మీ కలలు నిజం చేసుకోవటం ఎలా?
సద్గురు ఒక ప్రశ్నకి సమాధానం ఇస్తూ, మన ఆకాంక్షల స్వరూపాన్ని విశ్లేషించి మన పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకొనేందుకు మనం ఏం చేయాలో వివరిస్తున్నారు.
ప్రశ్న: నమస్కారం! నేను ఎంతో పెద్ద పెద్ద కలలు కంటూ ఉంటాను. అవి నిజం కావాలని ఆశిస్తుంటాను. కానీ నాకు కలుపుగోలుతనం తక్కువ. ప్రపంచాన్ని ఎదుర్కోవాలంటే భయం. నేను, కాలేజీ చదువు పూర్తయ్యాక, నలుగురూ గేలి చేసి తీసిపారేస్తారేమోనన్న భయం లేకుండా, నా కలలను సాకారం చేసుకోవటం ఎలా ?
సద్గురు: మనుషులు నిద్ర పోయినప్పుడల్లా కలలు కంటూనే ఉంటారు. నా సలహా ఏమిటంటే, మీరు కొంత కాలం మీ కలలను నిద్రపుచ్చండి. ఇప్పుడప్పుడే ఏ కలలూ వద్దు. ఇంకా సమయం రాలేదు. ముందు ఈ ప్రపంచంలో మీ స్థానం ఏమిటో నిర్ణయించుకోండి.రాబోయే మూడు నుండి అయిదు సంవత్సరాలలో మీరు పూర్తిగా మారిపోతారు. నిజానికి, చెప్పుకోదగినంత మార్పులు కాకపోయినా, ప్రతిరోజూ మార్పులు వస్తూనే ఉంటాయి. కాబట్టి, ఇప్పుడే మీరు 'ఈ ప్రపంచంలో నేను ఏం చేయబోతున్నాను? ' అని ఆలోచించక్కర్లేదు. అలా ఆలోచిస్తే, చిన్నపాటి నిస్సారపు కలలు మాత్రమే కనగలరు. ఇప్పటికిప్పుడు మీరు చేయాల్సిన పని, మీకు ఎంత వీలైతే అంత తెలుసుకోవటం, విషయ గ్రహణం చేయటం. శారీరకం గానూ, మానసికంగానూ, భావోద్వేగపరం గానూ మీ బుద్ధి శక్తికి తగ్గట్టుగా పూర్తి స్థాయి వికాసం గల వ్యక్తిగా ఎదగండి. అన్ని విధాలుగానూ మీకు సాధ్యమైనంత ఎదుగుదల సాధించండి.
పరుగు పందానికి సిద్ధం
ఓ రకంగా చూస్తే, మీరు కలలూ, ఆశలూ అంటున్నారంటే, మిమ్మల్ని మీరే ఏదో ఒక పరుగు పందెంలో ఉన్నట్టు భావిస్తున్నారన్న మాట ! ఈ రోజులలో ఈ పందాలను 'ఎలుకల పందాలు' (Rat-race) అంటున్నారు. ఎలుకల పందెంలో పాల్గొనటమంటేనే , ఎవరు హెచ్చు, ఎవరు తక్కువ అని నిర్ణయించేందుకు. ఈ పందెంలో పాల్గొనే అర్హత కోసం ముందు మీరొక ఎలుక కావాలి. జీవ పరిణామంలో ఒక పెద్ద వెనకడుగు వేయాలి. చివరికి పందెం గెలిచినా మీరు 'ఉత్తమ ఎలుక ' అయిపోతారేమో గానీ, మొత్తానికి ఎలుక గానే ఉంటారు! 'నేను ఎంత ఎత్తు ఎక్క గలను? ఫలానా వారికంటే ఎంత పైకి, ఎంత కిందికి?' అనే ధోరణిలో ఆలోచించద్దు. ఇది గ్రహించగలిగినంతగా విషయాలు గ్రహించ వలసిన సమయం. మీరు ఇంకా మామిడి పళ్లు కోతకు అందించే సమయం కాలేదు. ఆ పూతనే పీకి పడేసి, ఏపుగా ఎదిగిపోవలసిన సమయం ఇది !
మీరు పందెం గెలవాలంటే, కేవలం గెలవాలని కోరుకోవటం మాత్రమే సరిపోదు. దానికి తగ్గ వాహనం నిర్మించుకోవాలి. మీ దగ్గర ఉన్నది ఒక మారుతి-800 . మీరు దాంతో ఓ 'ఫార్ములా వన్' పందెం గెలవాలనుకొంటున్నారు. మీరు ఎన్ని కలలు కావాలంటే అన్నీ కనవచ్చు. లూయిస్ హామిల్టన్ మిమ్మల్ని దాటిపోవటానికి ప్రయత్నిస్తున్నట్టూ, కానీ మీ మారుతి-800 కారులో మీరే అతగాడిని దాటిపోయినట్టూ కలలు కనచ్చు. మీరు నిజంగా పందెం లోకి వెళ్ళి , అలాంటిదేదయినా ప్రయత్నిస్తే, మీ మారుతీ కారు నాలుగు చక్రాలూ ఎగిరి వెళ్ళి నాలుగు దిక్కుల్లో పడతాయి.
పందెం గెలవటానికి ప్రయత్నించద్దు. సరయిన పందెపు వాహనం నిర్మించుకోండి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం అది. పందెం గెలవాలని ప్రయత్నించటం అంటే, ఎప్పటికప్పుడు వెనక్కు తిరిగి చూసుకొంటున్నారన్న మాట, 'నా వెనక ఎవరున్నారు? ' అని. మీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ తెలివి లేని వాళ్ళు కావటం చేత, మీరు పందెం గెలుస్తున్నారంటే, మీరు కొంచెం తక్కువ తెలివి లేని వాళ్ళని అర్థం. అంతకు మించి ఏముంది? అసలు ఎప్పుడూ ఆ ధోరణిలో ఆలోచనే వద్దు. మరెవరికంటేనో అధికులం కావాలి అని కోరుకోవటం తప్పు దారి. కానీ మానవ జాతి అంతా ఈ తప్పు దారిలోనే నడుస్తున్నది . దీనివలన మీరు ఎప్పుడూ ఒక పోరాట భావన లోనే ఉండిపోతారు. నిజం చెప్పాలంటే, మరొకడు విఫలమైతే చూసి ఆనందించే దశకు వచ్చారంటే, అదే ఒక మానసిక రుగ్మత.
మీ కలలకు ఆవల!
ఈ ప్రపంచంలో మీరు ఏం చేయాలి? ఏది అత్యావశ్యకమో అది చేయాలి. అంతే కానీ, మీ బుర్రకు తోచినదేదో చేసేయగూడదు. మీ బుర్రకు తోచిన ఆలోచన ప్రపంచానికి పనికి వచ్చేది కాకపోవచ్చు. అలాంటప్పుడు దాన్ని అమలు చేస్తే ప్రయోజనం ఏముంటుంది? ఇప్పటికే చాలా మంది తమకు నచ్చిందేదో చేసేసి ప్రపంచాన్ని చాలా రకాలుగా నాశనం చేసేశారు. లోకానికి అవసరమయినదేదో అది మనం ఆనందంగా చేయ గలిగితే, అప్పుడు పదిమంది ఇతరులు కూడా మనతో చేరి మనకు తోడు వస్తారు. జరగవలసిన పనులు జరుగుతాయి.
భవిష్యత్తు సరికొత్తగా ముందుకు వెళ్ళాలి. మీకు కలలో కూడా ఊహించనిదేదో మీ జీవితంలో జరగాలి - మీకు నా ఆశీస్సు ఇదే! మీరు ఊహించను కూడా లేనిది జరగాలి. మీరు కల గన్నదే జరిగితే దాన్లో ప్రయోజనం ఏముంది? మీకు తెలిసిందేదో అదే కదా కలలో మీకు కనిపించేది! మీకు తెలిసిందేదో అదే మళ్ళీ జరుగుతూ ఉంటే అదొక నిస్సారమైన జీవితం అవుతుంది. మీరు ఎప్పుడూ కలలో కూడా చూడనిది జరగనివ్వండి. అలాగయితేనే జీవితం ఉత్సాహ భరితంగా ఉంటుంది.
మీ కలలను నాశనం చేయాలని నా కోరిక! అవి నాశనమై పోనీయండి, అప్పుడే, మీ పూర్తి సామర్థ్యం మేరకు మిమ్మల్ని వికసింపజేసుకోవాలనే అభిలాష మీకు కలుగుతుంది.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి.. UnplugWithSadhguru.org.