ప్రశ్న: నేను నా గాఢ కామ వాంఛలను ఎలా వదిలించుకోవాలి ?

సద్గురు: మనం ఎల్లప్పుడూ ఏదయినా వదిలించుకోవాలి అని చూస్తాము. ఏదయినా బలవంతంగా వదిలించుకోలేము. బలవంతంగా ఏదయినా వదిలించుకోవడానికి ప్రయత్నిస్తే, అది ఇంకో రూపంలో బయట పడుతుంది. మీలోనే ఇంకో వికారం ఉత్పన్నమవుతుంది. దాన్ని వదిలేయాలని ప్రయత్నిస్తే, అది మీ మనస్సును, చైతన్యాన్ని పూర్తిగా శాసిస్తుంది. కానీ, ఇప్పుడు మీకు తెలిసిన దాని కంటే లోతైనది మీరు కనుగొంటే, దాని కంటే తక్కువైనది దానంతట అదే నశిస్తుంది. మీరు చూస్తూనే ఉంటారు, ఏదయినా మేధో సంబంధమైన కార్య కలాపంలో పూర్తిగా నిమగ్నమైన వారు, పుస్తక పఠనం చేస్తారు గానీ రతిలో పాల్గొనరు.

మీరు కామ క్రీడలందు ఆసక్తితో ఎందుకు పరిగెడుతున్నారంటే, ప్రస్తుతానికి మీకు తెలిసిన గొప్ప సుఖం అదే. మీకు ఎవరయినా "అది చెడ్డది, వదిలెయ్యి" అని చెప్తే మీరు విడిచి పెడతారా ? కానీ అంతకంటే ఉత్తమమైనది, మధురమైనది రుచి చూస్తే అది వదిలేయమని మీకు ఎవరైనా చెప్పాలా ? దానంతట అదే వదిలి పోతుంది. కాబట్టి మీరు దానికంటే అధికమైన సంభావ్యతలు నిజం చేసేందుకు కావాల్సిన విషయాలపై సమయాన్ని వెచ్చించాలి. మీరు దానికంటే ఎంతో అధికము, పరమ సుఖప్రదము, ఎంతో పరవశింపచేసే దానిని పొందితే, సహజం గానే చిన్న సుఖాలు జారిపోతాయి. దానిని మీరు విడిచివేయలేదు, ఇంక దానిని ఆచరించరు, ఎందుకంటే మీరు మీకోసం అంతకంటే ఉన్నతమైన దాన్ని కనుగొన్నారు.

ఇదే మీకు జీవితంలోని అనేక విషయాలలో జరిగింది. మీ చిన్నప్పుడు మీ దృష్టిలో ఇదే ప్రపంచం అనుకొన్నవి, వదిలివెళ్లాయి, ఎందుకంటే మీరు వాటికంటే అధికం అనుకున్నవి కనుక్కున్నారు. అదే విషయం దీనికి కూడా వర్తిస్తుంది. మీరు దీనికంటే లోతయిన తీవ్రత, లోతయిన సౌఖ్యము, పారవశ్యమైనది మీకోసం కనుగొంటే, అవి వాటంతట అవే రాలి పోతాయి.

లైంగికత అనేది మీలో చాలా కొద్ది భాగము. ప్రజలు అతిగా లైంగిక భావనతో ఉండటానికి కారణం, మూర్ఖ నైతికత్వము వల్ల వారు దానిని బలవంతంగా వదిలి వేయాలనుకోవడమే. మీరు స్త్రీ, పురుషుడు అనేది, కేవలం కొన్ని సహజ ప్రక్రియల సౌలభ్యం కోసం, కొద్దిపాటి శరీర ధర్మ సంబంధమైన తేడా మాత్రమే. దేహంలోని ఒక అవయవం గురించి మనం ఇంత ప్రాధాన్యత ఎందుకు ఆపాదిస్తున్నాము ? అంత ప్రాధాన్యత దేహంలోని ఏ అవయవానికి తగదు. అంత ప్రాధాన్యత ఏ అవయవానికి అన్నా ఇవ్వాలి అంటే, మెదడుకి అర్హత ఉందేమో కానీ జననేంద్రియాలు మాత్రం కావు.

వారు జీవితాన్ని ఉన్నది ఉన్నట్లుగా చూస్తే, త్వరితగతిన వికసిస్తారు. చాలామంది, దానిలో ప్రవేశించకుండానే వికసిస్తారు. జీవితం మీద అనుచితమైన స్పష్టత వలన, ప్రతిదీ వికారంగాను, భీకరం గాను ఉంటాయి. కేవలం ఇంతమాత్రమే. కాకపోతే, ఎక్కువ శాతం ప్రజలకి దాని మీద ధ్యాసే ఉండదు, లేదా వారి ఆసక్తి యాదృచ్చికంగా ఉంటుంది. అది ప్రస్తుతం ఉన్నంత ప్రాముఖ్యతతో ఉండదు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు