రావణుడిని బోల్తా కొట్టించిన గణపతి...!!
గణపతి తెలివితేటలకు ప్రసిద్ధం. గోకర్ణ మహాబళేశ్వరాలయంలో గణపతి విగ్రహం ఉంది; ఇక్కడ ఉన్న గణపతి విగ్రహానికి తలమీద ఓ సొట్ట ఉంటుంది; అది ఒక సందర్భంలో గణపతి తెలివికి ఉక్రోషంతో రావణుడు కొట్టిన దెబ్బవల్ల ఏర్పడింది. సద్గురు ఆ కథను చెప్తున్నారు.
రావణుడు గొప్ప శివభక్తుడు. దక్షిణ ప్రాంతంలో ఉన్న తన దేశంలోనే శివుణ్ణి పూజించేవాడు. కొంతకాలం తర్వాత, “కైలాసాన్ని నాయింటికే ఎందుకు తెచ్చుకోకూడదు?” అని అతననుకున్నాడు. అతను లంక నుండి కైలాసపర్వతం దాకా నడిచాడు. కైలాసపర్వతాన్ని ఎత్తడం ప్రారంభించాడు. పార్వతికి చాలా కోపం వచ్చింది. ఆవిడ, శివుడితో , “అతను నీకెంత ప్రీతిపాత్రుడైనా కావచ్చు, కాని కైలాసాన్ని దక్షిణానికి తీసికు వెళ్ళడానికి అనుమతించవద్దు.” అన్నది. రావణుడి అహంకారం చూసి శివుడికి కూడా కోపం వచ్చింది. కైలాసాన్ని తన పాదంతో కిందికి ఒత్తాడు. కైలాసం కింద రావణుడి చేతులు ఇరుక్కున్నాయి. రావణుడు బాధతో గింజుకున్నాడు, కాని శివుడతన్ని వదిలిపెట్టలేదు.
కైలాసం కింద తన చేతులు ఇరుక్కుపోయినా, రావణుడు శివునిపై ప్రేమతో, అందమైన వివిధ గీతాలతో శివస్తోత్రం చేయసాగాడు. అతను 1001 గీతాలు రచించి శివునిపై తన భక్తిని వెల్లడించి, పూర్తిగా ఆయనకు ప్రపత్తుడయ్యాడు. అప్పుడు శివుడు రావణుని ముక్తుణ్ణి చేసి, “ఒక వరం కోరుకో, నీ ఇష్టం వచ్చిన వరం.” అన్నాడు. మళ్లీ రావణుడి స్వభావం వెల్లడైంది. అతను, “నేను పార్వతిని వివాహమాడాలి.” అని కోరుకున్నాడు “సరే, ఆమె ఇప్పుడు మానస సరోవరంలో ఉంది. నీవు వెళ్లి ఆమెను పెళ్లి చేసుకోవచ్చు” అన్నాడు శివుడు. శివుని చుట్టూ ఉన్న గణాలు ఆందోళన చెంది, “ఇదెట్లా? రావణుడు పార్వతీదేవిని ఎట్లా తాకగలడు? ఇది అసంభవం” అనుకున్నారు. వాళ్లు మానస సరోవరానికి పరిగెత్తి వెళ్లి పార్వతీదేవికి, “రావణుడొస్తున్నాడు. అమ్మా! రావణుడు మిమ్మల్ని వివాహం చేసుకోవడానికి శివుడు అనుమతి ఇచ్చాడు.” అని చెప్పారు. పార్వతి కప్పల రాణి మండూకాన్ని పిలిచింది. అందమైన యువతిగా మార్చింది. రావణుడు పార్వతినెప్పుడూ చూడలేదు. ఇప్పుడు మండూక యువతిని చూసి పార్వతే అనుకున్నాడు. ఆమె సౌందర్యానికి ఆకర్షితుడై వివాహమాడాడు. ఆ యువతే మండోదరి.
తర్వాత రావణుడు గొప్ప సాధన చేశాడు. శివుని నుండి శక్తిమంతమైన జ్యోతిర్లింగాన్ని పొందాడు. ఇది సమాజం ఆమోదిస్తుందా లేదా అన్న సంశయాలేవీ శివునికి ఉండవు. నిజాయితీగా ఏమి చేసినా ఆయనకు ఇష్టమే. ఏకైకధ్యానంతో సాధన చేస్తే ఆయన వశమైపోతాడు. శివుడు రావణునికి జ్యోతిర్లింగాన్ని ఇస్తూ దాన్ని ఎక్కడ పెడితే అక్కడే శాశ్వతంగా ప్రతిష్ఠమైపోతుందనీ, అందువల్ల మధ్యలో ఎక్కడా కింద పెట్టవద్దనీ చెప్పాడు.
రావణుడు చాలా జాగ్రత్తగా గొప్పశక్తితో జ్యోతిర్లింగాన్ని తీసికొని లంకకు వెళుతూ ఉన్నాడు. రావణుడు గొప్ప యోగి. ఆహరం తీసుకోలేదు, కనీసం లఘు శంక తీర్చుకోవడానికి కూడా పోలేదు, ప్రతి మనిషికీ, సహజమైనవీ, ఆవశ్యకమైనవీ అన్నీ విసర్జించాడు. కైలాసం నుండి దాదాపు 3000 కిలోమీటర్లు ఈ విధంగా ప్రయాణించి కర్ణాటకలోని గోకర్ణం చేరుకున్నాడు. అప్పటికి బాగా అలసిపోయి ఉంటాడు. చాలా నీళ్లు తాగి ఉంటాడు. మూత్రాశయం నిండిపోయి ఉంటుంది. ఇక మూత్ర విసర్జన చేయకుండా నిలుపుకోవడం అసాధ్యమైపోయింది. జ్యోతిర్లింగం చేతుల్లో పట్టుకొని ఈ అపవిత్రకార్యం చేయలేడు కదా.
అప్పుడతనికి పశువులను మేపుతున్న ఒక అమాయక గోపాలబాలుడు కనిపించాడు. ఎవడైనా తెలివైన వాడి చేతికి ఏదైనా విలువైన వస్తువును ఇస్తే వాడది తీసుకొని పారిపోవచ్చు. ఈ పిల్లవాడు చాలా అమాయకంగా కనిపించాడు. రావణుడు అతనితో ఇలా అన్నాడు, “కాసేపు ఈ లింగాన్ని పట్టుకో. కిందమాత్రం పెట్టకు. అందుకుగాను, నేను నీకో విలువైన నగ ఇస్తాను”. సరేనన్నాడు బాలుడు. రావణుడు బాలుడి చేతిలో జ్యోతిర్లింగం పెట్టి పక్కకు వెళ్లాడు. ఆ బాలుడెవరో కాదు, గణపతి. గణపతికి జ్యోతిర్లింగం లంకకు చేరడం ఇష్టం లేదు, అది లంకలో ఉంటే రావణుడి శక్తి అపారంగా పెరిగిపోతుంది. అందువల్ల గణపతి ఏం చేశాడు? జ్యోతిర్లింగాన్ని నేలమీద పెట్టాడు. అది అక్కడ దిగబడిపోయి ప్రతిష్ఠితమైపోయింది. ఇప్పుడు కూడా, మీరు గోకర్ణం వెళ్లి చూస్తే, లింగం రాతిలోపలకు ఉంటుంది. సన్న రంధ్రంలో నుండి వేలుపెట్టి లింగాన్ని స్పృశించాలి. అది లోపలకు వెళ్లిందన్నమాట.
రావణుడికి కోపం వచ్చి, గణపతి తలపై గట్టిగా ఒక దెబ్బ వేశాడు. గోకర్ణంలో గణపతి విగ్రహం కూడా ఉంది. దాని తల భాగం పై చిన్న గుంట ఉంటుంది. రావణుడికి మళ్లీ కైలాసం వెళ్లి, శివుణ్ణి మెప్పించి మళ్లీ జ్యోతిర్లింగం తెచ్చే ఓపిక లేకపోయింది. క్రోధంతో తన లంకకు నడుచుకుంటూ వెళ్లిపోయాడు.
మీరు మంచివాళ్ళైనా, చెడ్డవాళ్ళైనా , మీకు ఇచ్ఛ ఉంటే, దివ్యత్వం మీకెప్పడూ అందుబాటులోనే ఉంటుంది. మీరు కలిగి ఉన్న స్వభావాన్ని బట్టి అది వరంగానో, శాపంగానో పరిణమిస్తుంది. మీరు మీ అస్తిత్వాన్ని ఎలా ఉపయోగించుకుంటారన్నది - మీలో మీరు ఎటువంటి దృక్పథాన్ని, ఎటువంటి మనస్సును వికసింపచేసుకుంటారో- అదే నిర్ణయిస్తుంది.