మన విద్యా విధానం అర్థం లేనిదిగా ఎందుకు అనిపిస్తోంది?
ఈ మధ్య జరిగిన యూత్ అండ్ ట్రూత్ ప్రోగ్రాంలో, ఒక విద్యార్థిని ‘విద్యా విధానం అర్థం లేనిదిగా ఎందుకు అనిపిస్తుంది?’ అని అడిగింది. దేశ విద్యా విధానం మీద ఈమధ్య తీసుకుంటున్న కొత్త నిర్ణయాల గురించి సద్గురు వివరిస్తున్నారు. ఆ విధానంలో విద్యార్థి యొక్క వ్యక్తిగత అభిరుచుల్ని గుర్తించి, వాటిని వృద్ధిలోకి తేవడానికి అవకాశం ఉండేట్లు చూస్తున్నారు.
ప్రశ్న: నేను కంప్యూటర్ సైన్స్ లో మొదటి సంవత్సరం డిగ్రీ చదువుతున్నాను. నా ప్రశ్న ఏమిటంటే, ఇక్కడున్న మేమంతా 15 ఏళ్ల నుంచి విద్య నేర్చుకుంటూనే ఉన్నాము, కానీ మేము చదివిన విద్యను ఎక్కడా ఉపయోగించలేక పోతున్నాము. అందుకే నేర్చుకున్నదంతా నిరుపయోగంగా అనిపిస్తున్నది.
సద్గురు: కాదు, కాదు, మీ ఇంజనీరింగ్ కాలేజీలో అలా జరగకూడదు. ఏదో హైస్కూల్లో అంటే, అక్కడ చెప్పేదంతా నిరర్ధకం అనిపించవచ్చు. కానీ సాంకేతిక విద్యలో అలా జరగకూడదు.మన విద్యా విధానం చాలా వరకు, బ్రిటిష్ మహారాణి గారి సేవలో మనల్ని గుమాస్తాలను చేయడానికి రూపొందించబడింది. దానిలో సృజనాత్మకతకు తావులేదు. మన విద్యావిధానంలో ఉన్న ముఖ్య కోణం కేవలం విధేయత. ఆ విద్యా విధానంలో ఉన్నదంతా, మీరు టెక్స్ట్ బుక్ బట్టీ పట్టి, ఎక్కడో వెళ్లగక్కాలి. దానినే గొప్ప విద్యా విధానం అనేవారు. మరి నేను సాంకేతిక విద్య గురించి అలా చెప్పలేను, నా ఉద్దేశంలో అది వేరుగా ఉంటుంది అనుకుంటున్నాను.
విద్య ఒక్కటే అన్న ధోరణిని మార్చాలి
మేము భారతదేశంలో వస్త్ర పరిశ్రమ గురించిన చట్ట విధానం రూపొందించాము, అలాగే నదులు, వ్యవసాయం గురించి కూడా చేశాము. మరి ఇప్పుడు విద్యా విధానం గురించి చట్టం తేవటంలో నిమగ్నమై ఉన్నాము. నేను ఎప్పుడూ ప్రస్తావిస్తూ ఉండడంవల్ల, భవిష్యత్తులో పాఠశాలల్లో సగం సమయం మాత్రమే విద్యాపరమైన పాఠ్యాంశాలు బోధించాలని, మిగతా సమయమంతా ఆటలు, సంగీతం, కళలు, చేతివృత్తులు, ఇలా అనేక ఇతర విషయాలు బోధించాలని ప్రభుత్వం ఈమధ్య ప్రకటించింది. ఈ ప్రకటన ఈ మధ్యనే, ఒక నెల క్రితమే విడుదలయింది. ప్రకటించడం బానే ఉంది కానీ అలా మారడానికి కావాల్సిన సన్నద్ధతలో పాఠశాలలు లేవు. లెక్కలకి, సైన్స్ కి ఎంత సమయం కేటాయిస్తున్నారో, సంగీతానికి, ఇతర కళలకి, అంతే సమయం కేటాయించాలని నేనెప్పుడూ అంటూనే ఉంటాను. మా పాఠశాలలు అలాగే నడుపుతున్నాము. కానీ చాలా తక్కువ పాఠశాలలోనే అలా జరుగుతోంది.
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈ ప్రకటన చేసింది. దానిని అమలు చేయడానికి ఇంకా ఎంతో కాలం పడుతుంది. దానికి తగినంత మంది అధ్యాపకులు, ఉపకరణాలు, ట్రైనింగు, ఇంకా అనేక ఇతర విషయాలు జరగాలి. దానికి ఇంకా సమయం పడుతుంది. కానీ ఆలోచన అయితే వచ్చింది. అందరి పిల్లలకీ, స్కూళ్లలో విద్యా బోధన మూడు నాలుగు గంటలకన్నా ఎక్కువ కాకుండా ఉండేట్లు ప్రయత్నం చేస్తున్నాము. మిగతా సమయం వారు మిగతా విషయాలు నేర్చుకోవాలి.
ముంచుకొస్తున్న ప్రమాదం
ప్రస్తుతం మన చట్టాలు ఎలా చేసుకున్నామంటే, తండ్రీ కొడుకు ఇద్దరూ తమ పొలంలో పని చేసుకుంటూ ఉంటే తండ్రిని అరెస్టు చేయవచ్చు. బాల కార్మిక నిరోథక చట్టం క్రింద. అవును, ఇది దేశంలో చాలా విపత్కరమైన పరిస్థితికి దారితీస్తోంది. మీరు దేశంలో ఏ వ్యవసాయదారుడినైనా ‘మీ పిల్లవాడిని వ్యవసాయంలో పెడతారా?’ అని అడిగితే, కేవలం రెండు నుంచి నాలుగు శాతం మంది మాత్రమే ‘అవును’ అంటున్నారు. అంటే, ఈ తరం తర్వాత, ఈ దేశంలో మన ఆహారాన్ని మరి ఎవరు పండిస్తారు? మీరు దేశంలో ఏ వ్యవసాయదారుడనైనా ‘మీ పిల్లవాడిని వ్యవసాయంలో పెడతారా?’ అని అడిగితే, కేవలం రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే ‘అవును’ అంటున్నారు. అంటే, ఈ తరం తర్వాత, ఈ దేశంలో మరి మన ఆహారాన్ని ఎవరు పండిస్తారు?
మీకు సాంకేతికంగా ఎన్నో తెలిసి ఉండొచ్చు, మీరు ఎంబీఏ చేసి ఉండొచ్చు. కానీ పొలాల్లోకి వెళ్లి ఒక పంట పండించగలరా? అది ఎంతో క్లిష్టమైన విషయం. మనం వ్యవసాయం అంటే చదువురాని వాళ్ళకి అనుకుంటాము. కానీ అది అలా కాదు. అది ఎంతో ఓర్పుతో, నేర్పుతో చేయవలసిన పని. కేవలం అతనికి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేనంత మాత్రాన, అతనికి బుర్ర లేదని కాదు. ఆయనకి ఎంతో ముఖ్యమైనది ఏదో తెలుసు. దాని మూలంగానే మనమంతా ఈ రోజు తింటున్నాము. కానీ ఈ దేశానికి తనకు కావాల్సిన ఆహారాన్ని పడించుకోలేని విపత్కర పరిస్థితి వచ్చే 25 ఏళ్లలో రాబోతోంది.
అభిరుచిని గుర్తించడం
కొందరు పిల్లలే విద్యా సంబంధమైన చదువుల్లోకి వెళ్ళాలి. మిగతావారు దేశానికి కావాల్సిన మిగతా నైపుణ్యాలు సంపాదించుకోవాలి. అది వారికి, వారి దేశానికి శ్రేయస్కరం. అందరి బుర్రలూ కేవలం విద్యార్జనకి అనువుగా లేవు. చాలామంది ఈ విధమైన విద్యతో కష్టపడుతున్నారు. కొందరు మాత్రమే ఈ విద్యావిధానంలో సంతోషంగా చదువుకోగలుగుతున్నారు, కానీ చాలా ఎక్కువ మంది మాత్రం దీనివల్ల కష్టాలకు లోనవుతున్నారు. వీరంతా కేవలం విద్యార్జనకు పరిమితం కాకూడదు. అభిరుచికి అనుగుణంగా వేరే నైపుణ్యాలు నేర్చుకోవాలి. కానీ మీ అభిరుచిని గుర్తించడానికి ఎవరూ లేరు. ‘మీరు సంతోషంగా, హాయిగా ఏమి చేయగలరో’ గుర్తించే నైపుణ్యం ఉన్న వారు ఎవరూ లేరు.
పది పదిహేను సంవత్సరాల మధ్య వయసులో, విద్యార్థులు తాము కోరుకున్నది ఎంచుకునే విధంగా, వారికి ఒక పద్ధతి ఉండాలి. ఇప్పుడు, అందరూ వైద్య విద్య, ఇంజనీరింగ్ విద్య కావాలని తపన పడుతున్నారు. దానికి కారణం దాని వెనక ఉన్న ప్రతిష్ట, గౌరవం. ఒక ఎలక్ట్రీషియన్ లేదా ఒక వడ్రంగి కూడా, ఒక డాక్టర్ పొందుతున్న గౌరవం, గుర్తింపు పొందాలి. అప్పుడే విద్యా విధానం సరిగ్గా ఉంటుంది. అన్నిటికీ మించి, సంఘంలో రైతుకు మనందరి కన్నా ఉన్నత స్థానం ఉండాలి. ఎందుకంటే మనల్ని పోషించేది ఆయనే.
సంపాదకుడి సూచన: మిమ్మల్ని ఏదైనా ప్రశ్న తొలిచివేస్తుందా, ఎవ్వరినీ అడగలేని ప్రశ్న మీలో మొదలైందా? ఇదే మీకున్న అవకాశం..సద్గురుని ఇక్కడ అడగండి. UnplugWithSadhguru.org.