పెద్దలు కుదిర్చిన వివాహం మంచిదేనా?
పెద్దలు కుదిర్చిన వివాహాలకు ఇక కాలం చెల్లినట్లేనా? లేదా ఈ సంప్రదాయం పాటించటమే ఈ తరం వారికి మంచిదా? అన్న ప్రశ్నకు సద్గురు సమాధానమిస్తున్నారు.
పెద్దలు కుదిర్చిన పెళ్ళి అంటేనే అదొకరమైన బానిసత్వం అనే ఆలోచన - అక్కడ దోపిడీ ఉందా లేదా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అవసరానికి వాడుకునే వారు అన్ని చోట్లా ఉన్నారు. కొన్నిసార్లు, మీ తల్లిదండ్రులే, వారి స్వలాభాల కోసం అలా ఉండొచ్చు - పరువు మర్యాదలు, ఆస్తులు ఇంకా ఏవో వారి చెత్త ఆలోచనలు వంటి వాటి కోసం.
ఈమధ్య నన్ను ఒకరు, వాళ్ళ అబ్బాయిని ఏ అమ్మాయికిచ్చి పెళ్లి చేయాలనే దాని గురించి అడిగారు. ఒక అమ్మాయేమో బాగా చదువుకుంది, అందంగా కూడా ఉంటుంది; మరో అమ్మాయికి బాగా డబ్బున్న తండ్రి ఉన్నాడు. ఎవరినీ ఎంచుకోవాలని వారు నన్ను అడిగారు. నేనొక చిన్న ప్రశ్న అడిగాను, మీరు అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా, లేక వారి ఆస్తినా ?” అని. మీరు దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు అనే విషయంపై ఆధారపడి ఉంటుంది. పెళ్లి ద్వారా ఒకరి ఆస్తి మీ సొంతమవుతుంది అంటే, అదే ప్రధానం అనుకుంటే, సరే, అది మీ ఇష్టం. మీరు అలాంటి జీవితమే ఎంచుకోవాలనుకుంటున్నారు.
పెద్దలు కుదిర్చిన పెళ్ళిళ్ళు - విడాకుల గణాంకాలు
ఏదైనా విజయానికి కొలమానం దాని ఫలితంలో ఉంటుంది. లక్సంబర్గ్, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందిన, స్వేచ్చా సమాజంగా చెప్పుకునే ఒక చిన్న దేశం. అక్కడ విడాకుల రేటు ఎనభై ఏడు శాతంగా ఉంది. స్పెయిన్ లో, విడాకుల రేటు సుమారు అరవై అయిదు శాతం; రష్యాలో యాభై ఒక్క శాతం; అమెరికాలో నలభై ఆరు శాతం. భారతదేశంలో 1.5 శాతం. కాబట్టి ఏది బాగా పనిచేస్తుందో మీరే నిర్ణయించుకోండి.
విడాకులతో ముడిపడి ఉన్న సామాజిక అపవాదు కారణంగా ఇక్కడ విడాకుల రేటు తక్కువగా ఉందని ప్రజలు చెప్పవచ్చు, కానీ పెళ్ళిళ్ళు ఎలా కుదుర్చుకుంటున్నారు అనేది కూడా ఒక ముఖ్యమైన కారకం.
పెద్దలు పెళ్ళి నిశ్చయించినట్లైతే, అవి మరింత మెరుగ్గా, ఫలప్రదంగా ఉంటాయి, ఎందుకంటే వారు చాలా దూరం ఆలోచిస్తారు. ఈ రోజు మీరు ఒక అమ్మాయిని, తను వేసుకునే బట్టల్ని చూసి ఇష్టపడొచ్చు. అయితే, మరునాడు ఉదయమే ఆమెతో ఎలాంటి సంబంధం పెట్టుకోకూడదనే ఆలోచనలు రావచ్చు. మీరు ఇరవైల్లో ఉన్నప్పుడు, రకరకాల వ్యామోహాల వల్లనో, మీ స్నేహితుల ప్రోద్బలం వల్లనో జీవితాంతం నిలవని కొన్ని నిర్ణయాలు మీరు తీసుకుని ఉండొచ్చు. లేదా హఠాత్తుగా ఎవరో ఒకరు పరిచయమై, వారితో అద్భుతమైన సాంగత్యం మీకు కుదిరిపోవచ్చు. అది వేరే విషయం.
ప్రతిదీ కుదిర్చిందే. మీరు ఎన్నెన్నో అనుకోవచ్చు. కానీ అది మీ భావోద్వేగాల వల్లనో, అత్యాశ వల్లనో లేదా వేరెవరో కుదిర్చినదో అయ్యి ఉంటుంది. అది కుదిర్చినదే. బాధ్యతతో, తెలివితో ఇంకా మీ శ్రేయస్సు గురించి ఆలోచించే వారు కుదర్చడం ఉత్తమం. వారికి ఎక్కువ అవగాహన కూడా ఉంటుంది. ప్రపంచంలో ఉత్తమ పురుషుడు లేదా ఉత్తమ స్త్రీని మీరు కనుగొనలేరు, ఎందుకంటే అలాంటి వాళ్ళు ఎక్కడున్నారో మనకు తెలియదు! మనకి తెలిసిన కొంతమందిలో, అంతో ఇంతో మంచి వారిని చూసి కుదుర్చుకుంటాం. అంతకుమించి మీరేం చేయలేరు.
ఒక యువకుడు లేదా యువతి, ఎవరినైనా పెళ్ళాడాలనుకుంటే, ఎవరినీ పెళ్లాడతారు? వారికి తెలిసిన వారు చాలా తక్కువ. వారికి వారి జీవితంలో తెలిసిన పది మందిలో ఒకరిని పెళ్ళి చేసుకుంటారు. మూడు నెలల్లో అసలు విషయం అర్ధమైపోతుంది. అయితే చాలా దేశాల్లో ఒక చట్టం ఉంది: మీరు పొరపాటుగా ఎవరినైనా పెళ్లి చేసుకున్నారని తెలుసుకుంటే, విడాకులు తీసుకునే ముందు కనీసం రెండు సంవత్సరాలు నరకాన్ని అనుభవించక తప్పదు. అదొక జైలు శిక్ష లాంటిది. విడాకులు తీసుకోవడం నేరమని ఎన్నో మతాలూ కూడా ఆపాదించాయి. కానీ అలాంటి పద్ధతులు పాటించే దేశాల్లోనే, విడాకుల రేటు అన్ని దేశాల కంటే ఎక్కువగా ఉంటోంది! దేవుడిచ్చిన ఆజ్ఞలు గానీ, చట్టం గానీ విడిపోవడాన్ని ఆపలేకపోతున్నాయి.
తల్లిదండ్రులు వివాహాన్ని కుదిర్చినట్లయితే, వారి నిర్ణయం ఉత్తమమైనది అవ్వకపోవచ్చు. కానీ వారు సాధారణంగా, మీ మంచి కోరతారు. మీరు మీ తల్లిదండ్రుల నిర్ణయానికి లేదా పక్షపాత ధోరణికి అతీతంగా పరిణితి చెందినట్లయితే, అది వేరే విషయం - అప్పుడు మీ నిర్ణయాలు మీరు తీసుకోవచ్చు.
వివాహం పట్ల బాధ్యతగా ఉండడం
నేను పెళ్లి చేసుకున్నప్పుడు, నా భార్య పూర్తి పేరు కూడా నాకు తెలీదు. వాళ్ళ నాన్నగారి పేరు కూడా నాకు తెలీదు. వాళ్ళ కులం తెలీదు. నేను తనని పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నానని మా నాన్నకి చెప్పినప్పుడు, ఆయన, “ఏంటి? నీకు వాళ్ళ నాన్న పేరు కూడా తెలీదా? వాళ్ళెవరో, ఏం చేస్తుంటారో కూడా తెలీదా? ఇలా ఎవరైనా చేసుకుంటారా?” అన్నారు.
అప్పుడు నేను, “నేను కేవలం తనని మాత్రమే పెళ్ళి చేసుకుంటున్నాను, తన వాళ్ళెవరిని పెళ్లి చేసుకునే ఉద్దేశం నాకు లేదు. కేవలం తననే. అంతే!” అన్నాను. ఆమె సామర్థ్యం గురించి ఇంకా ఆమె నాకు ఏమి తీసుకువస్తుందనే దాని గురించి నాకు స్పష్టంగా తెలుసు, పైగా ఆమె నన్ను చూసిన మొదటి క్షణం నుంచి నాతో ప్రేమలో ఉంది. నా జీవితంలో నేనెన్నడూ ఎవరి సలహాలు తీసుకోనప్పటికి, స్వచ్చంద సలహాదారులు ఎప్పుడూ ఉంటారు. వాళ్ళు , “నువ్వు నీ జీవితంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నావు, ఇది జీవితాన్నే సర్వనాశనం చేస్తుంది.” అని అన్నారు. నేను, “ఏది జరిగినా, ఎలా జరిగినా సరే, దాన్ని విజయవంతం చేసుకోడం, నాశనం చేసుకోవడం నా చేతుల్లోనే ఉంటుంది.” అన్నాను . ఈ మాత్రం నాకు తెలుసు.
ఎందుకంటే, మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటున్నారు, ఎలా చేసుకుంటున్నారు, ఎలా కుదుర్చుకున్నారు, ఎవరు కుదిర్చారు అనేది ముఖ్యం కాదు. మీరు ఎంత బాధ్యతతో మెలుగుతున్నారు అన్నదే ముఖ్యం. మీరు ఎలా కుదుర్చుకుంటారో అది మీ ఇష్టం. నేను ఇలా చేసుకోవాలి , అలా చేసుకోవాలి అని చెప్పడం లేదు, మీరు ఎలా చేసిన సరే, దయచేసి బాధ్యతతో ఆనందంగా నిర్వహించుకోండి. మీ శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక ఇంకా అనేక ఇతర అవసరాలను తీర్చుకోవడానికి మీరు కలిసి ఉండబోతున్నారని మీరు అర్ధం చేసుకోవాలి. "నా అవసరాలను తీర్చుకోవడానికి, నేను నీతో ఉన్నాను" అని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటే, దీన్ని మీరు ఎంతో బాధ్యతతో నిర్వహిస్తారు.
మొదట్లో మీరు అలా ఉండి, కొంత కాలం తర్వాత, అతను లేదా ఆమెకు మీ అవసరం ఉందని మీరు అనుకుంటే, మీరు ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభిస్తారు ఇంకా వికారాలు అనేక రకాలుగా ప్రారంభమవుతాయి.
ఓసారి ఇలా జరిగింది. ఓ యువకుడు, ఓ యువతికి నిశ్చితార్ధం కుదిరింది. ఆమె వేలికి ఉంగరం తొడగ్గానే , ఆమె అతనితో, “నీకేమైనా బాధలు, కష్టాలు వస్తే, నీ భుజం నా మీద వాల్చి, అవి నాతో పంచుకోవచ్చు. మీకు ఎలాంటి కష్టమొచ్చినా సరే, మీరు నాతో పంచుకోవచ్చని” అంది.
అతను, “సరే, కానీ నాకు ఎటువంటి కష్టాలు గానీ, ఇబ్బందులు గానీ సమస్యలు గానీ లేవు” అన్నాడు.
ఆమె, “అది సరే, మనకి ఇంకా పెళ్లి కాలేదుగా!” అంది.
మీ జీవితం చాలా బాధలు, కష్టాలు ఇంకా అనేక సమస్యలతో నిండి ఉందని చెప్పుకోవడానికి ఎవరో ఒకరు కావాలనుకుంటే, మీరు చిక్కుల్లో పడుతున్నట్లే. పెళ్ళిళ్ళు స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటుంటారు, కానీ మీలో మీరు నరకాన్ని సృష్టింకుంటూ ఉంటారు. ఎవరో ఒకరు వచ్చి మీ సమస్యలన్నిటినీ పరిష్కరిస్తారని మీరనుకుంటే, మీకు ఇబ్బందులు తలెత్తుతాయి. ఇంకా అవతలి వ్యక్తికి కూడా దురదృష్టకర పరిణామాలు ఎదురవుతాయి. మిమ్మల్ని మీరు సంతోషకరమైన, అద్భుతమైన మనిషిగా తీర్చిదిద్దుకుంటే, మీ పని, ఇల్లు ఇంకా వైవాహిక జీవితం అన్నీ అద్భుతంగా మారడం మీరు చూస్తారు. ప్రతిదీ అద్భుతంగా ఉంటుంది, ఎందుకంటే మీరు అద్భుతంగా ఉన్నారు కాబట్టి!