భయం అంటే ఏంటి, భయాన్ని జయించడం ఎలా?
భయం లేకుండా జీవించడానికి మీకోసం ఒక ఖచ్చితమైన మార్గసూచి ఈ వ్యాసం.
భయం అంటే ఏమిటి?
సద్గురు:భయం కలిగేది ఎందుకంటే మీరు - జీవించడం లేదు, మీ ఆలోచనల్లో జీవిస్తున్నారు. ప్రతిక్షణం మీ భయం అంతా, తరువాత ఏం జరగబోతుందో అన్నదాని గురించే. అంటే అర్థం, మీ భయం అంతా ఎప్పుడూ అసలు ఉనికిలో లేనిదాని గురించి. మీ భయం అసలు ఉనికిలో లేనిదాని గురించి అయితే, అది 100% ఊహాజనితమైనదే. లేనిదాని గురించి భయపడుతూ ఉంటే దాన్ని వెర్రితనము అంటాం. సాధారణంగా జనం, సామాజికంగా ఆమోదయోగ్యమైన స్థాయి పిచ్చితనంలో ఉంటూ ఉంటారు, కానీ, అసలు ఉనికిలో లేని దాన్ని గురించి మీరు భయపడుతూ, బాధపడుతూ ఉన్నట్లయితే, అది వెర్రితనము కిందికి వస్తుంది, అంతేనా?
భయాన్ని కలిగించేది ఏది?
జనం సాధారణంగా నిన్న జరిగిన దాని గురించో, లేక రేపు జరగబోయే దాని గురించో ఎప్పుడూ బాధపడుతూ ఉంటారు. అంటే మీ బాధ ఎప్పుడూ ఇంకా ఉనికిలో లేని దాని గురించి అన్నమాట, ఎందుకంటే మీరు వాస్తవంలో నిలబడి లేరు గనుక, మీరెప్పుడూ మీ ఆలోచనల్లోనే ఉంటున్నారు. మనసు అంటే - ఒక భాగం జ్ఞాపకాలు, ఇంకొక భాగం ఊహలు. ఇంకా ఒకరకంగా చెప్పాలంటే రెండూ ఊహలే ఎందుకంటే ఆ రెండూ కూడా ప్రస్తుతం ఉనికిలోలేవు. మీరు మీ ఊహల్లో మునిగిపోయారు, అదే మీ భయానికి మూలం. మీరు గనక వాస్తవంలో ఉన్నట్లయితే మీకు భయం ఉండదు.
భయం ఏం చేస్తుందంటే, అది మీ చుట్టూ హద్దులు గీస్తుంది. భయం వలనే మీరు ఎప్పుడూ మీ చుట్టూ హద్దులు నిర్మించుకుంటూ ఉంటారు. ఇలా మీరు హద్దులు గీసుకుని మీ జీవితపు పరిధిని పరిమితం చేసుకుంటే, మీరు సురక్షితంగా ఉండొచ్చు, కానీ సమస్య ఏంటంటే అది మిమ్మల్ని మీ జీవితం నుంచి కూడా దూరం చేస్తుంది. మీరు మీ జీవితం, మీరు జీవించడాన్నించి కూడా దూరమై పోతున్నారు. అది నిజమైన రక్షణ!
భయం వల్ల కలిగే దుష్ప్రభావాలు
ఇక్కడికి మీరు జీవితాన్ని అనుభూతి చెందడానికి వచ్చారా లేక తప్పించుకోడానికి వచ్చారా అన్నది మీరే నిర్ణయించుకోవాలి. మీరు జీవితాన్ని అనుభూతి చెందడానికి వచ్చినట్లయితే, మీకు తప్పనిసరిగా కావలసినది తీక్షణత. మీలో తీక్షణత లేకపోతే, మీరు పేలవమైన జీవితాన్ని గడుపుతారు. మీరు భయాన్ని మీకు రక్షణ కవచంలా వాడుకున్న మరుక్షణం, మీలోని గాఢత తగ్గిపోతుంది. ఒకసారి అది తగ్గిపోగానే, మీకు జీవితాన్ని అనుభూతి చెందగలిగే సామర్థ్యం పోతుంది. మీరు ఒక మానసిక రోగిగా మారిపోతారు. కేవలం మీ మెదడులో ఏం జరుగుతోందో అదే మీకు తెలుస్తుంది. మీరు ఎప్పటికీ అద్భుతమైన వాటిని లేక పరమానందాన్ని గాని అనుభవించలేరు ఎందుకంటే మీరు భయంతో ఉన్నప్పుడు, స్వేచ్చానుభూతిని పొందలేరు. మీరు పాడలేరు, ఆడ లేరు, స్వేచ్ఛగా నవ్వలేరు, ఏడవలేరు, అసలు జీవంతో నిండిన దేన్నీ మీరు చెయ్యలేరు. కేవలం ఇక్కడ మీ జీవితం గురించి, అందులో ఉన్న ప్రమాదాల గురించి ఏడుస్తూ కూర్చోగలరు.
అసలు మీరు జాగ్రత్తగా గమనిస్తే, ఈ భయం దేని గురించి? మీ భయం ఎప్పుడూ జరిగిపోయిన దాని గురించి కాదు. అదెప్పుడూ జరగబోయే దాని గురించే. ఎప్పుడూ భవిష్యత్తు గురించే. భవిష్యత్ అంటే జరగబోయేది. అది ఇంకా జరగలేదు. అంటే ఇంకా ఉనికిలో లేదు. కాబట్టి, భయం అంటే అర్థం, మీరు అసలు వాస్తవంలో లేనిదాని గురించి బాధపడుతున్నారని. నిజంగా లేనిదాని గురించి బెంగ పడుతున్నారంటే మిమ్మల్ని పిచ్చి వారనాలా లేక మంచి వారనాలా? "అందరూ నాలాగే ఉన్నారు" అన్నది మాత్రం మీకు ఉన్న ఒకే ఒక్క ఉపశమనం. మెజారిటీ మీతోనే ఉన్నారు! అయినప్పటికీ, అది సరైనది కాదు ఎందుకంటే మీరు వాస్తవంలో లేనిదాని గురించి దుఃఖిస్తున్నారు.
భయాన్ని అధిగమించడం ఎలా?
భయం జీవితం నుంచి పుట్టినది కాదు. భ్రాంతులతో నిండిపోయిన మనస్సు నుంచి పుట్టినది. అస్తిత్వంలో లేని దాని గురించి మీరు బాధ పడుతున్నారు ఎందుకంటే, మీరు వాస్తవానికి బదులు మీ ఊహల్లో(మనసులో) పాతుకుపోయి ఉన్నారు. మీ మనసు నిర్విరామంగా భూత కాలాన్ని తింటూ భవిష్యత్తులోకి విసర్జిస్తూ ఉంటుంది. నిజానికి మీకు భవిష్యత్తు గురించి ఏమీ తెలియదు. భూతకాలం నుంచి ఒక ముక్క తీసుకుని, దానికి కొంచెం రంగు పూసి, అదే భవిష్యత్తు అని అనుకుంటూ ఉంటారు.
మీరు రేపటి గురించి గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు కానీ, అందులో బతకలేరు. కానీ ప్రస్తుతం ప్రజలు రేపులో బతుకుతున్నారు అందుకే భయం కలుగుతోంది. మీరు చేయగలిగింది ఒక్కటే, వాస్తవంలోకి దిగిరావడం. మీరు, లేని వాటిని ఊహించుకో కుండా, ప్రస్తుతం ఉన్న పరిస్థితులకి తగిన రీతిలో స్పందిస్తే భయానికి తావే ఉండదు. ఒక్కసారి భ్రమలు అన్ని తొలగిపోతే, ఇక భయం ఎక్కడ? మీరు వాస్తవంలో లేనిదాన్ని ఊహించుకోరు, కేవలం ప్రస్తుతం మీ ఎదురుగుండా ఉన్న వాటి గురించి మాత్రమే స్పందిస్తారు.
దయచేసి ఒక్క సారీ పరికించి చూడండి, అంత ఘోరంగా ఏం జరగవచ్చు? మహా అయితే మీరు చనిపోతారు. అంతకుమించి ఏమీ కాదు. ఎలాగూ మీరు చనిపోతారు కాబట్టి కనీసం బతికి ఉన్నన్నాళ్ళు జీవించండి. మేము అలా కావాలని ఏమీ అనుకోవడం లేదు. చాలా రోజులు బతకాలనే ప్రణాళికలు వేసుకుంటున్నాము కానీ, చావు రాక తప్పదు, అవునా ? జీవితానికి నిజంగా ఏమీ భద్రత లేదు. కేవలము మీరు ఎంత హుందాగా, స్వేచ్ఛగా ఈ జీవితాన్ని గడిపారు అన్నదే ప్రశ్న. మీరు నిజంగా జీవిస్తే, మరణానికీ సార్ధకత ఉంది. లేకపోతే, జీవనమూ బాధాకరమే, మరణమూ బాధాకరమే.
Editor’s Note: Isha Kriya is a free, 12-minute guided meditation that can align the body and mind with your vision for life. Daily practice of this simple yet potent process brings health and wellbeing.