ప్రశ్న: సద్గురు, నేను చాలా సంతోషంగా ఉండే రోజులు ఉన్నాయి, అలాగే ఎటువంటి కారణం లేకుండా నేను చాలా విచారంగా ఉండే రోజులు ఉన్నాయి. ఈ హెచ్చు తగ్గులను ఎలా ఎదుర్కోవాలి?

సద్గురు: దక్షిణ భారతదేశంలో, ఎవరైనా మరీ ఎక్కువగా నవ్వుతూ, చాలా సంతోషంగా ఉంటే, వారు, “అంతలా నవ్వకండి. దీని వెంటనే విచారం వస్తుంది.” అంటారు. కొంతమందిలో కలిగిన ఈ అభిప్రాయం అనేది ఒక రకంగా దౌర్భాగ్యం కొద్దీ అబ్బిన జ్ఞానం, ఎందుకంటే వారి జీవితం ఆ విధంగానే ఉంటూ వస్తుంది. ఈ రోజు వారు చాలా ఆనందంగా ఉంటే, రేపు వారు దుఃఖం బారిన పడతారు. ప్రజలు తమని తాము తీవ్ర స్థాయికి తీసుకువెళతారు. ఎందుకంటే వారి మనస్సులలో, వారు దుఖాన్ని ఇంకా ఆనందాన్ని, రెండింటినీ గుణిస్తారు(ఎక్కువ చేసి చూస్తారు). ఇప్పుడు మీరు ఇలా అడగవచ్చు, “మనం ఇలా చేయకపోతే, జీవితంలో అందం ఎక్కడ ఉంటుంది?” అని. జీవితం, అది ఉన్న విధంగానే అందమైనది. మీరు దీనిపైన మేకప్ కోటింగ్ వేయవలసిన అవసరం లేదు.

మీకు జీవితం పట్ల, అంటే ప్రాథమికంగా జీవితం అంటే ఏంటి అన్న దాని పట్ల శ్రద్ధ లేకపోవడం వల్లే, మీరు మీ మానసిక వాస్తవికతలో కొట్టుకుపోతున్నారు. ‘ఇది నేను’ అని మీరు దేనినైతే అనుకుంటున్నారో, దానికి సంబంధించిన మానసిక ఇంకా శారీరక అంశాలు, చక్ర భ్రమణంలాగా పునరావృత్తమవుతూ ఉంటాయి. ఈ రోజు మీరు మితిమీరిన ఉత్సాహపు ఎత్తులలో తేలి, రేపు అగాధానికి పడిపోవచ్చు. చాలా మంది మనుషులు ఈ మానసిక రోలర్ కోస్టర్ ను అనుభూతి చెందుతూ ఉన్నారు. మీరు ప్రతిదానికీ ఏవో బయటి ప్రభావాలను సాకుగా చెప్పవచ్చు, కాని మేము, మీకు ఆనందాన్ని లేదా దుఖాన్ని కలిగించే వారు ఎవరూ లేకుండా, మిమ్మల్ని ఒక గదిలో బంధించి ఉంచితే, అప్పుడు కూడా ఈ మానసిక పరమైన ఆవృత్తాలు(Cycles) జరుగుతాయి. అదేవిధంగా, శారీరక ఆవృత్తాలు కూడా ఉన్నాయి, అలాగే ఈ మానసిక ఇంకా శారీరక ఆవృత్తాలు, ఆ సమయంలో ఏది బలమైన శక్తిగా ఉంది అన్నదాన్ని బట్టి, ఒకదానికొకటి ప్రభావితం చేయగలవు.

మీరు మీ బంగారు సగటును చేరుకోవాలి. ఇది నిమ్మళంగా కూర్చో వలసిన సమయం - మీ మోకాలు ఉబ్బినా, మీ చీలమండలు నరకం లాగా బాధపపెడుతున్నా- మీరు ఆనందంగా ఉండాలి.

ఈ ఆవృత్తాలకు సంబంధించిన అవగాహన, ఒక విధంగా ప్రజలలో ఇంకిపోయింది, ఇక వారు ఎలాగూ తమని దుఃఖం ముంచెత్తుతుందని నమ్మడం మొదలుపెట్టారు - అలాగే ఆ విధంగా జరుగుతుంది కూడా. సంతోషాన్ని ఇంకా దుఃఖాన్ని రెండింటినీ తయారు చేస్తున్నది కేవలం మీరు మాత్రమే అని మీరు అర్థం చేసుకుంటే, ఇక సమస్య ఉండదు. ప్రజలు చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే, వారు సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. సంతోషంగా ఉండడానికి మాత్రమే కాదు - వారు వేరొకరి కంటే ఎక్కువ సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. అది ఒక తీవ్రమైన సమస్య. సంతోషంగా ఉండటానికి ప్రయత్నించవద్దు. ఒకసారి మీలో ఏం జరిగినా, అది జరుగుతున్నది మీ వల్లే తప్ప, మరొకదాని వల్ల కాదని మీరు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే, ఇక అప్పుడు మీరు ఆనందంగా ఉంటారు. మీరు ఎత్తుల్లో ఎగరరూ, లోతుల్లోకి పడిపోరు - మీరు అలా ఆనందంగా ఉంటారు. నికరంగా ఉండే ఈ ఆహ్లాదం యొక్క స్థాయి, మీ వద్ద ఉన్న తీక్షణత ఇంకా శక్తిని బట్టి, వ్యక్తి వ్వ్యక్తికీ భిన్నంగా ఉండవచ్చు, కానీ ఇది ఒక స్థిరమైన వేదిక. మీరు ఒక పారవశ్య స్థితిని ఆస్వాదించాలనుకుంటే, మీరు ఎప్పుడైనా పైకి వెళ్లి తిరిగి రావచ్చు. మీరు విచారాన్ని ఇష్టపడితే, మీరు కిందకు వెళ్లి తిరిగి పైకి రావచ్చు.

బంగారు సగటు

ఈ నికర ఆనంద అనుభూతి అనేదే, బంగారు సగటు, బుద్ధుడు ఇంకా ఇతరులు మాట్లాడిన మధ్యేమార్గం. కాకపోతే వేర్వేరు వ్యక్తులు వేరే వేరే స్థాయికి చేరుకుంటారు. ఇది నిష్క్రియాత్మకమైన, నిమ్మళమైన స్థితి కాదు, ఉల్లాసమైన, ఆహ్లాదకరమైన స్థితి - ఒక చక్కని ఉదయం వంటిది. ఏ విశేషమూ లేదు, కానీ ప్రతిదీ బాగానే ఉంది, అంతా బాగా జరుగుతోంది. “గుడ్ మార్నింగ్!” అనేది వచ్చింది దీని నుంచే. కొన్ని గంటలపాటు ప్రపంచం నుండి వేరుపడిన తర్వాత, మీరు ఉదయాన మేల్కొన్నప్పుడు, ఇది చాలా బాగుంటుంది. మధ్యాహ్నం కూడా బాగానే ఉంటుంది, సాయంత్రం ఇంకా మిగతావన్నీ కూడా అదే విధంగా ఉంటాయి, కానీ మీరు దీనిని గమనించడానికి, మీకు కొంత ఉపసంహరణ అవసరపడుతుంది. అది, ఐదు రోజుల పాటు గంజి తప్ప మరేమీ తినకుండా ఉండి, అప్పుడు మళ్ళీ సాధారణ ఆహారం తినడం వంటిది. అకస్మాత్తుగా అది ఎంత బాగుందో మీరు గమనిస్తారు. ప్రతి క్షణం కూడా తనదైన విధానంలో బాగుండేదే, కానీ మీరు దీన్ని గమనించడానికి ఉపసంహరణ అవసరపడుతుంది.

ఈ ‘బంగారు సగటు’ అనేది నిమగ్నత లేకుండా ఉండడం గురించి కాదు. మీకు కావాలంటే, మీరు పైకి ఎగిరి మళ్ళీ దిగవచ్చు, లేదా మీరు కిందకు దిగి, మళ్ళీ తిరిగి రావచ్చు, కానీ ఏ సందర్భంలో అయినా, మీరు ఒక నిర్దిష్ట స్థాయి ఆనందాన్ని కొనసాగిస్తారు. ఈ ఆనందాన్ని నిర్వహించడం అనేది మీ క్రియ(సాధన) చేసే పని. మీరు మీ క్రియను సరిగ్గా చేస్తే, మీరు ఆ బంగారు సగటును తాకి, అక్కడే నిలిచి ఉంటారు. అక్కడ నుండి, మీరు మీ బంగారు సగటును మరింత ఉత్సాహభరితమైన స్థాయిలో నెలకొల్పడానికి ప్రయత్నించవచ్చు. మీలో మీరు ఎంత శక్తిని ఇంకా సజీవత్వాన్ని సృష్టిస్తారు అనేదానిపై ఆధారపడి, మీ ప్రాధమిక స్థాయి (సగటు) ఎక్కువ లేదా తక్కువ స్థాయిలో స్థిరపడుతుంది. కానీ అది ఎక్కడ స్థిరపడినా సరే, అది మీకు ఒక అందమైన అనుభవంగా ఉంటుంది. ఇది ఉప్పొంగే పారవశ్యం కాదు, ఎందుకంటే మీరు దానిని నిర్వహించలేరు, లేదా మీరు ఒకవేళ నిర్వహించగలిగినా, అప్పుడు మీరు ప్రపంచంలో చురుకుగా ఉండలేరు. మీరు పారవశ్యంతో మునిగిపోవచ్చు, కానీ అప్పుడు, మీరు చేయవలసినది మీరు చేయలేరు.

మీరు ప్రపంచంలో ప్రభావవంతంగా ఉండాలనుకుంటే, మీరు పరమానందంతో నిండిన ఒక స్థిరమైన స్థాయి వద్ద ఉండాలి - మీరు ఒక ఆనందకరమైన స్థితిలో, వ్యక్తపరచడానికి సరైన పదాలు లేకపోవడం వల్ల ఇలా కూడా అనవచ్చు - మీరు సహజమైన ప్రశాంతత ఇంకా ఆనందాల కలయిక వద్ద ఉండాలి. మీరు ఉదయాన్నే అలా తిరుగుతున్నారని అనుకుందాం, మీ అల్పాహారం తయారు చేస్తున్నారు, తెలియకుండానే పాటలు పాడుతున్నారు; మీకు ఊరికే హాయిగా ఉంది - అదే ఆనందం. పారవశ్యం అనేది ఉర్రూతలూగే ఆహ్లాదకరమైన స్థితి. మీరు ఒక నిర్దిష్ట స్థాయి శక్తిని చేరుకోకపోతే మీరు అక్కడ ఉండలేరు. కొందరు యోగులు ఉన్నారు - వారిని అవధూతలు అని పిలుస్తారు - వారు తినాలని కూడా తెలియని పారవశ్య స్థితిలో ఉన్నారు. వారు ఏమీ చేయటానికి పట్టించుకోరు. ఎవరో వారికి ఆహారం ఇవ్వాలి, ఎవరైనా వారిని మరుగుదొడ్డికి తీసుకెళ్లాలి - అదేదో వారు పూర్తిగా మత్తులో జోగుతున్నట్లుగా. నేటి ప్రపంచంలో, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరూ లేరు – అందుకే మీరు దిగి రావడం మంచిది.

స్థిరమైన వేదిక

మీరు మీ బంగారు సగటును చేరుకోవాలి. ఇది నిమ్మళంగా కూర్చోవలసిన సమయం - మీ మోకాలు ఉబ్బినా, మీ చీలమండలు నరకం లాగా బాధపెడుతున్నా - మీరు ఆనందంగా ఉండాలి. ఒక భాగం స్వర్గంలో ఉంది, ఒక భాగం నరకంలో ఉంది - మధ్యలో ఒక స్థాయి పరమానందం ఉంది. అందుకోసమే సుదీర్ఘ ధ్యానాలు - మీరు ప్రపంచంలోని ప్రతి పనిలో నిమగ్నమవ్వగలిగి, అయినా కూడా ఆనందంగా ఉండే స్థితిని చేరుకోవడానికి ఉన్నాయి. మీకు ఈ స్థిరమైన పునాది లేకుండా, మీరు కార్యాచరణలోకి దిగితే, మీరు చెదిరిపోతారు. నేటి ప్రపంచంలో, చాలా మంది ప్రజల జీవితాలు చాలా నియంత్రించబడతాయి - మీకు విపరీతంగా ఏమీ జరగదు. ఉదాహరణకి మీరు అడవిలో నివసిస్తున్నారని అనుకుందాం, మీ సగటు పరమానంద స్థాయి మిమ్మల్ని చాలా అప్రమత్తంగా చేస్తుంది ఇంకా మీ మనుగడ సామర్థ్యాలను పెంచుతుంది.

మీరు దయనీయంగా ఇంకా నిరాశగా ఉంటే, మీరు బాగా జీవించలేరు - ఇవన్నీ చాలించి, ఈ రోజు పులికి భోజనంగా మారాలని మీరు కోరుకుంటారు. మీరు చాలా పారవశ్యంగా ఉంటే, పులి మిమ్మల్ని తింటుందన్నా మీరు పట్టించుకోరు. మీరు బంగారు సగటులో ఉంటేనే, మీరు మీ మనుగడ ప్రవృత్తిని కొనసాగించగలరు, మీరు చేయగలిగిన అన్ని పనులను చేయగలరు, ఇంకా మీతో మరియు మీ చుట్టుపక్కల అందరితో ఆహ్లాదకరంగా ఉంటారు, మీరు ప్రపంచంలో జీవించాలనుకుంటే ఇది చాలా ముఖ్యం. మీరు పారవశ్యంలో రమించిపోతుంటే, చుట్టూ ఏమి జరుగుతుందో మీరు పట్టించుకోకపోతే, మీరు పూర్తిగా ఉపసంహరించుకోవాలి. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎక్కువకాలం బతకరు - వారు యవ్వనంలో ఉన్నప్పుడే చనిపోతారు, కానీ అదో పెద్ద విషయం కాదు – ఎందుకంటే పారవశ్యం దాని స్వంత ప్రయోజనాన్ని అందిస్తుంది. వారు ఏ క్షణమైనా జీవితం నుండి విముక్తిపొందే పారవశ్య స్థితిలో ఉన్నారు. యాభై సంవత్సరాలు జీవించే బదులు, వారు ఐదేళ్లపాటు రమించే పారవశ్య స్థితిలో ఉండి, తరువాత మరణిస్తే, అది భేషుగ్గా సరిపోతుంది. మానవ అనుభవం తాకగలిగే ప్రతిదాన్ని వారు చూశారు - ఇంకేమీ చేయాల్సిన పనిలేదు.

భావ స్పందన కార్యక్రమం ఏమిటంటే, మీరు ఎటువంటి కారణం లేకుండా పారవశ్యంలో రమించగలరని మీకు చూపించడం, ఇది మంచి విషయమే, కానీ మీరు అక్కడ ఉండలేరు. మీరు ఎల్లప్పుడూ ఆహ్లాదకరమైన స్థితిలో ఉండాలనుకుంటే, మీరు స్థిరమైన వేదికను సృష్టించాలి - ఆనందానికి బంగారు సగటు. సంవత్సరంలో కొన్ని రోజులే ధ్యానం చేస్తే సరిపోదు. ఇది సాధనను మీ జీవితంలో అంతర్భాగం చేసే ఆలోచన. మిమ్మల్ని మీరు సాధనకు అర్పించినట్లయితే, నేను మీ జీవితంలో ఒక సజీవ వాస్తవంగా ఉంటాను. ప్రస్తుతం, నేను మీ మనస్సులో ఒక ఆలోచన, జ్ఞాపకం. మీ జీవితంలోని ప్రతి క్షణం నేను ఒక సజీవ వాస్తవంగా కావాలని మీరు కోరుకుంటే, మీరు ఎవరు అనేదాని పట్ల స్పష్టత తీసుకురావడానికి మీరు కొంత సమయం పెట్టుబడి పెట్టాలి. ‘మీరు’ అనేది అస్పష్టంగా ఉంటే, ‘నేను’ అనేది వ్యక్తం అవ్వదు. సృష్టికర్త యొక్క కృపతో తాకబడని ఏఒక్క చోటూ, సందూ లేదా మూల, ఒక్క పరమాణువూ లేదు, కానీ ‘మీరు’ అనేది అస్పష్టంగా ఉన్నంతకాలమూ, మీరు దాన్ని పూర్తిగా కోల్పోతారు. మీరు దీన్ని పరిష్కరించుకుంటే, ఉన్నట్టుండి, ఇది పూర్తిగా క్రొత్త ఉనికిలా ఉంటుంది.

ప్రేమాశీస్సులతో,

సద్గురు

Editor's Note: This article is based on an excerpt from the July 2014 issue of Forest Flower. Pay what you want and download. (set ‘0’ for free). Print subscriptions are also available.