లైంగిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం సమంజసమేనా?
"లైంగిక విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం సమజమేనా?" అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు. ఎక్కువమంది లైంగిక విషయాల గురించి ఆరాటపడడంలోనో, లేదా తప్పించుకోవడంలోనో నిమగ్నమవ్వడం గురించి కూడా చర్చిస్తున్నారు.
ప్రశ్న: లైంగిక విషయాల గురించి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నట్లు అనిపిస్తుంది. నేను తప్పుగా ఆలోచిస్తున్నానా? కానీ నా ఉద్దేశ్యంలో చాలామంది ఇదేవిధంగా ఆలోచిస్తారు అనిపిస్తుంది. కానీ తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దవారు ఆ విషయాన్ని దూరంగా పెడతారు. దాని గురించి మీరేమంటారోనని నాకు తెలుసుకోవాలని ఉంది.
సద్గురు: నేనో జోక్ చెబుతాను. ఒక రోజు ఓ ఆరేళ్ళ పాప స్కూలు నుండి ఇంటికి తిరిగివచ్చి, వాళ్ళ అమ్మతో ‘అమ్మా నేనెలా పుట్టాను?’ అని అడిగింది. తల్లి ఇబ్బందిపడి, నిన్ను ఒక కొంగ తీసుకువచ్చింది అంది, పాప ఆ విషయం వ్రాసుకుంది.
మళ్లీ ‘అమ్మా నువ్వెలా పుట్టావు?’ అని అడిగింది.
‘నన్నుకూడా కొంగే పడేసింది’ అని చెప్పింది.
‘మరి అమ్ముమ్మ ఎలా ఫుట్టింది?’
‘ఆమెను కూడా కొంగే పడేసింది’ అని చెప్పింది.
పాప చాలా గంభీరంగా అయిపోయింది. ఆమె తన పుస్తకంలో ఏదో రాయడం మొదలెట్టింది. తల్లికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉండి, పాప హోంవర్కు పూర్తి అయ్యాక ఆమె పుస్తకం తీసి ఆదుర్దాగా చూసింది. పాప పుస్తకంలో ‘మూడు తరాల నుంచి మా ఇంట్లో ఎవ్వరూ సహజంగా పుట్టలేదు’ అని రాసుకుంది.
కామం సహజమే, కామ వాంఛ మనం తయారుచేసుకున్నదే
ఇందులో అసహజం అంటూ ఏమీ లేదు. జరుగుతున్నదేమిటంటే మీ వివేకాన్ని మీ హార్మోన్లు దారితప్పిస్తున్నాయి. అది కేవలం నిర్బంధకరమైన ప్రవర్తన. మీ చిన్నతనంలో ఎదుటివారికి ఏ అవయవాలున్నాయో మీరు పట్టించుకోలేదు. కాని ఒకసారి మీలో హార్మోన్లు తయారైతే ఇక మీరు దానిని దాటి ప్రపంచంలో మరేదీ పట్టించుకోలేరు. మీ బుద్ధిని పూర్తిగా హర్మోన్లే దారి తప్పించాయి.
కామం సహజమే, అది భౌతికమైనది, అది శరీరంలో ఉంది. కాని కామ వాంఛ మీరు తయారుచేసుకుంది. అది మానసికమైనది. ప్రస్తుతం అదే ప్రపంచాన్ని పరిపాలిస్తున్నది. అదే ఇప్పుడు ఒక వ్యాధి అయ్యింది. ఎందువల్లనంటే అది శరీరంలో ఉంటే సరైనదే, అది సహజంగా ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. కాని ఒకసారి అది మీ మనస్సులోకి ప్రవేశిస్తే, అది విపరీతత్వం అవుతుంది. దానికి మీ బుర్రతో పనిలేదు.
కామ వాంఛ మానవుని బుర్రలో ఓ పెద్ద విషయమే అయినా, నిజానికి అది ఓ చిన్న విషయం. మీరు మీ శరీరాన్ని కొంచెం దాటి చూస్తే అక్కడ మగ, ఆడ అంటూ ఏమీలేదు. శరీర పరంగానే ఒకరు మగ లేక ఆడ. జాతి పునరుత్పత్తి సాగడానికే అక్కడ కొంత శారీరక వ్యత్యాసం ఉంది. ఆ శారీరక వ్యత్యాసానికి సహాయపడేదే మానసిక వ్యత్యాసం. అంతే తప్ప కళ్ళు, ముక్కు, నోరు అన్నీ అవే, పునరుత్పత్తి అవయవాలే తేడా.
అసలు మనం ఆ మూడు అవయవాలకు ఎంతో ప్రాముఖ్యత ఎందుకు ఇచ్చాము? మన శరీరంలో ఏదైనా అవయవం ముఖ్యమైనదైతే అది మన మెదడు కావాలి, మన పునరుత్పత్తి అవయవాలు కాదు.
లైంగికత మీద సిద్ధాంతాలు
లైంగికత అంత పెద్ద విషయం ఎందుకైందంటే, ఎక్కడో మనం మన శరీర నిర్మాణాన్ని పూర్తిగా అంగీకరించలేదు. మనం మిగతా అవయవాలను అంగీరించాం, కాని ఈ ఒక్క అవయవాన్ని అంగీకరించలేదు. మీ మర్మావయవాలు మీ చేతులు, కాళ్లు, మిగతా అవయవాల లాంటివే. కాని వాటి గురించి ఏదోదో చేసేశారు. అది ఎక్కువయ్యేకొద్దీ మనుషుల బుర్రల్లో అదో పెద్ద విషయం అయిపోయింది.
ఎవరో దాన్ని చెడ్డది అన్నారు, అందుకే అది మీ బుర్రలోకి ప్రవేశించింది. అది చెడ్డది కాబట్టి దానిని మీరిక విడవలేరు. చెడ్డది అనుకునేదానిని మీరు వదల్లేరు, అది మీ వెంటే ఉంటుంది. గమనించండి!
అతి ప్రాథమికమైన, చిన్న విషయం గురించి ఏదో తప్పు, ఒప్పు అని మనమే విభజించాం. ఇక చెడ్డ దానిని హీనం చేయడానికి ఒక సిద్ధాంతాన్ని తయారు చేసినా, అది ఇంకా మిగిలే ఉంది. ప్రజల లైంగికతను సమర్థించచడానికి ఎన్నో సిద్ధాంతాలు ప్రతిపాదించాము. అసలు కామానికి సిద్ధాంతాలు ఎందుకో నాకు అర్థం కాదు. అది కేవలం జీవశాస్త్రం. ఈ సంక్లిష్టత అంతా అనవసరం. దానిని సంక్లిష్టంచేస్తే అది మీ జీవితంలో అనవసరంగా పెద్ద విషయం అవుతుంది.
పనికిరాని ఆలోచనల వల్ల మనం దానిని పెద్దదైనా చేస్తాం లేక తొక్కి వేసే ప్రయత్నం చేస్తాం. ఆధునిక సమాజాలను గమనిస్తే బహుశా 90 శాతం మానవ శక్తిని దాని కోసమో, దానిని తప్పించుకునే ప్రయత్నంలోనో వ్యర్ధంచేస్తున్నారు. మీ జీవతంలో లైంగికతకు ఒక పాత్ర ఉంది. మీరు దానికి మరీ ప్రాముఖ్యతను ఇస్తే, మీ బుర్ర వికటిస్తుంది. మీరు దానిని చిదిమి వేసే ప్రయత్నం చేస్తే మీ బుర్ర మరికాస్త వికటిస్తుంది.
మీకు మీ శరీరంతో గుర్తింపు ఎక్కువయ్యేకొద్దీ లైంగికత మరింత ఎక్కువ అవుతుంది. మీ శరీరంతో మీకు గుర్తింపు తక్కువ అయ్యేకొద్దీ అది తగ్గుతుంది. ఎవరైనా ప్రజ్ఞావంతులైనకొద్దీ, వారికి కామ వాంఛ తగ్గడం గమనించారా? కాని ఎక్కువమంది జ్ఞానోన్నతి గానీ, మానసిక మాధుర్యంగానీ చవిచూచి ఉండరు, వారికి భావపరమైన మాధుర్యం కూడా తెలియదు, ఇక వారికి శక్తిపరమైన మాధుర్యత ఇక ఉండనే ఉండదు. వారికి కాస్త ఎక్కువ ఉన్నతానుభూతిని ఇచ్చేది ఇక కామమే. శారీరకమైన మధుర అనుభూతినిచ్చేది కామం ఒక్కటే, వారి జీవన విధానంలో వారికున్న కాస్తంత ఊరట ఇదొక్కటే.
లైంగికత ముఖ్యం కాదు, అనుభూతి ముఖ్యం
మీరు కాస్త నిశితంగా మిమ్మల్నీ, మీ చుట్టూవుండేవారినీ గమనిస్తే, వారిలో భౌతికమైన క్రమశిక్షణ కరువైతే, వారు ఆనందానికి అతిగా వెంపర్లాడుతుంటారు. అక్కడ ఆనందమేమీ మిగిలి ఉండదు. మీరెంత ఆనందంగా ఉంటే, మీ జీవితంలో సుఖంకోసం అంత తక్కువ అవసరం ఉంటుంది. మీరు ఆనందంగా లేకపోతే మీకు అపరిమితమైన కార్యకలాపాలు ఉంటాయి, లైంగికత అందులో ఒకటి. మనల్నందరినీ భూమి మీదకు తీసుకు వచ్చిన ప్రాధమిక ప్రక్రియ గురించి నేను మాట్లాడడం లేదు. నేను దానికి వ్యతిరేకంగా మాట్లాడడం లేదు, కాని మీరు దానిని మీ బుర్రల్లోంచి తొలగించాలి.
నేను కొంతమందిలో చూసిందేమిటంటే, తాము ఏమి చేస్తున్నా ఇది ‘సెక్సు తరువాత అతి ఉత్తమమైంది’ అంటుంటారు. నిజానికి సెక్సు అత్యుత్తమమైంది కాదు. ఇది అతి ప్రజాదరణ పొందింది, అంతే కానీ అత్యత్తుమమైంది కాదు. మీరు జీవితంలోని ఇతర అంశాలు చూస్తే ఇది ఎలా ఉంటుందంటే, మీరు చిన్నప్పుడు కొన్ని కొన్ని వాటిమీద ఎంతో ఉత్పాహం చూపారు, కానీ వయస్సు పెరుగుతున్నకొద్దీ ఏమాత్రం ప్రయత్నం చెయ్యకుండానే మీరువాటిని వదిలేశారు. విపరీతమైన కామ వాంఛను కూడా అలానే వదిలేయాలి.
మీ శక్తులు నిలకడ, సూక్ష్మం అయినప్పటినుంచీ, అది ఎంత మధురంగా ఉంటుందంటే, మీకు మరో శరీరంతో మీకు పనిలేదు, ఎందువల్లనంటే మీరు ఊరకే అలా కూర్చుంటే చాలు లైంగికత కంటే మరింత మైమరపులో ఉంటారు. ఆ స్థితి మీలో వాస్తమమయ్యేకొద్దీ, అంటే మీరు ఎప్పుడూ అదేస్థితిలో కొనసాగుతూ ఉండగలిగిన కొద్దీ, లైంగికత మీ జీవితంనుండి అదృశ్యమౌతుంది. దానికి కారణం మీ సామర్ధ్యం కరువయ్యో లేక అది చెడు అని తలచటం వల్లో కాదు, కేవలం మరొకరికి అంటుకుని ఏదో చేయడం, లేక ఏదో గొప్ప అని భావించడం అనేవి పిల్ల చేష్టల్లా అనిపించడం వల్ల.
లైంగికత సమంజసమే, దానిలో తప్పు, ఒప్పు అంటూ ఏమీ లేవు, కేవలం జీవితంలో అదొక ముతక వ్యవహారం, అంతే. అది మీ శరీరంలో ఉంటే సమంజసమే. కానీ అది మీ బుర్రలోకి వెళితే, అది ఉండకూడని చోట ఉన్నట్లే. అది ఉండకూడని చోట ఉంటే మీ జీవితం అస్థవ్యస్థం అవుతుంది.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి..UnplugWithSadhguru.org.