పిల్లలకి ఎంతవరకు స్వేచ్చను ఇవ్వాలి?
పిల్లలకి ఎంతవరకు స్వేచ్చను ఇవ్వాలి? అని వి.వి.యస్. లక్ష్మణ్ సద్గురుని ప్రశ్నించారు
వివిఎస్ లక్ష్మణ్: ప్రియమైన సద్గురు గారు, పిల్లల పెంపకం గురుంచి సత్యం తెలుసుకోవాలనుకుంటున్నాను. నా చిన్నప్పుడు ఇంకా యవ్వనంలో కూడా స్వేచ్ఛగా, నాకు నచ్చినట్టుగా ఉండాలనుకునే వాడిని. ప్రతీ తరం ఇలాగే కోరుకుంటుందనుకుంటా. పిల్లలకు స్వాతంత్ర్యం ఇచ్చి, వారి నిర్ణయాలను వారినే తీసుకోమన వచ్చా? మనము వారిని ఎంతవరకు హద్దుల్లో పెట్టాలి, అసలు హద్దుల్లో పెట్టవచ్చా? మంచి తల్లితండ్రులవడానికి మీరు మాకు ఇచ్చే సలహా ఏమిటి?
సద్గురు: నమస్కారం లక్ష్మణ్! మీ మణికట్టులో దాగివున్న నైపుణ్యాలన్నీ మేమందరం బాగా enjoy చేశాం, cricket ground లో. మరి పిల్లల పెంపకం విషయంలో, పిల్లల్ని మనం పెంచాలి అనే దృక్పథం పూర్తిగా పాశ్చాత్య దేశాల నుంచి వచ్చింది. మీరు కేవలం పిల్లలని ఎదిగేలా చూడాలి గాని మీరు పెంచకూడదు. మనం పశువుల్ని పెంచుతాం కాని మనుషుల్ని పెంచం.మీరు వారికి కేవలం ప్రేమ, ఆనందం ఇంకా భాద్యతలతో కూడిన వాతావరణాన్ని సృష్టించాలి. మీ ప్రశ్నలో మీరు “స్వాతంత్ర్యం” అనే పదాన్ని వాడారు. స్వాతంత్ర్యం అనేది ఒక తప్పు పదం. మీరు “స్వాతంత్ర్యం” అనే పదాన్ని వాడకూడదు ఇంకా “స్వాతంత్ర్యం” అనే పదాన్ని మీ పిల్లలికి కుడా అలవాటు చేయకూడదు. పిల్లలకి వారి బాగోగులు, ఆరోగ్యం, ఎదుగుదల ఇంకా జీవితంలో ప్రతీ పరిమాణానికి స్పందించే విధముగా మీరు బాధ్యతగా వ్యవహరించాలి. ఇది వారి జీవితంలోకి తీసుకురావాలి. ఎప్పుడైతే అవసరమైన వాతావరణం కల్పించామో, స్వేచ్ఛ అనేది అదే వస్తుంది.
మనం ఇప్పుడు goal-oriented అయిపోయాం, ఇప్పుడు ప్రపంచంలో ప్రధాన సమస్య,. మనకి ఫలితం మీదే ఆసక్తి గానీ పద్ధతి మీద కాదు. మీకు తోటలో పువ్వులు పుయ్యాలంటే, మీరు పువ్వుల గురుంచి మాట్లాడకండి. మీరు ఒక మంచి తోటమాలి అయితే , మీరు పువ్వుల గురుంచి మాట్లాడరు. మీరు మట్టి, ఎరువు, నీళ్ళు, సూర్య కాంతి గురించి మాట్లాడతారు. మీరు వీటిని నిర్వహిస్తే చాలు అందమైన పువ్వులు అవే పూస్తాయి.
అదేవిధంగా మీరు పిల్లల వికాసానికి అవసరమైన వాతావరణం కల్పిస్తే, వారు అధ్బుతంగా వికసిస్తారు. కాని మీరు పిల్లల్ని మీ మనస్సులో మీరు ఏర్పరచుకున్న ఒక (పద్ధతిలో) మూసలో ఒదిగేలాగా పెంచుదామనుకుంటే మాత్రం ప్రతీ పిల్లవాడు ఎదురు తిరుగుతాడు, ఎందుకంటే మీరు మనస్సులో ఏర్పరచుకున్న ఆకారంలోకి ఎవ్వరూ ఒదగలేరు. జీవం మీ మనస్సులో ఏర్పరచుకున్న చట్ర పరిధిలో ఒదగదు. మనస్సే జీవితంలో ఒదగాలి. ఇది అర్థంచేసుకోండి.
కాబట్టి పిల్లల్ని పెంచటానికి పెద్ద పెద్ద ఐడియాలు పెట్టుకోకండి. ప్రేమ, ఆనందం ఇంకా భాద్యత కలిగిన ఒక వాతావరణాన్ని create చెయ్యటమే మీ పని. ఇంకా ముఖ్యముగా తల్లితండ్రులలో కలిగే అసహనం, అసూయ, చిరాకు, ఒత్తిడి ఇంకా కోపం లాంటివి పిల్లలు చూడకూడదు. అప్పుడు మీ పిల్లలు అధ్బుతంగా వికసించడం, మీరు చూస్తారు ఎందుకంటే మీరు ఈ పద్ధతికి ప్రాముఖ్యం ఇస్తే, ఫలితాలు అవే వస్తాయి. ఒకవేళ మీరు ఫలితం మీద దృష్టి పెట్టి, పద్ధతిని పక్కన పెడితే, మీరు కోరుకుంటున్న ఫలితం ఒక కలలాగే మిగిలిపోతుంది.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.