Table of Content
విడాకులకు కారణాలు
ప్రేమ అనేది మీ గురించే
విడాకులు అంటే ఏంటి?
విడాకులు, మళ్లీ పెళ్లి
విడాకులు తీసుకోవడం తప్పనిసరి అయినప్పుడు
మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది పిల్లలపై చూపే ప్రభావం
విడాకుల తర్వాత సింగిల్ మదర్ గా ఉండడం
విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవటం సరైనదేనా?

విడాకులకు కారణాలు

ప్రశ్న : సంసారం నిరాశా నిస్పృహలతో నిండిన పోరుగా అయినప్పుడు, విడాకులు తీసుకోవడం మంచి పనే కదా?

సద్గురు::మనం అవతలి వ్యక్తితో గొడవ పడకుండా ఉండగలిగితే, అప్పుడు అసలు విడాకులు అన్న ప్రశ్నే తలెత్తదు. మీరు వీధిలో ఎవరితోనో గొడవ పడటం లేదు. మీరు ఒకప్పుడు ఎంతో అద్భుతమైన వ్యక్తి అని భావించిన వారితోనే ఇప్పుడు గొడవ పడుతున్నారు. ఈ గొడవ ఉన్నట్లుండి ఆ వ్యక్తి ఇప్పుడు ఘోరంగా మారడం వల్ల కాదు. ఈ గొడవ ఎందుకు వచ్చిందంటే మనం పెరిగే కొద్దీ కొన్ని మార్పులు చోటు చేసుకుంటాయి, మనం వాటిని అంగీకరించటానికి సుముఖంగా ఉండము. ఇద్దరు వ్యక్తులు వేర్వేరు దిశల్లో అభివృద్ధి చెందుతారు, అది పర్వాలేదు కూడా. మనం ఒకటిగా కలిసి ఉండటానికి ఒకే విధంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇద్దరు వ్యక్తులూ ఒకేలాంటి ఇష్టాలు, ఒకేలాంటి పనులు,ఒకేలాంటి భావాలు కలిగి ఉండాల్సిన అవసరం లేదు. ప్రజలు పూర్తిగా భిన్నంగా ఉండి కూడా ఒకటిగా ఉండవచ్చు. మీతో పాటు ఉండాలి అంటే ఇతరులు కూడా అచ్చం మీలానే ఉండాలి అనుకోవడంలో, ఒక విధమైన అపరిపక్వత ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా, ఏ ఇద్దరూ ఒకేలా ఉండరు. జీవితానికి సంబంధించిన ఏదో ఒక అంశంలో ఖచ్చితంగా ఇద్దరి మధ్యా కొంత వ్యత్యాసం అనేది ఉంటుంది.

ఎక్కడో వీధిలోని వ్యక్తి గురించి వదిలిపెట్టండి, మీ జీవితంలో ఉండే మీకు అతి సన్నిహితమైన వ్యక్తితో, మీకు పలు రకాల విబేధాలు లేవా?

రాబర్ట్ ఓవెన్ అనే ఒక అమెరికన్ రచయిత, “ప్రపంచంలో ప్రతి ఒక్కరు తేడా గానే ఉంటారు, ఒక్క మీరూ నేనూ తప్ప. కానీ మీరు కూడా కొద్దిగా తేడాగానే ఉన్నారు” అంటాడు. దయచేసి మీ ఆలోచనలను పరిశీలించి చూడండి. మీ ఆలోచన ప్రకారం వెళితే, ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా సరైన వారు కారు. ఒకసారి జీవితంలో మీకు ఉండే అత్యంత సన్నిహితమైన వ్యక్తిని పరిశీలించి చూడండి. మీకు అతనితో ఎన్ని రకాల విబేధాలు ఉంటాయో చూడండి. ఎక్కడో వీధిలోని వ్యక్త గురించి వదిలిపెట్టండి, మీ జీవితంలో ఉండే మీకు అతి సన్నిహితమైన వ్యక్తితో, మీకు పలు రకాల విబేధాలు లేవా? అంటే దానర్ధం, మీ దృష్టిలో ప్రపంచంలో ఎవ్వరు కూడా సరైన వారు కాదు అని. ఎవ్వరు సరైన వారు కాదు అంటే, ఇక్కడ ప్రశ్న సరైనవారా కాదా అన్నది కాదు. విషయం ఏంటంటే మీరు మానసికంగా అనారోగ్యానికి గురవుతున్నారు అంతే. మానసిక అనారోగ్యం రాబోతోందని తెలిపే మొట్టమొదటి లక్షణం ఏంటంటే, మీరు అసలు ఎవరూ సరిగ్గా లేరు అని అనుకోవడం మొదలు పెట్టడమే. మీరు ఇప్పటికే మొదటి అడుగు వేసినట్టు ఉన్నారు. మీరు తర్వాతి అడుగు కూడా వేస్తే, అది మరిన్ని సమస్యలకు దారి తీస్తుంది.

ఇద్దరు వేర్వేరు వ్యక్తులు, విషయాలను వేరువేరుగా అర్థం చేసుకుని వేరువేరు పద్ధతుల్లో చేయటంలో వచ్చిన సమస్య ఏమీ లేదు. ప్రజలను ఒక్కటిగా ఉంచేది వారిలోనున్న భావోద్వేగం. మొత్తం మీద, మీరు ఒకటిగా అయింది, మీ మీ శ్రేయస్సు కోసమే. ఇది మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఏదైతే ప్రేమ అనే పేరు మీద చలామణి అవుతుందో, సాధారణంగా అది కేవలం ఒక పరస్పర ప్రయోజన పథకం మాత్రమే. మీకు కొన్ని అవసరాలు ఉన్నాయి. అవతల వ్యక్తికి కొన్ని అవసరాలు ఉన్నాయి. వాటిని తీర్చుకోవడం కోసం మీరిద్దరూ ఒక్కటిగా అవుతారు. ఆ అవసరాలు రకరకాలుగా ఉండొచ్చు- భౌతికమైనవి, మానసికమైనవి, భావోద్వేగపరమైనవి, సామాజికమైనవి, ఇంక్నా ఆర్థికపరమైనవి కావచ్చు. మీ అవసరం సరిగ్గా నెరవేరని క్షణాన, ఇక ముగిసిపోయినట్టే. ప్రస్తుతం మీరు ఆ విధంగానే ఉన్నారు. అంతకుమించి మీ బంధంలో మరేమీ లేదు. మీరు అవతలి వ్యక్తి నుంచి ఉత్తమమైనదాన్ని పొందాలి అనుకుంటున్నారు. అలాగే అవతలి వ్యక్తి కూడా మీ నుంచి ఉత్తమమైన దాన్ని రాబట్టుకోవాలి అనుకుంటున్నారు. ఇది ఒక పోరు. ఇది ఒక ప్రేమానుబంధం కాదు.

ప్రేమ అనేది మీ గురించి

మీరు దేన్ని అయితే ప్రేమ అంటున్నారో, అది ఇతరుల గురించి కాదు, అది మీ గురించి. మీలో మీరు ఎలా ఉంటున్నారు అనేదాని గురించి. మీ శరీరం ఆహ్లాదంగా అయితే, మనం దాన్ని ఆరోగ్యమని ఇంకా సుఖమని అంటాము. మీ మనసు ప్రశాంతంగా ఉంటే మనం దాన్ని సంతోషమని, ఆనందం అని అంటాము. మీ భావోద్వేగాలు చాలా ఆహ్లాదంగా ఉంటే, మనం దాన్ని ప్రేమ అంటాము. మీ జీవశక్తులు చాలా ఆహ్లాదంగా ఉంటే, మనం దాన్ని పారవశ్యం అంటాము. ఇవి మనలో మనం ఉండగలిగే కొన్ని విధానాలు. వీటికి ఎవరితోనూ సంబంధం లేదు. కానీ మీరు వీటిని మరొకరితో ముడి పెడుతున్నారు. వేరెవరో మీ మనసుని, భావోద్వేగాన్ని, ఇంకా శరీరాన్ని ఆహ్లాదంగా ఉంచాలీ అంటే, అది ఎంతో కాలం పాటు జరిగే పని కాదు. ఏ మనిషీ కూడా అలా ఎప్పటికీ కొనసాగించలేరు. బహుశా వాళ్ళు మిమ్మల్ని కలిసినప్పుడు, మొదటి మూడు రోజుల వరకు, వాళ్ళు మీ మనసుని, భావోద్వేగాన్ని, శరీరాన్ని ఆహ్లాదంగా ఉంచడానికి, అన్నీ చేస్తారు. కానీ వాళ్ళు దాన్ని అలానే కొనసాగించలేరు. అసలు అది ఏ మనిషికీ సాధ్యం కాదు కూడా.

కాబట్టి మీరు మీ మనసుని, భావోద్వేగాన్ని, ఇంకా శరీరాన్ని ఆహ్లాదంగా ఉంచుకోవడం ఎలానో నేర్చుకుని తీరాలి. మీ భావోద్వేగాలు ఆహ్లాదంగా ఉండి, మీతో మీరు ప్రేమగా ఉంటే ఇక ఎన్ని వ్యత్యాసాలున్నా కూడా అంతా బాగానే ఉంటుంది. అది లేనప్పుడు, ప్రతి చిన్న వ్యత్యాసం కూడా ఒక పెద్ద సమస్యే. మీరు ఆహ్లాదభరితంగా ఉంటేనే, ప్రజలు మీతో సన్నిహితంగా ఉండగలుగుతారు.

విడాకులు అంటే ఏంటి?

ప్రశ్న:: నేను ఇప్పటికే విడాకులు తీసుకునే ప్రక్రియలో ఉన్నాను, నాలో ఒక భాగం చనిపోతున్నట్లుగా అనిపిస్తుంది. నేను దీన్ని సునాయాసంగా దాటడం ఎలా?

సద్గురు:: ప్రస్తుతం మీరు దేన్ని అయితే “నేను” అంటున్నారో అది ఒక పెద్ద జ్ఞాపకాల గుట్ట. మీ శరీరం, ప్రస్తుతం అది ఉన్న విధంగా ఉండటానికి కారణం, దానిలో ఉన్న జన్యుపరమైన జ్ఞాపకాలు. మీకు మీ అమ్మగారి ముక్కు, ఇంకా మీ నాన్నగారి రంగు వచ్చినది ఎందుకంటే, మీరు దేన్ని అయితే మీ శరీరం అని అంటున్నారో, అది కేవలం జ్ఞాపకాల సంక్లిష్ట సమ్మేళనం మాత్రమే. మీ శరీరంలో ఎంతో పురాతనమైన జ్ఞాపకం సజీవంగా ఉంటుంది. ప్రస్తుతం మీరు “నా మనసు” అని దేన్ని అయితే అంటున్నారో, అది నూటికి నూరు శాతం జ్ఞాపకమే. ఎన్నో విధాలుగా మీరు ఒక పెద్ద జ్ఞాపకాల గుట్ట, అలాగే మీలోనికి జ్ఞాపకాలు అనేక విధాలుగా చేరుతాయి. మీరు చూడడం ద్వారా, వినడం ద్వారా, పీల్చే వాసన ద్వారా, రుచి ద్వారా, స్పర్శ ద్వారా, మీరు జ్ఞాపకాలను పోగు చేసుకుంటారు. జ్ఞాపకాలను పోగుచేసుకునే ఈ అయిదు మార్గాలలో, మీరు చూసేది ఇంకా తాకేదీ, అత్యంత లోతైన జ్ఞాపకాలను సృష్టిస్తాయి. మరీ ముఖ్యంగా మీరు దేన్ని అయితే తాకుతారో, అది మీ వ్యవస్థలో ఒక స్థాయి జ్ఞాపకాన్ని సృష్టిస్తుంది.

విడాకులు అంటే స్వచ్చందంగా మరణించడమే. ఒక విధంగా మీలో ఒక భాగమైన దాన్ని, మీరు చంపేందుకు నిర్ణయించుకున్నారు.

జీవిత భాగస్వామి అంటే వారు మిమ్మల్ని తాకిన వారు, ఇంకా ఒక స్థాయి జ్ఞాపకాలు ఉంటాయి. విడాకులు అంటే ఒక విధంగా మీరు ఆ జ్ఞాపకాన్ని తీసేయాలి అనుకుంటున్నారు, అనేక కారణాల వల్ల అది అంత తేలిగ్గా జరిగే పని కాదు. కానీ అదే సమయంలో, మీరు విడాకులు తీసుకునే ప్రక్రియ గుండా వెళ్తున్నారు అంటే, ఒక విధంగా మీరు ఆ జ్ఞాపకాలను వదిలేయాలి అనుకుంటున్నారు అని. బహుశా మీకు ఆ జ్ఞాపకాన్ని చెరిపేయాలని లేదేమో, కానీ కొన్ని కారణాల వల్ల, ఎన్నో విధాలుగా మీ జీవితంలో ఒక భాగమైన వారిని, మెల్లగా ఒక భారంగా అనుభూతి చెందటం మొదలయ్యింది. ఇక మీరు ఆ భారాన్ని మొయ్యాలి అనుకోవడం లేదు. మీరు ఆ భారాన్ని దించేయాలి అనుకుంటున్నారు. కానీ అది మీరు స్వచ్చందంగా మోస్తున్న భారం కాదు, అని మీకు తెలిసింది. అది మీరు నిర్బంధంగా అంటి పెట్టుకున్న భారం. ఏదైతే నిర్బంధంగా మీకు అంటుకొని ఉంటుందో, దాన్ని తీసేయాలని చూస్తే, అప్పుడు నొప్పి ఉండి తీరుతుంది.

మీ జీవిత భాగస్వామి గురించిన జ్ఞాపకాలు పోగయ్యాయి, మీరు వాటిని అలా తీసేయలేరు. మీరు భావోద్వేగ పరంగా ఇంకా మానసిక పరంగా, దానితో వ్యవహరించగల ఒక సమతుల్యంలో ఉన్నా సరే, వ్యవస్థ అంతా కూడా ఒక స్థాయి క్షోభను అనుభవించడాన్ని మీరు గమనిస్తారు. మరీ ముఖ్యంగా, వారు మరణించినప్పుడు, మీరు కనుక తగినంత కాలం కలిసి జీవించి ఉన్నట్లయితే, మీ జీవిత భాగస్వామి యొక్క జ్ఞాపకాలు, మీ శరీరంలోని ప్రతి కణంలో పని చేయడాన్ని మీరు చూస్తారు. అది కేవలం భావోద్వేగపరమైన ఇంకా మానసిక పరమైన ప్రక్రియ మాత్రమే కాదు, అది అక్షరాల భౌతిక ప్రక్రియ.

విడాకులు అంటే స్వచ్చందంగా మరణించడమే. ఒక విధంగా మీలో ఒక భాగమైన దాన్ని, మీరు చంపేందుకు నిర్ణయించుకున్నారు. ఈ కారణంగానే, ఉనికి గురించి ఇంకా ఈ వ్యవస్థ పని చేసే విధానం గురించి గల ఈ అవగాహనతోనే, వారు మీకు, “మరణం మిమ్మల్ని విడదీసే వరకు, మీరు విడిపోరు” అని చెప్పేవారు. ఎందుకంటే ఇక్కడ ఒక భౌతిక జ్ఞాపకం ఉంది, అలాగే శరీరానికి, మనసుకి ఉండేటువంటి సమతుల్యత ఉండదు. మనసు నిర్ణయించుకుని, దిశను మార్చుకోగలదు, కానీ శరీరం దిశను మార్చుకోలేదు. మీరు దానిలోకి ఎంత ఎక్కువగా జ్ఞాపకాన్ని పోగు చేస్తే, అది అంత ఎక్కువగా అయోమయానికి గురి అవుతుంది.

విడాకులు, మళ్లీ పెళ్లి

చాలామంది, విడాకులతో వ్యవహరించేందుకు అత్యంత ఉత్తమమైన విధానం, వెంటనే ఏదో ఒక విధమైన మరొక అనుబంధం ఏర్పర్చుకోవడమే అనుకుంటారు. అలా చేయడం ద్వారా, మీరు మీలోని వ్యవస్థకు మరింత ఇబ్బంది, ఇంకా వేదన కలిగేలా చేస్తారు. మీ శరీరానికి ఆ జ్ఞాపకాలను మరిచిపోవడానికి, ఆ జ్ఞాపకాలను కొంత దూరంలో ఉంచగలగడానికి తగినంత సమయాన్ని ఇవ్వటం అనేది చాలా చాలా ముఖ్యం. లేదంటే, మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఇంకా ఆనందంగా ఉంచుకోవటం అనేది అతికష్టమైనా విషయంగా చేసుకుంటారు.

విడాకులు తీసుకోవడం తప్పనిసరి అయినప్పుడు

ఒకవేళ విడాకులను గనుక ఆపగలిగితే, అలా చేయడం ఒక విధంగా మంచిదే. అయితే, మీరు విడాకులు తీసుకోవాలి అనే నిర్ణయానికి వచ్చేసి ఉంటే, మీరు ఇది అర్థం చేసుకోవాలి, ప్రాథమికంగా విడాకులు అంటే, మీలో ఒక భాగమైన దాన్ని మీరు చంపేయడానికి నిర్ణయించుకున్నారు అని.

మనం ఒకరిపై ఒకరు ఆధారపడటం అనేది కేవలం బాహ్యమైన అవసరాలకు మాత్రమే, కానీ మన అంతర్గత ఉనికి పూర్తిగా స్వయం ఆధారితమైనది.

ఇద్దరు వ్యక్తులు తమ భావోద్వేగాన్ని, తమ శరీరాన్ని, తమ ఇంద్రియాలను, ఇంకా తమ నివాస ప్రదేశాలను కలిసి పంచుకున్నారు, వాటిని వేరు చేయటం అంటే దాదాపు మిమ్మల్ని మీరు చీల్చడమే. ఎందుకంటే ఎన్నో విధాలుగా ఈ రెండు జ్ఞాపకాలు మిళితం అయ్యాయి. అసలు ఆ వ్యక్తి అంటేనే సహించలేని స్థితికి మీరు వచ్చినా సరే, అయినప్పటికీ అది బాధగానే ఉంటుంది. ఎందుకంటే “మీరు” అయిన ఆ జ్ఞాపకాన్ని, మీరు తీసేయాలి అనుకుంటున్నారు - ఎందుకంటే మీరు ఒక జ్ఞాపకాల గుట్టగా ఇక్కడ ఉంటున్నారు కాబట్టి.

మీరు మీ జీవిత భాగస్వామితో మాత్రమే విడాకులు తీసుకుంటున్నారు, మీతో మీరు విడాకులు తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ, ఇప్పటికే మీతో మీరే విడాకులు తీసుకున్నారు, అని మీరు అర్థం చేసుకోవాలి. బంధము, భాగస్వామ్యము లేదా బాంధవ్యాల వలన మీ ఉనికి పెంపొందింపబడుతుంది. అయితే మీరు పరిపూర్ణంగా జీవించడం మాత్రము, వాటిని ఎలా నిర్వహిస్తున్నారు అనే దానిమీద ఆధారపడి ఉంటుంది. ఈ విధమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకోవడానికి గల కారణం, మీకుగా మీరు వెలితిగానూ ఇంకా అసంపూర్ణంగానూ అనిపించడమే. కానీ జీవితం అనేది అలా కాదు. మీకై మీరే ఒక సంపూర్ణమైన జీవ ప్రక్రియ. దానికి బయట నుండి ఎటువంటి సహకారం అవసరం లేదు.

మీరు విడాకులు తీసుకునే పరిస్థితికి చేరుకున్నట్లయితే, ఇది అంతర్ముఖులు అవ్వాల్సిన సమయం. ఇది జీవంలోని సంపూర్ణతని కనుగొనాల్సిన సమయం. మీరు ‘ఈ జీవి’ ఒక సంపూర్ణమైన జీవి అని, ఇంకా దానికి ఆ విధంగా ఉండటానికి ఎటువంటి బాహ్య సహకారం అవసరం లేదని కనుగొనాల్సిన సమయం ఇది. ఒక సమాజంలో జీవితాన్ని గడపాలంటే మనం ఒకరిపై ఒకరు ఆధారపడి ఉంటాము. కానీ ఈ జీవి యొక్క ప్రాథమిక ఉనికి, దీని సమతుల్యత ఇంకా దీనికున్న సంభావ్యత అనేవి, దానికదే ఒక సంపూర్ణమైన ప్రక్రియ. మనం ఒకరిపై ఒకరు ఆధారపడటం అనేది కేవలం బాహ్యమైన అవసరాలకు మాత్రమే, కానీ మన అంతర్గత ఉనికి దానికదే సంపూర్ణమైనది. మీ భాగస్వామి నుంచి విడాకులు తీసుకుంటున్నారనేదే విషాదం, దానికి తోడు మీ నుంచి మీరు కూడా విడాకులు తీసుకోకండి.

మళ్లీ పెళ్లి చేసుకోవడం అనేది పిల్లల పై చూపే ప్రభావం

ప్రశ్న:: సద్గురు, నేను ఇప్పటికే విడాకులు తీసుకున్నాను. నాకు 8 ఏళ్ళ కొడుకు ఉన్నాడు. ఒక్కోసారి నా జీవతంలో ప్రేమ కరువైందని, మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది. నా కొడుకు నన్ను పదే పదే ఇంట్లో నాన్నగారు ఎందుకు లేరు అని ప్రశ్నిస్తూ ఉంటాడు. నాకు నిజంగా అయోమయంగా ఉంది. దయచేసి నాకు దారి చూపండి.

సద్గురు:: నేటి ప్రపంచంలో, పెళ్లి జరగ్గానే ఆటోమాటిగ్గా పిల్లలు పుట్టరు. ఒకానొక సమయంలో అది తప్పనిసరి. మీకు పెళ్లి అయిందంటే, ఇక పిల్లలు పుడుతూ ఉంటారు. కానీ నేటి ప్రపంచంలో, పిల్లలు ఆటోమాటిగ్గా పుట్టరు - సాధారణంగా పిల్లల గురించి ప్లాన్ చేసుకుంటారు. ఇది అర్థం చేసుకోవాలి. ఒకసారి సంతానం కలిగింది అంటే, మీకు ఒక ఇరవై ఏళ్ల ప్రాజెక్టు ఉన్నట్టే. మీ పిల్లవాడు చాలా సమర్థవంతంగా ఉంటే, అది ఒక పదిహేను పదహారేళ్ల ప్రాజెక్టు. మీరు పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటే, మీరు కనీసం ఒక పదిహేనేళ్ళ ప్రాజెక్టుకు సిద్దపడి ఉండాలి. మీకు ఆ నిబద్ధత లేకపోతే, మీరు ఇందులోకి దిగకూడదు. ఆ అవసరం లేదు. ఎందుకంటే, ఏ పిల్లవాడూ కూడా, మీ గర్భాన్ని తట్టి, దయచేసి నాకు జన్మనివ్వండి అని అడగడం లేదు. ఈ విధమైన సహకారం ఇవ్వగలమన్న స్పష్టత మీకు లేకపోతే, మీరు పిల్లల్ని కనడం అనే ఈ దుస్సాహసాన్ని చేయకూడదు.

విడాకుల తర్వాత సింగిల్ మదర్ గా ఉండడం

దయచేసి మీ బిడ్డని ఎప్పుడూ, లేని వారి కోసం ఆశగా ఎదురు చూసే విధంగా పెంచవద్దు. మీ ఎనిమిది ఏళ్ళ కొడుకు మీతో కలిసి ఎంత సమయం గడపాలి అనుకుంటాడు? చాలా తక్కువే. తన ఆటలో తను మునిగిపోయి ఉంటాడు, తను ఎప్పుడూ మీకు అంటిపెట్టుకుని ఉండే విధంగా మీరు అతన్ని నిస్సహాయుడిగా తయారు చేస్తే తప్ప; లేదంటే తనకి తన సొంత విషయాలు ఉంటాయి. జీవపు స్వభావం ఇదే; పిల్లలకి తమ సొంత విషయాలు ఉంటాయి. మీరు కేవలం, వాళ్లు తమకి ప్రమాదకరమైన పనులు చేయకుండా ఉండేలా, ఒక కన్ను వేసి ఉంచితే చాలు. వాళ్ళు ప్రతిదీ మీతో పాటు కలిసి చేయాల్సిన పనిలేదు.

విడాకుల తర్వాత మళ్లీ పెళ్లి చేసుకోవటం సరైనదేనా?

కాబట్టి, మీరు మళ్లీ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే, అది మీ ఇష్టం. అది మీరు తీసుకోవాల్సిన నిర్ణయం. నెపాన్ని పిల్లవాడి మీద వేయకండి. పిల్లవాడిని, తనకు మీరు కానీ, లేదా తన తండ్రి కానీ అవసరం లేని విధంగా తయారు చేయండి. తనకై తాను బానే ఉంటాడు. అతనికి మీ నుండి కొంచెం మద్దతు, ఇంకొంచెం సంరక్షణ కావాలి, అంతకు మించి ఇంకేమీ కాదు. మీరు ఏమి చేసినా, దానికి ఒక పర్యవసానం ఉంటుంది. మీరు మళ్ళీ పెళ్లి చేసుకోకపోతే ఒక విధమైన పర్యవసానం ఉంటుంది. మీరు మళ్లీ పెళ్లి చేసుకుంటే, దానికి మరొక రకమైన పర్యవసానం ఉంటుంది. మీరు ఇప్పటికే ఒకసారి అనుభవించారు కాబట్టి, మరోసారి ఐనా మీరు దాన్ని కొంచెం మెరుగ్గా నిర్వహించగలరేమో – మాకు తెలీదు. కానీ రెండింటికీ తమవైన పర్యవసానాలు ఉంటాయి. అలాగని పర్యవసానాలు ఆహ్లాదంగానో లేదా చేదుగానో ఉండాలనేమీ లేదు. అది కేవలం మీరు వాటిని ఎలా స్వీకరిస్తారు అనేదాని మీద ఆధారపడి ఉంటుంది. మీరు వాటిని ఆనందంగా స్వీకరిస్తే , అది ప్రేమతో కూడిన పని అవుతుంది, లేదంటే అది కేవలం చాకిరి అవుతుంది.

Editor's Note:  In this blogpost, Sadhguru answers a question on why relationships often become burdened with anxiety, and how we can fix such situations.