ప్రశ్న:సద్గురు ! మనం తినే ఆహారం మన మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తుందని మీరు అన్నారు కదా? వైద్య శాస్త్రం కూడా పళ్ళు తినటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగ్గుగా ఉంటుందని చెప్తున్నది. ఫలాలు ఆహారంగా తీసుకోవటంలో ఏదయినా ప్రత్యేక విశేషం ఉన్నదా? సామాన్యంగా పని చేసుకుంటూ, కుటుంబ వ్యవస్థలో ఉండేవారు, ప్రధానంగా పళ్ళు మాత్రమే తింటూ ఉంటే, ఆ ఆహారం వారికి సరిపోతుందా ?

సద్గురు:ఏ యంత్రంలోనైనా మనం ఒక ఇంధనం వాడినప్పుడు, అది ఎంత తొందరగా రగిలి, దగ్ధమై, శక్తి నివ్వగలిగితే, అంత మంచి ఇంధనం కింద లెక్క. ఉదాహరణకు, మామూలుగా మనం కారుల్లో వాడే పెట్రోలు , రేస్ కారుల్లోనూ, విమానాలను నడిపేందుకూ పనికిరాదు. వాటికి కావలసినంత త్వరగా అది దగ్ధమై శక్తి నివ్వలేదు. పెట్రోలు బంకుల్లో మనకు పెట్రోలు ఆక్టేన్ సంఖ్యల తేడాల గురించి బోర్డులు కనిపిస్తుంటాయి - ఎనభయ్యేడు, ఎనభై తొమ్మిది, తొంభై, తొంభయ్యొకటీ, తొంభై మూడూ, ఇలాగ. మేము మోటార్ సైకిల్ నడిపే రోజుల్లో, అది నడిపేందుకు మూడు రేట్లు ఎక్కువ ధర చెల్లించి 'హండ్రెడ్ ఆక్టేన్' పెట్రోలు కొనుక్కునే వాళ్ళం. ఆ పెట్రోలు పడితే ఇక మన మోటార్ సైకిల్ జోరే వేరుగా ఉంటుంది.

పళ్ళు త్వరగా జీర్ణమౌతాయి

అలాగే, మనం తినే ఆహారంలో తొందరగా జీర్ణమయిపోయే ఆహారం పళ్ళు. జీర్ణమవటమంటే జఠరాగ్ని. ఆహారం అనే ఇంధనం సరిగా దగ్ధమైతే జఠరాగ్ని పుడుతుంది. జఠరాగ్నులు బాగా మండుతుండాలంటే, అందుకు ఫలాలే మంచి ఇంధనం. దురదృష్ట వశాత్తూ చాలా మందికి సోమరితనం అన్నా, బద్ధకం అన్నా చాలా ఇష్టం. జీవితానందం అసంపూర్ణంగా మాత్రమే అనుభవించి ఉండటంవల్ల, వాళ్ళకు సగం చచ్చి సగం చేవతోమాత్రమే బతుకుతుండటం మహదానందంగా ఉంటుంది. నిద్రా, మత్తూ, మితి మీరిన తిండీ, అలా బద్ధకంగా పడుకొని ఉండిపోవటం - ఇవి చాలు వాళ్ళకు! ఎప్పుడూ చురుకుగా, సజీవంగా, చైతన్యవంతంగా, హుషారుగా ఉండాలని వాళ్ళకు అనిపించదు. అలాంటి వాళ్ళకు మాత్రం పళ్ళు తినటం సరిపడదు, ఎందుకంటే పళ్ళు తింటే చురుకుగా, పూర్తి మెలకువతో ఉంటారు కదా ! పళ్ళు తిన్నప్పుడు నిద్ర మత్తు రాదు (అవేవో బాగా పులిసిపోయి ఉన్న పళ్ళయితే తప్ప!). పూర్తిగా జాగృతమై ఉన్న స్థితిలో కూడా ఒక గొప్ప ఆనందం, మత్తు లాంటి పారవశ్యం, లోతైన సుఖ భావనా అనుభవించవచ్చు.

మీరడుగుతున్న ప్రశ్న, కేవలం ఫలాలు మాత్రమే ఆహారంగా తీసుకొంటూ సాధారణ జీవనం సాగించగలమా అని.ప్రకృతి ఫలాలనే ఆహారంగా ఉద్దేశించింది. మీ ప్రశ్నకు సూటి సమాధానం కావాలంటే, మీ జీవన విధానం ఎలా సాగుతున్నదో మీరే ఒక్కసారి చూసుకొంటే చాలు. మీకేదయినా జబ్బు చేసి మీరు ఆసుపత్రిలో మంచాన పడి ఉన్నారనుకోండి. మీ కోసం ఎవ్వరూ చికెన్ బిరియానీ పట్టుకురారు. పళ్ళు తీసుకువస్తారు. మీ బంధుమిత్రులందరికీ తెలుసు, 'తినరాని చెత్త అంతా తిని ఈయన ఈ రోగం పాలయాడు. కనక కనీసం ఇప్పుడయినా కాస్త తినదగిన ఆహారం తింటే మంచిది' అని.

మీకు గుర్తుంది కదా, బైబుల్ కథలో యాడమ్ కూడా ఆహారం తీసుకోవటం ఫలాలతోనే ప్రారంభించాడు. ప్రకృతి ప్రాణులకు ఆహారంగా ఉద్దేశించింది పళ్ళనే. మామిడి పండును తీసుకోండి. అందులోముఖ్యమైన భాగం విత్తనం. అంటే మామిడి టెంక. దాని చుట్టూ ప్రకృతి ఏర్పరచిన గుజ్జంతా ఒక ప్రత్యేక ఆకర్షణ. ఆ 'ఎర' వల్లే పశువులూ, పక్షులూ ఆ పండును తీసుకొని, దాంతో పాటు విత్తనాన్ని కూడా మోసుకెళ్లి ఎక్కడో దూరంగా చేరవేస్తాయి.

ప్రతి ఋతువు లోనూ ఆ ఋతువులో మాత్రమే వచ్చే రక రకాల పళ్ళు కనిపిస్తాయి. ఒక్కొక్కఋతువులో వచ్చే అనేక విధాలైన ఫలాలు ఆ సమయంలో మన ఆరోగ్య వ్యవస్థకు సరిగ్గా సరిపడేవి కావటం ప్రకృతిలో ఉన్న అత్యద్భుతమైన విశేషాలలో ఒకటి. దీనిని గురించి చాలా పరిశోధన జరిగింది. మీరు అతి శీతలమైన ప్రాంతంలోనో , వేడి బాగా ఎక్కువగా ఉండే ప్రాంతంలోనో, గాలిలో తేమ హెచ్చుగా ఉండే ప్రాంతం లోనో ఉన్నప్పుడు, ఆ శీతోష్ణ స్థితిలో మీకు అవసరమయ్యే ఆహారాన్నే , ప్రకృతి ఆ ప్రాంతాలలో ఆ సమయాలలో వచ్చే ఫలాల రూపంలో అందిస్తుంది.

ఈ రోజుల్లో అయితే మీరు, అవి వదిలి, ఏ న్యూజీలాండ్ లాంటి దూరదేశాలనుంచో పళ్ళు తెప్పించుకొని తింటున్నారు. అది వేరే విషయం. మీరు ఉన్న ప్రాంతంలో పండే పళ్ళు మాత్రమే మీరు తినేటట్లయితే, మీకు ఏ ఋతువులో ఎలాంటి పళ్ళు అవసరమో, ఆ ఋతువుల్లో అలాంటి పళ్లే మీ ప్రాంతంలో దొరుకుతుంటాయని గమనించవచ్చు. ఆ సమయానికి సరిగ్గా తగిన ఆహారం అదే.

ఫలాలు మాత్రమే ఆహారం చేసుకోగోరితే, తీసుకోవలసిన ముందు జాగ్రత్తలు.

పళ్ళు మీ శరీరంలో నమ్మ శక్యం కానంత అద్భుతమైన మార్పులను తేగలవు . మీ జీవన విధానం ఏదయినా సరే, మీరు చాలా చురుకుగా, హుషారుగా మారిపోవచ్చు. మీరు చాలా శారీరక శ్రమ అవసరమయ్యే వృత్తిలో- ఉదాహరణ చెప్పాలంటే, రోజూ ఎండలో నిలబడి, ఏ యంత్ర సహాయమూ లేకుండా మట్టిని తవ్విపోయటం లాంటి పనులు - ఉండి, ఎక్కువ కాయ కష్టం చేసే వారయితే, మీకు రెండు గంటలకొకసారి ఆకలి వేస్తుంది. మీరు పళ్ళు ఎన్నని తినగలరు ? ఆ తిన్నవన్నీ అతి త్వరగా జీర్ణమైపోయి, కడుపు ఖాళీగా ఉన్నట్టు అనిపిస్తుంది.

కేవలం ఫలాలు మాత్రమే ఆహారంగా తీసుకోగోరే వాళ్ళు, కొంచెం నిదానంగా, కొంచెం ఎక్కువ సమయం తీసుకొని భోజనం చేయటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే అవసరమైన మోతాదులో పళ్ళు తినగలుగుతారు. సాధారణంగా పళ్ళు తీయగా ఉంటాయి కాబట్టి కాసిని తినగానే, కడుపు నిండిపోయినట్టు అనిపిస్తుంది. అందుచేత, తొందర పడకుండా, నిదానంగా తినాలి. మన శరీరంలో ఒక ప్రకృతిసిద్ధమైన గడియారం ఉంటుంది. మీకు మామూలుగా మీరు తినే వండిన ఆహారం తినేందుకు పది, పన్నెండు నిమిషాలు పడుతుందనుకోండి., మీరు పళ్ళు తినేటప్పుడు కూడా పది, పన్నెండు నిమిషాలు కాగానే , మీ శరీరం ' తిన్నది చాలు !' అని సంకేతం ఇస్తుంది. ఈ సంకేతం, తినటంలో గడిపిన సమయం మీద ఆధారపడిన సంకేతం, పొట్ట నిండటం మీద ఆధార పడింది కాదు. కనక మీరు ప్రయత్నపూర్వకంగా, మామూలుకంటే ఎక్కువ సమయం భోజన కార్యక్రమంలో గడపాల్సి వస్తుంది.

మీరు కేవలం ఫలాలే తింటూ, శారీరకంగా బాగా చురుకుగా ఉండాలంటే, మీరు రోజుకు మూడు సార్లు భోజనం చేయవలసిరావచ్చు . మీరు ఆరు నుంచి ఎనిమిది గంటలు నిద్రలో గడుపుతూ, పదహారు నుంచి పద్ధెనిమిది గంటలు మాత్రమే మెలకువతో ఉంటారు కనక, ఆ సమయంలో మూడు సార్లు ఫల రూపమైన ఆహారం తీసుకొంటే, మీ అవసరాలకు అది పూర్తిగా సరిపోతుంది. అయితే తిన్న తరవాత రెండు గంటలలో కడుపు ఖాళీగా అనిపిస్తుంది. చురుకుదనమూ శక్తీ బాగానే ఉన్నా, కడుపు ఖాళీగా, ఆకలిగాఉన్నట్టు అనిపించే అలాంటి స్థితికి మీరు అలవాటుపడాలి .ఆ సమయం లోనే మీ బుర్ర పాదరసంలా పని చేస్తుంది. మనిషిగా మీరు పూర్తి సమర్థతతో పని చేయగలుగుతారు.

మీరు బుద్ధి శక్తిని ఎక్కువగా ఉపయోగించదలచినా సరే , లేక, శరీర శ్రమ ఎక్కువ చేసినా సరే, ఈ ఫలాహారం మీకు రెండింటికీ పూర్తిగా అనుకూలంగానే ఉంటుంది. అయితే, ఈ రోజులలో మార్కెట్ లో దొరికే పళ్ళు ఎలా ఉంటున్నాయి, వాటిలో ఉన్నదేమిటి అన్నది మనం చెప్పలేకుండా ఉన్నాం. ఇది మాత్రం నాకు స్పష్టంగా కనిపిస్తున్నది : మేము మా చిన్నతనంలో తిన్న ప్రకృతిసిద్ధమైన పళ్ళు, ఇప్పుడు మనకు మార్కెట్లో దొరికే, భారీ ఎత్తున పొలాలలో పండించిన పళ్ల లాంటివి కావు. ఈ పళ్ళు, పెద్దవిగా, గుండ్రంగా, చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి, కానీ అదంతా బోటోక్స్ లాంటి మందుల మహిమ.

వాటిలో పూర్వం లాంటి సారమూ, జీవశక్తీ లేవన్న విషయం నాకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ పళ్ళు మార్కెట్ కోసం ఉత్పత్తి అయినవి తప్ప మనుషుల కోసం కాదు. అంటే ఇవి పూర్తిగా పనికిమాలినవని అర్థం కాదు సుమా! ఇదివరకు ఉన్నంతగా ఇప్పుడు వీటిలో పోషక పదార్థాలు ఉండటం లేదు. కాబట్టి ఆ లోటు భర్తీ చేసేందుకు వీటితో పాటు కొంత ఇతర ఆహారం కూడా తీసుకోవలసి రావచ్చు.

మనం పళ్ళు తినటం మన భూగోళానికీ మంచిదే

అన్నిటికంటే ముఖ్యం, పర్యావరణ పరిరక్షణ దృష్ట్యా కూడా పళ్ళు మాత్రమే ఆహారంగా తీసుకోవటం చాలా వివేకవంతమైన మంచి పని. ప్రతి వాళ్ళూ కనీసం 30 శాతం 'ఫలా'హారులు కావటం మంచిది. అంటే, మనం తినే ఆహారంలో కనీసం 30 శాతం ఫలాలే ఉండాలి. మీరు తినే ఆహారంలో ముప్ఫయి శాతం, పొలాలు దున్ని పండించిన పంటలనుంచి వచ్చినవి కాకుండా, వృక్షాల నుంచి లభించేదయితే, పర్యావరణ దృష్ట్యా అది ఈ ప్రపంచానికి ఎంతో గొప్ప మేలు చేస్తుంది.

మీరు మాంసాహారంనుంచి , ఫలరూపమైన ఆహారానికి మారిపోయేందుకు ప్రయత్నించినప్పుడు, మీకు ఒక ఇబ్బంది ఎదురౌతుంది. అసలు ఏమీ తిన్నట్టే ఉండదు! మాంసాహారం తినేసి , ఆ బరువుతో స్తబ్ధంగా ఒరిగి పడుకొని పోవటం మీకు అలవాటయిపోయి ఉంటుంది. చనిపోయిన తరవాత ఎలాగూ స్తబ్ధంగా నేలకు ఒరిగిపోవటం తప్పదు. సజీవంగా ఉండటం అంటే, నేలతో సంబంధమే లేనట్టు చెంగు చెంగుమంటూ తిరగటం. ఆకాశంలో పైకెక్కడో ఎగిరే పక్షిది కూడా ఈ మట్టితో చేసిన పార్థివ శరీరమే. కానీ అది ఆకసంలో ఎగిసిపోతున్నప్పుడు మాత్రం అలా అనిపించదు.

ప్రాణులన్నీ పాంచభౌతికాలే. కానీ చెంగున గంతులు వేసేటప్పుడు మాత్రం మట్టి ముద్ద లక్షణాలు కనిపించకూడదు. మనం చెంగు చెంగున గంతులేయాలంటే, మనం వాడే ఇంధనం త్వరగా రగిలి దగ్ధమై కావాల్సిన శక్తిని ఇచ్చేదిగా ఉండాలి. అదే మంచి ఆహారం. మన జీర్ణాశయంలో అన్నిటికంటే త్వరగా జీర్ణమయ్యే ఆహారం పళ్ళు అనటంలో సందేహమే లేదు. అవి ఏ అవశేషాన్నీ మిగల్చవు. జీర్ణ వ్యవస్థ మీద బరువునూ, ఒత్తిడినీ పెంచవు.

ప్రేమాశీస్సులతో,

సద్గురు