జెన్, యోగా - ఈ రెండు వేరు వేరా?
"జెన్" అనే పదం సంస్కృత పదమైన "ధ్యానం" నుండి వచ్చింది. గౌతమ బుద్ధుడు ధ్యానాన్ని బోధించారు. బోధిధర్ముడు ధ్యానాన్ని చైనా కి తీసుకువెళ్ళాడు, అక్కడ ఇది చాన్ అయ్యింది. ఈ చాన్ మరింత దూరంగా ఉన్న తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి జెన్ అయింది.
"జెన్" అనే పదం సంస్కృత పదమైన "ధ్యానం" నుండి వచ్చింది. గౌతమ బుద్ధుడు ధ్యానాన్ని బోధించారు. బోధిధర్ముడు ధ్యానాన్ని చైనాకి తీసుకువెళ్ళాడు, అక్కడ ఇది చాన్ అయ్యింది. ఈ చాన్ మరింత దూరంగా ఉన్న తూర్పు ఆసియా దేశాలకు వెళ్లి జెన్ అయింది. ఏ లేఖనాలు, పుస్తకాలు, నియమాలు, లేదా ప్రత్యేక పద్ధతులు లేని ఆధ్యాత్మిక మార్గమే జెన్. ఇది ఒక అపరిచిత మార్గం. కాని ఇది యోగా నుంచీ వేరైనది కాదు. ఇది కేవలం యోగా మాత్రమే. మనము యోగా అనే దానిని, వారు జెన్ అంటారు.
మనం యోగాలో శాస్త్రంగా చెప్పేదాన్ని వారు జెన్ లో ఒక కళారూపంగా చెప్తారు. కళని గుర్తించడానికి మీరు ఒక నిర్దిష్ట మార్గంలో అభివృద్ధి చెందవలసి ఉంటుంది. కానీ విజ్ఞానం యొక్క ఫలాలను అందరూ అనుభవించవచ్చు. ఒక నిర్దిష్ట సమయంలో ఒక గురువుల పరంపర వచ్చినప్పుడు జెన్ బాగా ప్రజాదరణ పొందింది. దాదాపు నాలుగైదు శతాబ్దాల పాటు నిరంతరంగా అసాధారణమైన గురువులు వచ్చారు. అది ఒక అద్భుతం. వారివలన జెన్ ఒక ప్రత్యేకమైన తేజస్సుని పొందింది. కేవలం ఈ గురువుల కారణంగానే అది తనంతట తానుగా ఒక ప్రత్యేక మార్గంగా అవతరించింది. ప్రతివారూ కూడా జెన్‌ని తమ స్వంత పద్ధతిలో వృద్ధి చేసి, తమదైన ఒక ప్రత్యేక విధానంలో బోధించారు లేదా ప్రసారం చేసారు. అనంతకాలంలో ఎప్పుడో ఒకసారి ఇలాంటి గురు పరంపర వస్తుంది. డజన్ల కొద్దీ జ్ఞానోదయం పొందిన గురువులు వచ్చి పునరావృతం చేయలేని అద్భుతమైన జ్ఞాన ప్రసార పద్ధతులను సృష్టించారు. మీరు దానిని పునరావృతం చేస్తే ఆ జెన్‌కి అర్ధం లేదు. అప్పటికప్పుడు జరిగే దానినే జెన్ అంటారు.
జెన్ మార్గంలో, హుయిట్టి అనే ఒక వ్యక్తి ఉండేవారు. ఆయన ఎప్పుడూ ఎవరికీ జెన్ నేర్పించలేదు. కానీ ఆయన ఒక గురువుగా పేరుపొందారు. ప్రతి ఒక్కరూ ఆయనను ఒక జెన్ గురువుగా గౌరవించారు కానీ ఆయనకీ బోధించడానికి ఎటువంటి బోధనలూ లేవు. ఆయన భుజాల మీద ఒక భారీ సంచీని మోసేవారు. అందులో చాలా వాటితో పాటు మిఠాయిలు కూడా ఉండేవి. ఆయన వెళ్ళిన ప్రతి గ్రామంలో, నగరంలో పిల్లలు ఆయన చుట్టూ గుమి కూడేవారు, ఆయన వారికి ఆ మిఠాయిలు పంచిపెట్టాక వారు వెళ్ళిపోయేవారు. అంతే! ప్రజలందరూ ఆయన దగ్గరకి వచ్చి బోధించమని అడిగేవారు. ఆయన నవ్వి వెళ్ళిపోయేవారు. ఒక రోజున మరొక పేరు పొందిన జెన్ గురువు, బానిన్, వచ్చి హుయిట్టిని కలిసారు. ఆయనకి హుయిట్టికి నిజంగా జెన్ తెలుసో తెలియదో అని తెలుసుకోవాలనిపించింది. అందుకని ఆయన హుయిట్టి ని అడిగారు, "జెన్ అంటే ఏమిటి ?"అని, దానికి హుయిట్టి వెంటనే, సంచిని కింద పెట్టి నుంచున్నారు. ఆయన మళ్ళీ అడిగారు, " జెన్ లక్ష్యం ఏమిటి?". హుయిట్టి సంచీని తన భుజాల మీద పెట్టుకుని నడిచి వెళ్ళిపోయారు. అదే జెన్ అంటే. యోగా కూడా దీని గురించే; ప్రతి ఆధ్యాత్మిక సాధన కూడా దీని గురించే.
మీరు యోగా లేదా జెన్, దానిని ఏ పేరుతో పిలిచినా సరే, దానిని సాధించటానికి, మీరు అవసరాన్ని బట్టి మీ భారాన్ని పక్కకు పెట్టగలగాలి లేదా మోస్తూ ఉండాలి. ఎలాగైనా మీరు నిశ్చింతగా ఉండాలి. ఇలా ఉండటం చాలా ముఖ్యం. మీరు మోస్తున్న భారంతో మీరు అలా ఎన్నటికీ చేయలేరు. కొంత మంది చేయగలరు, కానీ అలాంటి వారు చాలా అరుదుగా ఉంటారు. ఎన్నో కోట్ల మందిలో కూడా అలాంటివారు ఒక్కరు కూడా ఉంటారో, లేదా నాకు తెలియదు.
యోగా యొక్క లక్ష్యమేమిటి? ముందు భారాన్నంతా పక్కకు పడేయండి, తిరిగి అవసరమైతే పూర్తి భారాన్ని తీసుకోండి! అప్పుడు అది భారం కాదు; అది భారంలా అనిపించదు. అప్పుడు ఏది ఏమైనా, మీరు జీవించినా మరణించినా మీకు పెద్ద తేడా ఉండదు. రేపు పొద్దున, మనమందరమూ ఈ గ్రహం నుంచి మాయమైపోతే, అది ఒక్క పెద్ద తేడా అవ్వదు. "ఓ! నేను మాయమయిపోతే నా పిల్లలకి ఏమవుతుంది? దీనికి ఏమవుతుంది? దానికి ఏమవుతుంది? ఇలాంటి చాలా ఆందోళనలు ఉన్నాయి, అవునా, కాదా? కానీ నిజంగా, అవేమీ వర్తించవు. ఏమీ అవ్వదు. కొంత మంది మూర్ఖులు ఏడుస్తారు, కొంత మంది మూర్ఖులు పెడబొబ్బలు పెడుతారు, చివరికి వారు కూడా మరణిస్తారు మళ్ళీ జన్మించడానికి! "పునరపి జననం, పునరపి మరణం". కనీసం మీరు మరణిస్తే మీ వాళ్ళు ఆలోచించడం మొదలుపెడతారు, "ఈ జీవితం అంటే ఏమిటి?" అని. మీరు జీవిస్తూ వెళితే, వాళ్ళు ఆ కోణంలో ఆలోచించనే ఆలోచించరు. చాలా మంది సుఖాలలో ఎంతగా మునిగి పోయారంటే, వారు తాము అమరులమని అనుకుంటారు. ఇది పరమ మూర్ఖత్వం.
ప్రేమాశీస్సులతో,
సద్గురు