ప్రేమ అంటే ఏమిటి?
ప్రేమ అంటే ఏమిటి? ప్రేమలో పడడం అంటే ఏమిటి? ఈ విషయాల గురించి సద్గురు మాటల్లో తెలుసుకోండి.
ఒక రోజున... శంకరన్ పిళ్ళై .. పార్క్ కి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన అమ్మాయి, పార్కులో రాతి బెంచీ మీద కూర్చుని ఉంది, అతను వెళ్లి అదే బెంచీ మీద కూర్చున్నాడు. కొంత సమయం తర్వాత ఆమె దగ్గరకు జరిగాడు. ఆవిడ కొంచెం దూరం జరిగింది. రెండు నిమిషాలాగి, మళ్ళీ దగ్గరకి జరిగాడు. ఆవిడ దూరం జరిగింది. కొంత సేపాగి మళ్లీ దగ్గరకి జరిగాడు. అప్పుడు ఆవిడ బెంచీ అంచుకి జరిగింది. అతను దగ్గరకు జరిగి ఆమెపై చెయ్యి వేసాడు. ఆమె అతన్ని విదిలించుకుంది. అతను కొంత సేపలా కూర్చుని, ఒక పువ్వు తెంచి ఆమెకిచ్చి మోకాళ్ళ మీద నిల్చొని “ఐ లవ్ యూ” అని చెప్పాడు. “నా జీవితంలో నేను ఎవరినీ ప్రేమించనంతగా నిన్ను ప్రేమిస్తున్నాను” అన్నాడు.
ఆవిడ కరిగింది. ప్రకృతి తన పని చేసింది. ఇక వారి మధ్య విషయాలు జరిగాయి. సాయంత్రమై పొద్దు పోతోంది. శంకరన్ పిళ్ళై లేచి, “నేను వెళ్ళాలి, ఎనిమిది అయ్యింది, మా ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది” అన్నాడు.
ఆవిడ ”ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ప్రేమిస్తున్నానన్నావు కదా?” అంది.
అతను “అవును, కానీ టైమైంది. నేను వెళ్లి తీరాలి” అన్నాడు.
సాధారణంగా, మనం సంబంధాలన్నింటినీ మనకు సౌకర్యమైన, లాభదాయకమైన కట్టుబాట్ల కనుగుణంగా చేసుకున్నాము. ప్రజలకు శారీరక, మానసిక, ఉద్వేగపూరిత, ఆర్ధిక లేదా సమాజ పరమైన అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలను తీర్చుకునే ఉత్తమమైన దారి ‘ఐ లవ్ యు’ అని చెప్పడం. ‘ప్రేమ’ అనే ఈ పదం ఒక మంత్రం లాగా మారింది. మీకు కావాల్సిన దాన్ని పొందేందుకు ఇలా చెప్తారు. మనం చేసే ప్రతి పని ఏదో విధంగా కొన్ని అవసరాలను తీర్చుకునేందుకే.
మీరు దీన్ని గమనిస్తే, ప్రేమను మీ సహజ స్వభావం చేసుకుని ప్రేమించే సంభావ్యత లభిస్తుంది. కానీ ప్రజలు వారి సౌలభ్యం కోసమో, సౌకర్యం కోసమో, శ్రేయస్సు కోసమో ఏర్పరచుకున్న బంధాలను ప్రేమ వలన కలిగిన బంధాలనుకుని వారిని వారు మభ్య పెట్టుకుంటున్నారు. ఈ బంధాలలో ప్రేమానుభూతి అసలు లేదని నేనడం లేదు, అది ఉంది కానీ కొన్ని పరిధులలో మాత్రమే. ‘ఐ లవ్ యు’ అని ఎన్ని సార్లు చెప్పారన్నది విషయం కాదు, కొన్ని ఆశలు, అవసరాలు నెరవేరకపోతే ఎన్నో విషయాలు విడిపడి పోతాయి
బేషరతుగా ప్రేమించడం ఎలా
మీరు ప్రేమ గురించి మాట్లాడినపుడు అది షరతుల్లేకుండా ఉండాలి. వాస్తవానికి షరతులతో కూడిన లేదా షరతుల్లేని ప్రేమ అంటూ ఏదీ లేదు. ఇక్కడ షరతులూ ఉంటాయి, ప్రేమ ఉంటుంది. షరతులు విధించిన క్షణమే అదొక లావాదేవీగా మారుతుంది. బహుశా ఒక సౌలభ్యమైన లావాదేవీ లేదా ఒక మంచి ఏర్పాటు అవ్వొచ్చు. చాలామంది జీవితంలో గొప్ప ఏర్పాట్లు చేసుకున్నారు, కానీ అవి మీకు సాఫల్యం చేకూర్చవు లేదా అవి మిమ్మల్ని మరో పార్శ్వానికి చేర్చలేవు. అవి కేవలం సౌలభ్యం కోసమే.
‘ప్రేమ’ గురించి మాట్లాడినప్పుడు, అది సౌలభ్యం కోసమే అయ్యుంటుందని కాదు, కానీ చాలా వరకూ అది సౌలభ్యం కోసమే. ఎందుకంటే, అందుకు జీవితం పెట్టాలి. ప్రేమించడం అంత ఉత్తమమైన పని కాదు ఎందుకంటే అది మిమ్మల్ని తినేస్తుంది. మీరు ప్రేమలో పడాల్సి వస్తే కనుక మీరు అసలలా చేయకూడదు. మీరు ఒక వ్యక్తిగా అందులో పడిపోడానికి సుముఖతతో ఉండాలి, అప్పుడే అది సంభవిస్తుంది. ఈ ప్రక్రియలో మీ వ్యక్తిత్వాన్ని ధృడంగా ఉంచినట్లయితే మీరు కేవలం సౌలభ్యంగా ఉండే ఒక పరిస్థితిని ఏర్పరచగలరు, అంతే. ఒక లావాదేవీ ఎలా ఉంటుందో, నిజమైన ప్రేమ వ్యవహారం ఎలా ఉంటుందో మనం గుర్తించగలగాలి. ప్రేమ వ్యవహారం ప్రత్యేకించి ఒక వ్యక్తితోనే ఉండాల్సిన అవసరం లేదు. మీరు ఒక గొప్ప ప్రేమ వ్యవహారాన్ని ప్రత్యేకించి ఒక వ్యక్తితో కాకుండా జీవితంతో కలిగి ఉండొచ్చు.
మీరు ఏమి చేస్తారు, ఏమి చేయరు అనేది మీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఉంటుంది. మనం చేసే పనులు బయటి పరిస్థితులకు అనుగుణంగా ఉంటాయి. మీ బయటి ప్రపంచంలో మీరు చేస్తారు అనేది ఎన్నో షరతులపై ఆధారపడి ఉంటుంది. కానీ ప్రేమ ఒక అంతర్గత స్థితి. మీ ఆంతర్యంలో మీరు తప్పకుండా షరతుల్లేకుండా ఉండగలరు.
ఉదార సోదరులు
మా ముత్తమ్మ ఎన్నో కథలు చెప్పింది. అందులో ఒకటి నన్ను బాగా ఆకట్టుకుంది. ఈ కథ నా జీవితపు ఆధారం కాదు కానీ అది నా జీవితాన్ని ఎన్నో విధాలుగా మలిచింది. ఒక ఊరిలో భార్యాభర్త ఉండేవారు. ఆ రోజుల్లో పురుషుడు వ్యవసాయం, పొలం పని చేసి డబ్బు సంపాదించేవాడు. ఒక వేళ మగ పిల్లలుంటే ఎక్కువ పొలం సాగు చేయొచ్చు. వీరికి ఇద్దరు మగ పిల్లలు. పిల్లలిద్దరూ పెరిగి బాగా బలమైన యువకులుగా అయ్యారు. వాళ్ళ నాన్నతో కలిసి కష్టపడి పొలాన్ని వృద్ధి చేశారు. అలా సంపన్నులయ్యారు. వాళ్ళ నాన్న బాగా ముసలివాడు అయ్యేసరికి, తన కొడుకులతో ‘నేను ఎప్పుడైనా చనిపోవచ్చు. మీరు సదా ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. నేను చనిపోయాక మీ ఇద్దరూ ఎప్పుడూ పంటను సమానంగా పంచుకోవాలి. దాని గురించి ఎప్పుడూ వాగ్వాదం కానీ, వాదన కానీ, కొట్లాట కానీ జరగకూడదు’ అన్నాడు.
ముసలాయన చనిపోయాడు, ఆయన పిల్లలు అంత్యక్రియలు చేశారు. ఆ కాలంలో భారతదేశంలో ఇంకా ప్రపంచంలో అనేక భాగాల్లో భూమిని విభజించడమన్న ప్రశ్నే లేదు. పంటను మాత్రమే విభజించేవాళ్లు, భూమిని కాదు. కేవలం గత 4 తరాల నుండే, బహుశా బ్రిటిష్ వాళ్ళు వచ్చినప్పటి నుండి, భూమిని విభజించడం మొదలుపెట్టాం. కాబట్టి ఆ ఇద్దరు సోదరులు ఎప్పుడూ పంటను ఇద్దరికీ సమానంగా పంచుకునేవారు.
వారిలో ఒకరికి పెళ్లైంది, అయిదుగురు పిల్లలు కూడా పుట్టారు. మరొక సోదరుడు అసలు పెళ్ళే చేసుకోలేదు. అయినప్పటికీ పంటను సమానంగా పంచుకునేవారు. ఒకరోజు, పెళ్లి కాని సోదరుని బుర్రలో ఓ పురుగు తొలవడం మొదలుపెట్టింది. అతను, ‘నా సోదరుడు తన భార్యని ఇంకా అయిదుగురు పిల్లల్ని పోషించాలి, నేనేమో ఒంటరిని. ఐనా సగం పంట తీసుకుంటున్నాను. తను కూడా సగమే తీసుకుంటున్నాడు. ఇది న్యాయంగా లేదు. కానీ అది మా నాన్న కోరిక. నేనొక వేళ నా సోదరునికి కొంచెం ఎక్కువ వాటా ఇవ్వబోయినా తనకున్న ఆత్మాభిమానం వల్ల (తను దాన్ని) తీసుకోడు. నేనే దీనికి మార్గం కనుగొంటాను’ అనుకున్నాడు. ఇక, అతను ఒక కార్యం తలపెట్టాడు. పంట కోసిన తర్వాత, ప్రతి రోజూ రాత్రి రహస్యంగా ఒక ధాన్యం మూటను భుజాన వేసుకుని తన సోదరుని కొట్టంలో వేసేవాడు.
అదే పురుగు అతని సోదరుని బుర్రలోకి కూడా ప్రవేశించింది. అతను ‘నాకు ఎదిగే మగ పిల్లలు అయిదుగురు ఉన్నారు. ఇంకొన్నేళ్ళలో నా కుటుంబంలో ఎన్నో విషయాలు జరుగుతాయి. నా సోదరునికి ఎవరూ లేరు. ముందు ముందు తను ఏం చేస్తాడు? తను కేవలం సగం వాటానే తీసుకుంటున్నాడు. నేనూ సగం తీసుకుంటున్నాను. తనకు కొంచెం ఎక్కువ ఇవ్వబోతే తను తీసుకోడు’ అనుకుని, అతను కూడా ప్రతీ రాత్రి ఒక ధాన్యం మూటను తీసుకెళ్ళి తన సోదరుని కొట్టంలో వేయడం మొదలుపెట్టాడు. ధాన్యం మార్పిడి లాంటిది జరుగుతూ ఉండేది. వారిద్దరూ కూడా ఈ విషయాన్ని చాలా రోజుల వరకు గుర్తించలేదు.
వారు ముసలివారౌతున్నా కూడా అలా చేస్తూనే ఉన్నారు. ఒకరోజు, ధాన్యం బస్తా తీసుకుని ఒకరి కొట్టం వైపు మరొకరు నడిచి వెళ్తుండగా ఒకరికొకరు ఎదురుపడ్డారు. వారిద్దరూ ఒకరినొకరు చూసుకుని ఉన్నట్టుండి, అప్పటివరకు ఏం జరుగుతుందో తెలుసుకున్నారు. వెంటనే ఒకరి నుండి ఒకరు చూపులు తిప్పుకుని వెళ్లి ఆ ధాన్యం బస్తాలను వాటి గమ్య స్థానాలకు చేర్చి వాళ్ళ ఇళ్లకు వెళ్లి నిద్రపోయారు. కాలం గడిచింది, వారు వృద్దులై చనిపోయారు.
ఆ ఊరి ప్రజలు ఒక గుడి కట్టడానికి మంచి స్థలం కోసం చూస్తున్నారు. ఎన్నో రోజులు వెతికాక, ఏ చోటైతే ఈ ఇద్దరు సోదరులు వారి వీపుపైన ధాన్యం బస్తాతో ఒకరినొకరు చూసుకుని వారి ఉదారత గురించి విస్మయం చెందారో ఆ స్థలమే గుడి కట్టడానికి ఉత్తమమైనదని నిర్ణయించారు. మీరు ఇలా కనుక జీవిస్తే, మీరే ఒక సజీవ దేవాలయం. అప్పుడు మీరు ప్రేమ షరతులతో కూడినదా, కాదా అని చింతించాల్సిన పని లేదు.
కృతజ్ఞతా సాగరం
మీరు ఏమి ఇస్తున్నారు అనేదాన్ని లెక్కించకుండా మీరేమి పొందుతున్నారు అనేది ఎప్పుడూ గుర్తుంచుకుంటే మీరు సహజంగానే కృతజ్ఞతా భావంతో ఉంటారు. ‘నేనెంత చేసాను’ అనే చెత్త ఆలోచనను వదిలేయండి. మీరు ఎవరి నుండి ఏమీ ఆశించకుండా ఉంటే మీరు హాయిగా బ్రతుకుతారు. మీరు ఎవరినుండైనా ఏమైనా ఆశిస్తే, లేదా వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా అని మీలో అనుకుంటే, అప్పుడు ఈ సమస్యలన్నీ ఉత్పన్నమౌతాయి. మీరు ఎవరి నుండీ ఏమీ ఆశించకుండా ఉన్నపుడు వారు మీకోసం ఏమైనా చేస్తే అది వారికి అద్భుతమైనది. వారు ఏమీ చెయ్యకపోతే ఏమిటి సమస్య.
బంధం అనేది ఒక లావాదేవీ. దానిని సక్రమంగా నిర్వహించడానికి నైపుణ్యం కావాలి. లేదంటే అది వికారంగా మారుతుంది. మీరిది గమనించే ఉంటారు, ఒక వ్యక్తితో ఉన్న బంధం ఒకరోజు ఎంత అద్భుతంగా ఉంటుందో, అదే బంధం అదే వ్యక్తితో మరో రోజు ఎంత వికారంగా ఉంటుందో.
దురదృష్టవశాత్తూ, చాలా మంది ఒక బంధాన్ని ఒక లావాదేవీ అని ఒప్పుకోరు. బంధాలకు కొన్ని నిర్దిష్టమైన నియమాలు షరతులు ఉంటాయి. మీరు ఈ నియమాలు ఇంకా షరతుల పరిధిలో ఉంటేనే మీరు ఆ బంధాన్ని విజయవంతంగా నిర్వహించగలరు. మీరు కనుక ‘మా ప్రేమ షరతుల్లేనిది’ అనే భ్రమల్లో ఉంటే, అది ఏ రోజైనా విడిపోతుంది.
ప్రేమ సున్నితమైన జీవిత పార్శ్వం
నేను బంధాలను చులకన చేసి మాట్లాడడం లేదు, కానీ అందులో ఉన్న పరిమితులను గమనించడంలో తప్పు లేదు. అందులో పరిమితులు ఉన్నాయి, అలా అని అందులో అందం లేదని కాదు. ఒక పువ్వు ఎంతో అందంగా ఉంటుంది, దాన్ని నలిపేస్తే, రెండు రోజుల్లో అది ఎరువుగా మారుతుంది. ఒక్క క్షణంలో పువ్వుని పాడు చేయొచ్చు, అంత మాత్రాన ఆ పువ్వుకున్న అందం, ప్రాముఖ్యత తగ్గిపోతాయా? లేదు కదా. అలాగే మీ ప్రేమ కూడా సున్నితమైనది. దాని గురించిన ఏవో ఉహాజనిత విషయాలను నమ్మకండి. అదే విధంగా దానికున్న అందాన్ని నేను నిరాకరించడం లేదు.
కానీ మీరు కనుక అలాంటి సున్నితమైన పార్శ్వాన్ని మీ జీవితానికి పునాదిగా చేసుకుంటే, మీరు సహజంగానే ఎప్పుడూ భయంతోనే ఉంటారు. ఎందుకంటే మీరు అంత సున్నితమైన పువ్వు పైన కూర్చున్నారు. ఉదాహరణకు మీరు మీ ఇంటిని నేలపై కాకుండా అందంగా ఉంది కదా అని పువ్వుపై కడితే, మీరెప్పుడూ భయంలోనే బ్రతుకుతారు. ఒకవేళ మీరు మీ ఇంటి పునాదులను భూమిపై కట్టి, పువ్వు వైపు చూసి, వాసన చూసి, ముట్టుకుంటే, అది అద్భుతంగా ఉంటుంది. కానీ మీరు మీ ఇంటిని పువ్వుపై కట్టినట్లైతే మీరెప్పుడూ భయంలో ఉంటారు. నేను అలాంటి సందర్భం గురించి మాట్లాడుతున్నాను. అంతేగానీ, ప్రేమ అంటే ఏంటో దాన్ని నిరాకరించడం లేదు.
ప్రేమ ఒక అవసరం
ఒక విధంగా చూస్తే, ప్రేమ.. నేను దీన్ని పూర్తిగా సాధారణమైనదనడం లేదు. కానీ చాలా మందికి అలాంటిదే. ప్రేమ అనేది మరొక అవసరం, ఇది లేకుండా వారు బ్రతకలేరు. శరీరానికి అవసరాలున్నట్టు భావాలకూ అవసరాలు ఉన్నాయి. ‘నువ్వు లేకుండా నేను బ్రతకలేను’ అనంటే, ‘నేను చేతి కర్ర లేకుండా నడవలేను’ అని మరో విధంగా చెప్పినట్లే. మీ వద్ద వజ్రాలు పొదిగిన చేతి కర్ర ఉంటే, మీరు చాలా సులువుగా దానితో ప్రేమలో పడొచ్చు. ఇక మీరు ఈ చేతి కర్రను పదేళ్లు వాడిన తర్వాత, నేను ‘మీరు చేతి కర్ర లేకుండా నడవొచ్చు’ అని చెప్పినా కూడా, మీరు ‘లేదు, నేను నా చేతి కర్రను ఎలా వదిలేయగలను’ అంటారు. ఇలా అనడంలో వివేకం లేదు. అలాగే, ప్రేమ పేరుతొ మిమ్మల్ని మీరు పూర్తిగా దయనీయంగా, అసంపూర్ణంగా తయారు చేసుకుంటున్నారు
అంటే దానర్థం ప్రేమలో అందం కానీ వేరే ఇతర పార్శ్వం కానీ లేదనా? లేదు, ఉంది. ఎంతో మంది ఒకరు లేకుండా ఒకరం బ్రతకలేం అన్నంతగా జీవించిన వారున్నారు. ఇలా కనుక జరిగినట్లయితే, ఇద్దరు జీవులు ఒకటిగా అయితే, అప్పుడది అద్భుతం.
రాణి గారి ప్రేమకథ
ఇది భారతదేశంలోని రాజస్థాన్ లో ఉన్న ఒక రాజుకి జరిగింది. తనను ప్రేమించే, తనకు పూర్తిగా అంకితమైన యుక్త వయసున్న ఒక భార్య ఉండేది. కానీ రాజులకు ఎప్పుడూ చాలామంది ఉంపుడుగత్తెలు కూడా ఉండేవారు. అందువల్ల అతని భార్య తనతో అంతగా మమేకం అవ్వడం అతనికి నవ్వులాటగా అనిపించింది. ఆమె చూపే శ్రద్ధకు అతను మురిసిపోయేవాడు, కానీ కొన్నిసార్లు అది విపరీతమనిపించేది. అప్పుడతను ఆమె లోకం నుండి బయటకు వచ్చి ఎంతో మంది ఇతర ఆడవారితో ఉండేవాడు. కానీ ఆమె మాత్రం పూర్తిగా అతనికే అంకితమైంది.
రాజు రాణీలకు రెండు మాట్లాడే మైనాలున్నాయి. ఉపఖండానికి చెందిన ఈ పక్షులు, శిక్షణ ఇస్తే చిలుకల కంటే కూడా బాగా మాట్లాడగలవు. ఒకరోజు, వాటిలో ఒక పక్షి చనిపోయింది. దానితో రెండవ పక్షి ఆహారం తినకుండా అలానే కూర్చుని ఉంది. ఆ పక్షికి ఆహారం తినిపించడానికి రాజు శతవిధాలా ప్రయత్నించాడు, కానీ ఆ పక్షి ఏమీ తినలేదు, రెండ్రోజుల్లో అది కూడా చనిపోయింది.
దీనితో రాజు చెలించి పోయాడు. ‘ఏంటిది? ఏ ప్రాణి అయినా సహజంగా మొదట తన ప్రాణానికి విలువిస్తుంది, కానీ ఈ పక్షి అలానే కూర్చుని ప్రాణాలు విడిచింది’ అన్నాడు.
అతనిలా అన్నప్పుడు అతని భార్య ‘ఎవరైనా ఒకరిని ఎంతగానో ప్రేమిస్తే, సహజంగానే వారు ఒకరితో ఒకరు వెళ్ళిపోతారు, ఎందుకంటే ప్రేమించిన వారు లేకపోతే జీవితం అర్థం లేనిదిగా అనిపిస్తుంది’ అనింది.
రాజు సరదాకి ‘నీ విషయంలో కూడా అంతేనా? నువ్వు నన్ను అంతగా ప్రేమిస్తున్నావా?’ అని అడిగాడు.
భార్య ‘అవును, నేను కూడా అలానే’ అంది. ఇది విని రాజు మురిసిపోయాడు.
ఒకరోజు, రాజు తన స్నేహితులతో కలిసి వేటకు వెళ్ళాడు. మైనాలు చనిపోయిన విధానం, తన భార్య కూడా అలా చేయగలను అని చెప్పడం అతని బుర్రలో తిరుగుతూ ఉంది. దీన్ని అతను నిజంగానే పరీక్షించాలి అనుకున్నాడు. అందుకని అతను తన బట్టలకు రక్తం పూసి ఒకరికి ఇచ్చి కోటకు పంపించాడు, అవి తెచ్చినతను ‘రాజు గారిని పులి దాడి చేసి చంపింది’ అని చెప్పాడు. రాణి ఆ బట్టలను ఎంతో హుందాగా అందుకుంది, ఆమె కళ్ళలో కన్నీటి బొట్టు కూడా లేదు. ఆమె చితికి ఏర్పాటు చేసి, ఆ బట్టలను చితిపై పెట్టి తాను కూడా చితిపై పడుకుని ప్రాణం విడిచింది.
ప్రజలు దీన్ని నమ్మలేకపోయారు. రాణి అలా పడుకుని వెళ్ళిపోయింది. ఇక అప్పుడు చేయగలిగింది ఏమీ లేదు ఎందుకంటే ఆమె చనిపోయింది. అందువలన ఆమెను దహనం చేశారు. ఆ వార్త రాజుకి తెలియగానే అతను ఎంతో దుఃఖించాడు. ఏదో సరదా కొద్దీ ఆమెను పరీక్షించాలనుకున్నాడు. కానీ ఆమె నిజంగానే మరణించింది, ఆత్మహత్య చేసుకుని కాదు, అలా వెళ్ళిపోయింది.
ఇలా ఒకరు చనిపోతే మరొకరు ఆరోగ్యంగా వున్నా కూడా కొన్ని నెలల్లోనే ప్రాణం విడిచిన జంటలు భారతదేశంలో ఎందరో ఉన్నారు. ఎందుకంటే వారి జీవ శక్తులు ఒక విధంగా ముడి పడి ఉంటాయి. మీరు మరొక మనిషితో ఆ విధంగా ముడిపడి ఉంటే, ఇద్దరూ ఒక్కరే అన్నట్లుగా, అలా ఉండడం ఒక అద్భుతం. అదే మోక్ష హేతువు కాదు, కానీ అందంగా జీవించే విధానమే.
నిజమైన ప్రేమ అంటే అర్థం ఏమిటి?
ఈ రోజుల్లో మనుషులు ప్రేమ గురించి మాట్లాడితే, వారు దానిని మనోభావ పరంగా మాత్రమే మాట్లాడుతున్నారు. మనోభావాలు ఈరోజు ఒకటి చెబుతాయి రేపు మరొకటి చెబుతాయి. మీరు మొదటిసారి బంధం ఏర్పరచుకున్నప్పుడు, మీరు "ఇది కలకాలం ఉంటుంది!" అనుకుని, ఒక మూడు నెలల లోపే "అబ్బా! నేను ఈ మనిషితో ఎందుకు ఉన్నానో?" అనుకుంటారు. ఎందుకంటే ఇది మీ ఇష్టాయిష్టాల పైన ఆధారపడి నడుస్తుంటుంది. ఇటువంటి సంబంధంలో మీరు బాధ మాత్రమే అనుభవిస్తారు ఎందుకంటే ఒక సంబంధం అస్థిరంగా ఉన్నప్పుడు - అది ఒకసారి అటుగా, మరోసారి ఇటుగా ఉన్నప్పుడు - మీరు తీవ్రమైన ఆవేదనను, బాధను అనుభవిస్తారు. ఇది పూర్తిగా అనవసరమైనది.
ప్రేమలోని బాధను గురించి ఎన్నో కవిత్వాలు వచ్చినా, ప్రేమ అనే భావము, బాధను సృష్టించడానికి కాదు. మీరు ప్రేమలో పడడానికి కారణం అది మీకు పరమానందాన్ని ఇస్తుందని. ప్రేమ లక్ష్యం కాదు; పరమానందమే లక్ష్యం. ఎన్నోసార్లు వారు గాయపరచబడినా సరే, మనుషులకి ఎవరో ఒకరితో ప్రేమలో పడాలని పిచ్చి, ఎందుకంటే వారు ప్రేమలో ఉన్నామని అనుకున్నప్పుడు, వారిలో ఒక చిటికెడు పరమానందం ఉంటుంది. ప్రేమ పరమానందం పొందేందుకు మారకద్రవ్యం లాంటిది. ప్రస్తుతం ఎక్కువ శాతం మనుషులకు పరమానందంగా ఉండేందుకు తెలిసిన ఒకే మార్గం అది.
కానీ మీరు మీ స్వత: సిద్ధంగా పరమానందంగా ఉండడానికి ఒక మార్గం ఉంది. మీరు ఆహ్లాదంగా ఉన్నప్పుడు, ప్రేమగా ఉండడం సమస్య కాదు; మీరు ఎలాగూ ప్రేమగానే ఉంటారు. మీరు పరమనందాన్ని ప్రేమ ద్వారా పొందుదామని కోరుకున్నప్పుడు, మీరు ఎవరితో ప్రేమగా ఉండాలో ఎంచుకుంటారు. కానీ మీరు పరమానందంగా ఉన్నప్పుడు, మీరు దేనిని చూసినా దానితో ప్రేమగా ఉండగలరు. ఎందుకంటే అందులో చిక్కుకు పోయే భయం లేదు. చిక్కుకు పోయే భయం లేనప్పుడు మాత్రమే మీరు జీవితంతో మమేకమవ్వటం తెలుసుకుంటారు.
మీరు ప్రేమపూర్వకంగా ఉండడానికి ఒక సరళమైన పద్ధతి
రోజూ 15 నుండి 20 నిమిషాలు మీకు ఏ సంబంధం లేదా ఏ మనోభావం లేని దాని వద్దకు వెళ్ళి కూర్చోండి - ఒక చెట్టు కానీ, ఒక రాయి కానీ, లేదా ఒక పురుగు లేదా ఒక క్రిమి. కొంత సమయం తర్వాత మీరు దానిని మీ భార్యని లేదా భర్తని లేదా అమ్మని లేదా పిల్లలని ఎంత ప్రేమగా చూడగలరో అంతే ప్రేమగా చూడగలరని తెలుసుకుంటారు. ఆ పురుగుకి ఇది తెలియకపోవచ్చు. పరవాలేదు. మీరు అన్నింటినీ ప్రేమతో చూడగలిగితే మీ అనుభవంలో ప్రపంచం మొత్తం అందంగా మారుతుంది. ప్రేమ అనేది మీరు చేసే ఏదో పని కాదు; ప్రేమ అనేది మీరు ఉన్న స్థితి అని గ్రహిస్తారు.