భారతదేశంలో ఇంత మంది వ్యవసాయం ఎందుకు చేస్తున్నారు?
తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో విద్యార్థులతో చర్చిస్తూ, దురాక్రమణల మూలంగా దేశ వ్యవసాయంలో వచ్చిన మార్పులు, ఈనాటికీ మన వ్యవసాయ ఎదుర్కొంటున్న కష్టాలకు కారణం అని సద్గురు అంటున్నారు. ఆధునిక వ్యవసాయ దారుల జీవితాలను మెరుగుపరచడానికి, భవిష్యత్తులో దేశంలో వ్యవసాయం బాగు పడటానికి మనం తీసుకోవలసిన జాగ్రత్తల గురించి సద్గురు వివరిస్తున్నారు.
ప్రశ్న: సద్గురూ, మేము వ్యవసాయ విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్నాం కాబట్టి, నా ప్రశ్న కూడా వ్యవసాయానికి సంబంధించినదే.అప్పట్లో వ్యవసాయం ఒక పరిశ్రమగా జిడిపిలో 30% దాకా సహాయం చేసింది, కానీ ఇప్పుడు అది 16, 17 శాతానికి పడిపోయింది. మనం గమనిస్తే దాదాపు మూడింటా రెండు వంతుల మంది జనాభాకు జీవనోపాధిని ఇస్తోంది. మరి ఈ పరిస్థితి దేశ ఆర్ధిక అభివృద్ధికి ఆటంకం కాదా?
సద్గురు: వ్యవసాయాన్ని ఒక పరిశ్రమ అనడం ఒక మంచి మాట. మన దేశ సంస్కృతికి వ్యవసాయమే మూలాధారం. మనం వేటగాళ్లం అయితే, మన సంస్కృతిని ఇలా ముందుకు తీసుకెళ్లగలిగే వారం కాదు. మనం మట్టిలోనుంచి ఆహారాన్ని పుట్టించగలుగుతున్నాం కాబట్టే, మనం పట్టణాలను నగరాలను నిర్మించి స్ధిరపడగలిగాము. కళలు, శాస్రం, ఇంకా ఎన్నో పుట్టి, పెరిగాయి. మనం ఏ జంతువు వెనకనో పడి ఏ శూలం తోనో కొట్టే పనిలో ఉన్నట్లయితే మనం ఇలా సంస్కృతిని పెంచలేక పోయేవారం.
వ్యవసాయంలోని గొప్పతనం
వ్యవసాయం మన సంస్కృతికి పునాది. ఆ విషయం మనం మరువకూడదు. అదొక రకమైన అద్భుతం. మనం నడుస్తున్న మట్టినే మనం ఆహారంగా మనం మార్చగలుగుతున్నాం. నేను చెబుతున్నదేమిటో మీకు అర్థం కాక పోతే ఈ రాత్రి మీ భోజనంలో పచ్చడికి బదులు ఒక ముద్ద మట్టిని పెట్టుకుని అది నంజుకుంటూ అన్నం తినండి. మట్టి తినడం ఎంత కష్టంగా, ఘోరంగా ఉంటుందో చూడండి. మరి మనం తినలేని ఆ మట్టినే మనం మధురమైన, పోషణ నిచ్చే ఆహారంగా, మన కండ, నెత్తురును తయారు చేసే ఆహారంగా చేసుకుంటున్నాము. అదేమీ చిన్న విషయం కాదు.
మట్టిని ఆహారంగా మార్చే ప్రక్రియను వ్యవసాయం అంటాము. ఈ అద్భుతమైన ప్రక్రియను వృక్ష సంపదను గమనించి దానిని ఉపయోగించుకోవడంతో కనుగొన్నాము. మీరు కాలేజీలో ఉన్నారు కాబట్టి నేను చెప్పిందాంట్లో తప్పేమన్నా ఉంటే సరిచేయవచ్చు, నాకు తెలిసినంత వరకు, దక్షిణ అమెరికాలోని ఏవో కొన్ని ప్రాంతాలు తప్ప, మరెక్కడా పన్నెండు వేల ఏళ్ళకు పైబడిన వ్యవసాయ సంస్కృతి లేదు. ఈ దక్షిణ భారతంలో తమిళనాడులో పన్నెండు వేల ఏళ్లకు పైగా మనం అదే భూమిని మనం దున్నుతున్నాం. అమెరికాలో మట్టిని ‘మలినం’ అంటారు, కాని మనం మాత్రం దీనిని భూమాత అంటున్నాం, ఎందుకంటే మనకు భూమితో ప్రగాఢమైన సంబంధం ఉంది.
వ్యవసాయం విపి మళ్లడమే శరణ్యం
170, 180 ఏళ్లకు ముందు మన దేశం పరిశ్రమలున్న దేశం. మూడు వందల ఏళ్లకు పూర్వం బహుశా భూమి మీద మనదే పెద్ద పారిశ్రామిక దేశం. వస్త్ర పరిశ్రమ అతి పెద్ద పరిశ్రమ, ప్రపంచానికి కావలసిన అరవై శాతం వస్త్రాలు మనమే ఎగుమతి చేసే వారము. 1800 - 1860 మధ్య బ్రిటిష్ వారు యూరోప్ నుంచి మనదేశానికి కేవలం బట్టలు కొనడానికి ఎంతో ధనం రావడం గమనించారు. అరబ్బులు మన వస్త్రాలను కొని యూరోప్ లో పది రెట్లకు అమ్మేవారు. అందువల్ల వారి బంగారం, వెండి అంతా మన దేశానికి వచ్చేది. అప్పుడే కొలంబస్లు, వాస్కోడిగామాలు మన దేశానికి దారి కనుగునే ప్రయత్నాలు చేశారు. అరబ్బులు పది రెట్లు సొమ్ము చేసుకోవడం తప్పించుకోవడానికి, అప్పటినుంచే, అందరూ మన దేశానికి సముద్ర మార్గం కనుగొనే సాహసాలు చేపట్టారు,
వాళ్ళిక్కడకి వచ్చినప్పుడు ఈ పరిశ్రమలోని నేర్పును, మెళకువలునూ గమనించారు. కేవలం ఒక మనిషి కూర్చుని థక్, థక్, థక్, థక్, అంటుంటే వస్త్రం వచ్చేస్తోంది. వారు ఇది ఎంతో సులువైనదనీ తాము యంత్రాలతో దీన్ని చేయవచ్చని గమనించారు, వారు మొదలెట్టి ఓ అరవై ఏళ్లలో ఈ దేశం నుంచి ఎగుమతులు తొంబై ఎనిమిది శాతం పడిపోయాయి. రెండు శాతానికి పడిపోవడానికి కారణం వాళ్లు సుంకాలు పెంచారు, నాజూకు వస్త్రాలను తయారు చేసే వారి వేళ్లను తెగగొట్టి వారి మగ్గాలను నాశనం చేసారు.
1830 లలోని బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఒకరు “భారత దేశ భూములు చేనేతకారుల ఎముకలతో రంగు వేయ బడ్డాయి” అన్నారు. తమ పరిశ్రమలు నాశనం కావడంతో లక్షల మంది తిండిలేక అలమటించారు. అప్పుడే మళ్లీ జనాభా అంతా వ్యవసాయం వైపుకు మళ్లింది. తమకు, తమ కుటుంబాలకు కొంత ఆహారం చేకూర్చుకోవడానికి వ్యవసాయం ఒక్కటే జీవినాధారం అయ్యింది. అందుకే 1947 నాటికి 77 శాతం జనాభా వ్యవసాయంలోనే ఉన్నారు.
మానవ వనరులను సమీకరించడం
ఈనాడు అది అరవై శతానికి పడిపోయింది. దీనర్థం ఏమిటంటే పది మంది తినడానికి ఆరుగురు వండుతున్నారు. మానవ వనరులను సరిగా ఉపయోగించుకునే విధానం ఇది కాదు. నిజానికి మనకున్న నిజమైన వనరు మానవులే, మనకు మిగతావి అంతగా తేవు, మనకున్నది మానవ వనరులే. మనం వారికి సరైన శిక్షణ, స్పష్టతలను ఇచ్చి, స్ఫూర్తి వంతం చేస్తే మనం ఒక అద్భుతం అవుతాము. మనం ఆ పని చేయలేకపోతే, మనం ఒక పెద్ద విపత్తుకు చేరుకుంటాం.
అరవై శాతం మంది వ్యవసాయం చేయడం సరైన పద్ధతి కాదు. మనం మన జనాభాను కదిలించాలి. కదిలించడం అంటే, వారిని పల్లెలనుంచి పట్టణాలకు తరలించడం కాదు. వారి వృత్తులను, నైపుణ్యాలను, మార్చడం. ఇంత వరకూ సంఘటితంగా ఏ విధమైన ప్రయత్నమూ ఆ దిశగా జరగలేదు.
సరైన అభివృద్ధికి నోచుకోని జనాభా
మనకు వ్యవసాయంతో సమస్యలు మొదలయ్యింది నలభై, ఏభై ఏళ్ల క్రితం. మనం ఆహార పంటల నుంచి వాణిజ్య పంటలకు మారడం మొదలు పెట్టినప్పటి నుంచి. మొత్తంగా కాక పోవడానికి కారణం అది సంఘటితంగా చేయక పోవడం వల్ల. దీనివల్ల మన గ్రామీణ జనాభాకు సరైన పోషకాలు దొరకడం లేదు. మీరు ఓ నలభై ఏళ్ల క్రితం గ్రామాలకు పోయి ఉంటే అందరూ చిరిగిన బట్టలతోనే కనబడేవారు, వారు తాగేది చెరువు నీరే. దానితో అనేక సమస్యలు వచ్చేవి. అయినా వారంతా దృఢంగా ఉండేవారు. కాని ఈ రోజు చూస్తే, అరవై శాతం మందికి వారి ఎముకలు కూడా దృడంగా, పూర్తి స్థాయికి పెరగలేదు. వారు అలా కుచించుకుపోవడానికి కారణం వారు ఆహార పంటలనుంచి వాణిజ్య పంటలకు మారిపోయారు.
ఆహార పంటలు పండించేటప్పుడు వారి దగ్గర ధనం లేదు కాని వారు అన్నిరకాల ఆహారం తీసుకోగలిగేవారు. ఈనాడు దక్షిణ భారతంలో వారి ముఖ్య ఆహారం వరి, చింతపండు, ఉల్లి, మిరప అంతే. వాళ్లకు రుచిగా వండడం తెలుసు పులుసన్నం అంతే. ఉత్తర దేశంలో కూడా గోధుమ, ఉల్లి, టమోటా, మిరప అంతే. దీనివల్ల పోషకాల స్థాయి గణనీయంగా పడిపోయింది. ఇది చాలా పెద్ద సమస్య ఎందుకంటే మనం బలహీన మైన జనాభాను తయారు చేస్తున్నాము.
జనాజభాలో ఎంతో మంది తమ చిన్నతనంలో సరైన ఆహారం తీసుకోవడంలేదు, దాన్ని వాళ్లు తరువాత సరిచేసుకోలేరు. శరీరం, మెదడు వృధ్ధిచెందే సమయం మించిపోయింది. ప్రస్తుతం చేయవలసిన ముఖ్యమైన విషయం సంఘటిత వ్యవసాయ పద్ధతులు అవలింబించడం. సాంకేతికత, దానికి మించి ఆర్ధికంగా వెసులుబాటైన పరిమాణంలో వ్యవసాయం చేయడం. ఇప్పుడు రైతు దగ్గర ఉన్న సరాసరి వ్యవసాయభూమి ఒక హెక్టారు, అంటే రెండున్నర ఎకరాలు. దానితో పనికి వచ్చేది ఏదీ చేయలేము. మనం అంత తక్కువ భూమితో సరైనదేదీ చేయలేము. అందుకే కొంత పెద్ద పరిమాణంలో వ్యవసాయం చేయడానికి, మేము వ్యవసాయ ఉత్పత్తుల సంఘాలు, ఇంకా అటువంటివి ఎన్నో నెలకొల్పుతున్నాము. వ్యవసాయం చేయడానికి, నీటి వసతులు కల్పించడానికి, పండించినవి అమ్మడానికి కొంత పెద్ద మొత్తమైన భూమి, వ్యవసాయం కావాలి. పొలాలు చిన్నవి కావడం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లేదు.
సమస్య పరిష్కారానికి ప్రయత్నాలు
వ్యవసాయదారుల ఆదాయాన్ని పెంచడానికి నదుల రక్షణ ఉద్యమం ద్వారా గట్టి ప్రయత్నం జరుగుతోంది. సరైన సాంకేతికతను అవలంబిస్తే మరో ఐదారేళ్ళలో వారి ఆదాయాన్నిమూడు నుంచి ఎనిమిది రెట్లు పెంచే అవకాశం ఉంది. దీనిలో అన్నింటినీ సమీకరించడం, నీటి పారుదలను పెంచడం ముఖ్యం. నీటి వనరులను బాగా ఉపయోగించుకోవడం, పొలాల్లోకి పశువులను మళ్లీ తీసుకురావడం ముఖ్యం. ట్రాక్టరు పొలాలను దున్నగలదు కాని దానిని సారవంతం చేయలేదు. దానికి మనకు పశువులు కావాలి. పశువులు లేకుండా భవిష్యత్తులో వ్యవసాయం చేయలేము.
ఈ ప్రయత్నాలన్నీ జరుగుతున్నాయి, కాని మనది పెద్ద, వైవిధ్యాలతో కూడిన దేశం, మంచిదైనా చెడ్డదైనా ఏదీ కొంత సంక్షోభం లేకుండా జరగదు. ప్రతి చిన్నదానికీ ఏదో సంక్షోభం, కాని దీనిని మనం వెంటనే చేయలేకపోతే మన దేశ వ్యసాయం సంక్షోభంలో పడుతుంది. మనం సర్వే నిర్వహిస్తే ఎంతమంది వ్యవసాయదారులు తమ పిల్లలను వ్యవసాయంలోకి దించుతారు? నన్ను నమ్మండి అది రెండు నుంచి ఐదు శాతం మాత్రమే. అంతకన్నా ఎక్కువకాదు. ఇది దేశానికి మంచిది కాదు.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.