నిజమైన మిత్రుడిని గుర్తించటం ఎలా?
సాధారణంగా ఇద్దరు వ్యక్తులకు పరస్పరం సమాన ధర్మాలు - ఒకే రకమైన ఇష్టాలూ, అయిష్టాలూ, ఒకే రకమైన ఆలోచన ధోరణీ, ఇలాంటివి - కనిపిస్తే, స్నేహం కుదురుతుంది. కానీ ప్రేమ చూపుతూనే అవతలి వారికి ఏది శ్రేయస్కరమో అలా చేసే ధైర్యం ఉంటే, యాపిల్ పళ్లూ, నారింజలూ అంత భిన్నంగా ఉండే వారు కూడా నిజమైన స్నేహితులు కావచ్చు అని వివరిస్తున్నారు సద్గురు.
మంచి స్నేహితులు ఎపుడూ మంచి చేయలేరు
కిందటి సంవత్సరం శీతాకాలం నాటి మాట. ఓ చిన్న పిట్ట చల్లని ప్రాంతానికి వలస వెళ్లింది. అక్కడి చల్లదనం దానికి బాగా నచ్చేసి, చలి ముదిరే సమయం వచ్చేనాటికి తను మళ్ళీ వెనక్కు వెళ్లాలని మరిచిపోయింది. తీరా గుర్తుకొచ్చి తిరుగు ప్రయాణం ఆరంభించబోయే సరికి గడ్డ కట్టుకుపోయే చలి దెబ్బకు కిందపడిపోయింది. ఓ ఆవు అలా వెళ్తూ పేడ వేసింది. ఆ పేడ సరిగ్గా పిట్టమీద పడి పిట్టను కప్పేసింది. ఆ వెచ్చదనానికి పిట్టకు మళ్ళీ కొంచెం ప్రాణం వచ్చింది. ఆ ఆనందంలో పిట్ట హాయిగా కిచకిచలాడటం మొదలు పెట్టింది.
ఆ దోవన ఒక పిల్లి వచ్చింది. కిచకిచలు విని, అటూ ఇటూ చూసి, ఆ శబ్దం పేడ ముద్ద కింద నుంచి వస్తున్నదని గ్రహించింది. పేడను నెట్టేసి, పిట్టను బయటకు లాగి గుటుక్కున మింగేసింది. నీతి ఏమిటంటే, ఏదో నానా చెత్తా మీ మీద విసిరిపోయే వాళ్ళందరూ మీకు శత్రువులు కారు. అలాగే ఆ చెత్త పరిస్థితులలో కూరుకు పోయినప్పుడు, మిమల్ని బయటపడేసే వాళ్ళందరూ మీ మిత్రులూ కారు. అన్నిటికంటే ముఖ్యం, అలాంటి చెత్తలో పడిపోయి ఉన్నప్పు డు నోరు మూసుకొని ఉండటం నేర్చుకోవడమే..!
చెడ్డవాడనిపించుకొనే ధైర్యం
మీరు ఎవరితోనన్నా స్నేహం చేస్తుంటే, ఎప్పుడూ వాళ్ళ లోపాలు చెప్తూ వాళ్ళను సతాయించనక్కరలేదు. అలా చేయమని ఎవరూ అనరు. కానీ మీకు వ్యక్తులచేత చెడు అనిపించుకోవటానికి జంకని ధైర్యం ఉండాలి. అందరి చేతా మంచి అనిపించుకోవాలనే ప్రయత్నంలోనూ, ఎప్పుడూ మీచుట్టూ ఎలాంటి అప్రియతా, చికాకూ లేని వాతావరణం ఉంచుకోవాలన్న తాపత్రయంతోనూ, మీలో మీరే ఎంత చికాకు దాచేసుకొంటున్నారో చూడండి.
ఇలా చికాకును కప్పి ఉంచటమంటే, మీరు చికాకు బీజాలను నేలలో పాతినట్టు. దాని వల్ల మీకు లభించేది అప్రియమైన ఫలాలే. ఒకరు మీకు నిజంగా మిత్రుడయితే, అతనితో నిర్మొహమాటంగా ఉంటూ కూడా అతడి స్నేహానురాగాలు కోల్పోకుండా ఉండగలగాలి. ఇప్పుడు మీకున్న స్నేహాలన్నీ, కేవలం స్నేహితులిద్దరూ పరస్పరం అంగీకరించే విషయాల మీదా, సమానమైన అభిరుచుల మీదా. ఇష్టాయిష్టాల మీదా ఆధారపడి ఉన్నాయి. కానీ మీ ఇద్దరికీ యాపిల్ కూ, నారింజకూ మధ్య ఉన్నంత భేదం ఉన్నా కూడా, మీరు మంచి మిత్రులుగానే ఉండచ్చు. నిజమైన స్నేహితుడంటే, నువ్వు ఎంత పనికిమాలిన వాడివో నీ మొహానే చెప్పగల ధైర్యం చూపుతూనే, నిన్ను ప్రేమించి ఆదరించేవాడు. స్నేహమంటే అది!
ఒకసారి, ముగ్గురు అమెరికన్ సైన్యాధికారులు ఒక చోట కలిశారు. వాళ్ళు 'గ్రాండ్ కాన్యన్' (grand canyon- ప్రపంచంలో అతి విస్తారమైన లోతయిన లోయ) చూసేందుకు విహార యాత్రగా వెళుతున్న వాళ్ళు. వాళ్ళ అధీనంలో ఉన్న సైనిక దళాలు కూడా వాళ్ళతో వచ్చాయి.
ఆ అధికారుల్లో ఒకరు తన దళంలో సభ్యుల ధైర్యం, విధేయతా గురించి కొంత డబ్బా కొట్టుకోవాలనుకొన్నాడు. ' నా సైనిక దళం అంత గొప్పది మరొకటి లేదు. వీళ్ళ ధైర్యమూ, వీళ్ళ విధేయతా చాలా గొప్పవి. నిజమైన ధైర్యం అంటే వీళ్ళదే. ఇప్పుడే మీకిది ఋజువు చేస్తాను చూడండి!' అంటూ, 'పీటర్!' అని ఒక సైనికుడిని కేకవేసి పిలిచాడు. పీటర్ పరుగెత్తుతూ వచ్చి,
'సర్!' అంటూ ఆయన ముందు నిలబడ్డాడు.
'ఈ లోయ కనిపిస్తున్నది కదా? ' అంటూ ఎన్నో మైళ్ళ వెడల్పున్న గ్రాండ్ కాన్యన్ లోయను చూపించాడు అధికారి.
'నువ్వు ఈ లోయను ఇప్పుడే ఒక్క దూకులో దాటి అవతలి వైపుకు చేరాలి!' అన్నాడు.
సైనికుడు మంచి వేగంతో పరుగెత్తుకొంటూ వెళ్ళి ఒక్క దూకు దూకాడు. పాపం అతగాడు ఎక్కడికి చేరి ఉంటాడో మీరు ఊహించగలిగిన విషయమే.
ఇది చూసి రెండో అధికారి నవ్వాడు. 'ఇదొక లెక్కా? మా వాళ్ళను చూడండి' అని, 'హిగ్గెన్స్!' అని తన దళంలో ఒక ఆశ్వికుడిని కేక వేసి పిలిచాడు.
'ఒక అత్యవసర పరిస్థితి వచ్చింది. నువ్వు ఇప్పుడే ఈ లోయ దూకి వెళ్ళి, నా సందేశాన్ని అవతలి వైపు ఉన్న నా అధికారికి చేరవేయాలి".
హిగ్గెన్స్ చేతులు జాడించి బయలుదేరాడు. తరవాత ఏమయిందో మీకు చెప్పనక్కర్లేదు.
మూడో అధికారి మాట్లాడకుండా ఉండిపోయాడు. మిగిలిన ఇద్దరూ ఆయనని కాస్త రెచ్చగొడుతూ, 'మరి మీ వాళ్ళ సంగతేమిటీ?' అన్నారు. వాళ్ళకు దమ్ములు లేవేమో?' అని నవ్వారు.
ఈ మూడో అధికారి దళంలో సైనికులు కొందరు ఆ సమీపంలో పచార్లు చేస్తున్నారు. అధికారి, ' ఏమోయ్, ఇలా రా!' అని పిలవగానే ఒక సైనికుడు వచ్చాడు. అధికారి లోయలో అతివేగంగా సుడులు తిరుగుతూ దూకుతున్న ప్రవాహాన్ని చూపాడు. అది ఒక పెద్ద భయంకరమైన జలపాతానికి రెండు వందల మీటర్ల దూరంలో ఉంది. ' ఈ చిన్న దోనెను తీసుకెళ్లి, దీంతో నువ్వు ఆ ప్రవాహం దాటి అవతలి వైపుకు వెళ్ళాలి' అన్నాడు. సైనికుడు ఒకసారి దీర్ఘంగా కిందికి చూసి, అధికారితో 'జనరల్! మీరు మళ్ళీ మద్యం బాగా తాగేసినట్టున్నారు! నేను మాత్రం అలాంటి బుద్ధి లేని, చచ్చు సాహసం చేయను!' అన్నాడు. అతని అధికారి మిగిలిన ఇద్దరు అధికారుల వైపూ తిరిగి, 'చూశారుగా, అసలైన ధైర్యం అంటే ఇది!' అన్నాడు.
మీ స్నేహితుడికి ఏది హితం?
మీ స్నేహాల విషయంలో మీరు మరింత ధైర్యం చూపించండి. అవసరమైతే వాటిని వదులుకోవటానికి సిద్ధంగా ఉండండి. పోతే పోనివ్వండి. కానీ, మీరు మీ స్నేహితుడి బాగు కోరే వారయితే, అతనికేది మంచో అది చేయండి. మీకేది మంచో అది కాదు.
నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉండేవాడు. ఆయన బీరు తాగుతాడు. ఆయన్ని నేను కలిసేటప్పటికే ఆయనకు డెబ్భయి యేళ్ళు. పెద్ద ఆకారం, పెద్ద పొట్టా. కొన్నాళ్ళ క్రితం ఆయన తన స్నేహితుడొకడిని తరచుగా, క్రమం తప్పకుండా కలుస్తూ ఉండేవాడు. ఈయన వెళ్ళినప్పుడల్లా, ఆ స్నేహితుడు బీరు ఇచ్చేవాడు. ఇద్దరూ తాగే వారు. సమయం దొరికినప్పుడల్లా ఆ స్నేహితుడన్నా ఈయన దగ్గరకు వచ్చే వాడు, ఈయనన్నా వెళ్ళేవాడు.
అకస్మాత్తుగా ఒక రోజు ఆ స్నేహితుడికి ఎవరో ఒక గురువు తారసపడ్డాడు. దాంతో ఆ స్నేహితుడు, ఆధ్యాత్మిక సాధనలు మొదలుపెట్టి బీరు తాగటం మానేశాడు. దానితో తమ ప్రగాఢమైన స్నేహం ముగిసిపోయింది అన్నాడు డాక్టరుగారు, నాకు ఈ కథంతా వివరంగా చెప్తూ. ఆయన స్నేహితుడు బీరు ఇవ్వటం మానేసిన తరవాత, ఇంకెప్పుడూ డాక్టర్ గారు అతని ఇంటికి వెళ్ళదల్చుకోలేదు. చాలా స్నేహాలు ఇలానే నడుస్తాయి. ఏదో ఒక ప్రయోజనం ఉంటే ఆ స్నేహం ఉంటుంది. అది ఆగిపోయిన క్షణం అంతా ఆగిపోతుంది.
మీకు జీవితంలో నిజమైన మిత్రులు లేకపోతే అదొక లోటే. అసలు స్నేహితుడంటే ఏమిటి? మీలాగే అయోమయంలో కొట్టు మిట్టాడుతుండే సాటి మనిషి. స్నేహితుడంటే ఏదో పరిపూర్ణత సాధించినవాడని కాదు. ఇద్దరు వ్యక్తులు, ఒకరితో ఒకరు స్వేచ్ఛగా సేద తీరగలిగితే, నిష్కపటంగా వ్యవహరించగలిగితే, వాళ్ళిద్దరూ స్నేహితులౌతారు. మీ మిత్రుడూ మీలాగే, గందరగోళపు స్థితిలో ఉన్న వాడే. కానీ ఇద్దరు వ్యక్తులు ఒకరితో ఒకరు మనసు విప్పి మసలుకోగలిగిన వాతావరణం ఉంటే వాళ్ళు స్నేహితులవుతారు. మీకు చాలా మంది నిజమైన స్నేహితులు కావాలి, ఒక్కరు కాదు. కనీసం ఒక్కరు కూడా లేరంటే మీ జీవితం గురించి ఇప్పుడే మీరేదయినా చేయటం మంచిది.
సంపాదకుడి సూచన: సద్గురుని మీ ప్రశ్నలు ఇక్కడ అడగండి UnplugWithSadhguru.org.