విషయ పట్టిక
1. మనం మట్టిని ఎందుకు కాపాడుకోవాలి?
2. నేల పునరుజ్జీవనం పర్యావరణం బాగుకి ఎలా సహాయపడుతుంది?
3. నేల పునరుజ్జీవనం కోసం 5 పద్ధతులు
   3.1 సేంద్రీయ పదార్థం ఆరోగ్యకరమైన మట్టిని పెంపొందిస్తుంది
   3.2 చెట్ల ఆధారిత వ్యవసాయం లేదా వ్యవసాయక అటవీకరణ
   3.3 మాంసం తినడాన్ని తగ్గించడం
   3.4 పండ్ల ఆహారం- మీకు ఇంకా గ్రహానికీ ఆరోగ్యకరమైనది
   3.5 చేతన గ్రహాన్ని నిర్మించడం

మనం మట్టిని ఎందుకు కాపాడుకోవాలి?

సద్గురు:: ఈ గ్రహం మీద ఎనభై ఏడు శాతం జీవాలు - సూక్ష్మజీవులు, పురుగులు, కీటకాలు, పక్షులు, జంతువులు, మానవులు, మొక్కలు, చెట్లు ఇంకా భూమి మీద ఉన్న వృక్షసంపద - ఇవన్నీ కూడా మట్టి పై పొరలో దాదాపు ముప్పై తొమ్మిది అంగుళాల లోతు వరకు జీవిస్తాయి. ఇప్పుడు ఈ మట్టి తీవ్ర ప్రమాదంలో ఉంది. గత నలభై సంవత్సరాలలో, ఈ పై పొరలో ఉన్న మట్టిలో నలభై శాతం దాకా మన భూమి కోల్పోయింది. ఐక్యరాజ్యసమితి గణాంకాల ప్రకారం, ఇంకా ఎనభై నుండి వంద పంటలకు మాత్రమే మట్టిలో మిగిలి ఉంటుందని, అంటే మరో నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల వరకే వ్యవసాయం చెయ్యగలమని చెబుతున్నారు. ఆ తరువాత, మనకు ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి తగిన నేల ఉండదు. ప్రపంచంలో రాబోయే ఈ విపత్తును మనం ఊహించగలము. భారతదేశంలోని ముప్పై శాతం భూమి ఇప్పటికే సారవిహీనమైనది, ఇంకా 90% రాష్ట్రాలలో నేల ఎడారిగా మారడాన్ని చూడాల్సి రావొచ్చు.. అంటే ఇంక అక్కడ ఏమీ సాగు చేయలేము. కాబట్టి, భవిష్యత్తు తరాల కోసం ఈ నేలను రక్షించడం చాలా ముఖ్యo.  

నేల పునరుజ్జీవనం పర్యావరణం బాగుకి ఎలా సహాయపడుతుంది?

నేను జర్మనీలోని ఒక ఐక్యరాజ్యసమితి సంస్థ వద్ద మాట్లాడుతున్నప్పుడు వారు నన్ను, “పర్యావరణ విపత్తును నివారించడానికి మనం చేయవలసిన మూడు పనులు ఏమిటి?” అని అడిగారు. నేను, “ఆ మూడు పనులు, ‘మట్టి, మట్టి ఇంకా మట్టి' అని అన్నాను. దీని గురించి ఎవరూ పట్టించుకోవడంలేదు, ఎందుకంటే నగర వాసులకు వాయు కాలుష్యం గురించి మాట్లాడటం ఒక ఫ్యాషన్. వాయు కాలుష్యం గురించి ఆందోళన చెందాల్సిన పని లేదని అనడం లేదు, కానీ మీరు మట్టిని సరిచేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే, ఆ చర్య నీటిపై కూడా ఫలితం చూపుతుంది. ఆర్థికంగా మన విలాసాలని కొంచెం తగ్గించుకోవడానికి సిద్ధంగా ఉంటే, తక్కువ సమయంలోనే వాయు కాలుష్యాన్ని కూడా పరిష్కరించవచ్చు. కానీ మీరు ధ్వంసం చేసిన మట్టిని సరిచేయాలంటే, మీరు తీవ్రంగా పని చేస్తే 15-25 సంవత్సరాలు పడుతుంది. మీరు అంత ఎక్కువ ఆసక్తి చూపకపోతే, మీరు ఒక నిర్దిష్ట స్థాయి మట్టిని పొందడానికి 40-50 సంవత్సరాలు పడుతుంది.

ఇంత కాలం నేల అద్వానంగా ఉంటే రెండు మూడు తరాల వరకు ప్రజలు భయంకరమైన జీవన పరిస్థితులను ఎదుర్కొంటారు.

5 నేల పునరుజ్జీవనం కోసం 5 పద్ధతులు

soil-revitalization-methods-gif

#1 సేంద్రీయ పదార్థం ఆరోగ్యకరమైన మట్టిని పెంపొందిస్తుంది

భారతదేశంలోని ప్రజలు వేలాది తరాలుగా ఒకే భూమిని సాగు చేస్తున్నారు. కానీ గత తరంలో నేల సారం చాలా వరకు తగ్గడం వల్ల ఇప్పుడు అది ఎడారిగా మారే అవకాశం ఉంది. మీరు మట్టిని సంరక్షించాలనుకుంటే, సేంద్రీయ పదార్థాలు మట్టిలోకి వెళ్లాలి. కానీ మన చెట్లని నరికేస్తున్నారు, లక్షలాది జంతువులను మన దేశం నుండి ఎగుమతి చేస్తున్నారు. ఇవి జంతువులు కావు, మన మట్టే వేరే దేశానికి వెళ్తోంది. ఇది జరుగుతున్నప్పుడు, మీరు మట్టిని ఎలా తిరిగి సంపాదిస్తారు?

ఆకులు లేదా జంతువుల వ్యర్థాలు లేనట్లయితే, మన నేలకు తగినంత సారం తిరిగి అందదు. ఇది ప్రతి వ్యవసాయ కుటుంబానికి తెలిసిన సాధారణ విషయం. ఒక నిర్దిష్ట మొత్తంలో ఉన్న భూమిలో ఎన్ని జంతువులు, ఎన్ని చెట్లు ఉండాలో కూడా వారికి తెలుసు.

భారతదేశంలో ముప్పై మూడు శాతం భూమి నీడలో ఉండాలని పాత ప్రణాళికా సంఘం నిర్దేశించిన ఒక ఆకాంక్ష భారతదేశంలో ఉంది, ఎందుకంటే మీరు నేలను కాపాడుకోవాలనుకుంటే, ఇదే మార్గం. ఇంకా మీరు ఒక హెక్టారు భూమిని కలిగి ఉంటే, తప్పనిసరిగా కనీసం అక్కడ ఐదు పశువులు ఉండాలనే చట్టం కోసం నేను ప్రయత్నిస్తున్నాను. మన దేశపు మట్టి గురించిన ఒక అద్భుతమైన విషయం ఉంది, దాని కోసం మన దగ్గర శాస్త్రీయ సమాచారం ఉంది కానీ ఇంకా శాస్త్రీయ ప్రమాణం లేదు. మీరు దేశంలో నేల చక్కగా ఉన్న ప్రదేశానికి వెళ్లి, ఒక క్యూబిక్ మీటర్ మట్టిని తీసుకుంటే, ఒక్క క్యూబిక్ మీటర్లో సుమారు 10,000 జాతుల జీవులు ఉన్నాయని చెబుతారు. భూమి మీద కనిపించే అత్యధిక జీవ సాంద్రత ఇది. ఇలా ఎందుకు ఉందో మనకు తెలియదు. కాబట్టి, మట్టికి కొంచెం సహాయం మాత్రమే అవసరం. మీరు దానికి కొంచెం సహాయం అందిస్తే, అది త్వరగా పునర్జీవిస్తుంది. కానీ తరం వ్యక్తులుగా, చిన్న సహాయం ఇవ్వడానికి మనకు అవసరమైన తెలివి ఉందా…? లేక మనం సారహీనమవుతున్న మట్టిని చూస్తూ కూర్చుందామా?

మనము ఎరువులు ఇంకా ట్రాక్టర్ ఉపయోగిస్తే మట్టిని సమృద్ధిగా ఉంచలేము. మనకు భూమిపై జంతువులు అవసరం. పురాతన కాలం నుండి, మనం పంటలు పండించినప్పుడు, మనము పంటను మాత్రమే తీసుకున్నాము. మిగిలిన మొక్కలు ఇంకా జంతువుల వ్యర్థాలు ఎల్లప్పుడూ మట్టిలోకి తిరిగి వెళ్ళేవి. ఇప్పుడు మనం జ్ఞానాన్ని కోల్పోయాం.

 #2 చెట్ల ఆధారిత వ్యవసాయం లేదా వ్యవసాయక అటవీకరణ

"అటవీ ఉత్పత్తి" అనే పదం మన పదజాలం నుండి తీసేయ్యక తప్పదు. అటవీ ఉత్పత్తి అంటూ ఏదీ లేదు ఎందుకంటే గ్రహం మీద ఉత్పత్తిగా ఉపయోగించుకోవడానికి తగినంత అడవి లేదు. యుగం గడిచిపోయింది. మీరు భవిష్యత్తులో అటవీ ఉత్పత్తుల గురించి మాట్లాడలేరు.

మనం కొత్త వర్షారణ్యంను సృష్టించలేము ఎందుకంటే దానికి సహస్రాబ్దాల శ్రమ కావాల్సి ఉంటుంది. కానీ మనం ఖచ్చితంగా చెట్లను పెంచగలము ఇంకా చెట్ల ఆధారిత వ్యవసాయం లోకి వెళితే తప్పక చెట్లు పెరుగుతాయి. నేలలో ఎక్కువ భాగం రైతుల వద్ద ఉన్నందున, వారికి చెట్లను పెంచడం లాభసాటిగా చేస్తే తప్ప చెట్లను పెంచలేము.

ఎన్నో సంవత్సరాల కృషి తర్వాత, ఐక్యరాజ్యసమితి రోజు స్పష్టంగా గుర్తించిన విషయం ఏంటంటే, దీనికి, పరిష్కారం చాలా భాగం చెట్ల ఆధారిత వ్యవసాయం చేయడమే అని. ఇప్పటికే 22 ఏళ్లుగా  మీము పనిని చేస్తున్నాం. పర్యావరణ పరంగా ఇంకా ఆర్థికంగా, రెండు విధాలుగానూ ఇది ఫలితాలను ఇస్తుందని నిరూపించడానికి చెట్ల ఆధారిత వ్యవసాయం చేస్తున్న 107,000 మంది రైతులు ఉన్నారు.

 

#3 మాంసం తినడాన్ని తగ్గించడం

ప్రపంచంలో వ్యవసాయానికి ఉపయోగించే 4 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమిలో దాదాపు 77 శాతం, జంతువులు ఇంకా వాటి ఆహారం కోసం ఉపయోగించబడుతోంది. అందుబాటులో ఉన్న అనేక ఇతర పరిష్కారాలతో పోలిస్తే, మాంసం వినియోగం అనేది మీరు మార్చుకోగల సులభమైన పనులలో ఒకటి. మీరు మీ మాంసం వినియోగాన్ని 50% తగ్గించుకుంటే, భూమి మీద 2 కోట్ల చదరపు కిలోమీటర్ల భూమి, చెట్ల ఆధారిత వ్యవసాయానికి అందుబాటులోకి వస్తుంది. మీరు ఇన్ని చెట్లను పెంచినట్లయితే, మీరు అడవి నుండి పొందుతున్న అన్ని వస్తువులను వ్యవసాయ భూమినుండే ఉత్పత్తి చేయవచ్చు. రైతులు ధనవంతులవుతారు ఇంకా మీరు నేలను కూడా సుసంపన్నం చేస్తారు. సందర్భంలో, మీరు మాంసాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు - కేవలం 50% తక్కువ తినండి. డాక్టర్లందరూ ఇదే చేయమని చెబుతున్నారు. ఇది పర్యావరణ పరిష్కారం మాత్రమే కాదు, ఇది మీ జీవితానికే ఆరోగ్యకరమైన పరిష్కారం.

#4 పండ్ల ఆహారం- మీకు ఇంకా గ్రహానికీ ఆరోగ్యకరమైనది

ఎవరైనా అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నారని అనుకుందాం, మీరు వారికి మాంసము లేదా బిర్యానీ తీసుకెళ్లరు. మీరు వాళ్ళకు పండ్లు తీసుకు వెళ్తారు. ఇక్కడ సందేశం స్పష్టంగా ఉంది, “కనీసం ఇప్పుడైనా తెలివిగా తినండి!” అని. కానీ తీసుకువెళ్లిన వ్యక్తికి అది అర్ధం కాదు! హ్యూయెన్ త్సాంగ్ ఇంకా మెగస్తనీస్ వంటి యాత్రికులు భారతదేశానికి వచ్చినప్పుడు, భారతీయులు తమ ఆహారంలో చాలా ఎక్కువ పండ్లను తింటున్నారని వారు గమనించారు. వారు, "వారు మేధోపరంగా చాలా పదునుగా ఉండటానికి కారణం ఇదే కావచ్చు" అని అన్నారు. మనం తీసుకునే ఆహారం పట్ల స్పృహ లేకపోవడం వల్ల మనం బుద్ధిహీనంగా మారుతున్నాం.

మీరు తినే వాటిలో 75% కంటే ఎక్కువ నీరు ఉంటే, మీరు ఆరోగ్యంగా ఉండడం చాలా సులభమవుతుంది. మీరు పచ్చి కూరగాయలను తింటే, నీటి శాతం దాదాపు 70% కంటే ఎక్కువగా ఉంటుంది. మీరు ఒక పండు తింటే, దాంట్లో సాధారణంగా 90% కంటే ఎక్కువ నీరు ఉంటుంది. కనుక ఇది ఉత్తమమైన ఆహారం. మన ఆహారంలో కనీసం 30-40% చెట్ల నుండి నేరుగా వచ్చింది అయి ఉండాలి, 4 నెలల పాటు పండించిన పంటల నుండి కాదు. అంటే మనమందరం కొంచెం ఎక్కువగా పండ్లు తినాలి. ప్రస్తుతం, పండ్లు ఖరీదుగా ఉన్నాయి ఎందుకంటే మనము న్యూజిలాండ్, ఆస్ట్రేలియా లేదా థాయ్లాండ్ నుండి పండ్లను దిగుమతి చేస్తున్నాము. మీరు ఇక్కడ స్థానిక ఉష్ణమండల పండ్లను పెంచినట్లయితే, అవి అంత ఖరీదుగా ఉండవు.

#5 చేతన గ్రహాన్ని నిర్మించడం

మరేవైనా ఇతర జీవాలు మన భూమికి నష్టాన్ని కలిగించి ఉంటే, వాటిని ఎదుర్కోవటానికి మనము ఒక మార్గాన్ని కనుగొంటాము. కోట్ల కొద్దీ గ్రహాంతర మిడుతలు ఇక్కడ దిగి, మన చెట్లన్నింటినీ నరికి, మన మట్టిని ఎడారులుగా మార్చి, మన నదులలోని నీటిని ఖాళీ చేస్తుంటే - మనం ఖచ్చితంగా వాటిని నాశనం చేసి ఉండేవాళ్లం. కానీ ఇక్కడ సమస్య గ్రహాంతర మిడుతలు కాదు. సమస్య మనమే.

సమస్యకు మూలం మనమే కాబట్టి, పరిష్కారానికి కూడా మూలం మనమే కావాలి. మనం ఎరుక లేకుండా నిర్బంధ స్థితిలో చర్యలు చేస్తూ ఉన్నందున మాత్రమే మనము సమస్యగా మారుతున్నాము. మనం స్పృహతో ఉంటే, సహజంగానే మనం పరిష్కారం

అవుతాము. అందుకే నేను ఐక్యరాజ్యసమితి సంస్థలు ఇంకా ఇతర సంస్థలతో కలిసి పని చేస్తున్నాను, ఇంకా "కాన్షియస్ ప్లానెట్" ఉద్యమం అనే ఆలోచనను ప్రతిపాదిస్తున్నాను.

520 కోట్ల మంది ప్రజలు ఓటు వేయగల ఇంకా తమ దేశ నాయకుల్ని ఎన్నుకునే సామర్థ్యం గల దేశాలలో నివసిస్తున్నారు. పర్యావరణ సమస్యలు ప్రభుత్వాలను ఎన్నుకునే సమస్యలుగా మారడానికి కనీసం మూడు వందల కోట్ల మంది ప్రజలను మాతో ఎలా చేర్చుకోవాలో మేము ఆలోచిస్తున్నాము. మూడు వందల కోట్ల ప్రజలకు తమ దేశంలో జరగాల్సిన కనీసం ఐదు పర్యావరణ అంశాల గురించీ ఇంకా అలాగే మనం చేయకూడని రెండు లేదా మూడు అంశాలపై అవగాహన కల్పించాలని మేము కోరుకుంటున్నాము. ఇలా చేస్తే పర్యావరణం అనేది ఎన్నికల మేనిఫెస్టోలో మొదటిది కాకపోయినా కనీసం రెండవ సమస్య అవుతుంది.

కాన్షియస్ ప్లానెట్ ఉద్యమంలో భాగంగా, నేను భూమిని పునరుజ్జీవింపజేయడం అత్యంత ముఖ్యమైన అంశంగా దృష్టి సారించడానికి ప్రయత్నిస్తున్నాను: నేల - పురుగులు, కీటకాలు, పక్షులు, జంతువులు, మొక్కల జీవితం ఇంకా మనతో సహా - భూమి మీద మీరు జీవంగా చూసే ప్రతిదీ కేవలం ముప్పై తొమ్మిది అంగుళాల మట్టి పైపొర లొనే జరుగుతోంది. మనకు తెలిసిన ప్రతి ప్రాణాన్ని నిలబెట్టే మట్టికి నిజమైన నష్టం జరుగుతోంది. నేల సేంద్రీయంగా, సమృద్ధిగా ఇంకా ఆరోగ్యంగా ఉందని మనం నిర్ధారించుకోగలిగితే, భూమి స్వయంగా పునరుత్పత్తి కాగలదు ఇంకా ఇతర సమస్యలను మనం చాలా వరకు తగ్గించగలుగుతాము.

ప్రస్తుతం, ప్రపంచ జనాభాలో 95% కంటే ఎక్కువ మందికి తమ చుట్టూ ఏర్పడే పర్యావరణ విపత్తు గురించి పూర్తిగా అవగాహన లేదు. పర్యావరణ అవగాహన అనేది ఒక చిన్న వర్గానికి మాత్రమే పరిమితం చేయబడింది ఇంకా వారిలో కూడా, పళ్ళు తోముకునేటప్పుడు, స్నానం చేసేటప్పుడు లేదా కుళాయిని ఆపి వేసేటప్పుడు తక్కువ నీటిని ఉపయోగించడం వరకు మాత్రమే పర్యావరణం గురించిన ఆలోచనగా పరిమితం చేయబడింది. నీటిని ఎలా ఉపయోగిస్తున్నారో అనే దాని గురించి ప్రజలు స్పృహతో ఉండటం అద్భుతం, కానీ ఇది పర్యావరణ సంరక్షణకు సమగ్రమైన పరిష్కారం కాదు. పర్యావరణ సంరక్షణ ఎన్నికల సమస్యగా మారినప్పుడు మాత్రమే, అవి ప్రభుత్వాలు ఆచరించే విధానాలు అవుతాయి ఇంకా అప్పుడు మాత్రమే పరిష్కారాలు స్పష్టంగా కనిపించేలా పెద్ద బడ్జెట్లు కేటాయించబడతాయి.

Editor's Note:  Curious to know more about the movement? Check out the official website of Conscious Planet