారు స్వర్గం చేరుకున్నట్లే." అన్నాడు. ఒక పెద్ద దెబ్బతో ఆ కుండ పగిలి పోయింది, వెన్న పైకి తేలింది. అపరాధం చేసినట్లుగా అతను చూసి, "వెన్న పైకితేలింది ఇప్పుడు ఏం చేయాలి" అన్నాడు. గౌతముడు "అయితే ఆయన చేరుకోలేదు" అన్నాడు. రాళ్లు పైకి తేలాలి కానీ వెన్న పైకి తేలింది. ఆ మనిషి పూర్తిగా నిరుత్సాహంతో నిస్పృహతో ఉన్నాడు. అతను వెనక్కి తిరిగి నడవడం మొదలు పెట్టాడు.
అతను నీళ్లలో నుంచి బయటికి రావడం మొదలు పెట్టాడు. అతని బుర్ర పని చేయడం మొదలుపెట్టింది. అతను గౌతముడు దగ్గరికి వచ్చి "మీరు వెన్న మునిగిపోతుంది రాళ్లు పైకి తేలతాయి అన్నారు. అసలు అది ఎలా సాధ్యం. ఇది ప్రకృతి ధర్మానికి విరుద్ధం కదా, రాళ్లు మునిగిపోతాయి, వెన్న మాత్రమే తేలుతుంది మీరు నన్ను మోసం చేశారా?" అన్నాడు. అప్పుడు గౌతముడు "ఓఁ, ఇప్పుడు నీకు ప్రకృతి ధర్మాలు తెలుస్తున్నాయి, ఇక సమస్య ఏముంది. మీ నాన్నగారు వెన్న వంటి వారైతే పైకి వెళ్తారు. ఒకవేళ ఆయన ఒక రాయి లాంటి వాడైతే కిందకి పోతాడు. ఇందులో నేను చేయగలిగింది ఏముంది? ఇంకా నువ్వు చేయగలిగింది ఏముంది? నువ్వు చాలా అలసిపోయావు. ఇంటికి వెళ్లి పడుకో!" అన్నాడు
#4 బుద్ధుడు - అంగుళీమాల
ఒక వ్యక్తి ఉండేవాడు. అతనికి జనాలు ఇచ్చిన పేరు అంగుళీమాల. అతనికి ఏదో ఒక సంఘటన జరిగింది. సమాజం తన పట్ల అన్యాయంగా ప్రవర్తించిందని, అతను ఒక కోపిష్టిగా తయారయ్యాడు. యౌవ్వనంలో మీకు ప్రతిదీ అన్యాయం అనిపిస్తుంది. సమాజంపై కోపంతో, తనతో అన్యాయంగా ప్రవర్తించిన ఈ ఊరిలోని 101 మందిని చంపి, వాళ్ళ ఒక వేలును కత్తిరించి, తన మెడ చుట్టూ ఒక దండలా వేసుకుంటానని. అతను ఒక ప్రతిజ్ఞ పూనాడు.
అతను ఆలా చేస్తూ పోయాడు. అతను ఒక అడవిలో ఉండేవాడు, కానీ, అది అనేక మార్గాల మధ్యలో ఉంది. అందువల్ల, కొన్ని సంవత్సరాలలో, అతను వంద మందిని చంపేశాడు. తన ప్రతిజ్ఞ పూర్తిచేయడానికి, ఇంకొకరు కావాలి. ఒక రోజున గౌతమ బుద్ధుడు ఈ ఊరికి వచ్చాడు. అప్పటికే, ఈ వేళ్ళను మాలగా ధరిస్తుండటం వలన, అతన్ని అంగుళీమాల అంటే - చేతి వేళ్ళను దండగా ధరించేవాడు - అని పిలిచేవారు. తన ప్రతిజ్ఞ పూర్తి చేసుకోవడానికి ఇంకొక చేతి వేలు కావాలి. గౌతమ బుద్ధుడు వచ్చాడు, ఆయన ఈ దోవనే వెళ్ళాలి. “ఆ మార్గంలో వెళ్ళవద్దు. వాడు మనిషి కాడు, ఒక మృగం. బోధించడానికి కానీ, ధ్యాన పరుణ్ణి చేయడానికిగానీ, అతను తగిన వాడు కాదు, మీరు వెళ్ళవద్దు ఎందుకంటే అతనికి ఇంకొక ప్రాణం కావాలి. అది మీరేకావాలని మేము కోరుకోవడం లేదు’’ అని ప్రజలు అన్నారు. అప్పుడు గౌతముడు “నేను వెళ్లక పొతే, ఎవరు వెళతారు? అతను కోరిక నెరవేర కుండానే ఉంటాడు. అతనికి ఇంకొక్క వేలే కావాలి. నన్ను పోనివ్వండి” అంటూ ఆయన వెళ్లారు. అంగుళీమాల ఒక రాతి పైన కూర్చుని, మౌనంగా వస్తున్న సన్యాసిని చూసాడు.
ఇప్పటికే, తన పేరు ప్రఖ్యాతుల పట్ల అతనికి ఆనందంగా ఉంది. ప్రజలు అతనంటే భయ భీతులవుతున్నారు, అది అతనికి చాల ఇష్టం. ప్రజలు అతని పేరు వింటేనే వణికిపోతారు. ఆ రాతి మీద కూర్చుని, ఈ సన్యాసి ఆ విషయం తెలుసుకోవాలన్నట్లుగా “నేను ఇక్కడ ఉన్నాను. నీ చావు మూడుతోంది” అంటూ గర్జించాడు. గౌతముడు అతని వైపు చూసి, తన ముఖంపై చిరునవ్వుతో మౌనంగా నడవ సాగాడు. అది అతనికి నచ్చలేదు. సామాన్యంగా అతన్ని చూసినా, విన్నా ప్రజలు తమ ప్రాణాలు రక్షించుకోవడానికి, అస్తవ్యస్తంగా పరిగెత్తుతారు. అదంటే అతనికి ఇష్టం. మరి, ఈ మనిషి చక్కగా నడిచి వెళుతున్నాడు. అతను రాతి మీద నుండి దూకి, అతని ఎదుటికి వచ్చి ఇలా అన్నాడు, ‘‘నువ్వు ఎవడివి? నేనెవరినో తెలుసా?” అంటూ తన వేళ్ళతో ఉన్న మాలను చూపించాడు. ‘‘నా గురించి నీకు తెలుసా?” అని అన్నాడు, గౌతముడు “ఆఁ! నీ గురించి చాల విన్నాను. అయితే ఏమిటి?” అని నడుస్తూనే ఉన్నాడు. అంగుళీమాల ‘‘ఎక్కడికి పోదామను కుంటున్నావు? నేను మాట్లాడుతుంటే, నువ్వు వెళ్తూనే ఉన్నావు?” దానికి గౌతముడు “నా పయనం ఎప్పుడో ఆగిపోయింది. నేను గమ్యం చేరుకున్నాను. నీవే ఎక్కడికో పోదామని ప్రయత్నిస్తున్నావు.” అన్నాడు. అప్పుడు అంగుళీమాల నవ్వి “చెత్త మాటలు. నువ్వో పిచ్చివాడవు. నేను స్థిరంగా నిలుచున్నాను. నీవేమో వెళ్తున్నానని అంటున్నావు, కానీ నువ్వు నడుస్తున్నావు, అయినా ఎక్కడికి వెళ్లడం లేదంటున్నావు. నీకేమయింది?” అన్నాడు. దానికి గౌతముడు “నేను చాలా కాలం క్రిందే చేరుకున్నాను. నేను ఎక్కడికీ వెళ్లడం లేదు. నీవే ఎక్కడికో వెళ్లాలని ప్రయత్నిస్తున్నావు. కానీ, నీకు ఎక్కడికి వెళ్లాలో తెలీదు. నీకు నా వేలు కావాలా లేక నా మెడ కావాలా? నీ దగ్గర వేళ్ళు ఇప్పటికే ఉన్నాయి, నా తలను వెళ్ళాడ తీయి. అది నీ కంఠమాలలో మంచి పతకంగా ఉంటుంది. ఎందుకంటే నా పని పూర్తయింది, నేను చేరాను. నేను భౌతికంగా ఇక్కడ ఉన్నా, లేకపోయినా పర్వాలేదు. నీకు కావాల్సింది చేసుకో” అన్నాడు.
ఎవరినైనా చంపే ఆనందం, వారు భయ భ్రాంతులై, చావడానికి ఇష్టపడక పోతున్నప్పుడే. కాని, చావాలని నిశ్చయించుకుని, విచారించకుండా ఉంటే, అటువంటివాడిని చంపి ప్రయోజనమేమిటి? ఏమనిపిస్తోందంటే ఈ వ్యకిని చంపినప్పటికీ, 101 మందిని చంపాలన్న కోరిక తీరదు, ఎందుకంటే అది ఆనందం ఇవ్వదు. అప్పుడు అంగుళీమాల “ఆఁగు! నీవు ఇది ఏమిటో నాకు చెప్పు? నీవు కదుల్తున్నావు, నేను చేరాను అంటూనే నడుస్తున్నావు. నేను కదలటం లేదు కానీ కదుల్తన్నానని అంటున్నావు” అన్నాడు. గౌతముడు, “నీవు నీకు తెలసిన పద్ధతిలో తృప్తికై ఎదురుచూస్తున్నావు. నేను ఇప్పటికే తృప్తి పొందాను. ఇదే పెద్ద తేడా. నీవు నా ప్రాణం తీయవచ్చు. దాని వల్ల నీకు తృప్తి వస్తుందని నీవనుకుంటే, నువ్వు ఆ పని చెయ్యి, ఎందుకంటే నా పని ప్రజలను తృప్తి పరచడమే. కేవలం నా గొంతు కోసి, ఏ విధమైన బోధనలు లేకుండానే, నీకు ఇంత సులభంగా తృప్తి వచ్చేస్తే, కానిచ్చేయి. సమస్య ఏముంది?” అన్నాడు.
అప్పుడు అంగుళీమాల ఆయన శిష్యుడయ్యాడు. గౌతముడు “నీవు ఏ ఊరిలో వంద మందిని చంపావో ఆ ఊరికి నీవు తప్పక వెళ్ళాలి” అన్నాడు. గౌతముడి సన్యాసులని బిక్కులు అంటారు. బిక్కులు అంటే యాచకులు అని అర్థం. అప్పుడు గౌతముడు అతనికి ఒక పసుపు పచ్చ గుడ్డ, భిక్ష పాత్ర ఇచ్చాడు. ఆయన “వెళ్ళు, ఊరిలో కొంత ఆహారం కోసం ప్రయత్నించు’’ అన్నాడు. ఒక చిన్న ఊరిలో వంద మంది చనిపోయారంటే, దాదాపు ప్రతి ఇంట్లో, ఒకరు ఇతని వల్ల చంపబడ్డారు. అంగుళీమాల ఈ ఊరికి ఒక సన్యాసిలా వచ్చాడు. ప్రజలు అది చూసి భయభీతులయ్యారు. అతను ఏమి చేస్తాడో అని భయపడి, వారంతా మిద్దెల మీదకు వెళ్లారు.
ఎప్పుడయితే వారు ఇతను సాధువైనాడని, ముందటిలా, దుర్మార్గుడు కాదని చూశారో, అతనిపై రాళ్లు రువ్వడం మొదలు పెట్టారు. ఎందుకంటే ప్రతి కుటుంబం వీడివల్ల ఎవరో ఒకరిని కోల్పోయింది. అయినప్పటికీ అతను ముందుకు పోతూనే ఉన్నాడు, రాళ్లు తగిలి అతని దేహం అంతా రక్తసిక్త మయ్యింది. రాళ్లు విసరడం కొద్దిగా ఎక్కువైనప్పుడు, గౌతముడు వచ్చి "ఇతడు ఇంతకు ముందులాంటి వాడు కాదు. ఈతడు నా ప్రతి రూపం. మీరు నా పై రాళ్లు విసురుతున్నారు. వెంటనే ఆపండి. ఇతన్ని చంపి ప్రయోజనం లేదు, ఎందుకంటే ఇతనికి అతి కష్టమైన మార్గంలో జ్ఞానోదయం అయింది. ఇప్పుడు అతన్ని చంపడం ద్వారా, నష్టపోవద్దు" అన్నాడు. ఆ తరువాత అంగుళీమాల, ఒక ప్రసిద్ధ శిష్యుడై, బుద్ధుని జీవన శైలి, అవగాహనల గురించి దేశం నలుమూలల చాటాడు. కానీ, వారు అతన్ని అంగుళీమాల అనే పిలుస్తూ ఉండే వారు, ఎందుకంటే ఆ వేళ్ళ మాలను తన మెడ చుట్టూ ధరించేవాడు.
#5. బుద్ధుడు, ఆనందుడి కథ
బంధుత్వం రీత్యా, ఆనందుడు బుద్ధుడికి సోదరుడు అవుతాడు. బుద్ధుడు ప్రజలకు సన్యాస దీక్ష ఇవ్వడం మొదలు పెట్టినప్పుడు ఆనందుడు వచ్చి, “నేను కూడా సన్యాసి అవుతాను, కానీ నేను నీ శిష్యుడిని అవ్వాలి అంటే, నేను ఒక షరతు, నువ్వు దానికి ఒప్పుకుని తీరాలి, ఎందుకంటే వరుసకు, నేను నీకు అన్నని. నేను నీ శిష్యుణ్ణి అవుతాను, కానీ నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను. నువ్వు నన్ను ఎప్పుడూ, ఏ పనికీ పంపకూడదు. నేను ఎప్పుడూ నీ నీడలా వెన్నంటి ఉంటాను. గౌతముడు అతని వంక చూసి “అది నీ ఇష్టం, నాకు ఏ సమస్య లేదు” అన్నాడు. మీరు శిష్యుడిగా కూడా, షరతు పెట్టాలి అనుకుంటే, అప్పుడు శిష్యుడుగా ఉండటంలోని మాధుర్యం మీకు ఎప్పటికీ తెలియదు. మీరు షరతు పెట్టిన తక్షణమే జీవితంలోని అన్ని సంభావ్యతలను నాశనం చేసినట్టే. గౌతముడు నవ్వి “సరే” అన్నాడు. అతను ఈ షరతు పెట్టినప్పుడు గౌతముడు దాన్ని పాటించాడు, అతనికి ఏ సమస్యా లేదు.
ఒకసారి గౌతముడు తన భార్యను చూడాలనుకున్నాడు, అతను ఆమెను దాదాపు 8 ఏళ్లకు పైగా చూడనేలేదు. తన కుమారుడు పసివాడుగా ఉన్నప్పుడు అతను అర్ధరాత్రి వదిలేసి వెళ్లిపోయాడు. యశోద చాలా అభిమానవతి. కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా, అర్ధరాత్రి అతను వదిలి వెళ్ళిపోయాడని ఆమె చాలా బాధపడింది. అతను తన రాజ్యాన్ని, తన కుమారుడిని, తన భార్యను వదిలేసి, వారితో ఒక్క మాట కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు. ఎనిమిదేళ్ల తర్వాత అతను ఆమెను చూడాలని అనుకున్నాడు, ఎందుకంటే తాను అనుభూతి చెందిన ఈ సంభావ్యతను ఆమెకు కూడా అందించాలని అనుకున్నాడు. గౌతముడు ఆనందుడితో, ”ఇప్పుడు నేను నా భార్యను కలవడానికి వెళుతున్నాను, దయచేసి కాస్త దూరంగా ఉండు, ఇప్పుడు నీ అవసరం లేదు. అమెను అర్ధరాత్రి వదిలేసి వెళ్ళిపోయానని ఇప్పటికే చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నిన్ను తీసుకుని, ఆమెను కలవడానికి వెళ్తే, ఆమె దాన్ని ఒప్పుకోదు. దయచేసి నువ్వు ఇక్కడే ఉండు.” అన్నాడు. ఆనందుడు,‘‘మీరు మీ మాట నిలబెట్టుకోండి!” అన్నాడు.
అది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గౌతముడు మాట తప్పే వ్యక్తి కాదు. అతను “సరే!” అని, తన భార్యను కలవడానికి వెళ్లినప్పుడు ఆనందుడిని కూడా వెంట తీసుకువెళ్ళాడు. ఆమె కోపంతో రగిలిపోయింది, రకరకాల శాపనార్థాలు పెట్టింది, అతనిపై కేకలేసింది, అతన్ని పిరికివాడు అని తిట్టింది. అతను మౌనంగా విన్నాడు. అప్పుడు అతను ఆమెతో, “నిన్ను పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇప్పుడు లేడు, అతను పోయాడు, కానీ నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు నేను ఒక బుద్దుడిని, నేను జ్ఞానోదయం పొందిన వ్యక్తిని. ఆ వ్యక్తి వల్ల సాధ్యమైనది మహా అయితే ఇంకొంతమంది పిల్లలు. కానీ ఇప్పుడు మహత్తరమైనది జరగగలదు. ఈ వ్యక్తి పూర్తిగా భిన్నమైన వాడు. దయచేసి నా వైపు చూడు, నేను అదే వ్యక్తిని కాదు.” అన్నాడు.
అప్పుడు ఆమె “అదేం కాదు, నువ్వు నా భర్తవి!” అంది. ఇవన్నీ ఆనందుడితో షరతు లాగానే బంధంలో ఉండే షరతులు. “నువ్వు పిరికి వాడివి. ఈ పసివాడిని వదిలిపెట్టి వెళ్లిపోయావు. వాడికి కనీసం తన తండ్రి ఎవరో కూడా తెలీదు. నువ్వు పారిపోయావు” అంది. ఇంకా ఎన్నో అంది. ఆమె అనాలనుకున్నవన్నీ అంది. గౌతముడు “పరవాలేదు!” అన్నాడు. అప్పుడు యశోద తను ఎప్పుడూ వాడే యుక్తినే వాడింది, ఆమె, “నీ కొడుకుకి నువ్వు ఇచ్చేది ఏమిటి?” అని అడిగింది. ఆమె తన కుమారున్ని తీసుకువచ్చి, “అతను నీకు ఏమిస్తాడో నీ తండ్రిని అడుగు” అంది. గౌతముడు సిద్ధమయ్యే వచ్చాడు. అతడు ఆనందుడితో “దయచేసి నా భిక్ష పాత్రను తీసుకురా” అన్నాడు. అతను భిక్ష పాత్రను తీసుకువచ్చాడు. అతను తన కుమారుడిని పిలిచి, “నువ్వు ఒక రాజుగా బాధ పడటాన్ని నేను కోరుకోవడం లేదు, అందుకే నీకు పరమోత్తమ స్వేచ్ఛను ఇస్తున్నాను. నా వారసత్వం ఈ భిక్షపాత్ర” అన్నాడు. అతను తన బిక్ష పాత్రను తన ఎనిమిదేళ్ళ కుమారుడికి ఇచ్చాడు, ఇక ఆ కుమారుడు ఒక సన్యాసి అయ్యాడు.
ఆనందుడు తనకున్న సంభావ్యతను కేవలం ఒక్క షరతు మూలంగా నాశనం చేసుకున్నాడు. అతను దాన్ని పూర్తిగా చేజార్చుకున్నాడు. గౌతముడు తన మరణశయ్య మీద ఉన్నప్పుడు, కేవలం జ్ఞానోదయం పొందిన శిష్యులు మాత్రమే లోపల ఉన్నారు. మిగతా వారు బయటే ఉంచ బడ్డారు. ఆనందుడు “నేను అతనితో ఎంతో సన్నిహితంగా ఉన్నాను, కానీ నేను బయటి వారిలో ఉన్నాను. ఎందుకు నాకు జ్ఞానోదయం కాలేదు?” అని ఏడ్చాడు. ప్రజలు ఇదే ప్రశ్నను గౌతముడిని అడిగినప్పుడు, అతను “ఒక చెంచా, వంట రుచిని ఎలా చూడ గలుగుతుంది?” అన్నాడు. మీరు వంట రుచిని చూడాలి అంటే, మీకు నాలికకు ఉండే ఇంద్రియ జ్ఞానం ఉండాలి. మీరు జీవితంపై షరతు పెట్టిన మరుక్షణమే మీరు నిర్జీవంగా మారుతారు. మీరు ఒక వస్తువుగా కుచించుకుపోతారు ఇంకా మీరు మీకున్న సంభావ్యతని కూడా తగ్గించాలని ప్రయత్నిస్తారు. కానీ అది మీకు చాలా దూరంగా ఉంటుంది. ఆనందుడి విషయంలో అదొక దురదృష్టకరమైన విషయం.
#6. దేవుడు ఉన్నాడా ?
గౌతమ బుద్ధుడి జీవితంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. ఒక రోజు ఉదయం, ఆయన తన శిష్యుల మధ్య కూర్చుని ఉన్నప్పుడు ఒక వ్యక్తి వచ్చాడు. అతను రామ భక్తుడు. అతను తన జీవితం అంతా ‘రామా రామా రామా’ అంటూ కేవలం రామనామ జపం మాత్రమే చేస్తూ ఉన్నాడు. అతను గుళ్లకు వెళ్లడం మాత్రమే కాదు, అతను ఎన్నో గుళ్ళను కట్టించాడు కూడా. అతను ఒక గొప్ప భక్తుడు. వయసు పైబడుతుంది, ఇప్పుడు అతనికి ఒక చిన్న అనుమానం తలెత్తింది. “జీవితమంతా నేను కేవలం ‘రామా రామా రామా’ అంటూ రామ నామ జపం చేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని పైన విశ్వాసం లేని వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, వారు ఇక్కడ కూర్చుని ప్రాపంచిక విషయాలలో ఆనందాన్ని పొందుతున్నారు. నేను కేవలం దేవుని పేరు జపం చేయడం కోసం అన్నింటినీ విడచి పెట్టాను. ఒకవేళ ఇతరులు చెబుతున్నట్టుగానే దేవుడే లేకపోతే, అప్పుడు నేను నా పూర్తి జీవితాన్ని వృధా చేసుకున్న వాడిని అవుతాను” అని సందేహం వచ్చింది. అతనికి దేవుడున్నాడని తెలుసు, కానీ ఒక చిన్న సందేహం.
“ఎలాగూ, ఇక్కడ ఒక జ్ఞానోదయం పొందిన వ్యక్తి ఉన్నాడు, అతనికి తెలిసే ఉండాలి.” అతను గౌతముడి దగ్గరికి వెళ్ళాడు. ఉదయాన్నే, సూర్యోదయం కాకమునుపే, అతడు మసక చీకట్లో నుంచుని, “దేవుడు ఉన్నాడా?” అని అడిగాడు. గౌతముడు ఈ మనిషి వైపు చూసి, “లేడు!” అన్నాడు. మొట్టమొదటిసారిగా గౌతముడు స్పష్టంగా “దేవుడు లేడు!” అని చెప్పాడు. అక్కడ ఉన్న శిష్యులందరికీ, ఎప్పుడూ తమ లోపల ఇది ఒక పెద్ద సంఘర్షణ - దేవుడు ఉన్నాడా, లేడా? అని. ఇది ఎంతో పెద్ద సంఘర్షణ, కొన్ని వేల ఏళ్లుగా ఉన్న సంఘర్షణ ఇది. మనిషి ఈ భూమి మీద నివసించటం మొదలైనప్పటి నుండి అతనిలో ఉన్న సంఘర్షణ ఇది. విశ్వసించే వారికి, ఇంకా విశ్వసించని వారికి ఇద్దరికీ ఉన్నదే ఈ సంఘర్షణ. మొట్టమొదటిసారిగా గౌతముడు కచ్చితంగా “లేడు” అని చెప్పాడు. ఇక అది ఒక గొప్ప ఊరట. ఇక మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. దేవుడు లేడు. మీ మీద ఎవరూ నిఘా పెట్టి చూడడం లేదు. మీ జీవితంలో మీకు కావాల్సింది మీరు చేసుకోవచ్చు. ఎంత ఆనందమో కదా! అది ఒక పెద్ద ఊరట.
ఆ రోజు సాయంత్రం మరొక వ్యక్తి వచ్చాడు. ఇతను ఒక చార్వకుడు. తమకు కనిపించేది తప్ప, మరి దేన్నీ నమ్మని పూర్తి లౌకికవాదులు వీళ్ళు. దేశంలో ఆ రోజుల్లో, అదే వృత్తిగా పనిచేసే చార్వకులు ఉండేవాళ్ళు. వాళ్ళు మీ పట్టణానికి వచ్చి ఒక సవాలు విసిరే వాళ్ళు, “దేవుడు లేడని నేను మీకు నిరూపిస్తాను. మీరు గనుక దేవుడు ఉన్నాడని నాకు నిరూపిస్తే, నేను మీకు ఇంత డబ్బు ఇస్తాను, కానీ నేను దేవుడు లేడు అని నిరూపిస్తే మీరు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి” అని సవాలు విసిరే వాళ్లు. ఇదే వాళ్ళ వృత్తి. అతను ఒక ప్రతిభావంతుడైన చార్వకుడు. మీరు 50 ఏళ్లుగా దేవుడిపై నమ్మకంతో ఉండవచ్చు, కానీ మీరు అతనితో పదిహేను నిమిషాలు మాట్లాడితే, అతను మీకు దేవుడు లేడు అని నిరూపిస్తాడు. అతను దేవుడు లేడు అని కొన్ని వేల మందికి నిరూపించాడు. అతనికి ఇప్పుడు వయసు పైబడుతున్నది, ఇప్పుడు ఒక చిన్న సందేహం వచ్చింది. “ఒకవేళ దేవుడు ఉంటే? అని. దేవుడు లేడు అని అంతకాలంగా నిరూపించిన తరువాత, ఒకవేళ నేను అక్కడికి వెళితే, అతను నన్ను వదిలి పెడతాడా? ఇప్పటికే ఈ విశ్వాసులు దేవుడికి చాలా కక్ష ఉంటుంది అని చెబుతూ ఉంటారు - అతను నన్ను విడిచి పెడతాడా?” ఒక చిన్న భయం వచ్చింది. అతనికి కచ్చితంగా తెలుసు దేవుడు లేడు అని, కానీ ఒక చిన్న సందేహం వచ్చింది.
అతను సాయంత్రాన సూర్యుడు అస్తమించిన తరువాత, గౌతముడి దగ్గరికి వచ్చి, మసక చీకటిలో నుంచుని, అదే ప్రశ్నను అడిగాడు, “దేవుడు ఉన్నాడా?” గౌతముడు ఈ మనిషి వైపు చూసి, “ఉన్నాడు!” అన్నాడు. ఇక శిష్యులలో మళ్లీ అలజడి మొదలయ్యింది. ఉదయాన ‘దేవుడు లేడు’ అని తెలుసుకుని వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు. సాయంత్రానికి వచ్చేసరికి అతను ‘దేవుడు ఉన్నాడు’ అని అంటున్నాడు. గౌతముడు ఎందుకు ఆడుతున్నాడు? అసలు ఏమిటీ ఆట? అతను కేవలం గందరగోళం సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాడా? లేదు! ఈ ఆట అంతా, అన్ని నమ్మకాలను తీసివేయడానికే, అప్పుడే మీరు నిజంగా అన్వేషిస్తారు. నమ్మకంతో మీరు కేవలం అన్వేషణను నాశనం చేస్తారు అంతే.
#7. బుద్ధుడు జన్ సంప్రదాయాన్ని ఎలా ప్రారంభించాడు
ఒకానొక రోజున, గౌతముడు వచ్చి వేదిక మీద కూర్చున్నాడు. కొన్ని వందల మంది శిష్యులు ఆయన బోధన కోసం వేచి చూస్తున్నారు. వారిలో మహాకశ్యప అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ సంఘంలో మిగతావారంతా, అతను వెర్రివాడు అని తీర్మానించారు, ఎందుకంటే అతను ఎప్పుడూ కూర్చుని గౌతమ బుద్ధుడి మాటలు వినడు. అతను ఎప్పుడూ ధ్యానం చేయడు, ఇంకేదీ చేయడు. అతను ఒక మూర్ఖుడిలా ఊరికే అలా ఒక చెట్టు కింద కూర్చుని ఉంటాడు. అతను చురుకైన ఆధ్యాత్మికుడు కాదు. అతను ఊరికే అక్కడ కూర్చుని ఉంటాడు. ఏమి నేర్పించడానికి వీలులేని ఒక మూర్ఖుడని అందరూ అతన్ని వదిలేశారు. ఆరోజున గౌతముడు వచ్చి కూర్చున్నాడు. ఆయన చేతిలో ఒక పువ్వు ఉంది. ఆయన ఊరికే ఆ పువ్వు వైపు అలా చూస్తూనే ఉండిపోయాడు. అందరూ ఆయన మాట్లాడతారని వేచి చూస్తూ ఉన్నారు. కానీ ఆయన ఆ పువ్వులో ఎంతగా లీనమైపోయాడంటే, ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నిమిషాలు గంటలు అయ్యాయి, కానీ ఆయన అలా ఆ పువ్వు వైపు చూస్తూనే ఉన్నారు. మాట్లాడాలి అని కూడా ఆయన అనుకోలేదు. ఉన్నట్టుండి మహాకష్యపుడు నవ్వడం మొదలెట్టాడు. బిగ్గరగా నవ్వుతున్నాడు. అప్పుడు గౌతముడు మహాకశ్యపుడి వంకా ఇంకా ఆ మిగిలిన అందరివంకా చూసి, “మాటల ద్వారా నేను ఏమి ఇవ్వగలనో, అది మీకు ఇచ్చాను; నేను దేన్నయితే మాటల ద్వారా ఇవ్వలేనో, దాన్ని మహాకశ్యపుడికి ఇచ్చాను” అన్నాడు. అదే జెన్ సంప్రదాయం యొక్క ప్రారంభం. ఇందులో శాస్త్రం ఉండదు, బోధన ఉండదు, గ్రంథాలు ఉండవు, పద్ధతి ఉండదు, లేదా సాధన ఉండదు. మీరు ఊరికే కూర్చుని వేచి చూస్తూ ఉంటారు. అది జరిగినప్పుడు, అది మీకు జరుగుతుంది.
జెన్ సంప్రదాయం ఒక వెర్రి సంప్రదాయం, కానీ అదొక అద్భుతమైన సంప్రదాయం, ఎందుకంటే ఎక్కడ అసలు ఏవిధమైన బంధనమూ ఉండదు. కానీ జెన్ అనేది జరగాలి అంటే, అక్కడ మహాకశ్యపుడి లాంటి వాడు ఉండాలి, ఆ స్థాయి అనుభూతి కలిగిన ఎవరో ఒకరు ఉండాలి; లేదంటే అది జరగదు.
మహాకశ్యపునికి ఇంకా గౌతముడికి మధ్య జరిగినది ప్రపంచంలోనే రికార్డు చేయబడిన మొట్టమొదటి జెన్. అది అంతకు ముందు ఎన్నో సార్లు జరిగి ఉండవచ్చు, కానీ అప్పుడు అది ఒక ఆధ్యాత్మిక మార్గంగా కాలేదు.
#8. బుద్ధుడు “పడేయి” అంటున్నాడు
ఒక రోజున, ఒక వ్యక్తి గౌతమ బుద్ధుని చూడడానికి వచ్చాడు. గౌతముడు ఏకాంతంగా ఒక చిన్న ఆవరణలో కూర్చుని ఉన్నాడు, ఆ వ్యక్తి తన రెండు చేతుల నిండా పూలను తీసుకుని వచ్చాడు, ఎందుకంటే అది భారతదేశంలో గురువుకు అభివాదం చేసే విధానం. ఆ వ్యక్తి గౌతమ బుద్ధుడి వైపు వస్తూ ఉండగా, గౌతముడు అతని వైపు చూసి “పడేయి” అన్నాడు. అతను అలా అన్నప్పుడు, సమర్పణగా పూలను తీసుకొచ్చాడు కాబట్టి వాటిని క్రింద పడవేయమని అంటున్నాడేమో అని అతను అనుకున్నాడు. మళ్లీ వీటిని ఎడమచేతిలో తీసుకుని వస్తున్నాను కాబట్టి, బహుశా అది అమంగళమైనదేమో అని అతను అనుకున్నాడు. ఇది కూడా ఈ సంస్కృతిలో భాగమే. మీరు దేన్నయినా మీ ఎడమచేతితో ఇస్తే, దాన్ని అమంగళమైనదిగా భావిస్తారు. కాబట్టి అతను తన ఎడమ చేతిలోని పూలను పడేసి, వినయంగా ముందుకు సాగాడు. గౌతముడు అతని వైపు చూసి మరొకసారి “పడేయి” అన్నాడు. ఇప్పుడు అతనికి ఏం చేయాలో తెలియలేదు, ఈ పూలతో వచ్చిన తప్పేంటి? అతను మిగిలిన పూలను కూడా పడేశాడు. అప్పుడు గౌతముడు, “నేను పడేయమన్నది, పూలను కాదు, ఈ పూలను తెచ్చిన వాడు ఎవడైతే ఉన్నాడో అతన్ని పడేయి.” లేదంటే మీరు బుద్ధుడిని తెలుసుకోలేరు. మీరు వస్తారు, నమస్కారం చేస్తారు, వింటారు, వెళతారు, కానీ మీరు ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తితో ఉండటం అంటే ఏంటో తెలుసుకోలేరు. మీరు ఈ సంభావ్యతను పూర్తిగా కోల్పోతారు.
మీరు మీ జీవితంలోకి ఒక పూర్తిగా సరికొత్త పార్శ్వాన్ని తీసుకురావాలి అనుకుంటే, మీరు దాన్ని పడేయాలి, మరొక దాన్ని కాదు. మీ పనిని వదిలేయడం, మీ కుటుంబాన్ని వదిలి వెళ్ళటం, లేదా దీన్ని, దాన్ని వదిలేయటం వల్ల ఏమీ కాదు. ప్రస్తుతం మీరు దేన్నయితే “నేను” అని అంటున్నారో, అది కేవలం ఆలోచనల, భావోద్వేగాల, మనోభావాల, అభిప్రాయాల ఇంకా విశ్వాసాల సమాహారం మాత్రమే. మీరు దాన్ని పడేయకపోతే, ఇక కొత్త సంభావ్యతకు ఆస్కారం ఎక్కడ? మీరు కేవలం పాత వాటినే కొత్త విషయాలతో అలంకరణ చేయాలనుకుంటున్నారా? అది మీకు పని చేయదు. అది విషయాలను మరింత కష్ట తరంగా చేస్తుంది. కానీ మీరు పడేద్దాము అనుకున్నంత మాత్రాన అది పడిపోదు. కాబట్టే ఈ పడిపోవటం అనేది జరిగేలా చేయడానికి అవలంబించ వలసిన విధానాలు, ప్రక్రియలు ఉన్నాయి.
#9. బుద్దుడు ఒక సన్యాసిని ఒక వేశ్య దగ్గరకు ఎందుకు పంపించాడు?
గౌతమ బుద్ధుడు, ఆయన శిష్యులు నిరంతరం గ్రామం నుండి గ్రామానికి, పట్టణం నుండి పట్టణానికి పయనిస్తూనే ఉండేవారు. అతను వెళ్ళినప్పుడల్లా అతనితోపాటు 2000 నుంచి 3000 మంది సన్యాసులు ఉండేవాళ్ళు. వీళ్ళందరూ కూడా తమ ఆహారం కోసం బిక్షాటన చేసే వాళ్ళు. భారతదేశంలోని సంస్కృతి ఏమిటంటే, ఒక ఆధ్యాత్మికుడు మీ ద్వారం వద్దకు వచ్చి ఆహారం కోసం అడిగితే, ఆఖరికి మీ సొంత పిల్లలు తినకపోయినా సరే, మీరు ముందు ఆయనకు ఇవ్వాలి. ప్రజలు ఈ విధంగా ఉన్నప్పుడు అతను రెండు, మూడు వేల మంది సన్యాసులతో ఒక పట్టణంలోకి వెళ్ళినప్పుడల్లా, ఉన్నట్టుండి ఆ పట్టణ వాసుల మీద భారం పడేది. కాబట్టి అతను ఒక నియమం పెట్టాడు, వాళ్లు ఎప్పుడూ ఒకే చోట రెండు, మూడు రోజులకు మించి ఉండకూడదు, ప్రజల మీద భారం పడకుండా ఉండడం కోసం.
ఉత్తర, తూర్పు భారత భూభాగాలలో చాలా ఎక్కువ వర్షం పడుతుంది కాబట్టి, కాలినడకన వర్షాకాలంలో అడవులలో ప్రయాణం చేయడం కష్టం. అలా అడవులలో నడవడం చాలా ప్రమాదకరం, చాలా మంది తమ ప్రాణాలు కోల్పోతారు. అందుకే, ఆ సమయంలో వారు ఏదైనా, ఎక్కువ ఇళ్లు ఉన్న పట్టణంలో బస చేస్తారు.
పగటి పూట ఆ సన్యాసులు భిక్షాటన కోసం వెళ్లేవాళ్లు. ఆనంద తీర్థుడికి ఒక వేశ్య ఎదురయ్యింది. ఆమె అతనికి బిక్ష ఇచ్చి, పొడుగైన, అందమైన అతని వైపు చూసి, “సన్యాసులు ఆశ్రయం కోసం చూస్తున్నారని విన్నాను. మీరు నా ఇంట్లో ఎందుకు ఉండకూడదు?” అంది. ఆనంద తీర్థ, “ఎక్కడ ఉండాలి అనే విషయం నేను బుద్ధుణ్ణి అడగాలి” అన్నాడు. ఆమె చాలా గట్టిగా “ఓ నువ్వు నీ గురువుని అడగాలా? వెళ్లి అతన్ని అడుగు, అతను ఏమంటాడో చూద్దాం!” అంది. ఆనంద, గౌతముడి దగ్గరకు వెళ్లి తను తెచ్చిన భిక్ష అతని కాళ్ల వద్ద ఉంచాడు. ప్రతివారూ వెళ్ళిన చోట, ఆహారాన్ని ఇంకా ఆశ్రయాన్ని వెతుక్కోవడం సంప్రదాయం కాబట్టి, ఆనంద, “ఈ స్త్రీ నన్ను ఆహ్వానిస్తోంది, నేను అక్కడ ఉండవచ్చా?” అని అడిగాడు. గౌతముడు, “ఆవిడ నిన్న ఆహ్వానిస్తున్నప్పుడు, నువ్వు వెళ్లి అక్కడ ఉండి తీరాలి” అన్నాడు. ఆ మాట విన్నప్పుడు అతని చుట్టూ ఉన్న ఆ పట్టణవాసులు వ్యతిరేకించారు. “ఇదేంటి? ఒక సన్యాసి ఒక వేశ్య ఇంట్లో ఉండటమా? అలా అయితే, ఈ ఆధ్యాత్మిక ప్రక్రియ కలుషితమై పోయినట్లే” అన్నారు. గౌతముడు వారి వైపు చూసి, “మీరు ఎందుకు కంగారు పడుతున్నారు? ఆ స్త్రీ అతన్ని ఆహ్వానిస్తోంది. అతన్ని అక్కడ ఉండనివ్వండి. సమస్య ఏంటి?” అన్నాడు.
ప్రజలు లేచి వెళ్ళడం మొదలు పెట్టారు. ఆయన “ఆగండి! నేను ఈ మార్గాన ఉన్నది ఎందుకంటే, జీవించేందుకు అత్యంత విలువైన ఇంకా శక్తివంతమైన విధానంగా నేను దీన్ని చూస్తున్నాను. ఇప్పుడు మీరు నాకు నా విధానాల కన్నా ఆవిడ విధానాలు శక్తివంతమైనవని చెప్తున్నారా? అదే గనుక వాస్తవం అయితే, నేను కూడా వెళ్లి ఆమెతో కలసిపోవాలి. ఒక సత్యాన్వేషిగా ఉండాల్సిన విధానం అదే. మీరు ఏదైనా మరింత ఉన్నతమైనది చూస్తే, మీరు దానికై వెళ్లాలి’’ అంటాడు. ప్రజలకు చాలా కోపం వచ్చింది, చాలామంది వెళ్లిపోయారు కూడా. కాని, ఆనంద ఆవిడతోనే ఉన్నాడు. వర్షాల కారణంగా చలి పెరిగింది. అతను కేవలం ఒక పలుచని వస్త్రం మాత్రమే ధరించి ఉన్నాడు. ఆవిడ అతనికి ఒక చక్కని పట్టు వస్త్రాన్ని ఇచ్చింది. అతను అది కప్పుకున్నాడు. ఇది చూసి, అతను పెడదారి పడడానికి, ప్రజలు దీన్ని రుజువుగా తీసుకున్నారు. ఆమె అతనికై మంచి ఆహారం వండింది, అతను భోజనం చేశాడు. సాయంత్రం ఆమె అతని కోసం నృత్యం చేసింది. అతను అత్యంత ఏకాగ్రతతో చూస్తూ ఉన్నాడు. ప్రజలు ఆ సంగీతాన్ని విన్నప్పుడు వాళ్లు అతను పతనమై పోయాడు అనుకున్నారు. కాలం గడిచింది. వర్షాకాలం అయిపోయాక, ఇక బయలుదేరవలసిన సమయం వచ్చినప్పుడు, ఆనందుడు గౌతమ బుద్ధుడి దగ్గరికి ఒక ఆడ సన్యాసితో వచ్చాడు. ఇది సత్యమార్గంలో ఉండటంలోని శక్తి.
#10. బుద్ధుడిని ఒక తల్లి, తన చనిపోయిన కుమారుడిని బ్రతికించమని అడుగుతుంది
ఒకానొక రోజున, ముగ్గురు పిల్లలు గల స్త్రీ ఒకరు, భర్తను కోల్పోతుంది, ఆమె సహజంగానే శోకంలో మునిగిపోయింది. ఆ తరువాత ఆవిడ ఆ ముగ్గురు పిల్లలే తన ప్రాణంగా చూసుకుంటూ ఉంది. కానీ ఒక సంవత్సరం తర్వాత వారిలో పెద్ద కుమారుడు చనిపోతాడు. ఆ తర్వాత, వెంటనే రెండో కుమారుడు చనిపోతాడు. ఇక తనకు మిగిలిన ఒకే ఒక్క కుమారుణ్ని తన ప్రాణంగా చూసుకుంటూ ఉంటుంది. కానీ ఆ తర్వాత, ఈ పిల్లవాడు కూడా చనిపోతాడు. దీన్ని భరించలేక ఆమె ఆ చిన్న పిల్లవాడి మృత దేహాన్ని తీసుకుని గౌతమబుద్ధుని వద్దకు వస్తుంది. ‘‘మీరు, మీ ఆధ్యాత్మికత అంతా వ్యర్థం. మీరు నా పిల్లవాడిని తిరిగి బ్రతికించకపోతే, అవన్నీ అర్థంలేని విషయాలే. నా భర్త చనిపోయాడు ఎలాగోలా దాన్ని భరించాను. నా మొదటి కుమారుడు చనిపోయాడు, ఆ తర్వాత రెండో వాడు కూడా. అయినా నేను నిలదొక్కుకున్నాను. ఇప్పుడు ఆఖరి కొడుకు కూడా పోయాడు. మీరే గనక నిజమైతే, ఇప్పుడు ఈ పిల్లవాడిని తిరిగి బ్రతికించడం ద్వారా రుజువు చేసుకోండి” అంది.
గౌతముడు ఆమె వంక చూసాడు, భావోద్వేగంతో ఉన్న ఈ స్థితిలో, ఏమి చెప్పినా, ఏమి చేసినా లాభంలేదు అని అతనికి తెలుసు. కాబట్టి అతను, “నేను నీ పిల్లవాడిని తిరిగి బ్రతికిస్తాను. నువ్వు వెళ్లి నాకోసం, అసలు చావే చూడని ఇంటి నుండి కాసిని నువ్వులు తీసుకురా!” అంటాడు. ఈ పిల్లవాడి మృతదేహాన్ని తీసుకొని, అసలు చావే ఎరుగని ఇంటి కోసం వెతుకుతూ, ఇంటింటికీ వెళ్తుంది. పట్టణం మొత్తం తిరిగాక, ఆవిడ ఆ విధంగా ఒక్క ఇల్లు కూడా లేదు అని గ్రహిస్తుంది. ఆవిడ ఆ మృతదేహానికి చేయాల్సిన కర్మలు చేసి, తిరిగి వచ్చి గౌతమబుద్ధుడి ముందు కూర్చుంటుంది. ఆ తర్వాత తన జీవితకాలమంతా ఆమె అతని వద్దే ఉంటుంది.
#11. బుద్దుడు ఎలా చనిపోయాడు
బుద్ధుడు విషప్రయోగం వల్ల చనిపోతాడు. అతని ఆహారంలో విషాన్ని కలుపుతారు, దాన్ని తిన్నాక ఆ విషయం తెలుసుకుంటాడు, ఇంకా దాన్ని తప్పించుకోలేం అని అతనికి తెలుసు. ఆ ఆతిథ్యం ఇచ్చిన వారు బుద్ధునికి, ఇంకా అతనితో పాటు ఉన్న సన్యాసులందరికీ అన్నం వండుతారు. “మీరు నాకు అద్భుతమైన ఆహారం ఇచ్చారు. నేను దాన్ని తీసుకున్నాను. కానీ నా శిష్యులు ఈ ఆహారాన్ని జీర్ణించుకోగలరని నేను అనుకోవడం లేదు. నేను తిన్నాను కాబట్టి, మీరు ఇచ్చిన ఆతిథ్యంతో మీరు సంతృప్తి పడాలి. నా వారికి అది పెట్టకండి” అంటూ ఆయన ఒరిగి పోతాడు. అతను ఇంకా చనిపోలేదు, కానీ అనారోగ్యంతో పడిపోయాడు. శిష్యులు గుమిగూడతారు, ఆయన వాళ్ళతో దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అన్న విషయమై కొన్ని సూచనలు ఇస్తాడు. ఎందుకంటే ఆయన ఊహించని విధంగా చివరి దశకు వచ్చాడు. అతను ఇంకొన్ని సంవత్సరాలు బతికి ఉండేవాడు. కాని ఇప్పుడు అతను కూర్చోలేక పోతున్నాడు. పడుకుని మాట్లాడడానికి వీలయ్యేది కాదు. కాబట్టి అతను తన తలకు ఊతం తీసుకొని మాట్లాడాడు. ఆ భంగిమే గౌతముని మహాపరినిర్వాణ భంగిమగా అయింది. బౌద్ధులకు ఆ భంగిమ ఎంతో పవిత్రమైనది. బుద్ధుడు పడుకొని ఉన్న చిత్రాలు ఎన్నో ఉన్నాయి, ఎందుకంటే అతని ఆఖరి సందేశం, ఈ ఉద్యమం ఎలా కొనసాగాలి అన్న దానిపైన అతను మార్గనిర్దేశం చేయడం అనేది ఆ సమయంలోనే జరిగింది. కాబట్టి చాలా మంది బౌద్ధులు ఈ భంగిమలో పడుకోవడం మొదలుపెట్టారు. అది ఒక సంస్కృతి. మీరు ఆ భంగిమను అనుకరించవచ్చు, కానీ మీరు ఒక బుద్దుడు కాలేరు.
Questioner: ప్రశ్న: సద్గురూ, అంటే నేను ఒక బుద్దుడిని కాలేననా ?
Sadhguru: సద్గురు: గౌతముడు ఒక బుద్ధుడిగా కాగలిగినప్పుడు, మీరు ఒక బుద్ధుడిగా ఎందుకు కాలేరు? బుద్ధుడు అంటే బుద్ధికి అతీతమైన వాడు అని. ఇన్నర్ ఇంజినీరింగ్ లోని కృషి అంతా కూడా మిమ్మల్ని ఒక బుద్ధుడిగా చేయడం కోసమే. కొన్ని క్షణాల పాటు మేము మిమ్మల్ని బుద్ధుడిగా చేసాము, ఎందుకంటే కొన్ని క్షణాల పాటు మీరు మీ తర్కానికి అతీతంగా ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం అంతా, అక్కడే ఉండడం ఎలా అన్నదే; అక్కడ ఉండడానికి అవసరమైన ఎరుకని తెచ్చుకోవడమే కావలసింది.
Referring to those who conduct death rituals to assist the deceased person’s transition.